కేటీఆర్‌తో భేటీ అయిన శ్రీనివాస్ సదు. చిత్రంలో జయేశ్ రంజన్, శక్తి నాగప్పన్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్స్, బయో సిమిలర్, యాంటీబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ తయారీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాన్ని ప్రస్తుత పెట్టుబడితో గ్లాండ్ ఫార్మా విస్తరిస్తుంది. తద్వారా స్థానికంగా అర్హత, నైపుణ్యం కలిగిన 500 మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తుంది.
గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్ సదు సోమవారం మంత్రి కేటీ రామారావుతో భేటీ సందర్భంగా గ్లాండ్ ఫార్మా కార్యకలాపాల విస్తరణకు రూ.400 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్‌లు, బయోలాజికల్స్, బయోసిమిలార్, యాంటీబాడీస్ తదితర అధునాతన రంగాల్లో ఔషధాల తయారీకి 2022లో రూ.300 కోట్లతో జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా బయో ఫార్మాసూటికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.
దీనిద్వారా 200 మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా గ్లాండ్ ఫార్మా తాజా పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment