Corning
-
కార్నింగ్’ పెట్టుబడి రూ.934 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మెటీరియల్స్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో రూ. 934 కోట్ల భారీ పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్ ద్వారా మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలకు అవసరమైన గొరిల్లా గ్లాస్‌లను కార్నింగ్ తయారు చేయనుంది. 172 ఏళ్ల చరిత్రగల కార్నింగ్ తన తయారీ కేంద్రం ఏర్పాటు ద్వారా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ భారీ పెట్టుబడితో 800 మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బెయిని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాలకు తెలంగాణ హబ్‌గా మారుతున్న తీరును కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. యాపిల్ ఐఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ సంస్థ భారీ ఎత్తున తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ప్రభుత్వ పాలసీలను ఆ సంస్థ ప్రశంసించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన కార్నింగ్ ప్రతినిధి బృందం.. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలతోపాటు ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాల్లో తయారీరంగ పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. దీంతో కార్నింగ్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్రక్టానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తెలంగాణ యువతకు ఈ రంగంలో ఉద్యోగావకాశాలు రావడం తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఐటీ శాఖ ఎల్రక్టానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. -
గొరిల్లా గ్లాస్-5 వచ్చేసింది!
న్యూయార్క్ః మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ మోడళ్ళ స్మార్ట్ ఫోన్ లు అధునాతన గొరిల్లా గ్లాస్ స్క్రీన్ లను కలిగి ఉంటున్నాయి. ఇలా గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్లు ఎత్తునుంచీ కింద పడినా స్ర్నీన్ దెబ్బతినదన్న విషయం చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయం. ఈ గ్లాస్ గీతలు పడకుండా కూడా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 5 మరింత మన్నికతో, ధృఢంగా మార్కెట్లోకి ప్రవేశించింది. గ్లాస్ మేకర్ కార్నింగ్.. కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు తమ పరికరాల్లో ఉపయోగించే ఈ సూపర్ గ్లాస్ ను ఇప్పుడు రసాయనికంగా మరింత ధృఢంగా, బలంగా ఉండేట్టు రూపొందించారు. ఈ కొత్త గ్లాస్.. 1.6 మీటర్ల ఎత్తునుంచీ కిందపడినా 80 శాతం వరకూ పగిలే అవకాశమే ఉండదని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. ముఖ్యంగా గాడ్జెట్ల పనితీరును మెరుగు పరిచేందుకు వీలుగా ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను రూపొందించారు. భుజం లేదా నడుము ఎత్తునుంచీ గట్టిగా ఉండే ఉపరితలంపై పడినా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా, గ్లాస్ పగలకుండా ఉండేట్టు తయారు చేసినట్లు పేర్కొన్నారు. 2014 లో కార్నింగ్... గొరిల్లా గ్లాస్ 4 ను ప్రవేశ పెట్టింది. అప్పట్లో ఆ గ్లాస్ ను 1 మీటర్ ఎత్తునుంచి పడినా పగలకుండా, దెబ్బతినకుండా ఉండేట్లు రూపొందించింది. ఇప్పుడు ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను మునుపటికంటే రెండు రెట్లు దృఢంగా రూపొందించినట్లు కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జాన్ బేన్ తెలిపారు. గొరిల్లా గ్లాస్ ను మొట్టమొదట 2007 లో ఎలెక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ మరింత మన్నిక పెరిగేలా, గీతల్ని నిరోధించేలా, మరింత పలుచగా తయారు చేసేందుకు కార్నింగ్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 4.5 బిలియన్ల పరికరాల యూనిట్లకు గొరిల్లా గ్లాస్ రవాణా జరిగినట్లు కంపెనీ చెప్తోంది. శాంసంగ్, హెచ్‌టీసీ, హెవావే, ఎల్జీ, హెచ్‌పీ, ఆసుస్ వంటి పేరు పొందిన తయారీదారులతోపాటు.. మరెందరో పేరులేని పరికరాల ఉత్పత్తిదారులు కూడా కార్నింగ్ గ్లాస్ ను ఉపయోగించి పరికరాలు చేస్తున్నట్లు జాన్ తెలిపారు.