
ఏఐ, మెషీన్ లెర్నింగ్ ద్వారా సింగపూర్ ప్రజల జన్యు సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం
జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత ప్యాట్రిక్ టాన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌లో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నం గురించి ప్రతిష్టాత్మక బయో ఆసియా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుగ్రహీత డాక్టర్ ప్యాట్రిక్ టాన్ సభికులతో పంచుకున్నారు. ‘సింగపూర్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రులపై ఒత్తిడి ఎక్కువవుతోంది. చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా బాగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూనే ఆరోగ్య రంగంలో ఖర్చులు తగ్గించుకోవడం ఎలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచించింది. అందులో భాగంగానే ఇప్పుడు మేము భవిష్యత్తులో ఎవరు జబ్బు పడవచ్చో.. ఆ జబ్బులు ఎలాంటివో గుర్తించేందుకు.. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకొనేందుకు ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టాం.
ప్రిసైస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ‘నేషనల్ ప్రిసిషన్ మెడిసిన్ ప్రోగ్రామ్’కు నేను నేతృత్వం వహిస్తున్నా. ఇందులో భాగంగా ప్రజల జన్యు సమాచారంతోపాటు వారి ఆహార అలవాట్లు, వైద్య వివరాలు సేకరించాం. మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ సాయంతో భవిష్యత్తులో ఎవరు జబ్బు పడతారో.. ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో, వాటికి చవకైన వైద్యం ఎలా అందుతుందో గుర్తించాం. ఈ రెండు అంశాలకు తగ్గట్లు ప్రభుత్వం బీమా, న్యాయపరమైన రక్షణ వంటి విధానాలను రూపొందించింది. సుమారు లక్ష మంది సింగపూరియన్ల వివరాలు సేకరించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకూ 97 వేల మంది ఈ కార్యక్రమంలో చేరారు. దేశ ప్రజలందరినీ గుర్తించేందుకు ఉన్న పద్ధతి (ఆధార్ వంటిది) ద్వారా వారిలో ఎవరు ఎక్కడ జబ్బు పడ్డా ఆ వివరాలు ఎలక్ట్రానిక్ రిజిస్టర్‌లో నమోదవుతాయి.
ఏ జబ్బు వచ్చింది? ఏం మందులిచ్చారు? ఇతర వివరాలు ఏమిటన్నది తెలిసిపోతుంది. వాటిని విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో రాగల జబ్బులను గుర్తిస్తున్నాం. రోగులకు ఎలాంటి చికిత్స అందించాలనే అంశంపైనా పనిచేస్తున్నాం. చివరి దశలో భాగంగా మొత్తం సింగపూర్ జనాభాలో 10 శాతం మంది నుంచి వివరాలు సేకరిస్తాం. అయితే వారు ఇప్పటికే ఏదో ఒక జబ్బు బారినపడి చికిత్స తీసుకుంటున్న వారై ఉంటారు. వీరి నుంచి సేకరించే సమాచారం వ్యాధి ఎలా ముదురుతోంది? దుష్ప్రభావాలు ఏమిటి వంటివి తెలుస్తాయి.మొత్తమ్మీద ఇంకో ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా గణనీయమైన పురోగతి సాధించగలమని ఆశిస్తున్నాం’ అని ప్యాట్రిక్ టాన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment