మీడియాకు స్కాం వివరాలను వెల్లడిస్తున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా వివిధ దేశాల వారి నుంచి లక్షలు, కోట్లు కాజేయడం.. ఆ సొమ్మును నకిలీ కంపెనీల్లోకి మళ్లించడం.. తర్వాత ప్రత్యేకంగా పెట్టిన ‘మనీ చేంజర్’సంస్థలకు చేర్చడం.. అక్కడి నుంచి హవాలా మార్గంలో దుబాయ్ మీదుగా చైనాకు చేర్చడం.. కాంబోడియా కేంద్రంగా జరుగుతున్న చైనీయులు నడుపుతున్న ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్’ఇది. ఇందులో కేవలం రెండు కంపెనీల పేరిట ఏకంగా రూ.903 కోట్లను దేశం దాటించినట్టు రాష్ట్ర పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారంలో మన దేశానికి చెందినవారి బ్యాంకు ఖాతాలను వినియోగించుకున్నట్టు తేల్చారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో రూ.1.6 లక్షలు కోల్పోయిన హైదరాబాద్ తార్నాకకు చెందిన బాధితుడి ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ దందా గుట్టు రట్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు.
చైనీయులు సూత్రధారులుగా..
చైనాకు చెందిన వాన్ జువాన్, పే (మహిళ) ఆ దేశంలో జిన్‌పింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పేరిట జనాన్ని ఆకర్షించి, డబ్బు కాజేయాలని పథకం పన్నారు. మూడేళ్లుగా చైనా నుంచి వచ్చి వెళ్తూ ఢిల్లీలో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది నుంచి అసలు పని మొదలుపెట్టారు. నెట్‌వర్క్ బాధ్యతను చైనాకు చెందిన లీ, తైవాన్‌కు చెందిన చూ చున్ యోలకు అప్పగించారు. ఢిల్లీ కరోల్‌బాగ్‌లో ఎలక్ట్రానిక్స్ దుకాణం నిర్వహించే లీ, ముంబైలో అడ్డావేసిన చున్ కలిసి.. దుబాయ్‌లో ఉండే వరుణ్ అరోరా, భూపేష్ ఆరోరా, ఢిల్లీకి చెందిన సాహిల్, సన్నీ, నవనీత్ కౌశిక్‌లను తమతో చేర్చుకున్నారు. నవనీత్ కౌశిక్ ద్వారా రెండు ఆథరైజ్డ్ మనీ చేంజర్ (ఏఎంసీ)లు ‘రంజన్ మనీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్’లను ఏర్పాటు చేయించారు.
ఈ ముఠా దేశవ్యాప్తంగా వివిధ మెట్రో నగరాలకు చెందిన దళారుల ద్వారా తప్పుడు చిరునామాలు, వివరాలతో వర్చువల్ ఖాతాలు తెరిపించింది. సాధారణ ఖాతాలు అందించిన వారికి ఒక్కో ఖాతాకు రూ.1.2 లక్షల చొప్పున, వర్చువల్ ఖాతాలు ఇచ్చిన వారికి 0.2 శాతం కమీషన్ చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దుబాయ్‌లో ఉండే నవీద్ అనే వ్యక్తి ద్వారా.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీమ్ బేగ్, మహ్మద్ పర్వేజ్ ఈ ముఠాకు పరిచయమయ్యారు. తమ పేరిట రెండేసి వర్చువల్ ఖాతాలు తెరిచి అందించారు. కొన్నాళ్లు చైనాలో ఉండి వచ్చిన ఢిల్లీ వాసులు సంజయ్ యాదవ్, వీరేంద్ర రాథోడ్ కూడా పలు ఖాతాలను సమకూర్చారు.
ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి..
చైనీయుడైన జాక్ సూచనల మేరకు పుణెకు చెందిన వీరేంద్రసింగ్ ఈ ముఠాలో చేరి.. జిందాల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశాడు. తమ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభం వస్తుందని సాధారణ ప్రజలకు గాలం వేసి.. వారి నుంచి తస్కరించిన సొమ్మును తొలుత జిందాల్ టెక్నాలజీస్ ఖాతాలోకి తరలించారు. అక్కడి నుంచి వర్చువల్ ఖాతాల్లోకి మార్చి.. సాధారణ బ్యాంకు ఖాతాల్లోకి చేర్చుతున్నారు. ఈ ఖాతాల నుంచి రంజన్ మనీకార్ప్, కేడీఎస్ ఫోరెన్స్ సంస్థల్లోకి తరలించి డాలర్లుగా మార్చుతున్నారు. తర్వాత ఆ మొత్తాన్ని సాహిల్ హవాలా రూపంలో దుబాయ్‌కు పంపిస్తున్నాడు. అక్కడి చైనాకు తరలిస్తున్నారు.
రంజన్, కేడీఎస్ సంస్థలకు ఉన్నది ఇద్దరే క్లయింట్లు అయినా.. రంజన్ సంస్థ ఏడు నెలల్లో రూ.441 కోట్ల లావాదేవీలు, కేడీఆర్ సంస్థ 32 రోజుల్లోనే రూ.462 కోట్ల లావాదేవీలు జరపడం గమనార్హం. ఈ మొత్తం రూ.903 కోట్లు హవాలా రూపంలో దేశం దాటేశాయి. ఆర్థిక లావాదేవీలు భారత్ కేంద్రంగా జరిగినా.. ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్’కాంబోడియా కేంద్రంగా జరుగుతున్నట్టు అంచనా వేశారు. లీ అనేకసార్లు కాంబోడియాకు వెళ్లి రావడం, ముంబై నుంచి సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలను కొరియర్ ద్వారా అక్కడికి పంపడం జరిగినట్టు గుర్తించారు.
ఒకరొకరిగా పట్టుకుని..
తార్నాక బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పుణెకు చెందిన వీరేంద్ర సింగ్‌ను పట్టుకున్నారు. తీగ లాగుతూ సాహిల్, సన్ని, సంజయ్, నవ్‌నీత్, పర్వేజ్, సుల్తాన్, మీర్జాల, చుగ్‌లను పట్టుకున్నారు. చైనాకు చెందిన లీ ఢిల్లీలో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.91 కోట్లను ఫ్రీజ్ చేశారు.
రూ.50వేల కోట్లపైనే స్కామ్
సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినది కేవలం ఒక గ్యాంగ్‌ను మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉండవచ్చనే సమాచారం ఉంది. అవన్నీ కలిసి దేశవ్యాప్తంగా దాదాపు రూ.50వేల కోట్ల వరకు స్కామ్ చేసి దేశం దాటించి ఉండొచ్చని అంచనా. ఈ స్కామ్ వివరాలను ఈడీ, డీఆర్‌ఐ తదితర సంస్థలకు అందించి అప్రమత్తం చేస్తాం. సంస్థాగత లోపాలపై ఆర్‌బీఐకి లేఖ రాస్తాం. ఇలాంటి కుంభకోణాన్ని ఛేదించడం, విదేశీయులను అరెస్టు చేయడం దేశంలో ఇదే తొలిసారి. వర్చువల్ ఖాతాలు పెను ముప్పుగా మారుతున్నాయి.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment