సాక్షి, హైదరాబాద్: చైనాలో కూర్చున్న సూత్రధారులు కథ నడుపుతున్నారు... దుబాయ్‌లో ఉంటున్న పాత్రధారులు వీరి ఆదేశాలు పాటిస్తున్నారు. గుజరాత్‌లో నివసించే సహాయకులు ముందుండి పని చేస్తున్నారు. ఈ పంథాలో సాగిన రూ.712 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించడం ద్వారా హైదరాబాదీయులు కీలకపాత్ర పోషించారు.
ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంతోపాటు ముంబై, అహ్మదాబాద్‌లకు చెందిన 9 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి ఆయన శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
టాస్క్‌లకు రూపమిచ్చేది చైనాలో..
ఈ ఫ్రాడ్‌లో కథ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వచ్చే ప్రకటనలతో మొదలవుతుంది. దీనికి ఆకర్షితులై స్పందించిన వారికి లింకులు పంపడం ద్వారా ఆ రెండు యాప్స్‌లోని గ్రూపుల్లో చేరుస్తారు. ముందు తమ వద్ద ఇన్వెస్ట్ చేసి, తాము పంపే టాస్క్‌లు పూర్తి చేసి లాభాలు పొందాలని. ఆ తర్వాత ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తారు. వాళ్లు పంపే లింకులకు లైక్స్ కొట్టడం, నిర్ణీత విధానంలో షేర్ చేయడం వంటి తేలికపాటి టాస్క్‌లే ఉంటాయి. సూత్రధారులుగా ఉన్న చైనీయులు లీ లూ గువాంఘెజు, నాన్ ఏ, కివిన్ జున్ ఆ దేశంలోనే ఉండి ఆకర్షణీయమైన టాస్క్‌లు రూపొందిస్తున్నారు.
చిన్న లాభాలు ఇస్తూ ఉచ్చులోకి...
ఇందులో పెట్టుబడి రూ.5 వేల నుంచి మొదలవుతుంది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను బాధితులు డౌన్‌లోడ్ చేసుకుంటారు. రూ.5 వేలకు రూ.వెయ్యి, రూ.10 వేలకు రూ.2 వేలు,రూ.15 వేలకు రూ.3వేల చొప్పున లాభం ఇస్తారు. అలా క్రమంగా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు.
ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ఆస్కారం లేకుండా మరికొంత పెడితేనే కుదురుతుందని చెబుతారు. ఇలా ఒక్కో బాధితుడితో రూ.లక్షల్లో పెట్టించిన తర్వాత ఆ యాప్ పని చేయడం మానేస్తుంది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల నుంచి వీరిని తొలగించేసి బ్లాక్ చేసేస్తారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రూ.712 కోట్లు ఇన్వెస్ట్ చేసి నిండా మునిగిపోయారు.
రెండు యాప్‌ల ద్వారా దుబాయ్ నుంచి..
చైనీయుల ఏజెంట్లు అనిస్, ఆరిఫ్, శైలేష్, పీయూష్, ఖాన్, శెల్లీ దుబాయ్‌లో ఉంటున్నారు. అహ్మదాబాద్‌లో ఉన్న ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి వీరితోపాటు చైనీయులతో టచ్‌లో ఉంటున్నారు. వాళ్లకు కావాల్సిన షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, నగదును క్రిప్టోకరెన్సీగా మార్చడం వీరి విధి. ఇలా చేసినందుకు ఈ ద్వయానికి 3 శాతం కమీషన్ వస్తోంది.
లక్నోకు చెందిన వికాస్, మనీష్, రాకేష్ తదితరులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని షెల్ కంపెనీలు, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఖాతాల వివరాలను ప్రజాపతి ద్వయం దుబాయ్‌లోని వారికి పంపుతుంది. వీటికి లింకైన సిమ్‌కార్డులతో కూడిన ఫోన్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు. వీరితోపాటు దుబాయ్‌లో ఉన్న వాళ్లు ఆ ఫోన్లలో కూల్‌టెక్, ఎయిర్‌డ్రాయిడ్ అనే యాప్స్ వేసుకుంటున్నారు. వీటి ద్వారా ఇక్కడి ఫోన్లకు వచ్చిన ఓటీపీలను దుబాయ్‌లోని వాళ్లు చూడగలుగుతున్నారు.
క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు...
బాధితుల నుంచి కాజేసిన మొత్తాన్ని దుబాయ్‌లోని పాత్రధారులు అమెరికన్ డాలర్లతో సమానమైన క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. వీరికి ఒక్కో డాలర్‌కు రూ.10 కమీషన్‌గా వస్తోంది. వీళ్లు చైనాలోని సూత్రధారులకు వాలెట్స్ ద్వారా డబ్బు పంపేస్తున్నారు. ప్రజాపతులు వాడిన మూడు వాలెట్స్‌లో హిబ్బుల్ వాలెట్ కూడా ఉంది. దీని ద్వారా ఉగ్రవాదులకు నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి.
ప్రజాపతి ద్వయానికి రావాల్సిన కమీషన్‌ను దుబాయ్‌లోని కేటుగాళ్లు ముంబైకి చెందిన ఏజెంట్లు గగన్, గుడ్డు, నయీమ్ ద్వారా హవాలా రూపంలో పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మునావర్ మహ్మద్, ఆరుల్ దేవ్, సమీర్ ఖాన్, ఎస్.సుమేథ్ కూడా ఉన్నారు.
ఈ భారీ మోసాన్ని ఛేదించిన పోలీసులు ఈ నలుగురితోపాటు ప్రజాపతి ద్వయం, గన్, గుడ్డు, నయీమ్‌లను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10,53,89,943లను ఫ్రీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment