Gland Pharma
-
గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'శ్రీనివాస్ సాదు'
హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ శుక్రవారం (జూన్ 7) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా 'శ్రీనివాస్ సాదు'ను నియమించినట్లు ప్రకటించింది. ఈ నెల 10 నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ, న్యూయార్క్ నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన సాదు.. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ నుంచి ఎంబీఏ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ వంటి చదువులు చదువుకున్నారు.వ్యాపార అభివృద్ధి, తయారీ కార్యకలాపాలు, సరఫరా గొలుసు నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలలో సాదుకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఈయన గత 22 సంవత్సరాలుగా.. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. 2000లో జనరల్ మేనేజర్‌గా, 2002లో సీనియర్ జనరల్ మేనేజర్‌గా, 2003లో వైస్ ప్రెసిడెంట్‌గా, 2005లో డైరెక్టర్‌గా, 2011లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. కాగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా పెట్టుబడి రూ.400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో మరో రూ.400 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించింది. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్స్, బయో సిమిలర్, యాంటీబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ తయారీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాన్ని ప్రస్తుత పెట్టుబడితో గ్లాండ్ ఫార్మా విస్తరిస్తుంది. తద్వారా స్థానికంగా అర్హత, నైపుణ్యం కలిగిన 500 మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తుంది. గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈఓ శ్రీనివాస్ సదు సోమవారం మంత్రి కేటీ రామారావుతో భేటీ సందర్భంగా గ్లాండ్ ఫార్మా కార్యకలాపాల విస్తరణకు రూ.400 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్లు, బయోలాజికల్స్, బయోసిమిలార్, యాంటీబాడీస్ తదితర అధునాతన రంగాల్లో ఔషధాల తయారీకి 2022లో రూ.300 కోట్లతో జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా బయో ఫార్మాసూటికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. దీనిద్వారా 200 మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా గ్లాండ్ ఫార్మా తాజా పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
గ్లాండ్ ఫార్మా చేతికి సెనెక్సి: వెయ్యి కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఔషధ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా భారీ డీల్‌కు తెరలేపింది. యూరప్‌కు చెందిన సెనెక్సి గ్రూప్‌ను గ్లాండ్ ఫార్మా ఇంటర్నేషనల్ కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ రూ.1,015 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టేందుకు కంపెనీకి ఈ డీల్ వీలు కల్పిస్తుంది. థర్డ్-పార్టీ ఫండింగ్‌కు ఎటువంటి ఆధారం లేకుండా అంతర్గత వనరుల ద్వారా లావాదేవీకి నిధులు సమకూరుతాయని గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అయిన సెనెక్సి గ్రూప్‌నకు ఫ్రాన్స్‌లో మూడు, బెల్జియంలో ఒక ప్లాంటు ఉంది. -
గ్లాండ్ ఫార్మా లాభం 20% డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ గ్లాండ్ ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.241 కోట్లు నమోదు చేసింది. వ్యయాలు రూ.731 కోట్ల నుంచి రూ.786 కోట్లకు ఎగశాయి. టర్నోవర్ రూ.1,080 కోట్ల నుంచి రూ.1,044 కోట్లకు వచ్చి చేరింది. యూఎస్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్ల నుంచి టర్నోవర్ 3 శాతం పెరిగి రూ.747 కోట్లుగా ఉంది. ఆదాయం భారత విపణి నుంచి 42 శాతం తగ్గి రూ.73 కోట్లకు, ఇతర మార్కెట్ల నుంచి 3 శాతం క్షీణించి రూ.224 కోట్లకు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే గ్లాండ్ ఫార్మా షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.57 శాతం పెరిగి రూ.2,224.20 వద్ద స్థిరపడింది. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
Gland Pharma: పవర్ లిఫ్టర్ చంద్రకళకు ఆర్థికసాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఏషియన్ పవర్ లిఫ్టర్ చంద్రకళకు విశాఖపట్నానికి చెందిన గ్లాండ్ ఫార్మా సంస్థ మంగళవారం రూ.2 లక్షల ఆర్థికసాయం అందించింది. విజయవాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్రకళ ఇప్పటివరకు మూడు ఏషియన్ గేమ్స్‌లో ఏడు పతకాలు సాధించింది. జూన్‌లో కోయంబత్తూర్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో చాంపియన్‌గా నిలిచిన ఆమె డిసెంబర్లో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు గ్లాండ్ ఫార్మా తరఫున సీనియర్ మేనేజర్ కె.గణేష్‌కుమార్ రూ.2 లక్షల చెక్కును రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తనకు ఆర్థికసాయం అందజేసిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ యజమాని కెప్టెన్ రఘురామ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (Kethireddy: ఫలించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి కృషి) -
గ్లాండ్ ఫార్మా.. గ్రాండ్ లిస్టింగ్
ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న హెల్త్ కేర్ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ ఎక్స్ఛేంజీలలో 14 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,500తో పోలిస్తే.. ఎన్ఎస్ఈలో రూ. 210 లాభంతో రూ. 1,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 1,850 వరకూ జంప్‌చేసింది. ఇది 23 శాతం వృద్ధికాగా.. ప్రస్తుతం రూ. 1,717 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ రూ. 1,701 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ. 1850- 1701 మధ్య హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి తొలి గంటలోనే 3.2 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! చైనీస్ పేరెంట్.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గ్లాండ్ ఫార్మా రూ. 1,500 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించింది. ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. బ్యాక్ గ్రౌండ్ ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది. -
గ్లాండ్ ఫార్మా ఐపీవో సోమవారమే
ముంబై: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన హెల్త్ కేర్ కంపెనీ గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సోమవారం(9న) ప్రారంభంకానుంది. షేరుకి రూ. 1,490-1,500 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. బుధవారం(11) ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 3.5 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూకి 13 షేర్లు ఒక లాట్ కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వారాంతాన షేరుకి రూ. 1,500 ధరలో యాంకర్ సంస్థలకు 1.29 కోట్లకుపైగా షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,944 కోట్లు సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ కంపెనీల జాబితాలో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, గోల్డ్ మన్ శాక్స్, సింగపూర్ ప్రభుత్వ సంస్థతోపాటు.. 18 దేశీ మ్యూచువల్ ఫండ్స్ చేరాయి. చైనీస్ పేరెంట్.. ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. అతిపెద్ద ఇష్యూ దేశీయంగా గ్లాండ్ ఫార్మా అతిపెద్ద ఫార్మా ఐపీవోగా ఆవిర్భవించనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఎరిస్ లైఫ్ సైన్సెస్(2017) రూ. 1,741 కోట్లను సమీకరించింది. 2015లో ఐపీవోకు వచ్చిన ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ రూ. 1,350 కోట్లు, 2016లో లిస్టయిన లారస్ ల్యాబ్స్ రూ. 1,350 కోట్లను సమకూర్చుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది. -
గ్లాండ్ ఫార్మా ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫార్మా రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో నవంబర్‌కల్లా గ్లాండ్ ఫార్మా ఐపీవోను చేపట్టవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా చైనీస్ కంపెనీ మాతృ సంస్థగా కలిగిన గ్లాండ్ ఫార్మా తొలిసారి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా రూ. 6,000 కోట్లను సమీకరించాలని గ్లాండ్ ఫార్మా భావిస్తోంది. మార్చి పతనం తదుపరి కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతుండటంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న విషయం విదితమే. అయితే గత మూడు సంవత్సరాలలో దేశీయంగా ఒక్క ఫార్మా కంపెనీ కూడా పబ్లిక్ ఇష్యూకి రాకపోవడం గమనార్హం! ఇంతక్రితం 2017 జూన్‌లో ఎరిస్ లైఫ్‌సైన్స్ లిస్టయ్యాక తిరిగి గ్లాండ్ ఫార్మా ఐపీవో బాట పట్టినట్లు నిపుణులు తెలియజేశారు. కంపెనీ వివరాలు.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లాండ్ ఫార్మాకు మాతృ సంస్థ చైనీస్ ఫోజన్ గ్రూప్. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ ఫోజన్ గ్రూప్ కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. రూ. 4,750 కోట్ల విలువైన వాటాతోపాటు.. తాజాగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌లో లిస్టయిన ఫోజన్ గ్రూప్ 2017 అక్టోబర్‌లో 1.09 బిలియన్ డాలర్లకు గ్లాండ్ ఫార్మాలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. 1978లో పీవీఎన్ రాజు కంపెనీని ఏర్పాటు చేశారు. 1999 నుంచీ డాక్టర్ రవి పెన్మెత్స వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తదుపరి 2019లో యాజమాన్యానికి సలహాదారునిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా శ్రీనివాస్ ఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫార్మా ప్రొడక్టులు గ్లాండ్ ఫార్మా ప్రధానంగా జనరిక్ ఇంజక్టబుల్ ఫార్మా ప్రొడక్టులను రూపొందిస్తోంది. కంపెనీ యూఎస్, యూరోపియన్ మార్కెట్ల నుంచి అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండెపోటు, తదితర సమయాలలో చేసే సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. -
పెట్లుబడుల్లో చైనీస్ ఫోజన్ వెనకడుగు?!
ఇటీవల లడఖ్ వద్ద సరిహద్దులో చెలరేగిన సైనిక వివాదం నేపథ్యంలో చైనీస్ ఫార్మా గ్రూప్ ఫోజన్ దేశీయంగా పెట్టుబడుల విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతక్రితం దేశీ హెల్త్‌కేర్ రంగంలో 30 కోట్ల డాలర్ల(రూ. 2250 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎపెక్స్ కిడ్నీకేర్ సంస్థతోపాటు.. బెంగళూరులోని ఓ ఆసుపత్రితో ప్రాథమిక ప్రతిపాదనలు చేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా ఈ రెండు సంస్థలలో వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా చైనా పెట్టుబడులపై అనిశ్చిత పరిస్థితులు తలెత్తడంతో వెనకడుగు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇండియాసహా వర్ధమాన మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు ఫోజన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కంపెనీకి కీలకమైన రంగాలు, పరిశ్రమలలో కార్యకలాపాలను పటిష్టపరచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు. గ్లాండ్ ఫార్మా ఐపీవో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్లాండ్ ఫార్మా ఇటీవల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసుకుంది. 1978లో ఏర్పాటైన గ్లాండ్ ఫార్మాలో 2017లో ఫోజన్ ఫార్మాస్యూటికల్స్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దేశీ ప్రమోటర్ల నుంచి 74 శాతం వాటాను 110 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. అంతేకాకుండా డెల్హివరీ, కిస్త్, ఇక్సిగో, మేక్మైట్రిప్, లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ తదితర స్టార్టప్‌లలోనూ ఇన్వెస్ట్ చేసినట్లు పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. -
రోజారీ బయోటెక్ ఐపీవోకు యాంకర్ నిధులు
కోవిడ్-19 సవాళ్ల నేపథ్యంలోనూ ఐపీవోకు వస్తున్న రోజారీ బయోటెక్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది. వారాంతాన 15 యాంకర్ ఇన్వెస్టర్ సంస్థలకు 35 లక్షలకుపైగా షేర్లు కేటాయించడం ద్వారా రూ. 149 కోట్లు సమకూర్చుకుంది. అబుదభి ఇన్వెస్ట్మెంట్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, ఎస్బీఐ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, గోల్డ్‌మన్ శాక్స్ తదితర సంస్థలు షేరుకి రూ. 425 ధరలో ఇన్వెస్ట్ చేశాయి. రూ. 2 ముఖ విలువతో వస్తున్న రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 13న(సోమవారం) ప్రారంభమై 15న(బుధవారం) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 423-425. గ్లాండ్ ఫార్మా సైతం మార్చి 16న ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాక పబ్లిక్ ఇష్యూలు నిలిచిపోయాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే రోజారీ బయోటెక్ ఇందుకు తిరిగి శ్రీకారం చుడుతోంది. కాగా.. హెల్త్‌కేర్ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా సైతం తాజాగా ఐపీవో ప్రణాళికలు ప్రకటించింది. రూ. 6,000 కోట్ల సమీకరణకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. కోవిడ్-19 కారణంగా ఇటీవల పలు కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వెనుకాడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్ రూ. 10,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 35 షేర్లకు. పబ్లిక్ ఇష్యూ ద్వారా రోజారీ బయోటెక్ రూ. 494-496 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువ మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేయవచ్చు. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఇష్యూలో భాగంగా 1.05 కోట్ల షేర్లతోపాటు తాజాగా రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూ విజయవంతంగా పూర్తయితే.. ఈ నెల(జులై) 23కల్లా రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 విభాగాలలో రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. అయితే కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020లో ఇలా గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది. -
పేరెంట్ చైనా - గ్లాండ్ ఫార్మా ఐపీవోకు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ చేపడుతోంది. ఇందుకు అనుమతించమని కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. కంపెనీ మాతృ సంస్థ ఫోజన్ ఫార్మా. చైనాకు చెందిన షాంఘై ఫోజన్ ఫార్మాస్యూటికల్. దీంతో చైనా మాతృ సంస్థగా కలిగన కంపెనీ తొలిసారి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రికార్డును సాధించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రాస్పెక్టస్ ఇలా ఐపీవో చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ నెల 10న గ్లాండ్ ఫార్మా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000-6,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు తెలియజేసింది. పబ్లిక్ ఇష్యూ నిర్వహణకు సిటీ, కొటక్ మహీంద్రా క్యాపిటల్, నోమురా తదితర సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే గ్లాండ్ ఫార్మా ఐపీవో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్-మార్చి 21)లో మార్కెట్లను తాకే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐపీవో నిధులను విస్తరణపై పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. 2017లో హాంకాంగ్‌లో లిస్టయిన ఫోజన్ ఫార్మా 2017 అక్టోబర్‌లో గ్లాండ్ ఫార్మాను సొంతం చేసుకుంది. 74 శాతం వాటాను 1.09 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పీఈ సంస్థ కేకేఆర్ సైతం.. వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. జనరిక్ ఇంజక్టబుల్స్ రూపొందించే గ్లాండ్ ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు, డాక్టర్ రవి పెన్మెత్స ఏర్పాటు చేశారు. 1999 నుంచీ వైస్‌చైర్మన్, ఎండీగా డాక్టర్ రవి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా యూఎస్, యూరోపియన్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని పొందుతోంది. కంపెనీ హైదరాబాద్‌లో మూడు, విశాఖపట్టణంలో ఒకటి చొప్పున ప్లాంట్లను నిర్వహిస్తోంది. రెండో ఇష్యూ! కోవిడ్-19 చెలరేగడంతో ఇటీవల ఐపీవో మార్కెట్ డీలా పడింది. లాక్‌డవున్‌ల విధింపు తదుపరి తొలిసారి రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకి వస్తున్న విషయం విదితమే. సోమవారం నుంచీ ప్రారంభంకానున్న రోజారీ ఐపీవో బుధవారం ముగింయనుంది. రోజారీ బయోటెక్ ఐపీవోకు రూ. 423-425 ధరల శ్రేణికాగా.. రూ. 496 కోట్లవరకూ నిధులను సమీకరించాలని ఆశిస్తోంది. -
చైనా ‘ఫోసున్’ చేతికి గ్లాండ్ ఫార్మా
హైదరాబాద్ కంపెనీలో 74 శాతం వాటా కొనుగోలుకు నిర్ణయం ► పాత ఒప్పందంలో మార్పు ► విలువ రూ.7,000 కోట్లు ► భారత్‌లో అతిపెద్ద చైనా ఎఫ్‌డీఐ! న్యూఢిల్లీ: భారత్ ఫార్మా రంగంలోకి డ్రాగన్ దూకుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మాను కొనుగోలు చేసేందుకు చైనా ఫార్మా దిగ్గజం షాంఘై ఫోసున్ తాజా డీల్‌కు ఓకే చెప్పింది. గ్లాండ్ ఫార్మాలో 74 శాతం మెజారిటీ వాటాను దక్కించుకోనున్నట్లు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫోసున్ వెల్లడించింది. ఇందుకోసం గరిష్టంగా 1.09 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7 వేల కోట్లు) చెల్లించనున్నామని తెలిపింది. ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకరించాయని.. ఈ మేరకు గత లావాదేవీ పత్రాల్లో మార్పులు చేసినట్లు హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌కు ఫోసున్ తెలియజేసింది. ఈ డీల్ పూర్తయితే భారత్ కంపెనీల్లో చైనా సంస్థ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడిగా నిలుస్తుంది. కేంద్రం అభ్యంతరాలతో వాటా తగ్గింపు... గ్లాండ్ ఫార్మాలో 86.08 శాతం వాటా కొనుగోలు చేసేందుకు షాంఘై ఫోసున్ ఫార్మాసూటికల్స్(గ్రూప్) గతేడాది జూలైలోనే ముందుకొచ్చింది. ఇందుకోసం గరిష్టంగా 1.26 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.8,000 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది కూడా. కొనుగోలుచేసే వాటాలో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ దిగ్గజం కేకేఆర్ వాటాతోపాటు గ్లాండ్ ఫార్మా ప్రమోటర్స్ రవి పెన్మెత్స, ఆయన తండ్రి పీవీఎన్ రాజు వాటాలు కూడా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి ఉద్రిక్తతలు పెరిగిపోవడం ఇతరత్రా కారణాలతో కేంద్ర ప్రభుత్వం(ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ–సీసీఈఏ) ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపాదిత కొనుగోలు వాటాను 74%కి తగ్గించుకున్నామని ఫోసున్ ఫార్మా తాజాగా హాంకాంగ్ ఎక్సే్ఛంజ్‌కి వెల్లడించింది. ఈ డీల్‌లో అమెరికా మార్కెట్లో గ్లాండ్ ఫార్మా ప్రవేశపెట్టిన ఇనోక్సాపారిన్ ఇంజెక్షన్లకు సంబంధించి అదనపు చెల్లింపు మొత్తం(2.5 కోట్ల డాలర్లకు మించకుండా) కలిపి ఉన్నట్లు వివరించింది. అయితే, అంతక్రితం దీనికి 5 కోట్ల డాలర్లకు మించకుండా చెల్లించేందుకు ఫోసున్ ముందుకొచ్చింది. దీంతో పోలిస్తే ఇప్పుడు ఆఫర్ చేసిన మొత్తం సగానికి తగ్గిపోవడం గమనార్హం. ఈ డీల్‌కు చైనా ప్రభుత్వ యంత్రాంగాల నుంచి తగిన అనుమతులు లభించాయని.. అమెరికా, భారత్‌కు చెందిన నియంత్రణ పరమైన అనుమతులు కూడా పూర్తయ్యాయని ఫోసున్ తెలిపింది. డైరెక్ట్ రూట్... ఫార్మా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలు భారతీయ కంపెనీల్లో 74 శాతం వరకూ వాటాలను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేరుగా చేజిక్కించుకోవడానికి వీలుంది. ప్రతిపాదిత కొనుగోలు వాటాను 74 శాతానికి తగ్గించుకుంటూ లావాదేవీ పత్రాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఇకపై ఈ డీల్‌కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం(ఎఫ్ఐపీబీ), సీసీఈఏ అనుమతులు అవసం లేదని ఫోసున్ ఫార్మా పేర్కొంది. గ్లాండ్ ఫార్మా నిర్వహణ కార్యకలాపాలు చాలా మెరుగైన రీతిలో ఉన్నాయని తెలిపింది. బోర్డులోనే ప్రమోటర్లు...: తాజా డీల్‌తో... కంపెనీలో ప్రమోటర్లు రవి పెన్మెత్స, పీవీఎన్ రాజుల వాటా గతంతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. వీరిద్దరూ డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతారని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుత యాజమాన్య బృందమే కంపెనీ రోజువారీ వ్యవహారాలను చూసుకుంటుందని ఆయన తెలిపారు. ‘ఈ డీల్‌తో ఇరు కంపెనీలు తమ సామర్థ్యాలను ఇచ్చిపుచ్చుకోవడానికి దోహదం చేయనుంది. ఫోసున్ అభివృద్ధి చేస్తున్న బయో–సిమిలర్ ప్రోగ్రామ్, ఇతరత్రా ఉత్పత్తులను గ్లాండ్ ఫార్మా తయారు చేసేందుకు వీలవుతుంది. భారతీయ మార్కెట్లో వీటిని ప్రవేశపెట్టొచ్చు. ఇంకా ఫోసున్ ఫార్మాకు ఇప్పుడున్న మార్కెట్లలో గ్లాండ్ ఫార్మా తన ఉత్పత్తులను విక్రయిచేందుకు కొత్త అవకాశాలు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. ఫోసున్ సంగతిదీ... ► చైనా హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అతిపెద్ద గ్రూప్‌లలో ఒకటిగా షాంఘై ఫోసున్ నిలుస్తోంది. ► 1994లో ఇది ఆవిర్భవించింది. సబ్సిడరీలతో కలిపి జెనెటిక్ ఔషధాలు, చైనా సాంప్రదాయ ఔషధాలు, డయాగ్నోస్టిక్ ఉత్పత్తులు, మెడికల్ పరికరాల తయారీతో పాటు టెక్నాలజీ సేవలు, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ వంటి సేవలను కూడా అందిస్తోంది. అదేవిధంగా ఎగుమతి–దిగుమతుల వాణిజ్యంలోనూ పెట్టుబడులు పెడుతోంది. ► కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 12 బిలియన్ డాలర్లు. గ్లాండ్ ఫార్మా... ► 1978లో హైదరాబాద్ కేంద్రంగా పీవీఎన్ రాజు దీన్ని నెలకొల్పారు. వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్నారు. ► ఇక పీవీఎన్ రాజు తనయుడు డాక్టర్ రవి పెన్మెత్స కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా 1999 నుంచి కొనసాగుతున్నారు. ► జెనరిక్ ఇంజెక్టబుల్స్‌ను తయారుచేస్తోంది. ► ఐదు ఖండాల్లో దాదాపు 90 దేశాల్లో కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ► ఫార్మాసూటికల్ లిక్విడ్ ఇంజెక్టబుల్ ఉత్పత్తులకు సంబంధించి 2003లో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ ఎఫ్‌డీఏ) అనుమతి పొందింది. తద్వారా ఈ విభాగంలో యూఎస్ఎఫ్డీఏ ఆమోదం లభించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ► ఇంకా కంపెనీ తయారీ యూనిట్లకు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక కీలక దేశాల నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయి. -
1.26 బిలియన్ డాలర్ల డీల్
గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్‌కు 86% వాటా బోర్డులోనే వ్యవస్థాపకులు.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను 1.26 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,500 కోట్లు) కొనుగోలు చేసేందుకు చైనా కంపెనీ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ అంగీకరించింది. ఈ డీల్ కింద ఫోసన్ ఫార్మా 86 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లాండ్ ఫార్మాలో సంస్థ వ్యవస్థాపకులు, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్‌కు కలిపి మొత్తం 96% వాటాలు ఉన్నాయి. 2014లో ఇన్వెస్ట్ చేసిన కేకేఆర్ .. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుండగా.. ప్రమోటర్లు సింహభాగం వాటాలు విక్రయిస్తున్నారు. ఒక భారతీయ కంపెనీని చైనా సంస్థ ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ఇదే ప్రథమం కానుంది. ఒప్పందం ప్రకారం మిగతా షేర్‌హోల్డర్ల వాటాలతో పాటు కేకేఆర్ ఫ్లోర్లైన్ ఇన్వెస్ట్మెంట్స్కి చెందిన అన్ని షేర్లను ఫోసన్ ఫార్మా కొనుగోలు చేస్తుంది. డీల్ అనంతరం కూడా వ్యవస్థాపక కుటుంబానికి సంస్థలో వాటాలు ఉంటాయి. గ్లాండ్ ఫార్మా వ్యవస్థాపకుడు పీవీఎన్ రాజు, ఆయన కుమారుడు రవి పెన్మెత్స బోర్డులో కొనసాగుతారు. కంపెనీ ఎండీ, సీఈవోగా పెన్మెత్స కొనసాగుతారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి డీల్ ఉంటుందని గ్లాండ్ ఫార్మా వివరించింది. ఒప్పందానికి సంబంధించి సింప్సన్ థాచర్ అండ్ బార్ట్లెట్, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థలు న్యాయసలహాలపరమైన సేవలు అందించగా, జెఫ్రీస్ సంస్థ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. ఫోసన్ను ఎంచుకున్న కారణమేంటంటే.. కేకేఆర్ సహాయంతో వాటాల విక్రయానికి పలు సంస్థలను పరిశీలించి, చివరికి ఫోసన్ను ఎంపిక చేసుకోవడం జరిగిందని పెన్మెత్స తెలిపారు. ఫోసన్‌కు పుష్కలమైన వనరులు, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు ఉండటం ఇందుకు కారణమని వివరించారు. అమెరికా, చైనాలోనూ కంపెనీకి పలు ఆర్అండ్డీ కేంద్రాలు, తయారీ ప్లాంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను మరింతగా పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఫోసన్ ఫార్మా చైర్మన్ చెన్ కియు తెలిపారు. ప్రధానమైన అమెరికా మార్కెట్లో 2019 నాటికి దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇంజెక్టబుల్స్ పేటెంట్ల కాల వ్యవధి తీరిపోనున్న నేపథ్యంలో ఈ విభాగంలోని భారత సంస్థలకు పుష్కలంగా వ్యాపారావకాశాలు ఉన్నాయని పరిశీ లకులు భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో అమెరికా ఇంజెక్టబుల్స్ మార్కెట్ ఏటా 10% వృద్ధి చెందనుందని అంచనా. గ్లాండ్-ఫోసన్ల కథ ఇదీ.. గ్లాండ్ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా భారత్, అమెరికా మార్కెట్లతో పాటు 90 దేశాలకు జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు అందిస్తోంది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్‌లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. సుమారు రెండేళ్ల క్రితం కేకేఆర్ దాదాపు 200 మిలియన్ డాలర్లతో గ్లాండ్ ఫార్మాలో వాటాలు కొనుగోలు చేశారు. దీన్ని బట్టి అప్పట్లో సంస్థ విలువ సుమారు 600-650 మిలియన్ డాలర్లు. మరోవైపు, చెనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. ఇది కార్డియోవాస్కులర్ ఔషధాల నుంచి వ్యాధి నిర్ధారణ పరికరాల దాకా వివిధ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు. -
చైనా ఫోసన్ చేతికి.. గ్లాండ్ ఫార్మా!
♦ 96% వాటాల కొనుగోలు...? ♦ డీల్ విలువ రూ.9,500 కోట్లుగా అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీ ఫార్మా రంగంలో భారీ డీల్‌కు తెరతీస్తూ.. హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను చైనా సంస్థ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,500 కోట్లు) వెచ్చించనున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల ప్రకారం.. వ్యవస్థాపకుల వాటాలు సహా ఫోసన్ సుమారు 96 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. వాటాల కొనుగోలుకు సంబంధించి గ్లాండ్ ఫార్మాకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఈ ఏడాది మే లోనే షాంఘై ఫోసన్ ఫార్మా వెల్లడించింది. గ్లాండ్ ఫార్మాను దక్కించుకునేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్, బాక్స్టర్, టోరెంట్ ఫార్మా తదితర సంస్థలు కూడా పోటీపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. డీల్ పూర్తయితే ఒక దేశీ కంపెనీ పూర్తిగా చైనా సంస్థ అజమాయిషీలోకి వెళ్లనున్నందున దీన్ని నియంత్రణ సంస్థలు నిశితంగా పరిశీలించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2014 నాటి గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయంగా ఇంజెక్టబుల్స్ మార్కెట్ 300 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. ఇందులో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 35 శాతం పైచిలుకు ఉంది. భారత మార్కెట్ విలువ 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. గ్లాండ్ ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా అమెరికా తదితర మార్కెట్ల కోసం జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు తయారు చేస్తోంది. కంపెనీకి చెందిన ప్లాంట్లకు అమెరికా, బ్రిటన్ ఔషధ రంగ నియంత్రణ సంస్థల అనుమతులు కూడా ఉన్నాయి. ఫార్మా లిక్విడ్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన తొలి దేశీ కంపెనీగా గ్లాండ్ ఫార్మా గుర్తింపు పొందింది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్‌లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రెండు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో సుమారు 250 మంది పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లో మైలాన్, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థలకు ఇంజెక్టబుల్స్‌ను గ్లాండ్ ఫార్మా అందిస్తోంది. 2013లో ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ ఫండ్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్.. దాదాపు 200 మిలియన్ డాలర్లకు గ్లాండ్ ఫార్మాలో కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. దీని ప్రకారం అప్పట్లో గ్లాండ్ ఫార్మా విలువ 600-650 మిలియన్ డాలర్లు. గ్లాండ్ ఫార్మాలో ప్రమోటర్ రవి పెన్మెత్స కుటుంబం, కేకేఆర్‌లకు 96 శాతం మేర వాటాలు ఉన్నాయి. 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గ్లాండ్ ఫార్మా ఆదాయాలు రూ. 994 కోట్ల మేర ఉండగా లాభం సుమారు రూ. 209 కోట్లుగా నమోదైంది. ఫోసన్ గ్రూప్... చైనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు. గతేడాది కంపెనీ ఆదాయాలు సుమారు 1.9 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఉన్న ఫోసన్ గ్రూప్ ఇటీవలి రెండేళ్ల కాలంలో వివిధ అంతర్జాతీయ డీల్స్‌పై బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. భారత్‌లో సూలా వైన్యార్డ్స్, స్పైస్‌జెట్ వంటి సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరిపింది. గ్లాండ్ ఫార్మా డీల్‌తో రీసెర్చ్, తయారీ సామర్ధ్యాలను భారత్‌లో విస్తరించుకునేందుకు ఫోసన్‌కు తోడ్పడనుంది. -
గ్లాండ్ ఫార్మాపై చైనా కంపెనీ కన్ను!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి చైనాకు చెందిన షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ముందుకొచ్చింది. అనుబంధ కంపెనీ ఫోసన్ ఇండస్ట్రియల్ కంపెనీ లిమిటెడ్ ద్వారా గ్లాండ్ ఫార్మాలో 96 శాతం వాటాను కొనుగోలు చేయడానికి నాన్ బైండింగ్ ఆఫర్‌ను జారీ చేసినట్లు చైనా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం కుదిరితే డ్రగ్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో అంతర్జాతీయంగా విస్తరించడానికి చక్కటి వేదికల లభించినట్లు అవుతుందని ఫోసన్ తెలిపింది. 1978లో పి.వి.ఎన్ రాజు స్థాపించిన గ్లాండ్ ఫార్మాలో జెనరిక్ ఇంజెక్షన్ల తయారీలో ప్రత్యేకత సంపాదించుకుంది. ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ 2013లో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. 2008లో 30 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్‌సెన్సైస్ ఫండ్ నుంచి ఈ వాటాను కేకేఆర్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ సుమారు రూ. 10,000 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది గ్లాండ్ ఫార్మా రూ. 991 కోట్ల ఆదాయంపై రూ. 209 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సుమారు 90 దేశాలకు ఎగుమతులు చేస్తున్న గ్లాండ్ ఫార్మాకి హైదరాబాద్, విశాఖపట్నంలో తయారీ యూనిట్లు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జెనీవా, బ్రెజిల్ దేశాల నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయి. -
కేకేఆర్ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: రెండు ఫార్మా కంపెనీల్లో రూ.1,434 కోట్లతో వాటాల కొనుగోలుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. హైదరాబాద్ కేంద్రంగాగల గ్లాండ్ ఫార్మాలో 37.98%, గ్లాండ్ సెల్సస్ బయోకెమికల్స్‌లో 24.9% వాటాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలివి. ఈ కొనుగోళ్లకు కాంపిటీషన్ కమిషన్ గత జనవరిలోనే ఆమోదం తెలిపింది. భెల్‌లో 4.66 శాతం వాటా విక్రయంపై... విద్యుత్ పరికరాల సంస్థ భెల్‌లో 4.66 శాతం వాటాను బ్లాక్ డీల్ రూట్లో విక్రయించాలన్న నిర్ణయానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోని సీసీఈఏ ఈ నిర్ణయాన్ని మంగళవారం ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
గ్లాండ్‌ఫార్మాలో కేకేఆర్‌కు వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన జనరిక్ ఇంజక్టబుల్స్ తయారీ సంస్థ గ్లాండ్‌ఫార్మాలో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ మైనారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి కేకేఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్లాండ్ఫార్మా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 20 కోట్లుగా (దాదాపు రూ. 1,300 కోట్లు) ఉండనుంది. దీని ప్రకారం ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టరు ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ ఫండ్‌కి గ్లాండ్ ఫార్మాలో ఉన్న మొత్తం వాటాలను కేకేఆర్ కొనుగోలు చేస్తుంది. ఈ వాటాలు సుమారు 35 శాతం ఉండొచ్చని అంచనా. కేకేఆర్‌తో భాగస్వామ్యం.. కంపెనీ ఎదుగుదలకు మరింతగా దోహదపడగలదని గ్లాండ్ఫార్మా వ్యవస్థాపక చైర్మన్ పీవీఎన్ రాజు తెలిపారు. ప్రీ-ఫిల్డ్ సిరంజిల తయారీ వంటి ప్రత్యేకమైన రంగంలో తాము గుర్తింపు తెచ్చుకునేలా జర్మనీకి చెందిన ఇన్వెస్టర్లయిన వెటర్ గ్రూప్ తోడ్పాటు అందించిందని వివరించారు. ఆర్థిక పనితీరుపరంగా గ్లాండ్ ఫార్మా పటిష్టంగా ఉందని, అలాగే పలు దేశీయ, అంతర్జాతీయ ఫార్మా సంస్థలతో దీర్ఘకాలికంగా కలిసి పనిచేస్తోందని కేకేఆర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ నాయర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రీ-ఫిల్డ్ సిరంజిలకి సంబంధించిన టెక్నాలజీపై కంపెనీకి గట్టి పట్టు ఉందని, అమెరికా మార్కెట్లో పటిష్టమైన స్థానంలో ఉందని సంస్థ వైస్ చైర్మన్, ఎండీ రవి పెన్మెత్స తెలిపారు. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల కోసం అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, మరిన్ని ఉత్పత్తులను ఆవిష్కరించే క్రమంలో ఉన్నామన్నారు. కంపెనీ ఎదుగుదలలో ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. 1978లో ప్రారంభం.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్లాండ్ ఫార్మా 1978లో ప్రారంభమైంది. ప్రధానంగా జనరిక్ ఇంజెక్టబుల్స్ని తయారు చేస్తోంది. వీటిని భారత్‌తో పాటు అమెరికా, ఇతర మార్కెట్లలో విక్రయిస్తోంది. 2003లో గ్లాండ్ఫార్మాకి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. ఔషధాల్లో కీలకభాగమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఇంజెక్టబుల్స్ని గ్లాండ్ ఫార్మా ఉత్పత్తి చేస్తోంది. ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సైన్స్ ఫండ్.. 2008లో ఇందులో దాదాపు 30 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. తాజాగా కేకేఆర్‌తో డీల్ ప్రకారం చూస్తే గ్లాండ్ ఫార్మా విలువ సుమారు 60-65 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 4,000 కోట్లు) ఉండొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 700 కోట్ల ఆదాయంపై రూ. 200 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించినట్లు తెలుస్తోంది.