Shanghai Pharmaceutical phosan
-
1.26 బిలియన్ డాలర్ల డీల్
గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్‌కు 86% వాటా బోర్డులోనే వ్యవస్థాపకులు.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను 1.26 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,500 కోట్లు) కొనుగోలు చేసేందుకు చైనా కంపెనీ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ అంగీకరించింది. ఈ డీల్ కింద ఫోసన్ ఫార్మా 86 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లాండ్ ఫార్మాలో సంస్థ వ్యవస్థాపకులు, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్‌కు కలిపి మొత్తం 96% వాటాలు ఉన్నాయి. 2014లో ఇన్వెస్ట్ చేసిన కేకేఆర్ .. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుండగా.. ప్రమోటర్లు సింహభాగం వాటాలు విక్రయిస్తున్నారు. ఒక భారతీయ కంపెనీని చైనా సంస్థ ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ఇదే ప్రథమం కానుంది. ఒప్పందం ప్రకారం మిగతా షేర్‌హోల్డర్ల వాటాలతో పాటు కేకేఆర్ ఫ్లోర్లైన్ ఇన్వెస్ట్మెంట్స్కి చెందిన అన్ని షేర్లను ఫోసన్ ఫార్మా కొనుగోలు చేస్తుంది. డీల్ అనంతరం కూడా వ్యవస్థాపక కుటుంబానికి సంస్థలో వాటాలు ఉంటాయి. గ్లాండ్ ఫార్మా వ్యవస్థాపకుడు పీవీఎన్ రాజు, ఆయన కుమారుడు రవి పెన్మెత్స బోర్డులో కొనసాగుతారు. కంపెనీ ఎండీ, సీఈవోగా పెన్మెత్స కొనసాగుతారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి డీల్ ఉంటుందని గ్లాండ్ ఫార్మా వివరించింది. ఒప్పందానికి సంబంధించి సింప్సన్ థాచర్ అండ్ బార్ట్లెట్, సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థలు న్యాయసలహాలపరమైన సేవలు అందించగా, జెఫ్రీస్ సంస్థ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. ఫోసన్ను ఎంచుకున్న కారణమేంటంటే.. కేకేఆర్ సహాయంతో వాటాల విక్రయానికి పలు సంస్థలను పరిశీలించి, చివరికి ఫోసన్ను ఎంపిక చేసుకోవడం జరిగిందని పెన్మెత్స తెలిపారు. ఫోసన్‌కు పుష్కలమైన వనరులు, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు ఉండటం ఇందుకు కారణమని వివరించారు. అమెరికా, చైనాలోనూ కంపెనీకి పలు ఆర్అండ్డీ కేంద్రాలు, తయారీ ప్లాంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను మరింతగా పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఫోసన్ ఫార్మా చైర్మన్ చెన్ కియు తెలిపారు. ప్రధానమైన అమెరికా మార్కెట్లో 2019 నాటికి దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువ చేసే ఇంజెక్టబుల్స్ పేటెంట్ల కాల వ్యవధి తీరిపోనున్న నేపథ్యంలో ఈ విభాగంలోని భారత సంస్థలకు పుష్కలంగా వ్యాపారావకాశాలు ఉన్నాయని పరిశీ లకులు భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో అమెరికా ఇంజెక్టబుల్స్ మార్కెట్ ఏటా 10% వృద్ధి చెందనుందని అంచనా. గ్లాండ్-ఫోసన్ల కథ ఇదీ.. గ్లాండ్ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా భారత్, అమెరికా మార్కెట్లతో పాటు 90 దేశాలకు జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు అందిస్తోంది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్‌లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. సుమారు రెండేళ్ల క్రితం కేకేఆర్ దాదాపు 200 మిలియన్ డాలర్లతో గ్లాండ్ ఫార్మాలో వాటాలు కొనుగోలు చేశారు. దీన్ని బట్టి అప్పట్లో సంస్థ విలువ సుమారు 600-650 మిలియన్ డాలర్లు. మరోవైపు, చెనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. ఇది కార్డియోవాస్కులర్ ఔషధాల నుంచి వ్యాధి నిర్ధారణ పరికరాల దాకా వివిధ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు. -
చైనా ఫోసన్ చేతికి.. గ్లాండ్ ఫార్మా!
♦ 96% వాటాల కొనుగోలు...? ♦ డీల్ విలువ రూ.9,500 కోట్లుగా అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీ ఫార్మా రంగంలో భారీ డీల్‌కు తెరతీస్తూ.. హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను చైనా సంస్థ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,500 కోట్లు) వెచ్చించనున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల ప్రకారం.. వ్యవస్థాపకుల వాటాలు సహా ఫోసన్ సుమారు 96 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. వాటాల కొనుగోలుకు సంబంధించి గ్లాండ్ ఫార్మాకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఈ ఏడాది మే లోనే షాంఘై ఫోసన్ ఫార్మా వెల్లడించింది. గ్లాండ్ ఫార్మాను దక్కించుకునేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్, బాక్స్టర్, టోరెంట్ ఫార్మా తదితర సంస్థలు కూడా పోటీపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. డీల్ పూర్తయితే ఒక దేశీ కంపెనీ పూర్తిగా చైనా సంస్థ అజమాయిషీలోకి వెళ్లనున్నందున దీన్ని నియంత్రణ సంస్థలు నిశితంగా పరిశీలించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2014 నాటి గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయంగా ఇంజెక్టబుల్స్ మార్కెట్ 300 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. ఇందులో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 35 శాతం పైచిలుకు ఉంది. భారత మార్కెట్ విలువ 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. గ్లాండ్ ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా అమెరికా తదితర మార్కెట్ల కోసం జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు తయారు చేస్తోంది. కంపెనీకి చెందిన ప్లాంట్లకు అమెరికా, బ్రిటన్ ఔషధ రంగ నియంత్రణ సంస్థల అనుమతులు కూడా ఉన్నాయి. ఫార్మా లిక్విడ్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన తొలి దేశీ కంపెనీగా గ్లాండ్ ఫార్మా గుర్తింపు పొందింది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్‌లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రెండు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో సుమారు 250 మంది పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లో మైలాన్, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థలకు ఇంజెక్టబుల్స్‌ను గ్లాండ్ ఫార్మా అందిస్తోంది. 2013లో ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ ఫండ్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్.. దాదాపు 200 మిలియన్ డాలర్లకు గ్లాండ్ ఫార్మాలో కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. దీని ప్రకారం అప్పట్లో గ్లాండ్ ఫార్మా విలువ 600-650 మిలియన్ డాలర్లు. గ్లాండ్ ఫార్మాలో ప్రమోటర్ రవి పెన్మెత్స కుటుంబం, కేకేఆర్‌లకు 96 శాతం మేర వాటాలు ఉన్నాయి. 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గ్లాండ్ ఫార్మా ఆదాయాలు రూ. 994 కోట్ల మేర ఉండగా లాభం సుమారు రూ. 209 కోట్లుగా నమోదైంది. ఫోసన్ గ్రూప్... చైనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు. గతేడాది కంపెనీ ఆదాయాలు సుమారు 1.9 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఉన్న ఫోసన్ గ్రూప్ ఇటీవలి రెండేళ్ల కాలంలో వివిధ అంతర్జాతీయ డీల్స్‌పై బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. భారత్‌లో సూలా వైన్యార్డ్స్, స్పైస్‌జెట్ వంటి సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరిపింది. గ్లాండ్ ఫార్మా డీల్‌తో రీసెర్చ్, తయారీ సామర్ధ్యాలను భారత్‌లో విస్తరించుకునేందుకు ఫోసన్‌కు తోడ్పడనుంది.