1.26 బిలియన్ డాలర్ల డీల్
గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్‌కు 86% వాటా
బోర్డులోనే వ్యవస్థాపకులు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను 1.26 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,500 కోట్లు) కొనుగోలు చేసేందుకు చైనా కంపెనీ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ అంగీకరించింది. ఈ డీల్ కింద ఫోసన్ ఫార్మా 86 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లాండ్ ఫార్మాలో సంస్థ వ్యవస్థాపకులు, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్‌కు కలిపి మొత్తం 96% వాటాలు ఉన్నాయి. 2014లో ఇన్వెస్ట్ చేసిన కేకేఆర్ .. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుండగా.. ప్రమోటర్లు సింహభాగం వాటాలు విక్రయిస్తున్నారు. ఒక భారతీయ కంపెనీని చైనా సంస్థ ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ఇదే ప్రథమం కానుంది.
ఒప్పందం ప్రకారం మిగతా షేర్‌హోల్డర్ల వాటాలతో పాటు కేకేఆర్ ఫ్లోర్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి చెందిన అన్ని షేర్లను ఫోసన్ ఫార్మా కొనుగోలు చేస్తుంది. డీల్ అనంతరం కూడా వ్యవస్థాపక కుటుంబానికి సంస్థలో వాటాలు ఉంటాయి. గ్లాండ్ ఫార్మా వ్యవస్థాపకుడు పీవీఎన్ రాజు, ఆయన కుమారుడు రవి పెన్మెత్స బోర్డులో కొనసాగుతారు. కంపెనీ ఎండీ, సీఈవోగా పెన్మెత్స కొనసాగుతారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి డీల్ ఉంటుందని గ్లాండ్ ఫార్మా వివరించింది. ఒప్పందానికి సంబంధించి సింప్సన్ థాచర్ అండ్ బార్ట్‌లెట్, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థలు న్యాయసలహాలపరమైన సేవలు అందించగా, జెఫ్రీస్ సంస్థ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది.
ఫోసన్‌ను ఎంచుకున్న కారణమేంటంటే..
కేకేఆర్ సహాయంతో వాటాల విక్రయానికి పలు సంస్థలను పరిశీలించి, చివరికి ఫోసన్‌ను ఎంపిక చేసుకోవడం జరిగిందని పెన్మెత్స తెలిపారు. ఫోసన్‌కు పుష్కలమైన వనరులు, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు ఉండటం ఇందుకు కారణమని వివరించారు. అమెరికా, చైనాలోనూ కంపెనీకి పలు ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, తయారీ ప్లాంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను మరింతగా పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఫోసన్ ఫార్మా చైర్మన్ చెన్ కియు తెలిపారు. ప్రధానమైన అమెరికా మార్కెట్లో 2019 నాటికి దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇంజెక్టబుల్స్ పేటెంట్ల కాల వ్యవధి తీరిపోనున్న నేపథ్యంలో ఈ విభాగంలోని భారత సంస్థలకు పుష్కలంగా వ్యాపారావకాశాలు ఉన్నాయని పరిశీ లకులు భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో అమెరికా ఇంజెక్టబుల్స్ మార్కెట్ ఏటా 10% వృద్ధి చెందనుందని అంచనా.
గ్లాండ్-ఫోసన్‌ల కథ ఇదీ..
గ్లాండ్‌ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా భారత్, అమెరికా మార్కెట్లతో పాటు 90 దేశాలకు జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు అందిస్తోంది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్‌లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. సుమారు రెండేళ్ల క్రితం కేకేఆర్ దాదాపు 200 మిలియన్ డాలర్లతో గ్లాండ్ ఫార్మాలో వాటాలు కొనుగోలు చేశారు. దీన్ని బట్టి అప్పట్లో సంస్థ విలువ సుమారు 600-650 మిలియన్ డాలర్లు. మరోవైపు, చెనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్‌కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. ఇది కార్డియోవాస్కులర్ ఔషధాల నుంచి వ్యాధి నిర్ధారణ పరికరాల దాకా వివిధ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు.