
చైనా పెట్టుబడుల నిషేధంలో మార్పులేదు
దేశీ వినియోగమే రక్ష
సీఈఏ అనంత నాగేశ్వరన్
ముంబై: డిజిటైజేషన్ అంటే నియంత్రణల తొలగింపు అన్న తప్పుడు అభిప్రాయం అధికార యంత్రాంగంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్(Ananth Nageswaran) అన్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల (ఏఐ) పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక తప్పుడు అభిప్రాయం నెలకొంది. వారు ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఉంచారంటే, దాన్ని నియంత్రణ తొలగింపుగా భావిస్తున్నారు. కానీ అది నియంత్రణల తొలగింపు కాదు. ఆఫ్‌లైన్ బదులు ఆన్‌లైన్‌లో ఉంచారంతే. అభివృద్ధి చెందాలనుకునే ఏ దేశమైనా చిన్న వ్యాపారాలపై దృష్టి సారించాలి. నియంత్రణల వంటి సవాళ్లను తొలగించాలి. దాంతో నిబంధనల అమలుపై వనరులు వృధా కాబోవు’’అని స్పష్టం చేశారు.
ప్రపంచీకరణ స్థానంలో కొత్త నమూనా
రానున్న రోజుల్లో భారత్ దేశీ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడం ద్వారానే మరింత వృద్ధి సాధించగలదన్నారు నాగేశ్వరన్. గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) గతంలో మాదిరిగా ప్రయోజనాలను అందించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీ గ్లోబలైజేషన్ (దేశాల మధ్య అనుసంధానం తగ్గిపోవడం) ధోరణి వంద సంవత్సరాలకు పైగా చూస్తున్నదేనంటూ.. ప్రస్తుత నమూనాలో పరిమితుల దృష్ట్యా కొత్త ధోరణి అవతరించొచ్చన్నారు.
రూపాయి ఏటా 3 శాతం క్షీణత
ద్రవ్యోల్బణాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న 4–5 శాతం శ్రేణి నుంచి 3–4 శాతం శ్రేణికి పరిమితం చేస్తే రూపాయి విలువ క్షీణతను అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఏటా 3 శాతం క్షీణించొచ్చని (డాలర్‌తో పోల్చితే) చెప్పారు. ఇంధన భద్రత విషయంలో భారత్ రాజీపడకూడదన్నారు.
చైనా పాలసీపై సమీక్ష లేదు..
చైనా పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాన్ని సమీప కాలంలో భారత్ సమీక్షించకపోవచ్చని నాగేశ్వరన్ అన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాల ప్రాముఖ్యతను గుర్తించినట్టు చెప్పారు. వాణిజ్య అసమానతలపై రెండు దేశాలు సంప్రదింపులు నిర్వహిస్తున్నాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment