సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాలతోపాటు లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా చేపట్టిన మౌలిక వసతుల కల్పన ఆశించిన ఫలితాలను ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనం కోసం మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం మూడు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చింది.
శనివారం వారు టీ–హబ్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సదుపాయాల కారణంగానే ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ వరుసగా రెండేళ్లు దాటేసిందన్నారు. ఐటీ ఎగుమతులతోపాటు ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్, భవన నిర్మాణాల అనుమతుల కోసం టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామన్నారు.
టీఎస్–బీ పాస్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతో ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై ఒక్కరోజే 7 జీవోలను జారీ చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే తెలంగాణ విధానాలను, పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్లాయన్నారు. అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుందని అంటున్నారని చెప్పారు.
మహారాష్ట్రతో అనుబంధం వీడనిది
విద్యార్థిగా పుణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చరిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయని, ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయని గుర్తు చేశారు.
అందుకే తెలంగాణ, మహారాష్ట్ర మధ్యన సాంస్కృతిక, మానవ సంబంధాలు బలంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ముంబై తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుంటుందన్నారు.
బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా అభివృద్ధి: మహారాష్ట్ర ప్రతినిధి బృందం
హైదరాబాద్ గత పదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని మహారాష్ట్ర ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితి తమకు గుర్తుందని, పాలకులకు సరైన విజన్ ఉంటే అభివృద్ధి చెందుతుందనడానికి హైదరాబాద్ నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ వేగాన్ని మించి అభివృద్ధి చెందుతుందని ప్రశంసలు కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment