శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్
సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల అటవీ ప్రాంతం. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. అరుదైన వృక్షాలు.. వన్యప్రాణులు.. అన్నిటికీ మించి పులులు జీవించేందుకు నల్లమల అత్యంత అనుకూలమైంది. విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు. ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలతో అలరారుతున్న నల్లమలను చుట్టి రావాలంటే.. మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ.. అక్కడి జీవవైవిధ్యం అంతటినీ శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్‌లో చూడవచ్చు.
నల్లమల ప్రత్యేకతలు, జీవజాలం, జంతుజాలం, పులులు, ఇతర వన్యప్రాణులు వంటి సమస్త సమాచారం అక్కడ ఉంటుంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ప్రాంతంలో జీవవైవిధ్య కార్యకలాపాల కోసం 2001లో స్వతంత్ర జీవవైవిధ్య పరిశోధన కేంద్రాన్ని శ్రీశైలంలో ప్రారంభించారు. దశాబ్ద కాలంలో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, వివిధ జాతుల జాబితాకు సంబంధించి అత్యుత్తమ పరిశోధనలు ఇక్కడ జరిగాయి. ఈ అటవీ ప్రాంతంలోని వెన్నెముక లేని, వెన్నెముక ఉన్న జీవుల నమూనాలను సేకరించి బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ల్యాబోరేటరీలో భద్రపరిచారు.
ఇదీ నల్లమల జీవవైవిధ్యం
పులులు, ఎలుగుబంట్లు వంటి 80 రకాల పాలిచ్చే జంతువులు, 303 జాతుల పక్షులు, 80 రకాల పాకే ప్రాణులు, కప్పల వంటి 20 ఉభయ చరాలు, 55 రకాల చేపలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 57 రకాల తూనీగలు, 47 జాతుల కీటకాలు ఇంకా అనేక రకాల కీటక జాతులను ఈ అటవీ ప్రాంతంలో గుర్తించిన పరిశోధనా కేంద్రం చెక్‌లిస్ట్‌ను తయారు చేసింది.
నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం, రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యాలలో అన్ని రకాల జీవవైవిధ్య సర్వేలు నిర్వహించింది. నల్లమలలోని జంతు, పుష్ప సంపదపై డిజిటల్ ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. అక్కడి జంతుజాలం, వృక్షజాలం యొక్క జాతుల స్థాయిపై సమగ్ర తనిఖీ జాబితాను రూపొందించింది. మాంసాహార ప్రాణుల ఆహారపు అలవాట్లను అధ్యయనం నిర్వహిస్తోంది. శాకాహార ప్రాణుల వెంట్రుకల ద్వారా వాటి లక్షణాలను గుర్తిస్తోంది. ఇక్కడి గడ్డి జాతుల వైవిధ్యం, వృక్ష జాతులతో వాటిపై సంబంధాలపై అధ్యయనం చేసింది.
పులుల గణన ఇక్కడే..
నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల గణన చేపట్టేది ఈ పరిశోధనా కేంద్రంలోనే. అటవీ ప్రాంతంలో పులులు తిరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల నుంచి సేకరించిన లక్షలాది ఫొటోలను విశ్లేషించి ప్రతి సంవత్సరం పులులను ఇక్కడ లెక్కిస్తారు. పులుల సంఖ్య, వాటి తీరు, ఆడవా, మగవా, వాటి మధ్య తేడాలు వంటి అన్ని అంశాలను గుర్తిస్తారు. పులులపై ఉండే చారల ద్వారా ప్రతి పులి ఆనవాలును ఇక్కడ సేకరించి దాని కదలికలను గమనిస్తారు.
చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు
చిరుతలు, ఎలుగుబంట్లు వంటి ఇతర జంతువులను కూడా ఈ ఫొటోల ద్వారా గుర్తించి లెక్కిస్తారు. అటవీ సిబ్బందికి శిక్షణ తరగతులు, ప్రజలకు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 8.6 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ పక్కన పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఎకోలాజికల్ నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేశారు. ఇందులోని 4.96 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఆవిర్భావం నుండి ఆధునిక మనిషి జీవ పరిణామ క్రమాన్ని వివరించే థీమ్‌తో ఏర్పాటు చేసిన పార్కు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment