ముంబై: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన హెల్త్ కేర్ కంపెనీ గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సోమవారం(9న) ప్రారంభంకానుంది. షేరుకి రూ. 1,490-1,500 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. బుధవారం(11) ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 3.5 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూకి 13 షేర్లు ఒక లాట్ కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వారాంతాన షేరుకి రూ. 1,500 ధరలో యాంకర్ సంస్థలకు 1.29 కోట్లకుపైగా షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,944 కోట్లు సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ కంపెనీల జాబితాలో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, గోల్డ్ మన్ శాక్స్, సింగపూర్ ప్రభుత్వ సంస్థతోపాటు.. 18 దేశీ మ్యూచువల్ ఫండ్స్ చేరాయి.
చైనీస్ పేరెంట్..
ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది.
అతిపెద్ద ఇష్యూ
దేశీయంగా గ్లాండ్ ఫార్మా అతిపెద్ద ఫార్మా ఐపీవోగా ఆవిర్భవించనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఎరిస్ లైఫ్ సైన్సెస్(2017) రూ. 1,741 కోట్లను సమీకరించింది. 2015లో ఐపీవోకు వచ్చిన ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ రూ. 1,350 కోట్లు, 2016లో లిస్టయిన లారస్ ల్యాబ్స్ రూ. 1,350 కోట్లను సమకూర్చుకున్నాయి.
బ్యాక్ గ్రౌండ్
ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్‌ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment