రూ.5,445 కోట్ల పెట్టుబడులు.. 9,800 ఉద్యోగాలు | 5. 4K crore investments flow into Telangana as CM Revanth Reddy announces Life Sciences policy | Sakshi
Sakshi News home page

రూ.5,445 కోట్ల పెట్టుబడులు.. 9,800 ఉద్యోగాలు

Published Wed, Feb 26 2025 6:06 AM | Last Updated on Wed, Feb 26 2025 6:07 AM

5. 4K crore investments flow into Telangana as CM Revanth Reddy announces Life Sciences policy

గ్రీన్‌ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్న 11 కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, జయేశ్‌రంజన్‌ తదితరులు

గ్రీన్‌ ఫార్మాసిటీలో ఏర్పాటుకు ముందుకొచ్చిన 11 కంపెనీలు

సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు

ప్రముఖ కేన్సర్‌ పరిశోధకుడు డాక్టర్‌ పాట్రిక్‌ టాన్‌కు జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డు–2025 ప్రదానం

సాక్షి, హైదరాబాద్‌: బయో ఆసియా–2025 సదస్సులో భాగంగా తొలిరోజు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడ్డాయి. గ్రీన్‌ ఫార్మాసిటీలో తమ యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే ఆరు సంస్థలు ముందుకురాగా తాజాగా మరో 11 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ. 5,445 కోట్ల పెట్టుబడితో కొత్తగా 9,800 ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించాయి.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గ్రాన్యూల్స్, ఆర్బిక్యులార్, ఐజాంట్, బయోలాజికల్‌–ఈ, విర్చో, విరూపాక్ష, జూబిలియెంట్, విమ్టా, ఆరగెన్, భారత్‌ బయోటెక్, సాయి లైఫ్‌సైన్సెస్‌ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తాజా ఒప్పందాలతో గ్రీన్‌ ఫార్మాసిటీలో మొత్తం పెట్టుబడుల విలువ రూ. 11 వేల కోట్లకు చేరింది. అలాగే మొత్తంగా 22,300 మందికి ఉపాధి లభించనుంది.

ప్రతిభకు పట్టం..: బయో ఆసియా సదస్సులో భాగంగా ప్రముఖ కేన్సర్‌ పరిశోధకుడు, సింగపూర్‌లోని జీనోమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్, ‘ప్రిసైజ్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పాట్రిక్‌ టాన్‌కు ఈ ఏడాదికిగాను జీనోమ్‌ వ్యాలీ ఎక్సలెన్స్‌ అవార్డును ప్రదానం చేశారు. వైద్య రంగానికి ఆయన అందిస్తున్న అసాధారణ సేవలకుగాను ప్రత్యేకించి కేన్సర్‌ జీనోమిక్స్, ప్రజారోగ్యంపై పరిశోధనలకుగాను ఆయన్ను ‘బయోఆసియా’ ఈ అవార్డుకు గత నెలలో ఎంపిక చేసింది. మంగళవారం బయోఆసియా 2025 సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు అవార్డు ప్రదానం చేశారు.

క్వీన్స్‌లాండ్‌ వర్సిటీతో జట్టుకట్టిన రాష్ట్ర ప్రభుత్వ విభాగం
అత్యాధునిక పరిశోధనలు, డిజిటల్‌ హెల్త్‌కేర్, ఏఐ ఆధారిత ఆవిష్కరణల కోసం యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్, తెలంగాణ లైఫ్‌సైన్సెస్‌ విభాగం నడుమ ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌’ కుదిరింది. డిజిటల్‌ హెల్త్‌ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సహకారాన్ని వేగవంతం చేసేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక తోడ్పాటుతో ఇండియన్‌ డిజిటల్‌ హెల్త్‌ యాక్టివేటర్‌ ఏర్పాటుపై వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌ డైరెక్టర్‌ అలన్‌ రొవాన్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.  

తెలంగాణలోకి మరికొన్ని సంస్థలు
అమెరికాకు చెందిన ఎంఎస్‌డీ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరిచింది. లాస్‌ఏంజెలెస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘అగిలిసియం’ హైదరాబాద్‌లో లైఫ్‌ సైన్సెస్, ఇన్నోవేషన్, డెవలప్‌మెంట్‌ కార్యకలాపాల కోసం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. జీనోమ్‌ వ్యాలీలో సీజీఎంపీ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ‘ఏఎల్‌ఎస్‌’ ప్రకటించింది. హైదరాబాద్‌లో రెండో ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ‘మీషి ఫార్మా’ వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement