bio asia
-
ఔషధ పేటెంట్లకు మరిన్ని చట్టాలు అవసరం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ఔషధ ఆవిష్కరణలకు సంబంధించి పేటెంట్ల కోసం మరింత మెరుగైన చట్టాలు అవసరమని బయో ఏషియా సదస్సులో జరిగిన చర్చల్లో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పదేళ్ల కిందటితో పోలిస్తే భారత్‌లో పేటెంట్ల వాతావరణం కాస్త మెరుగుపడిందన్నారు. పేర్కొన్నారు. భారత్‌లో తయారవుతున్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న నేపథ్యంలో సంబంధిత చట్టాలను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం బయో ఏషియా సదస్సులో చర్చించారు. దీనితోపాటు వివిధ అంశాలపై లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందిన నిపుణులు కీలకోపన్యాసాలు చేశారు. ఆవిష్కరణలు, సంస్కరణలపై చర్చలు బయో ఏషియా సదస్సులో భారత్‌లో, ప్రత్యేకించి తెలంగాణలో జీవశాస్త్ర, ఔషధ రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై మంగళవారం బృంద చర్చలు జరిగాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఔషధ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఎదురయ్యే అవరోధాలపై మరో బృందం చర్చించింది. ఔషధ ఆవిష్కరణల్లో డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికత వినియోగం తీరుతెన్నులపై చర్చ జరిగింది. కొలన్ కేన్సర్ చికిత్స కోసం విద్యా, పరిశోధన సంస్థలు, ఆవిష్కరణలపై అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవాలని ప్యానెల్ అభిప్రాయపడింది. తక్కువ ధరకు ఔషధాల లభ్యత, మెరుగైన ఆవిష్కరణల వాతావరణం కోసం జీనోమ్ వ్యాలీలో సామర్థ్య పెంపుదల కేంద్రం ఏర్పాటుపైనా చర్చలు జరిగాయి. ఏఐ సాంకేతిక వినియోగాన్ని పెంచాలి సదస్సులో బ్రిస్టిల్ మేయర్స్ స్క్విబ్ సీఈవో డాక్టర్ క్రిస్టోఫర్ బోయెర్నర్, నోబెల్ విజేత ప్రొఫెసర్ గ్రెగ్ సెమంజా, ప్రావిడెన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ హాప్‌మన్ కీలకోపన్యాసాలు చేశారు. ఆక్సిజన్ లోపంతో వచ్చే వ్యాధులకు జన్యు చికిత్సలపై పరిశోధన, అభివృద్ధి జరగాలని గ్రెగ్ సెమంజా సూచించారు. వ్యాధుల నిర్ధారణలో వైద్యులు ఏఐ సాంకేతికతను ఉపయోగించేలా కృషి జరగాలని డాక్టర్ రోడ్నీ హాఫ్మన్ కోరారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు వేగంగా వచ్చేలా ఏఐ సాంకేతికతో కూడిన పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని క్రిస్బోయెర్నర్ నొక్కి చెప్పారు. జాన్హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్, నోబెల్ విజేత ప్రొఫెసర్ గ్రెగ్ సెమంజాకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు’ను ప్రదానం చేశారు. ఇక సదస్సులో భారత్‌లో తయారయ్యే వాక్సిన్లు, ఔషధ సరఫరా చైన్లు అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొంటున్న భౌగోళిక, రాజకీయ అవాంతరాలపై వివిధ సంస్థల సీఈఓలతో కూడిన బృందం చర్చించింది. డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, అడ్వెంట్ అంతర్జాతీయ భాగస్వామి స్టెఫాన్ స్టోఫెల్, లారస్ లాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, ఫైజర్ ఇండియా అధ్యక్షులు మీనాక్షి నెవాషియా, పిరమిల్ ఫార్మా చైర్పర్సన్ నందిని పిరమిల్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
వచ్చే ఫిబ్రవరిలో 21వ బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: బయో ఏసియా 21వ వార్షిక సదస్సు తేదీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరుగుతుందన్నారు. ‘డేటా అండ్ ఏఐ–రీడిఫైనింగ్ పాజిబిలిటీస్’అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో డేటా ఆధారిత సాంకేతికత, కృత్రిమ మేధస్సు పోషించే పాత్రపై 2024 బయో ఏసియా సదస్సులో చర్చిస్తారన్నారు. అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణల ఫలితాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్ సంగమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యరక్షణ రంగంలో ఆవిష్కరణ శకం నడుస్తున్న ప్రస్తుత సమయంలో బయో ఏసియా సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఉందని కేటీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో బయో ఏసియా తేదీల ప్రకటన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్ఎస్ సోషల్ మీడియా కనీ్వనర్లు మన్నె క్రిషాంక్, పాటిమీది జగన్మోహన్రావు, వై.సతీశ్‌రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
బయో ఆసియా విజేతలుగా ఐదు స్టార్టప్‌లు..
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు బయో ఆసియా–2023లో రెండో రోజు జరిగిన చర్చా గోష్టిలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేషన్లు, పేరొందిన ఆరోగ్య రక్షణ రంగ నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, స్టార్టప్‌ల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా రెండో రోజు ఐదు కీలక అంశాలపై చర్చా గోష్టులు జరగ్గా ఆపిల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి మధ్య ఫైర్‌సైడ్ చాట్ జరిగింది. 50కి పైగా దేశాల నుంచి రెండువేల మందికిపైగా ప్రతినిధులు హాజరు కాగా, రెండు రోజుల్లో రెండు వేల ముఖాముఖి వాణిజ్య సమావేశాలు జరిగాయి. 76 స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, అత్యంత వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించిన ఐదు స్టార్టప్‌లను విజేతలుగా ప్రకటించారు. విజేతలైన ఎక్సోబోట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాంబ్డాజెన్ థెరాప్యుటిక్స్, ప్రతిభ హెల్త్‌కాన్, రాంజా జీనోసెన్సర్, సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ స్టార్టప్‌ల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ సదస్సు ఆదివారం ముగియనుంది. -
వైద్యంలో దేశానికే దిక్సూచి..
సాక్షి, హైదరాబాద్: హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోందని, దేశానికే దిక్సూచిగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ వేదికగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియా సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. దేశంలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రస్తుతం 80 బిలియ¯న్ డాలర్లుగా ఉన్న తెలంగాణ భాగస్వామ్యం... 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రా, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే మూడు ‘ఐ’లు భారత్‌కు నాలుగో కన్నుగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాయన్నారు. సాంకేతికతను ఉపయోగించి వైద్య పరికరాలు, లైఫ్ సైన్సెస్‌లో నూతన ఆవిష్కరణలను తీసుకురాగల అర్హతలు, ప్రపంచస్థాయి సౌకర్యాలు, వనరులు భారత్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. భౌగోళిక, సామాజిక, ఆర్థిక అసమానతల సరిహద్దులకు అతీతంగా దేశం ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్స్ తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఆసియా సదస్సుకు 50 దేశాల నుంచి 215 మంది ప్రతినిధులు హాజరయ్యారని, 175 స్టార్టప్ కంపెనీలు వచ్చాయని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న స్టార్టప్స్ కంపెనీలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్, రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా వైస్ మినిస్టర్ కరోలిస్, ఈస్టోనియా రాయభారి కత్రిన్ కియి, ఒడిశా మంత్రి అశోక్‌చంద్ర పాండే, మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య, రెడ్డి ల్యాబ్స్ సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీనోమ్ వ్యాలీలో జుబ్లియెంట్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్ భార్తియా గ్రూప్ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జుబ్లియెంట్ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్ హరి ఎస్. భార్తియా శనివారం భేటీ అయ్యారు. ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్ ఆసియాలో హైదరాబాద్‌ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు జుబ్లియెంట్ రాకతో క్లినికల్ రీసెర్చ్ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్ మెడికల్ హబ్’ అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్‌లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్ మెడికల్ హబ్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. -
ముందస్తు గుర్తింపుతో గుండె ముప్పునకు చెక్.. వారిలో 63% మందికి 3 నాళాలు బ్లాక్?
సాక్షి, హైదరాబాద్: బయో ఆసియా సదస్సు–2023 రెండోరోజు కార్య క్రమాల్లో భాగంగా శనివారం జరిగిన ముఖా ముఖి సంభాషణలో దిగ్గజ సంస్థ యాపిల్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి పాల్గొన్నారు. ప్రజారోగ్యం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం అనే అంశాలపై చర్చించారు. ఆరోగ్య సమాజం కోసం యాపిల్ చేస్తున్న కృషిని డాక్టర్ సుంబుల్ దేశాయ్ వివరించగా అపోలో హాస్పిటల్స్ ద్వారా వైద్య సేవలందిస్తున్న తీరు ను, భవిష్యత్ కార్యాచరణను డాక్టర్ సంగీతారెడ్డి ప్రస్తావించారు. అవి వారి మాటల్లోనే.. సంగీత: లింగ సమానత్వం, సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రపంచంలో మేటిగా ఉంది. కానీ ప్రస్తుత సవాళ్లలో ప్రజారోగ్య పరిరక్షణ అతిపెద్దది. దీనికి పరిష్కారాలను చూపుతున్నప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ ప్రస్థానాన్ని ఒక ప్రాంతంలో ప్రారంభించి మరో చోటకు మారారు. మిమ్మల్ని ఉత్తేజపర్చిందేమిటి? సుంబుల్: ఏ పని చేసినా అర్థవంతంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా జీవించాలనే అంశానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మా ణాన్ని కాంక్షిస్తున్న యాపిల్ లక్ష్యం ఆ సంస్థ ఉద్యోగిగా నన్ను ఎంతో ఉత్తేజపరుస్తోంది. సంగీత: విజ్ఞానాన్ని పంచుకోవడానికి సాంకేతికత ఇప్పుడు కేంద్రంగా ఉందంటారా? సుంబుల్: అవును. నేను దాని గురించి మిమ్మల్ని అడగబోతున్నాను. అపోలో ద్వారా వైద్యసేవలందిస్తున్న మీరు ఆరోగ్యకర జీవన అంశాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? సంగీత: గుండెపోటు అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్‌గా మారుతోంది. దీని ముందస్తు హెచ్చరిక లక్షణాల గురించిన విశ్లేషణలను ప్రజల చేతుల్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. రెండు వారాల క్రితం మేము క్లినికల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్‌ను ప్రారంభించాం. ఇది దేశంలోని వైద్యులకు ఉచితంగా విడుదల చేయాలని భావిస్తున్నాం. మీరు మహిళల ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు? సుంబుల్: మా ప్రాధాన్యతలో కీలకమైన అంశం మహిళల ఆరోగ్యం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక చాప్టర్‌ను తెరిచాం. మహిళల కోసం సైకిల్ ట్రాకింగ్‌ను ప్రవేశపెట్టాం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరతను అధిగమించేందుకు మీరు ఏం ఆలోచిస్తున్నారు? సంగీత: కృత్రిమ మేధను మరింత విస్తృతం చేస్తున్నాం. దీంతో ఆరోగ్య సంరక్షణ రంగానికి కొంత వెసులుబాటు కలుగుతోంది. కానీ నిపుణుల కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదిక చర్యలు అవసరం. సుంబుల్: జీ–20 స్టాండ్ పాయింట్... మహిళలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? సంగీత: ఆరోగ్య సంరక్షణలో, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం నిజంగా తగ్గింది. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణలో మహిళలు 60 శాతం ఉన్నారు. మహిళలకు అవకాశాలు అపారమవుతున్నాయి. నాయకత్వం శారీరక బలంతో కాదు.. మానసిక పరాక్రమంతో సాధ్యమవుతుంది. సంగీత: అపోలోను 40 ఏళ్ల క్రితం ప్రారంభించాం. అత్యాధునిక ఆరోగ్య సేవలను ప్రజలకు వేగంగా అందించాలనే లక్ష్యంతో అడుగులు వేశాం. కానీ ఇప్పటికీ ముందస్తు వ్యాధి నిర్ధారణ సవాలుగానే ఉంది. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందినప్పటికీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేశంలోని కార్డియాక్ పేషంట్లలో 63 శాతం మందిలో గుండెలో మూడు నాళాలు మూసుకుపోయాయి. మొదటి నాళం మూసుకున్నప్పుడే విషయాన్ని గుర్తిస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అలాగే కేన్సర్ రోగుల్లో 73 శాతం మంది మూడో దశ, నాలుగో దశలోనే వ్యాధి బయటపడుతోంది. వారిని మొదటి దశలోనే గుర్తించగలిగితే చరిత్రను తిరగరాయొచ్చు. వాటి గుర్తింపునకు కృత్రిమ మేధ (ఏఐ) మరింత విస్తృతంగా అందుబాటులోకి రావాలి. దీనిపై యాపిల్ ఏవిధంగా ఆలోచిస్తోంది? సుంబుల్: ప్రజారోగ్యానికి యాపిల్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ఆరోగ్య అంశాల కోసం యాప్‌లు తీసుకొచ్చాం. గుండె స్పందన, నడక తదితరాల కోసం ప్రత్యేక ఫీచర్లు అందించాం. ఇంకా ఎన్నో రకాలను ఆవిష్కరిస్తున్నాం. దీంతోపాటు మహిళల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాం. -
సృజన భళా... ఆరోగ్య మేళా...
సాక్షి, హైదరాబాద్: సూది గుచ్చడం దగ్గర నుంచి సర్జరీ దాకా అవసరమైన సందర్భాల్లో నొప్పి తెలీకుండా చేసే ఉత్పత్తి ఏదైనా ఉంటే? మనం ఇంట్లో కూర్చుని ఓ వైపు మన పని మనం చేసుకుంటుండగానే మన హార్ట్ బీట్, బ్లడ్‌షుగర్ స్థాయిలు వైద్యునికి తెలిసిపోతూ ఉంటే..? ఆకాశమే హద్దుగా ఆరోగ్యరంగంలో వెల్లువెత్తుతున్న సృజన సాకారం చేస్తున్న అద్భుతాలివి... వీటన్నింటికి అద్దం పడుతోంది నగరంలో జరుగుతున్న బయో ఆసియా సదస్సు. ఇందులో విజేతలుగా నిలిచిన స్టార్టప్‌లు చేసిన ఆవిష్కరణలు ఇలా.. అందుబాటు ధరలో కృత్రిమ అవయవాలు వైకల్య బాధితులను దృష్టిలో పెట్టుకుని అత్యంత తేలికగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉత్పత్తులు రూపొందించాం. ప్రస్తుతం మేము చేతులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. త్వరలో ప్రధాన అవయవాలనూ అందుబాటులోకి తెస్తాం. సహజమైన శరీర భాగాల తరహాలోనే ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్పత్తులు రూ7 లక్షల వరకుంటే.. మా ఉత్పత్తులు రూ.1.50 లక్షల్లోనే లభిస్తున్నాయి. – మునీష్ కుమార్, ఎగ్జోబొట్ డైనమిక్స్ సంస్థ సీఈఓ కేన్సర్ మందుల సృష్టితో... అంతర్జాతీయ మార్కెట్ కోసం కేన్సర్ మందులను తయారు చేసే సంస్థని మూడేళ్ల క్రితం ప్రారంభించాం. ఫస్ట్ ఇన్ క్లాస్ మెకానిజమ్‌తో దేశంలోనే మాది తొలి సంస్థ. లంగ్ కేన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ కేన్సర్‌కు డ్రగ్‌ను అభివృద్ధి చేశాం. దీనిని త్వరలోనే మనుషుల మీద ప్రయోగించనున్నాం. దేశంలో ఇంతవరకు ఎవరూ చేయని మెకానిజమ్‌ను అనుసరిస్తూ ఈ డ్రగ్‌ను తెస్తున్నందుకే మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. –సీఎస్ఎన్ మూర్తి, సీఈఓ సత్య ఫార్మా ఇన్నోవేషన్స్, హైదరాబాద్ ఆరోగ్యం చెప్పే మెషీన్ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కనిపించే వెయింగ్ మెషీన్ తరహాలో ఓ అధునాతన మెషీన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్‌కు చెందిన పల్స్ యాక్టివ్ స్టేషన్స్ నెట్వర్క్ రూపొందించింది. ఈ మెషీన్ మీదకు ఎక్కి స్క్రీన్ ముందు నిలబడి మొబైల్ నంబర్ తదితర వివరాలు ఎంట్రీ చేస్తే చాలు. మన ఆరోగ్య వివరాలు వాట్సాప్‌కు వచ్చేస్తాయి. ఇందులో మన బరువు, ఎత్తు, బీఎంఐ, బీపీతోపాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని, ఫిట్నెస్ స్థాయిని, డయాబెటిస్ అవకాశాల్ని కూడా అంచనా వేస్తుంది. మెషీన్‌ని పూర్తిగా తెలంగాణలోనే తయారు చేశామని భవిష్యత్తులో అన్ని ఆసుపత్రుల్లో బహిరంగ ప్రదేశాల్లో అమర్చేలా ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో జోగిందర్ తనికెళ్ల చెప్పారు. ధర రూ.2.50 లక్షలు. నేరుగా వైద్యుడికి నివేదికలు.. ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకోవడంతోపాటు ఆ పరీక్షల ఫలితాలు నేరుగా మన వైద్యునికి చేరేలా ఉత్పత్తులు సృష్టించారు ‘ఆబో 1008 డిజిటల్ హెల్త్ కేర్’ సంస్థకు చెందిన నగరవాసి సత్యదేవ్. పల్స్ రేట్, బీపీ, ఈసీజీ, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర శాతం ఇవన్నీ కలిపి హెల్త్ బోట్ డివైజ్ ద్వారా పరీక్షించుకునే సదుపాయాన్ని తెచ్చారు. అలాగే నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి స్థాయిలు, మహిళల రుతుక్రమ సమస్యలు తెలుసుకునే ఉంగరం మాదిరి ఉండే పరికరాన్నీ రూపొందించారు. చర్మ పరీక్షలు, చెవి, గొంతు సమస్యలు తెలుసుకోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యల్ని గుర్తించడానికి ఆబో వన్ డివైజ్‌లను తయారుచేశారు. ఇంట్లో చేసుకున్న ఈ పరీక్షల రిపోర్టులు నేరుగా వైద్యునికి చేరేలా అప్లికేషన్ రూపొందించామన్నారు. విద్యుత్ అవసరం లేని ‘ఫ్రీజర్’.. కొన్ని రకాల వైద్య చికిత్సల్లో ఉపయోగించే ఉత్పత్తుల్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో భధ్రపరచాల్సి ఉంటుంది. దీని కోసం ఇప్పటిదాకా థర్మాకోల్‌తో చేసిన బాక్స్‌లనే ఉపయోగిస్తుండగా, బయోస్యూర్ పేరుతో షిప్పర్ బాక్స్‌లను మ్యాక్ఫై అనే సంస్థ రూపొందించింది. విద్యుత్ అవసరం లేకుండా రోజుల తరబడి ఫ్రీజర్ సేవల్ని అందించే ఈ బాక్స్‌ను వెజిటబుల్స్ దాచుకోవడానికీ వాడొచ్చని సంస్థ చెప్పింది. పేస్ ఛేంజ్ మెటీరియల్ ఉపయోగించి దీన్ని చార్జ్ చేయాల్సి ఉంటుందని, ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే నిర్ణీత ఉష్ణోగ్రతను 24గంటలపాటు ఉంచుతుందని పేర్కొంది. అందరికీ ప్రాథమిక వైద్యం కోసం... ప్రాథమిక వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా హెల్త్ కాన్ అండ్ మెడ్ టెక్ స్టార్టప్ లక్ష్యం. ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రజలకు డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ సొల్యూషన్స్, మొబైల్ హెల్త్ సొల్యూషన్స్, అనలటిక్స్ ద్వారా హెల్త్‌కేర్‌ను చేరువ చేస్తున్నాం. అపోలో టెలీ హెల్త్‌తో కలిసి దేశవ్యాప్తంగా 440 కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు 3 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. బయో ఆసియాలో లభించిన ఈ గుర్తింపు మా సేవలకు మరింత స్ఫూర్తినిస్తుంది. – డా.ప్రణయ్ కార్గ్, ప్రతిభ హెల్త్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే ఇట్టే గుర్తించే పేపర్ ఆధారిత డివైజ్... రాంజా జీనో సెన్సర్ కూడా టాప్ 5లో నిలిచింది. అమెరికాలోని ఎండీ ఆండర్సన్ కేన్సర్ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్‌కు చెందిన ల్యాంబ్డజెన్ థెరప్యూటిక్స్ కూడా ఈ జాబితాలో నిలిచింది. -
లైఫ్ సైన్సెస్‌లో విజ్ఞాన కేంద్రంగా నిలపడమే లక్ష్యం: కేటీఆర్
జీవశాస్త్ర సేవల్లో వృద్ధి సాధించడం ద్వారా ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి గమ్యస్థానంగా హైదరాబాద్ ఇప్పటికే పేరు గడించినా.. ఇక్కడితోనే ఆగిపోవాలని తాము కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన దిగ్గజాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ఆ వివరాలు కేటీఆర్ మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నాం. మేం విధించుకున్న సాహసోపేత లక్ష్యాన్ని సాధించేందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నాం. వాటి సాయంతో లైఫ్ సైన్సెస్ రంగానికి కొత్త రూపు ఇస్తాం. పరిశోధన, అభివృద్ధికి గమ్యస్థానంగా.. భారత ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం వాటా కలిగిన హైదరాబాద్‌లో ఉన్న వెయ్యికి పైగా లైఫ్‌సైన్సెస్ కంపెనీలు వినూత్న, జెనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, బయోలాజికల్–ఈ, భారత్ బయోటెక్, శాంతా బయోటెక్, అరబిందో, హెటెరో, గ్లాండ్ ఫార్మా, విర్చో బయోటెక్ వంటి కీలక సంస్థలు ఇక్కడ ఉండటంతో.. జీవ ఔషధాల ఉత్పత్తిలో దేశంలోనే హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటయ్యే బయో ఫార్మాహబ్ (బీ హబ్), హైదరాబాద్ ఫార్మాసిటీలతో మా సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. కణ, జన్యు చికిత్సల రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు కొత్త తరహా నివారణ, చికిత్సల వాణిజ్యీకరణ లక్ష్యంతో హైదరాబాద్‌లో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ మెడిసిన్’ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. అన్ని వసతులు, వనరులతో.. ఆసియాలో ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సేవలకు హైదరాబాద్‌ను కేంద్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతులు జీనోమ్ వ్యాలీలో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఔషధ రసాయన శాస్త్రం, డిస్కవరీ బయాలజీ, ప్రీ–క్లినికల్, క్లినికల్, డ్రగ్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్ ప్రొడక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సహా వివిధ సేవలు అందించే భారతీయ, బహుళజాతి ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సర్వీస్ ఆర్గనైజేషన్లకు హైదరాబాద్ నిలయంగా ఉంది. అంచనాలకు మించి వృద్ధి సాధించాం.. లైఫ్ సైన్సెస్, ఫార్మా, సంపూర్ణ ఆరోగ్య రక్షణ ప్రాముఖ్యతను గుర్తించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. 2030 నాటికి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం విలువ వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని గతంలో మేం వేసుకున్న అంచనాలు చాలా మందికి నమ్మశక్యంగా కనిపించలేదు. కానీ 2022 నాటికే 80 బిలియన్ డాలర్లకు చేరుకున్నాం. నిర్దేశిత షెడ్యూల్ కంటే ఐదేళ్లు ముందు 2025 నాటికే వంద బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధి జాతీయ స్థాయిలో 14శాతంకాగా.. తెలంగాణలో 23 శాతంగా ఉంది. ఏడేళ్లలో కొత్తగా 3 బిలియన్ డాలర్లకుపైగా నికర పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు 4.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. బయో ఆసియా 20వ వార్షిక సదస్సు కొత్త అవకాశాలకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఘనంగా ‘బయో ఆసియా’ సదస్సు ప్రారంభం ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, ఆరోగ్యరక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ శుక్రవారం హెచ్ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు ప్రభుత్వ అధికారులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన నిపుణులు పాల్గొన్నారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ ఒన్: షేపింగ్ నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ నేపథ్యం (థీమ్)తో ఈ వార్షిక సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రారంభ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నోవారి్టస్ సీఈవో వాస్ నరసింహన్, రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, జయంత్ నాడిగర్, సమిత్ హెరావత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని పునర్ నిర్మించాలనే ఉద్దేశంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నాం. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నాం. ఈ సాహసోపేత లక్ష్యాన్ని సాధించేందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నాం. 1. సెల్, జీన్ థెరపీ వంటి కొత్త నివారణ చికిత్సల వాణిజ్యీకరణ, 2. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, 3.లైఫ్ సైన్సెస్ ఫోకస్డ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడం, 4.ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల కలబోత సాధించడం. ఈ నాలుగింటి సాయంతో లైఫ్ సైన్సెస్ రంగానికి కొత్త రూపు ఇస్తాం. -కేటీఆర్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి గుండె వ్యాధులకూ వ్యాక్సిన్ చికిత్సలు: నోవార్టీస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్ మానవ మేధస్సును సాంకేతికత భర్తీ చేయలేదని, కానీ మనుషులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతికత అవసరమని ప్రముఖ ఫార్మా సంస్థ నోవార్టీస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్ చెప్పారు. మానవ శరీర నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడంతోపాటు ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారంపై లోతుగా ఆలోచించాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ‘బయో ఆసియా’ సదస్సులో వాస్ నరసింహన్ కీలకోపన్యాసం చేశారు. ‘‘డేటా సైన్సెస్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆరోగ్యపరమైన అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు సరిపడినంత సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. గత దశాబ్దకాలంగా అనేక వైద్య, చికిత్సాపరమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కణ, జన్యు చికిత్స వంటి కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి వృద్ధుల్లో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. 80వ దశకంలో పురుడు పోసుకున్న ఎస్ఐ ఆర్ఎన్ఏ సాంకేతికత ద్వారా గుండె సంబంధ వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఎస్ఐ ఆర్ఎన్ఏ ఉపయోగించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు కూడా వ్యాక్సిన్ ఆధారిత చికిత్స ఎంతో దూరంలో లేదు. గుండె వ్యాధుల తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది కేన్సర్ బారిన పడుతున్నారు. ఎన్నో రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ‘రేడియోలిగాండ్’ అనే కొత్త విధానంలో పెట్ స్కాన్ ద్వారా కేన్సర్ కణితులను గుర్తించి రేడియేషన్ చికిత్స అందించవచ్చు..’’ అని వాస్ నరసింహన్ చెప్పారు. ఈ రెండింటి తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది నరాల సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యానికి గురి కావడం జరుగుతోందని.. బహుళ సాంకేతికతల వినియోగం ద్వారా మెదడులోని వివిధ భాగాలకు చికిత్స అందించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో సికిల్ సెల్ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని.. అవసరమైనంత మేర ఔషధాలు అందుబాటులో లేవని చెప్పారు. హైదరాబాద్‌లో కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు 15 ఏళ్ల క్రితం నోవార్టిస్ సంస్థ హైదరాబాద్‌లో అడుగు పెట్టిందని.. శరవేగంగా వృద్ధి చెంది ప్రస్తుతం కార్పోరేట్ సెంటర్‌గా ఎదిగిందని వాస్ నరసింహన్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. ఔషధ అభివృద్ధి, డేటా నిర్వహణ తదితర అంశాల్లో వేగంగా వృద్ధి చెందుతోందని వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో హైదరాబాద్‌కు రావాలని పిలుపునిచ్చారు. -
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే సత్తా భారత్‌కు ఉందని, 50 కోట్ల మంది ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కల్పించేందుకు చేపట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో వాస్ (వసంత్) నరసింహన్ స్పష్టం చేశారు. దేశంలోని మేధో సంపత్తిని దృష్టిలో ఉంచుకున్నా, బయో టెక్నాలజీ, ఆరోగ్య రంగాల్లో మన శక్తి సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకున్నా భారత్ ప్రపంచంపై తనదైన ముద్ర వేసేం దుకు ఇది మంచి తరుణమని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్ర పరిశ్రమల రంగంలో విశేష కృషి జరిపేందుకు బయో ఆసియా ఏటా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును వాస్ నరసింహన్ మంగళవారం అందుకున్నారు. మంత్రి కె.తారక రామారావు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం వైద్య రంగంలో వస్తున్న మార్పులపై వాస్ ప్రసంగించారు. మందులనేవి వచ్చి కేవలం రెండు మూడు వందల ఏళ్లు మాత్రమే అయిందని మందులతో చేసే వైద్యం కూడా ఇప్పుడు మారి పోయి.. కణ ఆధారిత, జన్యు ఆధారిత వైద్యంగా పరిణమిస్తోందన్నారు. కేన్సర్‌తోపాటు గుండె జబ్బులకు, మలేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కూడా కణ ఆధారిత చికిత్సలు అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. హైదరాబాద్ కేంద్రంగా బయోమ్.. నోవార్టిస్‌కు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద కేంద్రం ఉందని, దీనికి అదనంగా బయోమ్ పేరుతో ఇంకో వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని వాస్ నరసింహన్ ప్రకటించారు. -
కార్ల్ జూన్‌కు ‘జినోమ్’ అవార్డు
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారికి వినూత్న చికిత్సను అందుబాటులోకి తెచ్చిన అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ కార్ల్ హెచ్.జూన్, ప్రజారోగ్య రంగంలో విశేష కృషి చేసిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్‌లకు ఈ ఏడాది జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ప్రకటిం చారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహించే బయో ఆసియా ఇప్పటికే ఆసియా మొత్తానికి అతిపెద్ద జీవశాస్త్ర సంబంధిత వేదికగా పరిణమించిన సంగతి తెలిసిందే. ఫార్మా రంగంతోపాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించే బయో ఆసియా ఆయా రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందిస్తోంది. ఈ ఏడాది బయో ఆసియా సమావేశం ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఈ నేపథ్యంలో కార్ల్ హెచ్.జూన్‌కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు ఇస్తున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన వాస్ నరసింహన్‌లకు బయో ఆసియా తొలిరోజున అవార్డులు అందిస్తామని వివరించింది. ఇమ్యూనోథెరపీ ద్వారా.. కేన్సర్ వ్యాధికి ప్రస్తుతం మూడు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి శస్త్రచికిత్స, రెండు రేడియో థెరపీ, మూడు కీమో థెరపీ. ఈ మూడింటితోనూ చాలా సమస్యలున్నాయి. కీమో, రేడియో థెరపీలతో జుట్టు ఊడిపోవడం మొదలుకొని ఆరోగ్యకరమైన కణాలూ నాశనమై అనేక దుష్ప్రభావాలు చూపుతాయన్నది మనకు తెలిసిందే. కేన్సర్ కణాలు రోగ నిరోధక శక్తి కణాలను దృష్టిని తప్పించుకోవడం ద్వారా శరీరమంతా వ్యాపిస్తుంటాయి. అయితే కార్ల్ జూన్ ఈ రోగ నిరోధక వ్యవస్థ కణాల్లో (టి–సెల్స్) కొన్ని మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్ కణాలను గుర్తించి మట్టుబెట్టేలా చేయగలిగారు. కచ్చితంగా చెప్పాలంటే టి–సెల్స్ ఉపరితలానికి కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్లను అనుసంధానిస్తారు. ఫలితంగా ఇవి కేన్సర్ కణాలను గుర్తించే శక్తిని పొందుతాయన్నమాట. దీన్నే ఇమ్యూనోథెరపీ అని పిలుస్తారు. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన మెరుగైన కేన్సర్ చికిత్స ఇది. కార్ల్ జూన్ పరిశోధనల ఆధారంగా అభివృద్ధి చెందిన టిసాజెన్లిక్లుయి అనే ఎఫ్‌డీఏ ఆమోదిత జన్యు చికిత్స అందుబాటులోకి వచ్చింది. -
200కుపైగా కంపెనీలతో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం
-
జినోమ్ వ్యాలీ 2.0
సాక్షి, హైదరాబాద్ : ఫార్మా, జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 200కుపైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, స్టార్టప్‌లతో కూడిన జినోమ్ వ్యాలీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిని జినోమ్ వ్యాలీ 2.0 (రెండో దశ)గా ఆయన అభివర్ణించారు. కొన్ని నెలల్లో ప్రారంభంకానున్న ఫార్మాసిటీ, వైద్య పరికరాల తయారీ కేంద్రాలతో రాష్ట్రం బయోటెక్నాలజీ రంగంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన 15వ బయోఆసియా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ బయోటెక్నాలజీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. వచ్చే పదేళ్లలో రెట్టింపు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 కంపెనీలతో బయోటెక్నాలజీ రంగం ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉందని.. వచ్చే పదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేటీఆర్ చెప్పారు. తద్వారా ఒక్క తయారీ రంగం ద్వారానే నాలుగు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడం సాధ్యమన్నారు. ఇమ్యూనోథెరపీ, వ్యక్తిగత, నానో వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలున్న సంస్థను ఏర్పరచేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని చెప్పారు. మందులను పరీక్షించేందుకు అవసరమైన జంతువులు స్థానికంగానే లభించేలా అనిమిల్ రిసోర్స్ ఫెసలిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం, అంతర్జాతీయ వ్యాక్సీన్ల తయారీలో 33 శాతం వాటా కలిగిన హైదరాబాద్‌లో ఏటా ఒక కొత్త వ్యాక్సీన్ ఉత్పత్తి కావాలని ఆశిస్తున్నామని, ఇందుకోసం జినోమ్ వ్యాలీలో ఒక వ్యాక్సీన్ ఇన్క్యుబేటర్ను ప్రారంభించే ఆలోచన ఉందని వివరించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని ఫార్మా, బయోటెక్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఈ రంగానికి సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. పెద్ద కంపెనీలు సైతం ఇన్‌క్యుబేటర్లతో కలసి పనిచేసేలా ఈ విధానం ప్రోత్సహిస్తుందని వివరించారు. జీవశాస్త్ర రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటైన లైఫ్ సైన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ ఏడాది పెట్టుబడులు పెట్టడం మొదలుపెడుతుందని, వచ్చే రెండు మూడేళ్లలో రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. ప్రొఫెసర్ హాల్‌కు ఎక్సలెన్సీ అవార్డు జీవశాస్త్ర రంగంలో విశిష్ట సేవలందించే వారికి బయో ఆసియా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును ఈ ఏడాది ప్రొఫెసర్ మైకేల్ ఎన్ హాల్‌కు అందించారు. స్విట్జర్లాండ్‌లోని బేసిల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హాల్ కణాల పెరుగుదలలో ర్యాపమైసిన్ ప్రోటీన్ల పాత్రపై పరిశోధనలు చేశారు. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలకు అనుగుణంగా శరీరంలోని ఒక వ్యవస్థ కణాల సైజును తగ్గిస్తుందన్న ఈయన పరిశోధన.. అవయవ మార్పిడిని మరింత సులభతరం చేసింది. రోగ నిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా చూసేందుకు ఉపయోపడింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రొఫెసర్ హాల్ మాట్లాడుతూ.. మానవాళి జీవశాస్త్ర రంగంలో ఎంతో ప్రగతి సాధించినప్పటికీ.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందన్నారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు అదుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం, మలేసియాలోని సెలంగోర్ రాష్ట్ర ప్రభుత్వం జీవశాస్త్ర రంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, సెలంగోర్ ప్రతినిధి దాతో హసన్ ఇద్రిస్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే బయో ఆసియా సదస్సులో దేశవిదేశాల నుంచి వచ్చిన 1,600 మంది పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. -
గ్లోబల్ లక్ష్యాల్ని అందుకోలేపోయాం
హైదరాబాద్: భారతదేశంలో వైద్యరంగం అభివృద్ధిగణనీయంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవడంలో ఇంకా వెనకబడే ఉన్నట్టు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. భారతీయుల సగటు ఆయు ప్రమాణం పెరిగినా.. మిలీనియం అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని తెలిపారు. దేశీయ హెల్త్కేర సెక్టార్ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి మరింత సుదీర్ఘ కాలం పట్టే అవకాశంఉందన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బయో ఆసియా 2017 సదస్సులో బుధవారం మాట్లాడిన ఆయన ప్రపంచ బ్యాంక్ రిపోర్టును ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ, "మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు" అందుకోలేకపోయిందని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణపై ఎక్కువగా పెట్టుబడులుపెట్టిన చైనా, బ్రెజిల్ తో పోలిస్తే ఇండియా వెనుకబడి ఉందన్నారు. చికున్ గున్యా, డెంగ్యూకేసుల నమోదు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ రాష్ట్రాల్లో కొన్నిదక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాల భారీ వ్యత్యాసాలను ఉన్నాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లాంటి చిన్న పొరుగు దేశాలకంటే కూడా తీసిపోయినట్టు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 1995- 2015కాలంలో మోర్టాలిటీ రేటు 25 పాయింట్ల మేర క్షీణించిందని మూర్తి పేర్కొన్నారు. -
నేటి నుంచి బయో ఏషియా సదస్సు
ప్రారంభించనున్న గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా – 2017 సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. హెచ్ఐసీసీలో సోమవారం నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభిస్తారని నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 50 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ కుర్త్ ఉత్రిచంద్, డాక్టర్ పాల్ స్టోఫెల్స్‌లకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డును గవర్నర్ అందజేస్తారు. అంతకుముందు షామీర్పేటలోని జీనోమ్‌వ్యాలీలో కొన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ తమ లేబరేటరీని జీనోమ్‌వ్యాలీలో నెలకొల్పనుంది. ఈ రీసెర్చ్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని వచ్చే నెల నిర్వహించనున్నారు. దీనికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది. మొదటి విడతలో కేంద్రం రూ. 350 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ సదస్సుకు ఫార్మాసూటికల్స్ అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ పాల్ స్టోఫెల్స్ కీలకోపన్యాసం చేస్తారు. ఇక్కడ నిర్వహించే ఎగ్జిబిషన్లో 100 స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. హెల్త్‌కేర్ స్టార్టప్‌లనూ ఏర్పాటు చేసి డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్, రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ, త్రీడీ బయో ప్రింటింగ్‌లను ప్రదర్శిస్తారు.