మళ్లీ గూగుల్‌ మ్యాప్‌ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్‌ పర్యాటకుల వంతు | Two French Tourists Going From Delhi to Nepal on Bicycle got lost and Reached Bareilly | Sakshi
Sakshi News home page

మళ్లీ గూగుల్‌ మ్యాప్‌ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్‌ పర్యాటకుల వంతు

Published Sat, Jan 25 2025 8:00 AM | Last Updated on Sat, Jan 25 2025 10:28 AM

Two French Tourists Going From Delhi to Nepal on Bicycle got lost and Reached Bareilly

బరేలీ: యూపీలోని బరేలీ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇద్దరు విదేశీయులకు గూగుల్‌ మ్యాప్‌ చుక్కలు చూపించింది. జరిగిన పొరపాటు కారణంగా వారిద్దరూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, వారి విచారణను ఎదుర్కోవలసి వచ్చింది.

వివరాల్లోకి వెళితే ఇద్దరు విదేశీ పర్యాటకులు గూగుల్ మ్యాప్ సాయంతో నేపాల్ వెళ్తుండగా దారి తప్పారు. ఢిల్లీ నుండి నేపాల్ రాజధాని ఖాట్మండుకు  వెళుతున్న ఈ ఫ్రెంచ్ పర్యాటకులు దారి తప్పి, యూపీలోని చురైలి ఆనకట్ట దగ్గరకు చేరుకున్నారు. కొందరు గ్రామస్తులు వీరిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ చురైలి పోలీస్ స్టేషన్‌కు తరలించి, విచారించారు.

ఈ ఘటన గురించి సర్కిల్ ఆఫీసర్ (సీఓ) బహేరి అరుణ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్రెంచ్ పౌరులు బ్రియాన్ జాక్వెస్ గిల్బర్ట్, సెబాస్టియన్ ఫ్రాంకోయిస్ గాబ్రియేల్ జనవరి 7న ఫ్రాన్స్ నుంచి ఢిల్లీకి వచ్చారని తెలిపారు. వారు పిలిభిత్ నుండి తనక్‌పూర్ మీదుగా నేపాల్‌లోని ఖాట్మండు వెళ్ళవలసి ఉంది. అయితే గూగుల్ మ్యాప్ వారికి బరేలీలోని బహేరికి రూటును చూపించింది. దీంతో ఆ విదేశీయులు ఇద్దరూ దారితప్పి బరేలీలోని చురైలి ఆనకట్టకు చేరుకున్నారు.

గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు విదేశీయులు  నిర్మానుష్య ప్రదేశంలో సైకిల్‌పై వెళ్లడాన్ని గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తరువాత గ్రామస్తులు ఆ విదేశీయులను ఆపి, వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు.అయితే వారు చెప్పేది గ్రామస్తులకు అర్థం కాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరు విదేశీయులను చురైలి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య సైతం ఆ ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులను విచారించి,వారిని నేపాల్‌కు సురక్షితంగా పంపించారు.

ఇది కూడా చదవండి: Mahakumbh: అద్భుతం.. అమోఘం.. డ్రోన్‌ షో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement