Genome Valley
-
వందల కోట్లతో పశువుల వ్యాక్సిన్ల తయారీ యూనిట్ నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం ఇండియన్ ఇమ్యునలాజికల్స్ (ఐఐఎల్) నూతన ప్లాంటు నిర్మాణం ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని జీనోమ్‌వ్యాలీలో 14 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల వ్యయంతో ఇది ఏర్పాటవుతోంది. గురువారం ఈ మేరకు నూతన కేంద్రం కోసం భూమి పూజను కంపెనీ నిర్వహించింది. పశువులకు అవసరమయ్యే వ్యాక్సిన్లను ఇక్కడ తయారు చేస్తారు. ఏటా 30 కోట్ల యూనిట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ ఈ ప్లాంటును స్థాపిస్తోంది. తయారీ కేంద్రం కార్యరూపంలోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ‘హైదరాబాద్‌లోని ఈ కొత్త ప్లాంటు దేశానికి అంకితం. భారత్‌లో ఫుట్ అండ్ మౌత్ డిసీస్ (గాలికుంటు వ్యాధి) నిర్మూలనలో ఈ కేంద్రం సహాయపడుతుంది. అందుబాటు ధరలో వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీలో ఐఐఎల్ సామర్థ్యం ఖజానాకు రూ. వేల కోట్లను ఆదా చేసింది’ అని ఎన్డీడీబీ, ఐఐఎల్ చైర్మన్ మీనేశ్ షా ఈ సందర్భంగా తెలిపారు. -
జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా పెట్టుబడి రూ.400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్స్, బయో సిమిలర్, యాంటీబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ తయారీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాన్ని ప్రస్తుత పెట్టుబడితో గ్లాండ్ ఫార్మా విస్తరిస్తుంది. తద్వారా స్థానికంగా అర్హత, నైపుణ్యం కలిగిన 500 మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తుంది. గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్ సదు సోమవారం మంత్రి కేటీ రామారావుతో భేటీ సందర్భంగా గ్లాండ్ ఫార్మా కార్యకలాపాల విస్తరణకు రూ.400 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్లు, బయోలాజికల్స్, బయోసిమిలార్, యాంటీబాడీస్ తదితర అధునాతన రంగాల్లో ఔషధాల తయారీకి 2022లో రూ.300 కోట్లతో జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా బయో ఫార్మాసూటికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. దీనిద్వారా 200 మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా గ్లాండ్ ఫార్మా తాజా పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
పరిశోధనల్లోనూ అగ్రగామి కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫార్మసీ రాజధానిగా ఎదిగిన భారత్.. శాస్త్ర పరిశోధనల రంగంలోనూ అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగేందుకు కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ జనాభా తీసుకునే ప్రతి ఆరు మాత్రల్లో ఒకటి భారత్‌లో తయారవుతోందని.. అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే ప్రతి నాలుగు మాత్రల్లో ఒకటి ఇక్కడ తయారైన జెనరిక్ మాత్ర అని ఆయన వెల్లడించారు. శనివారం హైదరాబాద్ శివారులోని జినోమ్ వ్యాలీలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘‘నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్’’ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన రంగంలో అగ్రగామిగా మారేందుకు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల పరిశోధనశాలల్లో ప్రైవేట్ రంగం కూడా పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో అవసరాన్ని బట్టి ప్రైవేట్ సంస్థల్లోని సౌకర్యాలను వాడుకునేందుకు ప్రభుత్వ సంస్థలకూ అవకాశం ఉండేలా చూస్తామని చెప్పారు. పరిశోధనలకు పెద్ద ఎత్తున వేర్వేరు జాతుల జంతువులు అవసరమవుతాయని, నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ ఈ అవసరాన్ని తీరుస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఇది దేశంలోనే అతిపెద్ద వ్యవస్థ అని, ఎలుకలు మొదలుకొని గుర్రాల వరకూ పలు రకాల జంతువులను పెంచి పోషించేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారని అన్నారు. ఇందుకు తగ్గట్టుగా కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పూర్తిస్థాయి స్వదేశీ టీకా తయారైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని ఎయిమ్స్ ఆసుపత్రుల్లో సమీకృత వైద్యవిధానం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆయుర్వేదంతోపాటు అన్ని రకాల వైద్యపద్ధతుల్లో మెరుగైన వైద్యం అందించడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భాల్ పాల్గొన్నారు. ఎన్ఐఎన్కు మంత్రి మాండవీయ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)ను సందర్శించారు. సంస్థలోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘డైట్ అండ్ బయోమార్కర్ స్టడీ’ని ప్రారంభించారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ వర్గాల ఆహారపు అలవాట్ల నమోదు, దేశవ్యాప్తంగా ఆహారం, పోషకాల కొరతను గుర్తించడం ఈ అధ్యయనం ముఖ్యఉద్దేశం. ఈ అధ్యయనం ద్వా రా రక్తహీనత సహా పలు పోషక లోపాల సమాచారం తెలుస్తుందని ఎన్ఐఎన్ డైరెక్టర్ ఆర్.హేమలత తెలిపారు.దేశంలో తొలి సా రి వివిధ ప్రాంతాల్లో వండిన ఆహారం, వండని ఆహారంలో ఉండే పోషకాలను గుర్తించేందుకు ఈ అధ్యయనం ద్వారా ప్రయత్నం చేస్తున్నామని హేమలత వివరించారు. -
Telangana: బీఈ పెట్టుబడి రూ.1,800కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగాన్ని భారీగా విస్తరించాలని కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్–ఈ (బీఈ) సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీయెత్తున పెంచేందుకు ఏకంగా రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ ఘనత సాధించనుంది. రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ ప్రకటించింది. గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం తరువాత బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వివరాలు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం ప్రతి ఏడాదీ 900 కోట్ల టీకాలు ఉత్పత్తి అవుతుంటే.. బీఈ తాజా విస్తరణతో 1,400 కోట్ల టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు. కోవిడ్ నివారణ టీకా జెన్సెన్, ఎమ్మార్ పీసీవీ , టైఫాయిడ్, ఐపీవీ, పెర్టుసిస్ వ్యాక్సిన్లు.. టెటనస్ టాక్సైడ్ యాంపూల్స్, జెనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. సుదీర్ఘ చరిత్ర గల బీఈ సంస్థ దాదాపు నాలుగు వ్యూహాత్మక బిజినెస్ యూనిట్లను కలిగి ఉందన్నారు. కోవిడ్ నేపథ్యంలో సకాలంలో స్పందించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మౌలిక వసతులు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే.. ప్రపంచ టీకా అవసరాల్లో మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే తీరుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఈ విస్తరణను సగర్వంగా.. సంతోషంగా ప్రకటిస్తున్నానని, దీనిద్వారా టీకా రంగంలో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం మీద ఏడాదికి 900 కోట్ల టీకాలు తయారవుతున్నాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీకాల ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన క్లస్టర్ అని వివరించారు. ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, స్పెషల్ ఎకనామిక్ జోన్, డ్రై, వెట్ లాబోరేటరీలు , ఇంక్యుబేషన్ సౌకర్యాలు ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులోని దాదాపు 200 పరిశ్రమల్లో 15 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు నోవార్టిస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, డూపాంట్, లోంజా తదితర కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం.నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
జీనోమ్ వ్యాలీలో ఫెర్రింగ్ ఫార్మా
స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముక ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ హైదరాబాద్‌లో తన కార్యకలపాలు ప్రారంభించింది. జీనోమ్ వ్యాలీలో నిర్మాణం జరుపుకున్న వరల్డ్ క్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 2022 ఏప్రిల్ 25న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫెర్రింగ్ సంస్థ తొలుత ఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని మహారాష్ట్రలో ప్రారంభించాలని అనుకుందని.. కానీ ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలిపారు. ఫెర్రింగ్ సంస్థ యాభై ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉంది. 60కి పైగా దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. రీప్రొడక్టివ్ హెల్త్, మెటర్నల్ హెల్త్, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల్లో పని చేస్తోంది. తొలి విడతగా హైదరాబాద్‌లో 30 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. చదవండి: అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్ -
కరోనా మహమ్మారిగా మారడం అదృష్టమే! ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: ముప్ఫై ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న కరోనా వైరస్ రెండేళ్ల క్రితం మహమ్మారిగా మారడం మన అదృష్టమని.. మనిషికి ఏమాత్రం తెలియని వైరస్‌తో ముప్పు వచ్చి ఉంటే ఆ విపత్తును ఊహించలేమని డాక్టర్ డ్రూ వైజ్మాన్ అభిప్రాయపడ్డారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ వైజ్మాన్ గురువారం బయో ఆసియా సదస్సులో భాగంగా అపోలో గ్రూప్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో ఒక చర్చలో పాల్గొన్నారు. మోడిఫైడ్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) టీకా అభివృద్ధిలో డాక్టర్ వైజ్మాన్ పరిశోధనలు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ రూపాంతరంతోనే కరోనా వైరస్ ప్రమాదం తొలగిపోలేదని.. భవిష్యత్‌లో ఈ వైరస్ రూపాంతరాలు విరుచుకుపడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయ పద్ధతుల్లో టీకాలను అభివృద్ధి చేసేందుకు కూడా అవకాశం లేనంత వేగంగా వైరస్లు పుట్టుకురావచ్చని.. దీన్ని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎంఆర్ఎన్ఏ సురక్షితం.. ఎంఆర్ఎన్ఏ సాయంతో టీకా అభివృద్ధి చేసిన క్రమాన్ని వైజ్మాన్ ఈ సందర్భంగా వివరించారు. సాధారణ పరిస్థితుల్లో ఆర్ఎన్ఏను శరీరంలోకి ఎక్కిస్తే అది కణజాలాన్ని దెబ్బతీస్తుందన్నారు. అందుకే తాము వాటిల్లో మార్పులు చేయడమే కాకుండా.. నానోస్థాయి కొవ్వుకణాల్లో బంధించి టీకాగా ఉపయోగించేలా చేశామని తెలిపారు. ఎంఆర్ఎన్ఏ టీకా వేగంగా పనిచేస్తుందని, సురక్షితమైందని, డీఎన్ఏను మారుస్తుందన్న అపోహల్లోనూ వాస్తవం లేదని వివరించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా కంపెనీలు తయారు చేసిన ఎంఆర్ఎన్ఏ టీకాలను వంద కోట్ల మంది తీసుకున్నారని, ఎలాంటి దుష్ఫలితాలూ దాదాపు కనిపించలేదని తెలిపారు. అన్ని రూపాంతరాలకూ ఒకే వ్యాక్సిన్... కరోనా వైరస్ రూపాంతరం చెందడం సహజమని, అల్ఫాతో మొదలై ఒమిక్రాన్ వరకూ ఇది పలు రూపాలు సంతరించుకుందని వైజ్మాన్ గుర్తు చేశారు. అయితే వైరస్ తన రూపం మార్చుకున్న ప్రతిసారీ టీకాలు అభివృద్ధి చేయడం అసాధ్యం... అందుకే తాము ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా అన్ని రకాల కరోనా రూపాంతరాలపై పనిచేసే టీకాను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొన్ని టీకాల అభివృద్ధి ఇప్పటికే జరుగుతోందని ప్రాథమిక ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయని చెప్పారు. 20 ఏళ్లలో కరోనా మూడుసార్లు (సార్స్, మెర్స్, కోవిడ్ కారక సార్స్–కోవ్–2) మానవాళిపై దాడి చేసిందని, భవిష్యత్‌లోనూ మరో రూపంలో ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఇతర వ్యాధులకు కూడా... ఆర్ఎన్ఏ అనేది సంక్లిష్టమైన పరమాణువు అయినా తయారీ చాలా సులువు అని డాక్టర్ వైజ్మాన్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని వాడేందుకయ్యే ఖర్చు కూడా తక్కువని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆర్ఎన్ఏ టీకాలు కరోనాకు మాత్రమే కాదు.. అనేక ఇతర వ్యాధులకూ ఉపయోగించవచ్చు. హెచ్ఐవీ మొదలుకొని మలేరియా, ఇన్ఫ్లుయెంజా, హెచ్ఎస్వీ, హెచ్‌సీవీ వ్యాధులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఫుడ్ అలె ర్జీలు, కేన్సర్ వ్యాక్సిన్లు, మధుమేహం, కీళ్లవాతం వంటి వ్యాధుల చికిత్సలోనూ ఈ ఆర్ఎన్ఏను వాడవచ్చని.. ఈ దిశగానూ తాము పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. గుండెపోటు వంటి సమస్యలకు, శరీరంలో మంట/వాపులను తగ్గించేందుకు కూడా ఆర్ఎన్ఏ టెక్నాలజీని వాడవచ్చని చెప్పారు. ‘ఆర్ఎన్ఏ టెక్నాలజీని జన్యుచికిత్సలకూ వాడవచ్చన్నది నా అతిపెద్ద నమ్మకం. సిస్టిక్ ఫైబ్రోసిస్, సికెల్ సెల్ అనీమియా వంటి వ్యాధులకు ఒక్క ఎంఆర్ఎన్ఏ ఇంజెక్షన్ ద్వారానే చికిత్స అందించే స్థితి వస్తుందని ఆశిస్తున్నా’అన్నారు. -
Telangana : ఔషధ రంగాభివృద్ధికి బీ–హబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్ (బీ–హబ్)ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీ–హబ్ భవనం నమూనా డిజైన్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించి, ట్విట్టర్లో వాటి ఫొటోలను పోస్టు చేశారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్–ఫేజ్ సెంటర్)గా బీ–హబ్ సేవలందించనుందని తెలిపారు. దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. 15 నెలల్లో బీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుందని చెప్పారు. రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్ ఏరియా)లో జినోమ్ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా్ట సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మించనుందని, స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో ప్రయోగశాలలుంటాయని వివరించారు. ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్ వేదికగా ఉపయోగపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. -
జీనోమ్‌లో విదేశీ సందడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు బుధవారం జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌తో పాటు బయోలాజికల్–ఈ సంస్థలను సందర్శించారు. కోవిడ్ నిరోధానికి భారత్ నిర్వహిస్తున్న కీలక పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్లను వారు సందర్శించారు. బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాయబారులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయి జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థతో పాటు బయోలాజికల్–ఈ సంస్థను సందర్శించారు. భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ, జేఎండీ సుచిత్రా ఎల్లాలు కోవాగ్జిన్ తయారీ ప్రక్రియను వారికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు వారితో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతల గురించి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. విదేశీ ప్రతినిధులు తమ పర్యటనను ముగించుకుని సాయంత్రం వెళ్లిపోయారు. నవంబర్ నుంచే మూడో దశ ట్రయల్స్ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించిన విదేశీ రాయబారులు, హైకమిషనర్లకు వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా వివరించారు. ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని నవంబర్ నుంచి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని చెప్పారు. దాదాపు 26 వేల మంది వలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 30 కోట్ల డోసుల టీకాలు తయారు చేసిన వేరోసెల్ విభాగంలో పరిశోధనాత్మక ఉత్పత్తి చేపట్టామని వెల్లడించారు. తక్కువ సమయంలో అద్భుత పురోగతి ఏర్పాటైన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని విదేశీ రాయబారులతో సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా దేశంలో సులభతర వ్యాపారం (ఈవోడీబీ) చేయడంలో రాష్ట్రం ముందుందని చెప్పారు. విమాన, రోడ్డు రవాణా సదుపాయాలతో రాష్ట్రం అనుసంధానమై ఉందని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ అగ్రశేణి సంస్థలైన గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఫార్మా రంగ ఉత్పాదక విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. దేశంలోనే 33 శాతం టీకా ఉత్పత్తి హైదరాబాద్‌లో జరుగుతోందని, ప్రపంచంలోనే హైదరాబాద్ వ్యాక్సిన్ కేంద్రంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల కోసం రాష్ట్రంలో కొత్తగా టీఎస్ఐపాస్ విధానాన్ని రూపొందించామని వివరించారు. రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జయేశ్‌రంజన్ విదేశీ ప్రముఖులకు వివరించారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ కొన్ని నెలల్లోనే ప్రారంభమవుతుందని, ఓఆర్ఆర్ సమీపంలో 500 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వినయ్‌కుమార్, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, బయోలాజికల్–ఈ సంస్థ ఎండీ మహిమ దాట్ల, భారత్ బయోటెక్ ఈడీ సాయిప్రసాద్ పాల్గొన్నారు. హైదరాబాద్ బిర్యానీ ఇష్టంగా తిన్నారు.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన విదేశీ దౌత్యవేత్తలు హైదరాబాదీ బిర్యానీని ఇష్టంగా తిన్నారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని భారత్ బయోటెక్ సంస్థ ప్రాంగణంలోనే వీరికి భోజన ఏర్పాట్లు చేశారు. షెర్టాన్ ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి ఆయా ఖండాలు, దేశాల అభిరుచులకు అనుగుణంగా ఆహార పదార్థాలను ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. -
జీనోమ్ వ్యాలీకి కంపెనీల వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో కొత్త కంపెనీలు కొలువుదీరుతున్నాయి. రూ.800 కోట్ల విలువైన ప్రాజెక్టులను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆవిష్కరించారు. జెనెసిస్ బయాలాజిక్స్ అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఈ సందర్భంగా ప్రారంభించింది. ఈ కేంద్రం కోసం కంపెనీ మొత్తం రూ.350 కోట్లు వెచ్చించనుంది. కెనడాకు చెందిన జనరిక్ డ్రగ్ కంపెనీ జంప్ ఫార్మా తన ఆర్అండ్డీ, తయారీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రెండేళ్లలో ప్రత్యక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. లక్సాయ్ లైఫ్ సైన్సెస్ 50,000 చదరపు అడుగుల ఫెసిలిటీని ప్రారంభించింది. టచ్‌స్టోన్ స్క్వేర్ పేరుతో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పనున్న ఆర్అండ్డీ పార్క్‌కు శంకుస్థాపన జరిగింది. -
200కుపైగా కంపెనీలతో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం
-
జినోమ్ వ్యాలీ 2.0
సాక్షి, హైదరాబాద్ : ఫార్మా, జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 200కుపైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, స్టార్టప్‌లతో కూడిన జినోమ్ వ్యాలీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిని జినోమ్ వ్యాలీ 2.0 (రెండో దశ)గా ఆయన అభివర్ణించారు. కొన్ని నెలల్లో ప్రారంభంకానున్న ఫార్మాసిటీ, వైద్య పరికరాల తయారీ కేంద్రాలతో రాష్ట్రం బయోటెక్నాలజీ రంగంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన 15వ బయోఆసియా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ బయోటెక్నాలజీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. వచ్చే పదేళ్లలో రెట్టింపు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 కంపెనీలతో బయోటెక్నాలజీ రంగం ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉందని.. వచ్చే పదేళ్లలో దీన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేటీఆర్ చెప్పారు. తద్వారా ఒక్క తయారీ రంగం ద్వారానే నాలుగు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడం సాధ్యమన్నారు. ఇమ్యూనోథెరపీ, వ్యక్తిగత, నానో వైద్య రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలున్న సంస్థను ఏర్పరచేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని చెప్పారు. మందులను పరీక్షించేందుకు అవసరమైన జంతువులు స్థానికంగానే లభించేలా అనిమిల్ రిసోర్స్ ఫెసలిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం, అంతర్జాతీయ వ్యాక్సీన్ల తయారీలో 33 శాతం వాటా కలిగిన హైదరాబాద్‌లో ఏటా ఒక కొత్త వ్యాక్సీన్ ఉత్పత్తి కావాలని ఆశిస్తున్నామని, ఇందుకోసం జినోమ్ వ్యాలీలో ఒక వ్యాక్సీన్ ఇన్క్యుబేటర్ను ప్రారంభించే ఆలోచన ఉందని వివరించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని ఫార్మా, బయోటెక్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఈ రంగానికి సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. పెద్ద కంపెనీలు సైతం ఇన్‌క్యుబేటర్లతో కలసి పనిచేసేలా ఈ విధానం ప్రోత్సహిస్తుందని వివరించారు. జీవశాస్త్ర రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటైన లైఫ్ సైన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ ఏడాది పెట్టుబడులు పెట్టడం మొదలుపెడుతుందని, వచ్చే రెండు మూడేళ్లలో రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. ప్రొఫెసర్ హాల్‌కు ఎక్సలెన్సీ అవార్డు జీవశాస్త్ర రంగంలో విశిష్ట సేవలందించే వారికి బయో ఆసియా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును ఈ ఏడాది ప్రొఫెసర్ మైకేల్ ఎన్ హాల్‌కు అందించారు. స్విట్జర్లాండ్‌లోని బేసిల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హాల్ కణాల పెరుగుదలలో ర్యాపమైసిన్ ప్రోటీన్ల పాత్రపై పరిశోధనలు చేశారు. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలకు అనుగుణంగా శరీరంలోని ఒక వ్యవస్థ కణాల సైజును తగ్గిస్తుందన్న ఈయన పరిశోధన.. అవయవ మార్పిడిని మరింత సులభతరం చేసింది. రోగ నిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా చూసేందుకు ఉపయోపడింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ప్రొఫెసర్ హాల్ మాట్లాడుతూ.. మానవాళి జీవశాస్త్ర రంగంలో ఎంతో ప్రగతి సాధించినప్పటికీ.. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందన్నారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు అదుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం, మలేసియాలోని సెలంగోర్ రాష్ట్ర ప్రభుత్వం జీవశాస్త్ర రంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, సెలంగోర్ ప్రతినిధి దాతో హసన్ ఇద్రిస్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే బయో ఆసియా సదస్సులో దేశవిదేశాల నుంచి వచ్చిన 1,600 మంది పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. -
శివారులో వైద్య పరికరాల తయారీ కేంద్రం
హైదరాబాద్: ఐటీ తరహాలోనే ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగర శివారులో 400 ఎకరాల విస్తీర్ణంలో వైద్య పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలోని బయోలాజికల్ ఈ-లిమిటెడ్ కంపెనీ రూ. 300 కోట్లతో సుమారు 29 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బయోలాజికల్ సెజ్‌కు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే జీనోమ్ వ్యాలీలోని ఆరోగ్య కేంద్రంతో పాటు క్యాటిలిస్ట్ హబ్‌కు కూడా శంకుస్థాపన చేశారు. ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే వ్యాక్సిన్లలో 20 శాతం హైదరాబాద్ నుంచే తయారుకావడం రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. జీనోమ్ వ్యాలీలో ఉద్యోగుల సౌకర్యార్థం వచ్చే రెండేళ్లలో తూముకుంట వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. -
సృష్టికి ప్రతిసృష్టి...
- హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న ఎన్ఏఆర్ఎఫ్ - జీవ వైవిధ్య పరిశోధనలకు ప్రాధాన్యం సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత వరకూ వెళ్లామంటే కృత్రిమంగా జీవులనే సృష్టిస్తున్నాం. అత్యంత భయంకరమైన వ్యాధులకు తక్కువ కాలంలోనే మందులను కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే వీటిని మొదట క్షీరదాలపై ప్రయోగాలు చేసిన అనంతరమే విడుదల చేస్తారు. మనదేశంలో ఇప్పటి వరకు అతి పెద్ద జీవ ప్రయోగశాలలు లేవు. త్వరలో హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్’ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో దీని విశేషాలు తెలుసుకుందాం... - సాక్షి, స్కూల్ ఎడిషన్ హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో రూ.338.58 కోట్ల వ్యయంతో ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ ’(ఎన్ఏఆర్ఎఫ్) పేరుతో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇలాంటి పరిశోధన కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం. వైద్య అవసరాల నిమిత్తం రకరకాల పరిశోధనలకు జంతు వనరుల్ని సమకూర్చడం, కృత్రిమ జన్యువు, జీవుల సృష్టిలో ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2018లో ప్రారంభం ప్రపంచశ్రేణి సదుపాయాలతో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రం 2018-19 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది. పాలిచ్చే జంతువులు, ఎలుకలు, కుందేళ్లు వంటివి ఉత్పత్తి చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఔషధ కంపెనీలకు ఉపయోగపడేలా జీవవైవిద్య పరిశోధనల నిమిత్తం జంతువుల్ని ఈ కేంద్రం సిద్ధం చేస్తుంది. నిపుణులకు అవసరమైన శిక్షణను సైతం అందిస్తుంది. ఎన్ఏఆర్ఎఫ్ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 102.69 ఎకరాల స్థలాన్ని జినోమ్ వ్యాలీలో ఉచితంగా కేటాయించింది. పరీక్షలకు నిలయం జినోమ్ వ్యాలీలో ఏర్పాటయ్యే పరిశోధన కేంద్రం విస్తృత పరీక్షలకు నిలయంగా నిలుస్తుంది. ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల పరిశోధన-అభివృద్ధి వ్యయం 60 శాతం మేర తగ్గిపోతుందని నిపుణులు అంచానా వేస్తున్నారు. ఉత్పత్తి వ్యయంలోనూ 30 శాతం ఆదా అవుతుంది. రోగకారక జీవులు లేని అన్ని రకాల జంతువులు పరీక్షల నిమిత్తం ఇక్కడ అందుబాటులో ఉంటాయనీ, ఇంతవరకు దేశం లో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదనీ ఐసీఎంఆర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. దాదాపు 250 కంపెనీలు ఇలాంటి సదుపాయాలను వాడుకోవడంపై ఆసక్తితో ఉన్నాయని వివరించారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో జంతువుల ఖరీదు, ప్రయోగాలకయ్యే ఖర్చు చాలా తక్కువ. నేపాల్, సింగపూర్ వంటి చిన్నదేశాల్లోనూ ఇలాంటి సదుపాయాలున్నాయి. ప్రముఖ కంపెనీలు ప్రపంచంలో పేరొందిన సంస్థలు ఇందులో తమ యూనిట్లను స్థాపించాయి. 30 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇందులో ఉన్నాయి. అలెగ్జాండ్రియా, జీవీకే బయో, నెక్టార్, డూపాండ్, విమ్టా, బయోలాజికల్-ఇయూని సాంక్యో, భారత్ బయోటిక్ వంటి సంస్థలు తమ పరిశ్రమలను నిర్వహిస్తున్నాయి. పారిశ్రామిక , నాలెడ్జ్ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, బహుళ ప్రయోగశాలలు, ఇంక్యుబేషన్ సెంటర్లు ఇందులో ఉ న్నాయి. సీసీఎంబీ, ఇక్రిశాట్, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌లు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. పరిశోధనలు జంతువులపై పరిశోధనలు జరగటం ఇప్పుడే కొత్త కాదు. అనేక దేశాల్లో ఎలుకలు, చింపాంజీలు, కుందేళ్లు, కోతులు, పిల్లుల వంటి జంతుజాలంపై ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. క్లోనింగ్ వంటి పరిశోధనలు అలాంటివే. జంతువుల రక్తాన్ని, కణజాలాన్ని నమూనాలుగా తీసుకుని మలేరియా, టైఫాయిడ్ పలు వ్యాధుల నివారణకు వాటి రక్తంలో ఈ వ్యాధి కారక క్రిములను పంపిస్తారు. వాటిపై ప్రభావాన్ని పరిశీలించి, నివారణకు ఔషధాలు తయారు చేయడాన్నే జీవ వైవిధ్య పరిశోధన అంటారు. ఈ కేంద్రం అందుబాటులో వస్తే వైద్య పరిశోధనా రంగంలో అగ్రగామి దేశాలతో పోటీ పడే అవకాశం ఉంటుంది. చరిత్ర హైదరాబాద్ శివార్లలో శామీర్‌పేట, మేడ్చల్, ఉప్పల్, పటాన్చెరు, జీడిమెట్ల, గచ్చిబౌలి, కీసర దాకా సుమారు 600 కిలోమీటర్ల మేర జినోమ్ వ్యాలీ విస్తరించింది. దేశంలో మొదటి ప్రపంచ స్థాయి జీవ సాంకేతిక సమూహం ఔషధ పరిశోదన సంస్థలు, జీవ శాస్త్ర పరిశోదనలు, శిక్షణలు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు ఇక్కడ సాగిస్తారు. 1999లో ఇది ప్రారంభమైంది. దేశంలోనే మొదటి ప్రపంచస్థాయి జీవ సాంకేతిక సమూహంగా, ఔషధ పరిశోధక సంస్థగా ఇది పేరొందింది. జీవ శాస్త్ర పరిశోధనలు, శిక్షణలు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు ఇందులో సాగుతున్నాయి. -
జీనోమ్ వ్యాలీలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు
♦ ఏడు ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు ♦ అనుమతి పత్రాలిచ్చిన పరిశ్రమల మంత్రి ♦ మూడేళ్లలో ఫార్మా హబ్‌గా తెలంగాణ ♦ బయో ఏషియా సదస్సు ప్రారంభం ♦ 50 దేశాల నుంచి 800 కంపెనీల హాజరు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ. 1,000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఫార్మా కంపెనీలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఫలితంగా 3 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. అరబిందోఫార్మా లిమిటెడ్ సహా పలు కంపెనీల ప్రతినిధులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. సోమవారమిక్కడ హైటెక్స్‌లో ప్రారంభమైన బయో ఏషియా-2016 సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేశారు. బయో ఏషియా సదస్సులో.. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలోనూ జూపల్లి మాట్లాడారు. సదస్సుకు 50 దేశాల నుంచి 800 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. హైదరాబాద్‌లో 15 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ రాబోతుందని, దీనికి టెండర్లు కూడా పిలిచినట్లు చెప్పారు. చైనాలోనూ తాము ఫార్మాసిటీ చూశామని, అంతకంటే పెద్దగానే ఫార్మాసిటీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలు, పరిశోధనలు, నివాసాలు తదితర మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రపంచ ఫార్మా ఉత్పత్తుల్లో 33 శాతం హైదరాబాద్ నుంచే ఎగుమతి అవుతోందని, మూడేళ్లలో హైదరాబాద్ ఫార్మా హబ్‌గా ఎదగనుందన్నారు. 8 వారాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తామన్నారు. ఐడీబీఎల్కు చెందిన భూమి 600 ఎకరాలుందని... అక్కడ మెడికల్ డివైస్ పార్కు, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) అభివృద్ధి చేస్తామని జూపల్లి చెప్పారు. జీనోమ్‌వ్యాలీలో 72 యూనిట్లు ఇప్పటికే వచ్చినట్లు తెలిపారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ కంపెనీ ఆర్ అండ్ డీ యూనిట్‌ను నెలకొల్పబోతుందన్నారు. 250 మిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టబోతుందన్నారు. ఆర్ అండ్ డీ కోసం జీనోమ్‌వ్యాలీలో 10 ఎకరాలు వారికి కేటాయించామన్నారు. నైఫర్ కంపెనీ కూడా త్వరలో హైదరాబాద్‌లో శంకుస్థాపన కూడా చేయనుందని తెలిపారు. మన ఫార్మాసిటీకి రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ. 42 వేల కోట్ల ఎగుమతుల సామర్థ్యం ఉందన్నారు. దీనివల్ల లక్షన్నర ప్రత్యక్ష ఉద్యోగాలు, ఐదు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ వ్యాక్సిన్లు, డ్రగ్స్‌ల్లో లీడర్‌గా ఎదగనుందన్నారు. ఈ సందర్భంగా జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డును ఇజ్రాయిల్‌కు చెం దిన నోబుల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ఆద ఇ.యోనాత్కు అందించారు. కార్యక్రమంలో శ్రీలంక శాస్త్ర, సాంకేతిక, పరిశోధన మంత్రి సుశీల్ ప్రేమజయంత, అంతర్జాతీయ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ అజిత్శెట్టి, భారత్‌లో నార్వే రాయబారి నిల్స్ రగ్నర్ కమ్స్వాగ్, స్పెయిన్ ఎంబసీ ప్రతినిధి మాగ్డలేనా క్రుజ్ యాబర్, మాణిక్‌రాజ్ తదితరులు ప్రసంగిం చారు. సదస్సు ఆదివారం వరకు జరగనుంది.