గ్లాండ్‌ఫార్మాలో కేకేఆర్‌కు వాటా | KKR to acquire minority stake in Gland Pharma | Sakshi
Sakshi News home page

గ్లాండ్‌ఫార్మాలో కేకేఆర్‌కు వాటా

Published Fri, Nov 29 2013 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

గ్లాండ్‌ఫార్మాలో కేకేఆర్‌కు వాటా

గ్లాండ్‌ఫార్మాలో కేకేఆర్‌కు వాటా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  రాష్ట్రానికి చెందిన జనరిక్ ఇంజక్టబుల్స్ తయారీ సంస్థ గ్లాండ్‌ఫార్మాలో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం కేకేఆర్ మైనారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి కేకేఆర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్లాండ్‌ఫార్మా గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 20 కోట్లుగా (దాదాపు రూ. 1,300 కోట్లు) ఉండనుంది. దీని ప్రకారం ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టరు ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ ఫండ్‌కి గ్లాండ్ ఫార్మాలో ఉన్న మొత్తం వాటాలను కేకేఆర్ కొనుగోలు చేస్తుంది. ఈ వాటాలు సుమారు 35 శాతం ఉండొచ్చని అంచనా.  కేకేఆర్‌తో భాగస్వామ్యం.. కంపెనీ ఎదుగుదలకు మరింతగా దోహదపడగలదని గ్లాండ్‌ఫార్మా వ్యవస్థాపక చైర్మన్ పీవీఎన్ రాజు  తెలిపారు.

ప్రీ-ఫిల్డ్ సిరంజిల తయారీ వంటి ప్రత్యేకమైన రంగంలో తాము గుర్తింపు తెచ్చుకునేలా జర్మనీకి చెందిన ఇన్వెస్టర్లయిన వెటర్ గ్రూప్ తోడ్పాటు అందించిందని వివరించారు. ఆర్థిక పనితీరుపరంగా గ్లాండ్ ఫార్మా పటిష్టంగా ఉందని, అలాగే పలు దేశీయ, అంతర్జాతీయ ఫార్మా సంస్థలతో దీర్ఘకాలికంగా కలిసి పనిచేస్తోందని కేకేఆర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ నాయర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 ప్రీ-ఫిల్డ్ సిరంజిలకి సంబంధించిన టెక్నాలజీపై కంపెనీకి గట్టి పట్టు ఉందని, అమెరికా మార్కెట్లో పటిష్టమైన స్థానంలో ఉందని సంస్థ వైస్ చైర్మన్, ఎండీ రవి పెన్మెత్స తెలిపారు. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల కోసం అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, మరిన్ని ఉత్పత్తులను ఆవిష్కరించే క్రమంలో ఉన్నామన్నారు. కంపెనీ ఎదుగుదలలో ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.
 1978లో ప్రారంభం..
 హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్లాండ్ ఫార్మా 1978లో ప్రారంభమైంది. ప్రధానంగా జనరిక్ ఇంజెక్టబుల్స్‌ని తయారు చేస్తోంది. వీటిని భారత్‌తో పాటు అమెరికా, ఇతర మార్కెట్లలో విక్రయిస్తోంది. 2003లో గ్లాండ్‌ఫార్మాకి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. ఔషధాల్లో కీలకభాగమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఇంజెక్టబుల్స్‌ని గ్లాండ్ ఫార్మా ఉత్పత్తి చేస్తోంది. ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సైన్స్ ఫండ్.. 2008లో ఇందులో దాదాపు 30 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. తాజాగా కేకేఆర్‌తో డీల్ ప్రకారం చూస్తే గ్లాండ్ ఫార్మా విలువ సుమారు 60-65 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 4,000 కోట్లు) ఉండొచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 700 కోట్ల ఆదాయంపై రూ. 200 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించినట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement