ఆ బిజినెస్ టైకూన్ అరెస్టయ్యాడా?
బీజింగ్: చైనాకు చెందిన బిజినెస్ టైకూన్ అదృశ్యం కావడం కలకలం రేపింది. చైనాలో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ ఫోసున్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు గువో గువాంగ్ చాంగ్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఆచూకీ కోసం కంపెనీ వర్గాలు కలవర పడుతున్నాయి. అటు హాంగ్‌కాంగ్ మార్కెట్లో ఫోసున్ కంపెనీ తన షేర్ల ట్రేడింగ్ నిలిపేసింది.
వారెన్ బఫెట్ అంతటివాడిని కావాలని కలలు కనే గువోను చైనీయులు కూడా ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్‌తో పోలుస్తారు. రెండు రోజుల నుంచి గువో ఆచూకీ లేనట్లు ఆయన కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం నుండి ఇప్పటివరకు సంప్రదింపులు జరపలేదన్నాయి. దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన గువోకి సంబంధించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారన్న వదంతులు కూడా వ్యాపించాయి. షాంఘై పోలీసులు గువోను అదుపులోకి తీసుకున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ అవినీతి కేసులో విచారణకు సహకరించని కారణంగా గువోను పోలీసులు అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా తమ అధినేత అరెస్టు వార్తలపై ఫోసున్ కంపెనీ ప్రతినిధుల వైపునుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.