యూరోఫిన్స్ బయోఫార్మా సర్విసెస్ క్యాంపస్‌ను ప్రారంభిస్తున్న కేటీఆర్, కంపెనీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్ / శామీర్‌పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్‌వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు.
జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్‌వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్‌గుల్ పాల్గొన్నారు.
యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం
బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్‌మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment