
అత్యంత మోసపూరితమైన ఆర్థిక నేరాల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ (investment fraud) కూడా ఒకటి. టెక్నాలజీతో పాటు స్కాములు కూడా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి సైకలాజికల్ మోసాల బారిన పడకుండా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (NPCI) ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోంది.
ఆర్థిక నిపుణుల ముసుగులో, పేరొందిన సంస్థల పేరిట ఎండార్స్‌మెంట్స్‌తోనూ, కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫేక్ వీడియోలను ఉపయోగించి మోసగాళ్లు అమాయకులకు వల వేస్తారు. అసాధారణమైన రాబడులొస్తాయని, విశిష్టమైన పెట్టుబడి అవకాశాలని, పరిమిత కాలం పాటే ఉండే డీల్స్ అంటూ కనీసం ఆలోచించుకోనివ్వకుండా ఇన్వెస్ట్ చేసేలా ప్రేరేపిస్తారు. ఇక ఇన్వెస్ట్ చేసిన వెంటనే మోసగాళ్లు ఠక్కున మాయమైపోతారు లేదా తాము మోసపోతున్నాననే విషయాన్ని బాధితులు గ్రహించే వరకు వారి నుంచి డబ్బు లాగుతూనే ఉంటారు.
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో రకాలు
ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలు, యాప్‌లు: స్కామర్లు అచ్చం చట్టబద్ధమైన బ్రోకర్లు, ఫండ్ హౌస్‌లు లేదా ఎక్స్చేంజీలవిగా అనిపించే బోగస్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లను తయారు చేస్తారు. ఫేక్ స్క్రీన్‌లపై వర్చువల్ లాభాలను చూపించడం ద్వారా డబ్బు డిపాజిట్ చేసేలా తొలుత యూజర్లను వలలోకి లాగుతారు. యూజర్లు గణనీయమైన మొత్తాలను ఇన్వెస్ట్ చేశాక, వారు ఆ నిధులను విత్‌డ్రా చేసుకోకుండా అడ్డుపడతారు.
డిస్కౌంట్ ధరల్లో షేర్లు: ఎవరికీ అంతగా తెలియని, అతి తక్కువ వాల్యూమ్స్‌తో ట్రేడయ్యే షేర్లను మోసగాళ్లు ప్రమోట్ చేస్తారు. ముందుగా అతి కొద్ది మంది క్లయింట్లకు మాత్రమే, భారీగా డిస్కౌంట్ రేట్లకు అవి లభిస్తాయని నమ్మబలుకుతారు. దురుద్దేశపూరితంగా, ఎక్స్చేంజ్ లేదా బ్రోకింగ్ హౌస్‌లకు కాకుండా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి నిధులను బదిలీ చేయాలంటూ ఇన్వెస్టర్లను కోరతారు. షేర్ల ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు గడించొచ్చని మభ్యపెడుతూ, ఈ తరహా స్కామ్‌లలో మోసగాళ్లు సాధారణంగా లక్షల్లో భారీ ఎత్తున నిధులను కొల్లగొడతారు.
ఫేక్ జాబ్ స్కామ్‌లు: సోషల్ మీడియా పేజీలను లైక్ చేయడం లేదా లేదా రివ్యూలు రాయడంలాంటి తేలికైన పనులు చేసే ఉద్యోగాలిచ్చే కంపెనీల ముసుగులో స్కామర్లు సంప్రదించవచ్చు. నమ్మకాన్ని చూరగొనేందుకు ముందు కాస్త మొత్తం చెల్లించవచ్చు. ఆ తర్వాత ప్రాథమిక పెట్టుబడుల అవకాశాలంటూ చిన్న చిన్న కొనుగోళ్లు జరిపేలా బాధితులను మోసగిస్తారు. ఆ తర్వాతెప్పుడో ఈ స్కీముల మోసపూరిత స్వభావం బయటపడుతుంది.
పోంజి, పిరమిడ్ స్కీములు: ఈ తరహా స్కాముల్లో అధిక రాబడులు వస్తాయని ఇన్వెస్టర్లకు నమ్మబలుకుతారు. తొలుత వచ్చిన ఇన్వెస్టర్లకు వాస్తవ లాభాలను కాకుండా కొత్త ఇన్వెస్టర్ల నుంచి వచ్చే డబ్బు నుంచి చెల్లిస్తారు. కొత్తగా డబ్బు రావడం ఆగిపోతే ఇవి కుప్పకూలిపోతాయి.
స్కామ్‌ల నుంచి ఇలా దూరంగా ఉండండి..
ఇన్వెస్ట్ చేసే ముందు ధ్రువీకరించుకోవాలి: ఆయా సంస్థలు రిజిస్టర్ అయినవా లేదా అనేది సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) లేదా ఇతరత్రా అధికారిక నియంత్రణ సంస్థల వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలి.
అధిక రాబడుల హామీలపై అప్రమత్తంగా ఉండాలి: ఏదైనా పెట్టుబడి నమ్మశక్యం కానంతగా బాగుందనిపిస్తోందంటే, అది మ్ అయి ఉండొచ్చు.
ఒత్తిళ్లకు తలొగ్గవద్దు: చట్టబద్ధమైన పెట్టుబడులను చేసేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు
వెబ్‌సైట్, ఈమెయిల్‌ను చెక్ చేసుకోవాలి: HTTPS, అధికారిక డొమైన్ పేర్లు చూసుకోవాలి, అవాంఛిత లింకులపై క్లిక్ చేయకూడదు.
వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయొద్దు: మోసపుచ్చేందుకు, డబ్బు కాజేసేందుకు మోసగాళ్లు వీటిని ఉపయోగించుకుంటారు.
అనుమానాస్పద నంబర్ల గురించి 1930కి డయల్ చేయడం ద్వారా నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్‌కి లేదా టెలికం డిపార్ట్‌మెంట్‌కి ఫిర్యాదు చేయండి. మెసేజీలను సేవ్ చేసుకోండి. స్క్రీన్‌షాట్లు తీసుకోండి. సంప్రదింపుల వివరాలను భద్రపర్చుకోండి.
Comments
Please login to add a commentAdd a comment