ఒక్కరోజే రూ.3,250 కోట్లు  | Telangana Minister KTR Winds Up US Tour Gets In More Investment To Telangana | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే రూ.3,250 కోట్లు 

Published Mon, Mar 28 2022 1:27 AM | Last Updated on Mon, Mar 28 2022 1:27 AM

Telangana Minister KTR Winds Up US Tour Gets In More Investment To Telangana - Sakshi

స్లేబ్యాక్‌ ఫార్మా ప్రతినిధితో మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానించడం లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన ఆదివారం ముగిసింది. చివరిరోజు అమెరికా లైఫ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో కేటీఆర్‌ విజయం సాధించారు. ప్రముఖ గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్‌ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ రూ.1,750 కోట్లు, స్లేబ్యాక్‌ ఫార్మా రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి.

అలాగే జీనోమ్‌ వ్యాలీలో ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మాకొపియా, హైదరాబాద్‌లోని తమ గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లో ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలో రెట్టింపు చేస్తామని క్యూరియా గ్లోబల్‌ వెల్లడించాయి. 

హైదరాబాద్‌లోని కంపెనీల్లో అడ్వెంట్‌ పెట్టుబడులు  
న్యూయార్క్‌లోని అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ జాన్‌ మాల్డోనాడోతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్‌లో అడ్వెంట్‌ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఇద్దరూ చర్చించారు.

హైదరాబాద్‌లోని లైఫ్‌ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఆర్‌ఏ చెమ్‌ ఫార్మా లిమిటెడ్‌ , అవ్రా లేబొరేటరీస్‌లో మెజార్టీ వాటాలు కొనేందుకు రూ. 1,750 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.  

నగరంలో స్లేబ్యాక్‌ సీజీఎంపీ ల్యాబ్‌ 
న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్‌ ఫార్మా కంపెనీ.. హైదరాబాద్‌ ఫార్మా రంగంలో రాబోయే మూడేళ్లలో సుమా రు రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది.

సీజీఎంపీ ల్యాబ్‌తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని కేటీఆర్‌తో భేటీ తర్వాత సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్‌సింగ్‌ ప్రకటించారు. గత ఐదేళ్లలో హైదరాబాద్‌ ఫార్మాలో స్లేబ్యాక్‌ రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. హైడ్రాక్సీ ప్రోజెస్టెరాన్‌ 5 ఎంఎల్‌ జెనరిక్‌ ఔషధానికి అనుమతులను పొందడంతో పాటు అమెరికన్‌ మార్కెట్‌లో తొలిసారి ప్రవేశపెట్టింది తమ కంపెనీయేనని కేటీఆర్‌కు సంస్థ సీఈవో వివరించారు. 

జీనోమ్‌ వ్యాలీలో యూఎస్‌పీ ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్‌  
రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషద తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఫార్మాకొపియా (యూఎస్‌పీ) ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్‌కు సింథటిక్, విశ్లేషణ సామర్థ్యం ఉంటుందని చెప్పింది. ఈ ల్యాబ్‌లో 50 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని తెలిపింది. నిరంతర ఔషధ తయారీ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కునేందుకు అవసరయ్యే కొత్త ప్రక్రియ, సాంకేతికతను ఈ బృందం అభివృద్ధి చేస్తుందని ప్రతినిధులు చెప్పారు.  

ఏడాదిలో క్యూరియా సర్వీస్‌ సెంటర్‌ ఉద్యోగులు రెట్టింపు 
న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తున్న క్యూరియా గ్లోబల్‌.. హైదరాబాద్‌లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను మరో 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. కేటీఆర్‌తో కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ప్రకావ్‌ పాండియన్‌ సమావేశం తర్వాత కంపెనీ ఈ ప్రకటన చేసింది.

వివిధ రంగాల్లోని అన్ని క్యూరియా గ్రూపు సంస్థలకు సపోర్ట్‌ సర్వీస్‌ అందించడానికి గతేడాది హైదరాబాద్‌లో గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు పాండియన్‌ తెలిపారు. సర్వీస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 115 మంది పనిచేస్తున్నారని, 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కంపెనీ దేశంలో ఇప్పటికే 27 మిలియన్‌ డాలర్ల (రూ. 200 కోట్ల)పెట్టుబడి పెట్టింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement