న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ యూనికార్న్ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్‌లో నువామా వెల్త్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ రూ. 100 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓయో బ్రాండ్ కంపెనీ వాటాను షేరుకి రూ. 53 చొప్పున సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
సెకండరీ మార్కెట్లో లావాదేవీ ద్వారా కంపెనీ తొలి ఇన్వెస్టర్ల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. మరోపక్క ఆతిథ్య రంగ కంపెనీలో వాటా కొనుగోలుకి ఇన్‌క్రెడ్ తదితర సంస్థలు సైతం ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాయి. ఇందుకు షేరుకి రూ. 53–60 మధ్య ధరను చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వెరసి కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లకుపైగా మదింపు చేసినట్లు వివరించాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం ఏప్రిల్–జూన్(క్యూ1)లో సుమారు రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) క్యూ1లో రూ. 108 కోట్ల నష్టాలు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment