గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన బీఈ ఎండీ మహిమ దాట్ల. చిత్రంలో లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ నాగప్పన్, జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ టీకా ఉత్పత్తులు, పరిశోధన రంగాన్ని భారీగా విస్తరించాలని కోవిడ్ వ్యాధి నియంత్రణకు కోర్బివ్యాక్స్ టీకా తయారు చేసిన బయోలాజికల్–ఈ (బీఈ) సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలోని టీకా ఉత్పత్తులను భారీయెత్తున పెంచేందుకు ఏకంగా రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు ఉత్పత్తి చేసే నగరంగా హైదరాబాద్ ఘనత సాధించనుంది. రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడితో కొత్తగా 2,518 మందికి ఉపాధి లభిస్తుందని బీఈ సంస్థ ప్రకటించింది.
గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో సమావేశం తరువాత బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల వివరాలు వెల్లడించారు. జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం ప్రతి ఏడాదీ 900 కోట్ల టీకాలు ఉత్పత్తి అవుతుంటే.. బీఈ తాజా విస్తరణతో 1,400 కోట్ల టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపారు. కోవిడ్ నివారణ టీకా జెన్సెన్, ఎమ్మార్ పీసీవీ , టైఫాయిడ్, ఐపీవీ, పెర్టుసిస్ వ్యాక్సిన్లు.. టెటనస్ టాక్సైడ్ యాంపూల్స్, జెనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. సుదీర్ఘ చరిత్ర గల బీఈ సంస్థ దాదాపు నాలుగు వ్యూహాత్మక బిజినెస్ యూనిట్లను కలిగి ఉందన్నారు. కోవిడ్ నేపథ్యంలో సకాలంలో స్పందించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మౌలిక వసతులు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే..
ప్రపంచ టీకా అవసరాల్లో మూడింట ఒక వంతు హైదరాబాద్ ద్వారానే తీరుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఈ విస్తరణను సగర్వంగా.. సంతోషంగా ప్రకటిస్తున్నానని, దీనిద్వారా టీకా రంగంలో హైదరాబాద్ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం మీద ఏడాదికి 900 కోట్ల టీకాలు తయారవుతున్నాయని తెలిపారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీకాల ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన క్లస్టర్ అని వివరించారు.
ఇక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, స్పెషల్ ఎకనామిక్ జోన్, డ్రై, వెట్ లాబోరేటరీలు , ఇంక్యుబేషన్ సౌకర్యాలు ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులోని దాదాపు 200 పరిశ్రమల్లో 15 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు నోవార్టిస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్, ఫెర్రింగ్ ఫార్మా, కెమో, డూపాంట్, లోంజా తదితర కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం.నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment