సృష్టికి ప్రతిసృష్టి... | National Resource Facility for Bio-Medical Research to be established in Hyderabad soon | Sakshi
Sakshi News home page

సృష్టికి ప్రతిసృష్టి...

Published Mon, Mar 14 2016 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

సృష్టికి ప్రతిసృష్టి...

సృష్టికి ప్రతిసృష్టి...

- హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న ఎన్‌ఏఆర్‌ఎఫ్  
- జీవ వైవిధ్య పరిశోధనలకు ప్రాధాన్యం

 
సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత వరకూ వెళ్లామంటే కృత్రిమంగా జీవులనే సృష్టిస్తున్నాం. అత్యంత భయంకరమైన వ్యాధులకు తక్కువ కాలంలోనే మందులను కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే వీటిని మొదట క్షీరదాలపై ప్రయోగాలు చేసిన అనంతరమే విడుదల చేస్తారు. మనదేశంలో ఇప్పటి వరకు అతి పెద్ద జీవ ప్రయోగశాలలు లేవు. త్వరలో హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్’ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో దీని విశేషాలు తెలుసుకుందాం...
 - సాక్షి, స్కూల్ ఎడిషన్
 
 హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో రూ.338.58 కోట్ల వ్యయంతో ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ ’(ఎన్‌ఏఆర్‌ఎఫ్) పేరుతో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇలాంటి పరిశోధన కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం. వైద్య అవసరాల నిమిత్తం రకరకాల పరిశోధనలకు జంతు వనరుల్ని సమకూర్చడం, కృత్రిమ జన్యువు, జీవుల సృష్టిలో ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
 
 2018లో ప్రారంభం
 ప్రపంచశ్రేణి సదుపాయాలతో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రం 2018-19 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది. పాలిచ్చే జంతువులు, ఎలుకలు, కుందేళ్లు వంటివి ఉత్పత్తి చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఔషధ కంపెనీలకు ఉపయోగపడేలా జీవవైవిద్య పరిశోధనల నిమిత్తం జంతువుల్ని ఈ కేంద్రం సిద్ధం చేస్తుంది. నిపుణులకు అవసరమైన శిక్షణను సైతం అందిస్తుంది. ఎన్‌ఏఆర్‌ఎఫ్ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 102.69 ఎకరాల స్థలాన్ని జినోమ్ వ్యాలీలో ఉచితంగా కేటాయించింది.
 
పరీక్షలకు నిలయం
జినోమ్ వ్యాలీలో ఏర్పాటయ్యే పరిశోధన కేంద్రం విస్తృత పరీక్షలకు నిలయంగా నిలుస్తుంది. ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల పరిశోధన-అభివృద్ధి వ్యయం 60 శాతం మేర తగ్గిపోతుందని నిపుణులు అంచానా వేస్తున్నారు. ఉత్పత్తి వ్యయంలోనూ 30 శాతం ఆదా అవుతుంది. రోగకారక జీవులు లేని అన్ని రకాల జంతువులు పరీక్షల నిమిత్తం ఇక్కడ అందుబాటులో ఉంటాయనీ, ఇంతవరకు దేశం లో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదనీ ఐసీఎంఆర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ చెప్పారు. దాదాపు 250 కంపెనీలు ఇలాంటి సదుపాయాలను వాడుకోవడంపై ఆసక్తితో ఉన్నాయని వివరించారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో జంతువుల ఖరీదు, ప్రయోగాలకయ్యే ఖర్చు చాలా తక్కువ. నేపాల్, సింగపూర్ వంటి చిన్నదేశాల్లోనూ ఇలాంటి సదుపాయాలున్నాయి.
 
ప్రముఖ కంపెనీలు
ప్రపంచంలో పేరొందిన సంస్థలు ఇందులో తమ యూనిట్లను స్థాపించాయి. 30 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇందులో ఉన్నాయి. అలెగ్జాండ్రియా, జీవీకే బయో, నెక్టార్, డూపాండ్, విమ్టా, బయోలాజికల్-ఇయూని సాంక్యో, భారత్ బయోటిక్ వంటి సంస్థలు తమ పరిశ్రమలను నిర్వహిస్తున్నాయి. పారిశ్రామిక , నాలెడ్జ్ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, బహుళ ప్రయోగశాలలు, ఇంక్యుబేషన్ సెంటర్లు ఇందులో ఉ న్నాయి. సీసీఎంబీ, ఇక్రిశాట్, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌లు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.
 
పరిశోధనలు
జంతువులపై పరిశోధనలు జరగటం ఇప్పుడే కొత్త కాదు. అనేక దేశాల్లో ఎలుకలు, చింపాంజీలు, కుందేళ్లు, కోతులు, పిల్లుల వంటి జంతుజాలంపై ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. క్లోనింగ్ వంటి పరిశోధనలు అలాంటివే. జంతువుల రక్తాన్ని, కణజాలాన్ని నమూనాలుగా తీసుకుని మలేరియా, టైఫాయిడ్ పలు వ్యాధుల నివారణకు వాటి రక్తంలో ఈ వ్యాధి కారక క్రిములను పంపిస్తారు. వాటిపై ప్రభావాన్ని పరిశీలించి, నివారణకు ఔషధాలు తయారు చేయడాన్నే జీవ వైవిధ్య పరిశోధన అంటారు. ఈ కేంద్రం అందుబాటులో వస్తే వైద్య పరిశోధనా రంగంలో అగ్రగామి దేశాలతో పోటీ పడే అవకాశం ఉంటుంది.  
 
చరిత్ర
హైదరాబాద్ శివార్లలో శామీర్‌పేట, మేడ్చల్, ఉప్పల్, పటాన్‌చెరు, జీడిమెట్ల, గచ్చిబౌలి, కీసర దాకా సుమారు 600 కిలోమీటర్ల మేర  జినోమ్ వ్యాలీ విస్తరించింది. దేశంలో మొదటి ప్రపంచ స్థాయి జీవ సాంకేతిక సమూహం ఔషధ పరిశోదన సంస్థలు, జీవ శాస్త్ర పరిశోదనలు, శిక్షణలు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు ఇక్కడ సాగిస్తారు. 1999లో ఇది ప్రారంభమైంది. దేశంలోనే మొదటి ప్రపంచస్థాయి జీవ సాంకేతిక సమూహంగా, ఔషధ పరిశోధక సంస్థగా ఇది పేరొందింది. జీవ శాస్త్ర పరిశోధనలు, శిక్షణలు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు ఇందులో సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement