Biodiversity research
-
బయోడైవర్సిటీని రక్షించడంలో సోషల్‌మీడియాది కీలక పాత్ర
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. గంటగంటకూ అప్డేట్స్ చూసుకునేవారు చాలామందే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్బుక్, వాట్సప్, లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ అంటూ పలు ప్లాట్ఫార్మ్స్ ద్వారా మనిషి జీవితం పెనవేసుకొని పోయిందంటే ఆశ్చర్యం లేదు. అయితే జీవవైవిధ్యం(బయోడైవర్సిటీ)ని రక్షించడంలో సోషల్ మీడియాది ప్రముఖ పాత్ర ఉందని తాజా అధ్యయనంలో తేలింది. పకృతిలో జీవుల మధ్య సహజంగా కనిపించే భిన్నత్వాన్ని / ఓ భౌగోళిక ప్రాంతంలోని భిన్నజాతుల సముదాయాన్ని జీవవైవిధ్యం (Biodiversity) అంటారు. పెరుగుతున్న జనాభా, వనరులను మితిమీరంగా వాడటం వల్ల జీవవైవిద్య పరిరక్షణ సంక్లిష్టం మారుతోంది. చెట్లు నరికివేయడం,ఇష్టారాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు వంటివి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమిపై ఉన్న కోట్లాది జీవరాశులు అంతరించే ప్రమాదం ఉంది. అయితే బయోడైవర్సిటినీ రక్షించడంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ జరిపిన అధ్యయనంలో తేలింది. డాక్టర్ చౌదరి ఆధ్వర్యంలో జరిపిన అధ్యయనం ప్రకారం.. సోషల్ మీడియా అన్నది శాస్త్రీయ పరిశోధన, పరిరక్షణ ప్రయత్నాలకు శక్తివంతమైన సాధనంగా మారింది. ఉదాహరణకు బంగ్లాదేశ్‌లో గొప్ప వన్యప్రాణుల వారసత్వం ఉన్నప్పటికీ, కేవలం 4.6 శాతం మాత్రమే అధికారికంగా రక్షిత ప్రాంతంగా గుర్తించబడిందని తేలింది. బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్న ఫేస్బుక్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపులను పరిశీలించగా అక్కడ అనేక పక్షులు, కీటకాలు సహా మొత్తం 44,000 జీవరాశులు ఉన్నట్లు వారు కనుగొన్నారు. వీటిలో 288 జీవరాశులు అంతరించే ప్రమాదం ఉన్నట్లు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ అందించిన డేటా ప్రకారం తెలిసిందని డా. చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్ననేచర్ ఫోటోగ్రాఫర్లు దక్షిణాసియాలో జీవవైవిధ్య పరిరక్షణ మ్యాపింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు. బంగ్లాదేశ్‌లో అంతరించిపోతున్న వందలాది జాతుల పంపిణీ డేటాను మేము కోల్పోతున్నాము. ఈ క్రమంలో సోషల్ మీడియా అందించిన డేటా మాకు సహాయపడింది. బయోడైవర్సిటీ పరిరక్షణలో కీలకమైన సమాచార అంతరాలను తగ్గించడానికి సోషల్ మీడియా కీలకంగా మారింది. ప్రత్యేకించి పర్యవేక్షణ లేని ప్రాంతాలలో ఫేస్బుక్ వంటి మీడియా ప్లాట్‌ఫామ్‌లు శాస్త్రీయ ప్రయత్నాలకు అర్థవంతంగా సహకరించేలా చేస్తాయి. ఆస్ట్రేలియాలో, తెగులు జాతుల కదలికలను ట్రాక్ చేయడంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అని డాక్టర్ చౌదరి వెల్లడించారు.బయోడైవర్సిటీ పరిశోధనపై సోషల్ మీడియా ప్రభావం దక్షిణాసియాకు మించి విస్తరించింది. టానీకోస్టర్ అని పిలవబడే దక్షిణాసియాకు చెందిన సీతాకోకచిలుక 2012లో ఆస్ట్రేలియాలో ప్రవేశించింది. దీని వలస విధానాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధన బృందం ఫేస్‌బుక్‌ని ఆశ్రయించడం విశేషం. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు తప్పుడు సమాచారాన్ని, వ్యవసాన్ని పెంపొందిస్తాయని చెడు ప్రచారం ఉంది. కానీ జీవవైవిధ్యాన్ని రక్షించడంలో సోషల్‌మీడియా పాత్ర కీలకమని తాజా అధ్యయనంలో తేలింది. -
శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్.. ఎన్నో ప్రత్యేకతలు
సాక్షి, అమరావతి: ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల అటవీ ప్రాంతం. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. అరుదైన వృక్షాలు.. వన్యప్రాణులు.. అన్నిటికీ మించి పులులు జీవించేందుకు నల్లమల అత్యంత అనుకూలమైంది. విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు. ఎన్నో విశేషాలు, వింతలు, అద్భుతాలతో అలరారుతున్న నల్లమలను చుట్టి రావాలంటే.. మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ.. అక్కడి జీవవైవిధ్యం అంతటినీ శ్రీశైలం బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్లో చూడవచ్చు. నల్లమల ప్రత్యేకతలు, జీవజాలం, జంతుజాలం, పులులు, ఇతర వన్యప్రాణులు వంటి సమస్త సమాచారం అక్కడ ఉంటుంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ప్రాంతంలో జీవవైవిధ్య కార్యకలాపాల కోసం 2001లో స్వతంత్ర జీవవైవిధ్య పరిశోధన కేంద్రాన్ని శ్రీశైలంలో ప్రారంభించారు. దశాబ్ద కాలంలో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, వివిధ జాతుల జాబితాకు సంబంధించి అత్యుత్తమ పరిశోధనలు ఇక్కడ జరిగాయి. ఈ అటవీ ప్రాంతంలోని వెన్నెముక లేని, వెన్నెముక ఉన్న జీవుల నమూనాలను సేకరించి బయోడైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ల్యాబోరేటరీలో భద్రపరిచారు. ఇదీ నల్లమల జీవవైవిధ్యం పులులు, ఎలుగుబంట్లు వంటి 80 రకాల పాలిచ్చే జంతువులు, 303 జాతుల పక్షులు, 80 రకాల పాకే ప్రాణులు, కప్పల వంటి 20 ఉభయ చరాలు, 55 రకాల చేపలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 57 రకాల తూనీగలు, 47 జాతుల కీటకాలు ఇంకా అనేక రకాల కీటక జాతులను ఈ అటవీ ప్రాంతంలో గుర్తించిన పరిశోధనా కేంద్రం చెక్లిస్ట్ను తయారు చేసింది. నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం, రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యాలలో అన్ని రకాల జీవవైవిధ్య సర్వేలు నిర్వహించింది. నల్లమలలోని జంతు, పుష్ప సంపదపై డిజిటల్ ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది. అక్కడి జంతుజాలం, వృక్షజాలం యొక్క జాతుల స్థాయిపై సమగ్ర తనిఖీ జాబితాను రూపొందించింది. మాంసాహార ప్రాణుల ఆహారపు అలవాట్లను అధ్యయనం నిర్వహిస్తోంది. శాకాహార ప్రాణుల వెంట్రుకల ద్వారా వాటి లక్షణాలను గుర్తిస్తోంది. ఇక్కడి గడ్డి జాతుల వైవిధ్యం, వృక్ష జాతులతో వాటిపై సంబంధాలపై అధ్యయనం చేసింది. పులుల గణన ఇక్కడే.. నల్లమల అటవీ ప్రాంతంలోని పులుల గణన చేపట్టేది ఈ పరిశోధనా కేంద్రంలోనే. అటవీ ప్రాంతంలో పులులు తిరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల నుంచి సేకరించిన లక్షలాది ఫొటోలను విశ్లేషించి ప్రతి సంవత్సరం పులులను ఇక్కడ లెక్కిస్తారు. పులుల సంఖ్య, వాటి తీరు, ఆడవా, మగవా, వాటి మధ్య తేడాలు వంటి అన్ని అంశాలను గుర్తిస్తారు. పులులపై ఉండే చారల ద్వారా ప్రతి పులి ఆనవాలును ఇక్కడ సేకరించి దాని కదలికలను గమనిస్తారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి ఇతర జంతువులను కూడా ఈ ఫొటోల ద్వారా గుర్తించి లెక్కిస్తారు. అటవీ సిబ్బందికి శిక్షణ తరగతులు, ప్రజలకు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 8.6 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ పక్కన పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఎకోలాజికల్ నాలెడ్జ్ పార్కును అభివృద్ధి చేశారు. ఇందులోని 4.96 హెక్టార్ల విస్తీర్ణంలో భూమి ఆవిర్భావం నుండి ఆధునిక మనిషి జీవ పరిణామ క్రమాన్ని వివరించే థీమ్‌తో ఏర్పాటు చేసిన పార్కు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. -
తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో భారీ దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్ ఆసియా రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్–సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్(పర్స్) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్ ఫెస్టివల్లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దం పడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్థాన్ ఆల్వర్ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలను సైతం రైతులు కొనుగోలు చేయవచ్చన్నారు. దేశీయ విత్తనోత్సవంతోపాటు దేశీ ఆహారోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని రోహిణీ రెడ్డి తెలిపారు. వివరాలకు.. 99859 47003, 98496 15634. -
సృష్టికి ప్రతిసృష్టి...
- హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న ఎన్ఏఆర్ఎఫ్ - జీవ వైవిధ్య పరిశోధనలకు ప్రాధాన్యం సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత వరకూ వెళ్లామంటే కృత్రిమంగా జీవులనే సృష్టిస్తున్నాం. అత్యంత భయంకరమైన వ్యాధులకు తక్కువ కాలంలోనే మందులను కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే వీటిని మొదట క్షీరదాలపై ప్రయోగాలు చేసిన అనంతరమే విడుదల చేస్తారు. మనదేశంలో ఇప్పటి వరకు అతి పెద్ద జీవ ప్రయోగశాలలు లేవు. త్వరలో హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్’ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో దీని విశేషాలు తెలుసుకుందాం... - సాక్షి, స్కూల్ ఎడిషన్ హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో రూ.338.58 కోట్ల వ్యయంతో ‘నేషనల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ ’(ఎన్ఏఆర్ఎఫ్) పేరుతో పరిశోధన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇలాంటి పరిశోధన కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం. వైద్య అవసరాల నిమిత్తం రకరకాల పరిశోధనలకు జంతు వనరుల్ని సమకూర్చడం, కృత్రిమ జన్యువు, జీవుల సృష్టిలో ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2018లో ప్రారంభం ప్రపంచశ్రేణి సదుపాయాలతో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రం 2018-19 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది. పాలిచ్చే జంతువులు, ఎలుకలు, కుందేళ్లు వంటివి ఉత్పత్తి చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఔషధ కంపెనీలకు ఉపయోగపడేలా జీవవైవిద్య పరిశోధనల నిమిత్తం జంతువుల్ని ఈ కేంద్రం సిద్ధం చేస్తుంది. నిపుణులకు అవసరమైన శిక్షణను సైతం అందిస్తుంది. ఎన్ఏఆర్ఎఫ్ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం 102.69 ఎకరాల స్థలాన్ని జినోమ్ వ్యాలీలో ఉచితంగా కేటాయించింది. పరీక్షలకు నిలయం జినోమ్ వ్యాలీలో ఏర్పాటయ్యే పరిశోధన కేంద్రం విస్తృత పరీక్షలకు నిలయంగా నిలుస్తుంది. ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల పరిశోధన-అభివృద్ధి వ్యయం 60 శాతం మేర తగ్గిపోతుందని నిపుణులు అంచానా వేస్తున్నారు. ఉత్పత్తి వ్యయంలోనూ 30 శాతం ఆదా అవుతుంది. రోగకారక జీవులు లేని అన్ని రకాల జంతువులు పరీక్షల నిమిత్తం ఇక్కడ అందుబాటులో ఉంటాయనీ, ఇంతవరకు దేశం లో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదనీ ఐసీఎంఆర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. దాదాపు 250 కంపెనీలు ఇలాంటి సదుపాయాలను వాడుకోవడంపై ఆసక్తితో ఉన్నాయని వివరించారు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో జంతువుల ఖరీదు, ప్రయోగాలకయ్యే ఖర్చు చాలా తక్కువ. నేపాల్, సింగపూర్ వంటి చిన్నదేశాల్లోనూ ఇలాంటి సదుపాయాలున్నాయి. ప్రముఖ కంపెనీలు ప్రపంచంలో పేరొందిన సంస్థలు ఇందులో తమ యూనిట్లను స్థాపించాయి. 30 పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇందులో ఉన్నాయి. అలెగ్జాండ్రియా, జీవీకే బయో, నెక్టార్, డూపాండ్, విమ్టా, బయోలాజికల్-ఇయూని సాంక్యో, భారత్ బయోటిక్ వంటి సంస్థలు తమ పరిశ్రమలను నిర్వహిస్తున్నాయి. పారిశ్రామిక , నాలెడ్జ్ పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, బహుళ ప్రయోగశాలలు, ఇంక్యుబేషన్ సెంటర్లు ఇందులో ఉ న్నాయి. సీసీఎంబీ, ఇక్రిశాట్, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌లు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. పరిశోధనలు జంతువులపై పరిశోధనలు జరగటం ఇప్పుడే కొత్త కాదు. అనేక దేశాల్లో ఎలుకలు, చింపాంజీలు, కుందేళ్లు, కోతులు, పిల్లుల వంటి జంతుజాలంపై ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి. క్లోనింగ్ వంటి పరిశోధనలు అలాంటివే. జంతువుల రక్తాన్ని, కణజాలాన్ని నమూనాలుగా తీసుకుని మలేరియా, టైఫాయిడ్ పలు వ్యాధుల నివారణకు వాటి రక్తంలో ఈ వ్యాధి కారక క్రిములను పంపిస్తారు. వాటిపై ప్రభావాన్ని పరిశీలించి, నివారణకు ఔషధాలు తయారు చేయడాన్నే జీవ వైవిధ్య పరిశోధన అంటారు. ఈ కేంద్రం అందుబాటులో వస్తే వైద్య పరిశోధనా రంగంలో అగ్రగామి దేశాలతో పోటీ పడే అవకాశం ఉంటుంది. చరిత్ర హైదరాబాద్ శివార్లలో శామీర్‌పేట, మేడ్చల్, ఉప్పల్, పటాన్చెరు, జీడిమెట్ల, గచ్చిబౌలి, కీసర దాకా సుమారు 600 కిలోమీటర్ల మేర జినోమ్ వ్యాలీ విస్తరించింది. దేశంలో మొదటి ప్రపంచ స్థాయి జీవ సాంకేతిక సమూహం ఔషధ పరిశోదన సంస్థలు, జీవ శాస్త్ర పరిశోదనలు, శిక్షణలు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు ఇక్కడ సాగిస్తారు. 1999లో ఇది ప్రారంభమైంది. దేశంలోనే మొదటి ప్రపంచస్థాయి జీవ సాంకేతిక సమూహంగా, ఔషధ పరిశోధక సంస్థగా ఇది పేరొందింది. జీవ శాస్త్ర పరిశోధనలు, శిక్షణలు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు ఇందులో సాగుతున్నాయి.