జీనోమ్ వ్యాలీలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు
♦ ఏడు ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు
♦ అనుమతి పత్రాలిచ్చిన పరిశ్రమల మంత్రి
♦ మూడేళ్లలో ఫార్మా హబ్‌గా తెలంగాణ
♦ బయో ఏషియా సదస్సు ప్రారంభం
♦ 50 దేశాల నుంచి 800 కంపెనీల హాజరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ. 1,000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఫార్మా కంపెనీలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఫలితంగా 3 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. అరబిందోఫార్మా లిమిటెడ్ సహా పలు కంపెనీల ప్రతినిధులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. సోమవారమిక్కడ హైటెక్స్‌లో ప్రారంభమైన బయో ఏషియా-2016 సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంబంధిత కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేశారు. బయో ఏషియా సదస్సులో.. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలోనూ జూపల్లి మాట్లాడారు.
సదస్సుకు 50 దేశాల నుంచి 800 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. హైదరాబాద్‌లో 15 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ రాబోతుందని, దీనికి టెండర్లు కూడా పిలిచినట్లు చెప్పారు. చైనాలోనూ తాము ఫార్మాసిటీ చూశామని, అంతకంటే పెద్దగానే ఫార్మాసిటీని నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలు, పరిశోధనలు, నివాసాలు తదితర మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రపంచ ఫార్మా ఉత్పత్తుల్లో 33 శాతం హైదరాబాద్ నుంచే ఎగుమతి అవుతోందని, మూడేళ్లలో హైదరాబాద్ ఫార్మా హబ్‌గా ఎదగనుందన్నారు. 8 వారాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తామన్నారు.
ఐడీబీఎల్‌కు చెందిన భూమి 600 ఎకరాలుందని... అక్కడ మెడికల్ డివైస్ పార్కు, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) అభివృద్ధి చేస్తామని జూపల్లి చెప్పారు. జీనోమ్‌వ్యాలీలో 72 యూనిట్లు ఇప్పటికే వచ్చినట్లు తెలిపారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ కంపెనీ ఆర్ అండ్ డీ యూనిట్‌ను నెలకొల్పబోతుందన్నారు. 250 మిలియన్ డాలర్లతో పెట్టుబడులు పెట్టబోతుందన్నారు. ఆర్ అండ్ డీ కోసం జీనోమ్‌వ్యాలీలో 10 ఎకరాలు వారికి కేటాయించామన్నారు.
నైఫర్ కంపెనీ కూడా త్వరలో హైదరాబాద్‌లో శంకుస్థాపన కూడా చేయనుందని తెలిపారు. మన ఫార్మాసిటీకి రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ. 42 వేల కోట్ల ఎగుమతుల సామర్థ్యం ఉందన్నారు. దీనివల్ల లక్షన్నర ప్రత్యక్ష ఉద్యోగాలు, ఐదు లక్షల పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ వ్యాక్సిన్లు, డ్రగ్స్‌ల్లో లీడర్‌గా ఎదగనుందన్నారు. ఈ సందర్భంగా జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డును ఇజ్రాయిల్‌కు చెం దిన నోబుల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ఆద ఇ.యోనాత్‌కు అందించారు.
కార్యక్రమంలో శ్రీలంక శాస్త్ర, సాంకేతిక, పరిశోధన మంత్రి సుశీల్ ప్రేమజయంత, అంతర్జాతీయ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ అజిత్‌శెట్టి, భారత్‌లో నార్వే రాయబారి నిల్స్ రగ్నర్ కమ్స్‌వాగ్, స్పెయిన్ ఎంబసీ ప్రతినిధి మాగ్డలేనా క్రుజ్ యాబర్, మాణిక్‌రాజ్ తదితరులు ప్రసంగిం చారు. సదస్సు ఆదివారం వరకు జరగనుంది.