చైనా ఫోసన్ చేతికి.. గ్లాండ్ ఫార్మా!
♦ 96% వాటాల కొనుగోలు...?
♦ డీల్ విలువ రూ.9,500 కోట్లుగా అంచనా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీ ఫార్మా రంగంలో భారీ డీల్‌కు తెరతీస్తూ.. హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను చైనా సంస్థ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,500 కోట్లు) వెచ్చించనున్నట్లు సమాచారం. సంబంధిత వర్గాల ప్రకారం.. వ్యవస్థాపకుల వాటాలు సహా ఫోసన్ సుమారు 96 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. వాటాల కొనుగోలుకు సంబంధించి గ్లాండ్ ఫార్మాకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు ఈ ఏడాది మే లోనే షాంఘై ఫోసన్ ఫార్మా వెల్లడించింది.
గ్లాండ్ ఫార్మాను దక్కించుకునేందుకు అడ్వెంట్ ఇంటర్నేషనల్, బాక్స్‌టర్, టోరెంట్ ఫార్మా తదితర సంస్థలు కూడా పోటీపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. డీల్ పూర్తయితే ఒక దేశీ కంపెనీ పూర్తిగా చైనా సంస్థ అజమాయిషీలోకి వెళ్లనున్నందున దీన్ని నియంత్రణ సంస్థలు నిశితంగా పరిశీలించవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2014 నాటి గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయంగా ఇంజెక్టబుల్స్ మార్కెట్ 300 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా. ఇందులో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 35 శాతం పైచిలుకు ఉంది. భారత మార్కెట్ విలువ 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని అంచనా.
గ్లాండ్ ఫార్మాను 1978లో పీవీఎన్ రాజు ప్రారంభించారు. ఇది ప్రధానంగా అమెరికా తదితర మార్కెట్ల కోసం జనరిక్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులు తయారు చేస్తోంది. కంపెనీకి చెందిన ప్లాంట్లకు అమెరికా, బ్రిటన్ ఔషధ రంగ నియంత్రణ సంస్థల అనుమతులు కూడా ఉన్నాయి. ఫార్మా లిక్విడ్ ఇంజెక్టబుల్స్ ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన తొలి దేశీ కంపెనీగా గ్లాండ్ ఫార్మా గుర్తింపు పొందింది. సంస్థకు హైదరాబాద్, వైజాగ్‌లలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రెండు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో సుమారు 250 మంది పైగా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.
దేశ విదేశాల్లో మైలాన్, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థలకు ఇంజెక్టబుల్స్‌ను గ్లాండ్ ఫార్మా అందిస్తోంది. 2013లో ఎవాల్వెన్స్ ఇండియా లైఫ్ సెన్సైస్ ఫండ్ నుంచి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్.. దాదాపు 200 మిలియన్ డాలర్లకు గ్లాండ్ ఫార్మాలో కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. దీని ప్రకారం అప్పట్లో గ్లాండ్ ఫార్మా విలువ 600-650 మిలియన్ డాలర్లు. గ్లాండ్ ఫార్మాలో ప్రమోటర్ రవి పెన్మెత్స కుటుంబం, కేకేఆర్‌లకు 96 శాతం మేర వాటాలు ఉన్నాయి. 2015తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో గ్లాండ్ ఫార్మా ఆదాయాలు రూ. 994 కోట్ల మేర ఉండగా లాభం సుమారు రూ. 209 కోట్లుగా నమోదైంది.
ఫోసన్ గ్రూప్...
చైనా కోటీశ్వరుడు గువో గ్వాంచాంగ్‌కి చెందిన ఫోసన్ ఇంటర్నేషనల్ గ్రూప్‌లో షాంఘై ఫోసన్ ఫార్మా భాగంగా ఉంది. దీని మార్కెట్ విలువ సుమారు 8.3 బిలియన్ డాలర్లు. గతేడాది కంపెనీ ఆదాయాలు సుమారు 1.9 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఉన్న ఫోసన్ గ్రూప్ ఇటీవలి రెండేళ్ల కాలంలో వివిధ అంతర్జాతీయ డీల్స్‌పై బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించింది. భారత్‌లో సూలా వైన్‌యార్డ్స్, స్పైస్‌జెట్ వంటి సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరిపింది. గ్లాండ్ ఫార్మా డీల్‌తో రీసెర్చ్, తయారీ సామర్ధ్యాలను భారత్‌లో విస్తరించుకునేందుకు ఫోసన్‌కు తోడ్పడనుంది.