ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న చైనా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో పెట్టుబడులు పెట్టి, తమ ఉనికిని విస్తరిస్తూ ఉంది. చైనా కంపెనీలు భారత్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. అయితే ఇటీవల చైనా ప్రభుత్వం ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టవద్దని తమ వాహన తయారీదారులను కోరింది.
చైనా వెలుపల ఉన్న దేశాలలో పూర్తి స్థాయి ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం తమ వాహన తయారీదారులకు సలహా ఇచ్చింది. అదే సమయంలో తమ ఉత్పత్తులను 'కంప్లీట్ నాక్డ్ డౌన్' (CKD) మార్గం ద్వారా ఎగుమతి చేయాలని సూచించింది. దీని ద్వారా గణనీయమైన లాభాలను పొందటమే కాకుండా.. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో కీలకమైన భాగాలు చైనాలో ఉండాలని భావిస్తోంది.
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ జూలైలో వాహన తయారీదారులతో సమావేశాన్ని నిర్వహించింది. భారతదేశంలో ఎటువంటి ఆటో-సంబంధిత పెట్టుబడులు పెట్టకూడదని ఈ సమావేశంలో పేర్కొన్నారు. చైనా ఈవీ పరిశ్రమ పరిజ్ఞానాన్ని రక్షించడానికి ఇదొక మార్గమని అన్నారు.
ఇతర దేశాలలో కొత్త ఎలక్ట్రిక్ కార్ల కార్యకలాపాలను ఏర్పాటు చేసినప్పుడు పరిశ్రమ, సాంకేతిక మంత్రిత్వ శాఖకు తెలియజేష్యాలని చైనా తన వాహన తయారీదారులను కోరింది. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రపంచంలోని దిగ్గజ దేశాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది.
భారతదేశంలోని చైనా కంపెనీలు
భారతదేశంలో చైనా కంపెనీలు తమ కార్యాలపాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో ఒకటి 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' (BYD). ఈ కంపెనీ ఇప్పటికే నాలుగు కార్లను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ సమయంలో చైనా తీసుకున్న నిర్ణయానికి భారత్ స్పందిస్తే.. ఈ కంపెనీ ఇండియాలో కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా ఈ చైనా కంపెనీ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా యోచిస్తోంది. దీనికి కేంద్రం అంగీకరించలేదు.
ఎంజీ మోటార్ కంపెనీ కూడా చైనా కంపెనీ అయినప్పటికీ దేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంది. ఇటీవల జేఎస్డబ్ల్యుతో కలిసి విండ్సర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. గ్రేట్ వాల్ మోటార్స్ పెట్టుబడులను తిరస్కరించడంతో భారతదేశ ప్రణాళికలను కంపెనీ పూర్తిగా వదులుకోవాల్సి వచ్చింది. 2022లో కంపెనీ దుకాణాన్ని మూసివేసింది.
Comments
Please login to add a commentAdd a comment