అమెరికాలో స్క్రిప్స్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్. చిత్రంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటన తొలిరోజు విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ ‘కెమ్ వేద’ముందుకొచ్చింది. శాండియాగోలోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ భీమారావు పారసెల్లి ఈ మేరకు ప్రకటన చేశారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో ప్ర ముఖ పరిశోధన సంస్థగా ‘కెమ్ వేద’కంపెనీకి పేరు ఉంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ కంపెనీని మరింత విస్తరించేందుకు రూ.150 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ పేర్కొంది.
కేవలం 45 మంది ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌కు సంస్థ సీఈవో తెలిపారు. 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, రాష్ట్రంలో ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపారు.
పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్..
హైదరాబాద్ నగరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టంలో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకొని ప్రత్యే కంగా పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కెమ్ వేద నిర్ణయించుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఎకో సిస్టంను ఈ కంపెనీ మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ వేగంగా విస్తరిస్తోందని కెమ్ వేద సీఈవో భీమారావు పారసెల్లి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది హై స్కిల్డ్ నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. కాగా శాండియాగోలో మంత్రి కేటీఆర్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాండియాగోలో ఉన్న వ్యాపార అవకాశాలపై మంత్రి ఆరా తీశారు.
ఫార్మా వర్సిటీలో భాగమవ్వండి: హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూని వర్సిటీలో భాగంకావాలని ప్రముఖ పరిశోధన సంస్థ ‘స్క్రిప్స్’ను కేటీఆర్ కోరారు. పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సిబ్బంది, విద్యార్థుల మార్పి డి, రీసెర్చ్, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల రూపకల్పనలో ‘స్క్రిప్స్’తన భాగస్వామ్యాన్ని అందించా లని విజ్ఞప్తి చేశారు. శాండియాగోలో పర్యటిస్తున్న మంత్రి.. స్క్రిప్స్ పరిపాలక సభ్యులైన డా.జేమ్స్ విలియమ్సన్, మేరీవాంగ్, డాక్టర్ అర్నాబ్ ఛటర్జీ, ప్రొఫెసర్ సుమిత్ చందాలతో సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ వివరాలను వారితో కేటీఆర్ పంచుకున్నారు. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్క్రిప్స్ హామీ ఇచ్చింది. కాగా స్క్రిప్స్ రీసెర్చ్ టీమ్, తెలంగాణ ప్రభుత్వంతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ప్రతిపాదించారు. సైన్స్ పరిశోధనల్లో 2,400 మంది శాస్త్రవేత్తలు, సిబ్బందితో పాటు 200కు పైగా ప్రయోగశాలలు ఈ సంస్థకు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment