ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న హెల్త్ కేర్ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ ఎక్స్ఛేంజీలలో 14 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,500తో పోలిస్తే.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 210 లాభంతో రూ. 1,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 1,850 వరకూ జంప్‌చేసింది. ఇది 23 శాతం వృద్ధికాగా.. ప్రస్తుతం రూ. 1,717 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ రూ. 1,701 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ. 1850- 1701 మధ్య హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి తొలి గంటలోనే 3.2 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం!
చైనీస్ పేరెంట్..
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గ్లాండ్ ఫార్మా రూ. 1,500 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించింది. ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది.
బ్యాక్ గ్రౌండ్
ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్‌ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment