గ్లాండ్ ఫార్మాపై చైనా కంపెనీ కన్ను!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి చైనాకు చెందిన షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ముందుకొచ్చింది. అనుబంధ కంపెనీ ఫోసన్ ఇండస్ట్రియల్ కంపెనీ లిమిటెడ్ ద్వారా గ్లాండ్ ఫార్మాలో 96 శాతం వాటాను కొనుగోలు చేయడానికి నాన్ బైండింగ్ ఆఫర్‌ను జారీ చేసినట్లు చైనా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం కుదిరితే డ్రగ్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగంలో అంతర్జాతీయంగా విస్తరించడానికి చక్కటి వేదికల లభించినట్లు అవుతుందని ఫోసన్ తెలిపింది. 1978లో పి.వి.ఎన్ రాజు స్థాపించిన గ్లాండ్ ఫార్మాలో జెనరిక్ ఇంజెక్షన్ల తయారీలో ప్రత్యేకత సంపాదించుకుంది. ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్ 2013లో 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.
2008లో 30 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్‌సెన్సైస్ ఫండ్ నుంచి ఈ వాటాను కేకేఆర్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ విలువ సుమారు రూ. 10,000 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గతేడాది గ్లాండ్ ఫార్మా రూ. 991 కోట్ల ఆదాయంపై రూ. 209 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సుమారు 90 దేశాలకు ఎగుమతులు చేస్తున్న గ్లాండ్ ఫార్మాకి హైదరాబాద్, విశాఖపట్నంలో తయారీ యూనిట్లు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జెనీవా, బ్రెజిల్ దేశాల నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయి.