FOSUN INTERNATIONAL
-
గ్లాండ్ ఫార్మా.. గ్రాండ్ లిస్టింగ్
ముంబై, సాక్షి: ఇటీవలే పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న హెల్త్ కేర్ రంగ కంపెనీ గ్లాండ్ ఫార్మా స్టాక్ ఎక్స్ఛేంజీలలో 14 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,500తో పోలిస్తే.. ఎన్ఎస్ఈలో రూ. 210 లాభంతో రూ. 1,710 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 1,850 వరకూ జంప్‌చేసింది. ఇది 23 శాతం వృద్ధికాగా.. ప్రస్తుతం రూ. 1,717 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ రూ. 1,701 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ. 1850- 1701 మధ్య హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి తొలి గంటలోనే 3.2 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! చైనీస్ పేరెంట్.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గ్లాండ్ ఫార్మా రూ. 1,500 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించింది. ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. బ్యాక్ గ్రౌండ్ ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది. -
పెట్లుబడుల్లో చైనీస్ ఫోజన్ వెనకడుగు?!
ఇటీవల లడఖ్ వద్ద సరిహద్దులో చెలరేగిన సైనిక వివాదం నేపథ్యంలో చైనీస్ ఫార్మా గ్రూప్ ఫోజన్ దేశీయంగా పెట్టుబడుల విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంతక్రితం దేశీ హెల్త్‌కేర్ రంగంలో 30 కోట్ల డాలర్ల(రూ. 2250 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎపెక్స్ కిడ్నీకేర్ సంస్థతోపాటు.. బెంగళూరులోని ఓ ఆసుపత్రితో ప్రాథమిక ప్రతిపాదనలు చేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీనిలో భాగంగా ఈ రెండు సంస్థలలో వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా చైనా పెట్టుబడులపై అనిశ్చిత పరిస్థితులు తలెత్తడంతో వెనకడుగు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇండియాసహా వర్ధమాన మార్కెట్లు, ప్రాంతీయ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు ఫోజన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కంపెనీకి కీలకమైన రంగాలు, పరిశ్రమలలో కార్యకలాపాలను పటిష్టపరచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు. గ్లాండ్ ఫార్మా ఐపీవో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్లాండ్ ఫార్మా ఇటీవల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసుకుంది. 1978లో ఏర్పాటైన గ్లాండ్ ఫార్మాలో 2017లో ఫోజన్ ఫార్మాస్యూటికల్స్ మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దేశీ ప్రమోటర్ల నుంచి 74 శాతం వాటాను 110 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. అంతేకాకుండా డెల్హివరీ, కిస్త్, ఇక్సిగో, మేక్మైట్రిప్, లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ తదితర స్టార్టప్‌లలోనూ ఇన్వెస్ట్ చేసినట్లు పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. -
పేరెంట్ చైనా - గ్లాండ్ ఫార్మా ఐపీవోకు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ చేపడుతోంది. ఇందుకు అనుమతించమని కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. కంపెనీ మాతృ సంస్థ ఫోజన్ ఫార్మా. చైనాకు చెందిన షాంఘై ఫోజన్ ఫార్మాస్యూటికల్. దీంతో చైనా మాతృ సంస్థగా కలిగన కంపెనీ తొలిసారి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రికార్డును సాధించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రాస్పెక్టస్ ఇలా ఐపీవో చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ నెల 10న గ్లాండ్ ఫార్మా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000-6,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు తెలియజేసింది. పబ్లిక్ ఇష్యూ నిర్వహణకు సిటీ, కొటక్ మహీంద్రా క్యాపిటల్, నోమురా తదితర సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే గ్లాండ్ ఫార్మా ఐపీవో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్-మార్చి 21)లో మార్కెట్లను తాకే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐపీవో నిధులను విస్తరణపై పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. 2017లో హాంకాంగ్‌లో లిస్టయిన ఫోజన్ ఫార్మా 2017 అక్టోబర్‌లో గ్లాండ్ ఫార్మాను సొంతం చేసుకుంది. 74 శాతం వాటాను 1.09 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పీఈ సంస్థ కేకేఆర్ సైతం.. వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. జనరిక్ ఇంజక్టబుల్స్ రూపొందించే గ్లాండ్ ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు, డాక్టర్ రవి పెన్మెత్స ఏర్పాటు చేశారు. 1999 నుంచీ వైస్‌చైర్మన్, ఎండీగా డాక్టర్ రవి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా యూఎస్, యూరోపియన్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని పొందుతోంది. కంపెనీ హైదరాబాద్‌లో మూడు, విశాఖపట్టణంలో ఒకటి చొప్పున ప్లాంట్లను నిర్వహిస్తోంది. రెండో ఇష్యూ! కోవిడ్-19 చెలరేగడంతో ఇటీవల ఐపీవో మార్కెట్ డీలా పడింది. లాక్‌డవున్‌ల విధింపు తదుపరి తొలిసారి రోజారీ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకి వస్తున్న విషయం విదితమే. సోమవారం నుంచీ ప్రారంభంకానున్న రోజారీ ఐపీవో బుధవారం ముగింయనుంది. రోజారీ బయోటెక్ ఐపీవోకు రూ. 423-425 ధరల శ్రేణికాగా.. రూ. 496 కోట్లవరకూ నిధులను సమీకరించాలని ఆశిస్తోంది. -
ఆ బిజినెస్ టైకూన్ అరెస్టయ్యాడా?
బీజింగ్: చైనాకు చెందిన బిజినెస్ టైకూన్ అదృశ్యం కావడం కలకలం రేపింది. చైనాలో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ ఫోసున్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు గువో గువాంగ్ చాంగ్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం కంపెనీ వర్గాలు కలవర పడుతున్నాయి. అటు హాంగ్‌కాంగ్ మార్కెట్లో ఫోసున్ కంపెనీ తన షేర్ల ట్రేడింగ్ నిలిపేసింది. వారెన్ బఫెట్ అంతటివాడిని కావాలని కలలు కనే గువోను చైనీయులు కూడా ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్‌తో పోలుస్తారు. రెండు రోజుల నుంచి గువో ఆచూకీ లేనట్లు ఆయన కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం నుండి ఇప్పటివరకు సంప్రదింపులు జరపలేదన్నాయి. దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన గువోకి సంబంధించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారన్న వదంతులు కూడా వ్యాపించాయి. షాంఘై పోలీసులు గువోను అదుపులోకి తీసుకున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ అవినీతి కేసులో విచారణకు సహకరించని కారణంగా గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా తమ అధినేత అరెస్టు వార్తలపై ఫోసున్ కంపెనీ ప్రతినిధుల వైపునుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.