24.5% వాటా కొనుగోలు..
డీల్ విలువ రూ. 33,600 కోట్లు!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం భారతి ఎంటర్‌ప్రైజెస్ అంతర్జాతీయ పెట్టుబడుల విభాగం భారతి గ్లోబల్ తాజాగా బ్రిటన్ సంస్థ బీటీ (బ్రిటీష్ టెలికం) గ్రూప్‌లో 24.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. డీల్ విలువను నిర్దిష్టంగా ప్రకటించనప్పటికీ బీటీ వేల్యుయేషన్ సుమారు 15 బిలియన్ డాలర్లు ఉంటుందని, దాన్ని బట్టి చూస్తే ఒప్పంద విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33,600 కోట్లు) ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
భారతి గ్లోబల్ ప్రకటన ప్రకారం కంపెనీ ముందుగా ఆల్టిస్ సంస్థ నుంచి బీటీ గ్రూప్‌లో 9.99 శాతం వాటాను తక్షణం కొనుగోలు చేస్తుంది. నియంత్రణ సంస్థ అనుమతులు వచ్చాక మిగతా వాటాను తీసుకుంటుంది. బీటీని పూర్తిగా దక్కించుకోవడంపై గానీ బోర్డులో స్థానం తీసుకోవడంపై గానీ ఆసక్తి లేదని భారతి గ్లోబల్ పేర్కొంది. బీటీ గ్రూప్ బ్రిటన్‌లో అతి పెద్ద బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది.
దానికి గతంలో 1997 నుంచి 2001 వరకు భారతి ఎంటర్‌ప్రైజెస్ టెలికం విభాగమైన భారతి ఎయిర్‌టెల్‌లో 21 శాతం వాటాలు ఉండేవి. బీటీ గ్రూప్‌లో బిలియనీర్ ప్యాట్రిక్ డ్రాహీకి చెందిన పెట్టుబడి సంస్థ ఆల్టిస్ 2021లో ముందుగా 12 శాతం వాటాలు తీసుకుని తర్వాత దాన్ని 24.5 శాతానికి పెంచుకుంది. భారతి గ్లోబల్ పెట్టుబడులు తమ గ్రూప్ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై నమ్మకానికి నిదర్శనమని బీటీ సీఈవో అలిన్ కిర్క్‌బీ పేర్కొన్నారు.
టాటా, మహీంద్రాల సరసన భారతి..
→ తాజా డీల్‌తో బ్రిటన్ కంపెనీలను కొనుగోలు చేసిన టాటా, మహీంద్రా, వెల్‌స్పన్, టీవీఎస్ వంటి దిగ్గజ సంస్థల సరసన భారతి ఎంటర్‌ప్రైజెస్ కూడా చోటు దక్కించుకోనుంది.
→ టాటా గ్రూప్‌లో భాగమైన టాటా టీ 2000లో బ్రిటన్ సంస్థ టెట్లీ టీని కొనుగోలు 271 మిలియన్ పౌండ్లకు చేసింది. అప్పట్లో టెట్లీతో పోలిస్తే టాటా టీ పరిమాణం చాలా చిన్నది. అయినప్పటికీ 1995 నుంచి దాన్ని కొనుగోలు చేసేందుకు సుదీర్ఘంగా ప్రయత్నాలు చేసింది. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కూడా రంగంలోకి దిగారు. చివరికి 2000లో టాటా గ్రూప్ దాన్ని సొంతం చేసుకుని అప్పట్లో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలు డీల్‌ను నమోదు చేసింది.
→ ఆ తర్వాత ఆరేళ్లకు 2006 జూలైలో టెక్స్‌టైల్స్ దిగ్గజం వెల్‌స్పన్ ఇండియా, బ్రిటన్‌కి చెందిన టెర్రీ టవల్ బ్రాండ్ క్రిస్టీ మాతృ సంస్థ సీహెచ్‌టీ హోల్డింగ్స్‌లో 85 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 132 కోట్లు వెచి్చంచింది.
→ టాటా గ్రూప్ తన దూకుడును కొనసాగిస్తూ ఆ మరుసటి ఏడాది 2007లో ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్ గ్రూప్‌ను దక్కించుకుంది. ఇందుకోసం టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. దానికి కొనసాగింపుగా 2008లో టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లతో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ మోటర్ నుంచి దక్కించుకుంది.
→ ఇక 2016 అక్టోబర్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటన్‌కు చెందిన ద్విచక్ర వాహనాల సంస్థ బీఎస్‌ఏ కంపెనీని రూ. 28 కోట్లకు తీసుకుంది.
→ 2020 ఏప్రిల్‌లో బైక్‌ల తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను టీవీఎస్ మోటర్ కంపెనీ 16 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది.
భారతి, బీటీలకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉంది. దిగ్గజ బ్రిటన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మాకు ఒక గొప్ప మైలురాయిలాంటిది
– సునీల్ భారతి మిట్టల్, భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment