చైనా ‘ఫోసున్‌’ చేతికి గ్లాండ్‌ ఫార్మా | hina's Fosun opts for stake cut to 74 % in Gland Pharma | Sakshi
Sakshi News home page

చైనా ‘ఫోసున్‌’ చేతికి గ్లాండ్‌ ఫార్మా

Published Tue, Sep 19 2017 12:34 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

చైనా ‘ఫోసున్‌’ చేతికి గ్లాండ్‌ ఫార్మా

చైనా ‘ఫోసున్‌’ చేతికి గ్లాండ్‌ ఫార్మా

హైదరాబాద్‌ కంపెనీలో 74 శాతం వాటా కొనుగోలుకు నిర్ణయం
► పాత ఒప్పందంలో మార్పు
► విలువ రూ.7,000 కోట్లు
► భారత్‌లో అతిపెద్ద చైనా ఎఫ్‌డీఐ!


న్యూఢిల్లీ: భారత్‌ ఫార్మా రంగంలోకి డ్రాగన్‌ దూకుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్‌ ఫార్మాను కొనుగోలు చేసేందుకు చైనా ఫార్మా దిగ్గజం షాంఘై ఫోసున్‌ తాజా డీల్‌కు ఓకే చెప్పింది. గ్లాండ్‌ ఫార్మాలో 74 శాతం మెజారిటీ వాటాను దక్కించుకోనున్నట్లు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో ఫోసున్‌ వెల్లడించింది. ఇందుకోసం గరిష్టంగా 1.09 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.7 వేల కోట్లు) చెల్లించనున్నామని తెలిపింది. ఒప్పందానికి ఇరు వర్గాలు అంగీకరించాయని.. ఈ మేరకు గత లావాదేవీ పత్రాల్లో మార్పులు చేసినట్లు హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌కు ఫోసున్‌ తెలియజేసింది. ఈ డీల్‌ పూర్తయితే భారత్‌ కంపెనీల్లో చైనా సంస్థ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడిగా నిలుస్తుంది.

కేంద్రం అభ్యంతరాలతో వాటా తగ్గింపు...
గ్లాండ్‌ ఫార్మాలో 86.08 శాతం వాటా కొనుగోలు చేసేందుకు షాంఘై ఫోసున్‌ ఫార్మాసూటికల్స్‌(గ్రూప్‌) గతేడాది జూలైలోనే ముందుకొచ్చింది. ఇందుకోసం గరిష్టంగా 1.26 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.8,000 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది కూడా. కొనుగోలుచేసే వాటాలో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ వాటాతోపాటు గ్లాండ్‌ ఫార్మా ప్రమోటర్స్‌ రవి పెన్మెత్స, ఆయన తండ్రి పీవీఎన్‌ రాజు వాటాలు కూడా ఉన్నాయి. అయితే, ఆ తర్వాత చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి ఉద్రిక్తతలు పెరిగిపోవడం ఇతరత్రా కారణాలతో కేంద్ర ప్రభుత్వం(ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ–సీసీఈఏ) ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపాదిత కొనుగోలు వాటాను 74%కి తగ్గించుకున్నామని ఫోసున్‌ ఫార్మా తాజాగా హాంకాంగ్‌ ఎక్సే్ఛంజ్‌కి వెల్లడించింది. ఈ డీల్‌లో అమెరికా మార్కెట్లో గ్లాండ్‌ ఫార్మా ప్రవేశపెట్టిన ఇనోక్సాపారిన్‌ ఇంజెక్షన్‌లకు సంబంధించి అదనపు చెల్లింపు మొత్తం(2.5 కోట్ల డాలర్లకు మించకుండా) కలిపి ఉన్నట్లు వివరించింది. అయితే, అంతక్రితం దీనికి 5 కోట్ల డాలర్లకు మించకుండా చెల్లించేందుకు ఫోసున్‌ ముందుకొచ్చింది. దీంతో పోలిస్తే ఇప్పుడు ఆఫర్‌ చేసిన మొత్తం సగానికి తగ్గిపోవడం గమనార్హం. ఈ డీల్‌కు చైనా ప్రభుత్వ యంత్రాంగాల నుంచి తగిన అనుమతులు లభించాయని.. అమెరికా, భారత్‌కు చెందిన నియంత్రణ పరమైన అనుమతులు కూడా పూర్తయ్యాయని ఫోసున్‌ తెలిపింది.  

డైరెక్ట్‌ రూట్‌...
ఫార్మా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ) సంబంధించి  కొత్త నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలు భారతీయ కంపెనీల్లో 74 శాతం వరకూ వాటాలను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా నేరుగా చేజిక్కించుకోవడానికి వీలుంది. ప్రతిపాదిత కొనుగోలు వాటాను 74 శాతానికి తగ్గించుకుంటూ లావాదేవీ పత్రాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఇకపై ఈ డీల్‌కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం(ఎఫ్‌ఐపీబీ), సీసీఈఏ అనుమతులు అవసం లేదని ఫోసున్‌ ఫార్మా పేర్కొంది. గ్లాండ్‌ ఫార్మా నిర్వహణ కార్యకలాపాలు చాలా మెరుగైన రీతిలో ఉన్నాయని తెలిపింది.

బోర్డులోనే ప్రమోటర్లు...: తాజా డీల్‌తో... కంపెనీలో ప్రమోటర్లు రవి పెన్మెత్స, పీవీఎన్‌ రాజుల వాటా గతంతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. వీరిద్దరూ డైరెక్టర్ల బోర్డులో కొనసాగుతారని గ్లాండ్‌ ఫార్మా ప్రతినిధి వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుత యాజమాన్య బృందమే కంపెనీ రోజువారీ వ్యవహారాలను చూసుకుంటుందని ఆయన తెలిపారు. ‘ఈ డీల్‌తో ఇరు కంపెనీలు తమ సామర్థ్యాలను ఇచ్చిపుచ్చుకోవడానికి దోహదం చేయనుంది. ఫోసున్‌ అభివృద్ధి చేస్తున్న బయో–సిమిలర్‌ ప్రోగ్రామ్, ఇతరత్రా ఉత్పత్తులను గ్లాండ్‌ ఫార్మా తయారు చేసేందుకు వీలవుతుంది. భారతీయ మార్కెట్లో వీటిని ప్రవేశపెట్టొచ్చు. ఇంకా ఫోసున్‌ ఫార్మాకు ఇప్పుడున్న మార్కెట్లలో గ్లాండ్‌ ఫార్మా తన ఉత్పత్తులను విక్రయిచేందుకు కొత్త అవకాశాలు దక్కుతాయి’ అని పేర్కొన్నారు.

ఫోసున్‌ సంగతిదీ...
► చైనా హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో అతిపెద్ద గ్రూప్‌లలో ఒకటిగా షాంఘై ఫోసున్‌ నిలుస్తోంది.
► 1994లో ఇది ఆవిర్భవించింది. సబ్సిడరీలతో కలిపి జెనెటిక్‌ ఔషధాలు, చైనా సాంప్రదాయ ఔషధాలు, డయాగ్నోస్టిక్‌ ఉత్పత్తులు, మెడికల్‌ పరికరాల తయారీతో పాటు టెక్నాలజీ సేవలు, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్‌ వంటి సేవలను కూడా అందిస్తోంది. అదేవిధంగా ఎగుమతి–దిగుమతుల వాణిజ్యంలోనూ పెట్టుబడులు పెడుతోంది.
►  కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు 12 బిలియన్‌ డాలర్లు.

గ్లాండ్‌ ఫార్మా...
► 1978లో హైదరాబాద్‌ కేంద్రంగా పీవీఎన్‌ రాజు దీన్ని నెలకొల్పారు.  వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్నారు.
►  ఇక పీవీఎన్‌ రాజు తనయుడు డాక్టర్‌ రవి పెన్మెత్స కంపెనీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా 1999 నుంచి కొనసాగుతున్నారు.
► జెనరిక్‌ ఇంజెక్టబుల్స్‌ను తయారుచేస్తోంది.
►  ఐదు ఖండాల్లో దాదాపు 90 దేశాల్లో కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.
►  ఫార్మాసూటికల్‌ లిక్విడ్‌ ఇంజెక్టబుల్‌ ఉత్పత్తులకు సంబంధించి 2003లో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ ఎఫ్‌డీఏ) అనుమతి పొందింది. తద్వారా ఈ విభాగంలో యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది.
►  ఇంకా కంపెనీ తయారీ యూనిట్లకు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక కీలక దేశాల నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement