కార్నింగ్‌’ పెట్టుబడి రూ.934 కోట్లు | Corning Investment in Telangana | Sakshi
Sakshi News home page

కార్నింగ్‌’ పెట్టుబడి రూ.934 కోట్లు

Published Sat, Sep 2 2023 4:50 AM | Last Updated on Sat, Sep 2 2023 4:01 PM

Corning Investment in Telangana - Sakshi

కార్నింగ్‌ ప్రతినిధుల బృందంతో మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌

సాక్షి, హైదరాబాద్‌: మెటీరియల్స్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్‌ సంస్థ తెలంగాణలో రూ. 934 కోట్ల భారీ పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలకు అవసరమైన గొరిల్లా గ్లాస్‌లను కార్నింగ్‌ తయారు చేయనుంది. 172 ఏళ్ల చరిత్రగల కార్నింగ్‌ తన తయారీ కేంద్రం ఏర్పాటు ద్వారా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ భారీ పెట్టుబడితో 800 మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కార్నింగ్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జాన్‌ బెయిని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాలకు తెలంగాణ హబ్‌గా మారుతున్న తీరును కేటీఆర్‌ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. యాపిల్‌ ఐఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ భారీ ఎత్తున తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ప్రభుత్వ పాలసీలను ఆ సంస్థ ప్రశంసించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన కార్నింగ్‌ ప్రతినిధి బృందం.. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలతోపాటు ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాల్లో తయారీరంగ పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు కార్నింగ్‌ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. దీంతో కార్నింగ్‌ సంస్థకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

ఎల్రక్టానిక్స్‌ తయారీ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తెలంగాణ యువతకు ఈ రంగంలో ఉద్యోగావకాశాలు రావడం తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఐటీ శాఖ ఎల్రక్టానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపురి తదితరులు
పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement