బయో ఏసియా సదస్సులో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఫార్మా, జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 200కుపైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, స్టార్టప్‌లతో కూడిన జినోమ్ వ్యాలీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిని జినోమ్ వ్యాలీ 2.0 (రెండో దశ)గా ఆయన అభివర్ణించారు.
కొన్ని నెలల్లో ప్రారంభంకానున్న ఫార్మాసిటీ, వైద్య పరికరాల తయారీ కేంద్రాలతో రాష్ట్రం బయోటెక్నాలజీ రంగంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన 15వ బయోఆసియా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ బయోటెక్నాలజీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
వచ్చే పదేళ్లలో రెట్టింపు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 కంపెనీలతో బయోటెక్నాలజీ రంగం ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉందని.. వచ్చే పదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేటీఆర్ చెప్పారు. తద్వారా ఒక్క తయారీ రంగం ద్వారానే నాలుగు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడం సాధ్యమన్నారు. ఇమ్యూనోథెరపీ, వ్యక్తిగత, నానో వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలున్న సంస్థను ఏర్పరచేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని చెప్పారు. మందులను పరీక్షించేందుకు అవసరమైన జంతువులు స్థానికంగానే లభించేలా అనిమిల్ రిసోర్స్ ఫెసలిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం, అంతర్జాతీయ వ్యాక్సీన్ల తయారీలో 33 శాతం వాటా కలిగిన హైదరాబాద్‌లో ఏటా ఒక కొత్త వ్యాక్సీన్ ఉత్పత్తి కావాలని ఆశిస్తున్నామని, ఇందుకోసం జినోమ్ వ్యాలీలో ఒక వ్యాక్సీన్ ఇన్‌క్యుబేటర్‌ను ప్రారంభించే ఆలోచన ఉందని వివరించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని ఫార్మా, బయోటెక్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఈ రంగానికి సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.
పెద్ద కంపెనీలు సైతం ఇన్‌క్యుబేటర్లతో కలసి పనిచేసేలా ఈ విధానం ప్రోత్సహిస్తుందని వివరించారు. జీవశాస్త్ర రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటైన లైఫ్ సైన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ ఏడాది పెట్టుబడులు పెట్టడం మొదలుపెడుతుందని, వచ్చే రెండు మూడేళ్లలో రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు.
ప్రొఫెసర్ హాల్‌కు ఎక్సలెన్సీ అవార్డు
జీవశాస్త్ర రంగంలో విశిష్ట సేవలందించే వారికి బయో ఆసియా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును ఈ ఏడాది ప్రొఫెసర్ మైకేల్ ఎన్ హాల్‌కు అందించారు. స్విట్జర్లాండ్‌లోని బేసిల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హాల్ కణాల పెరుగుదలలో ర్యాపమైసిన్ ప్రోటీన్ల పాత్రపై పరిశోధనలు చేశారు. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలకు అనుగుణంగా శరీరంలోని ఒక వ్యవస్థ కణాల సైజును తగ్గిస్తుందన్న ఈయన పరిశోధన.. అవయవ మార్పిడిని మరింత సులభతరం చేసింది. రోగ నిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా చూసేందుకు ఉపయోపడింది.
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రొఫెసర్ హాల్ మాట్లాడుతూ.. మానవాళి జీవశాస్త్ర రంగంలో ఎంతో ప్రగతి సాధించినప్పటికీ.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందన్నారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు అదుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం, మలేసియాలోని సెలంగోర్ రాష్ట్ర ప్రభుత్వం జీవశాస్త్ర రంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, సెలంగోర్ ప్రతినిధి దాతో హసన్ ఇద్రిస్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే బయో ఆసియా సదస్సులో దేశవిదేశాల నుంచి వచ్చిన 1,600 మంది పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment