ప్రాజెక్టు వద్దనుకుంటే రైతుల భూములు తిరిగి ఇచ్చేయాలి
సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైకోర్టు సైతం ఈ విషయంలో స్పష్టత కోరిందని, తక్షణమే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా నంబర్ వన్‌గా నిలిపే ఉద్దేశంతో ఫార్మా సిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు.
9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించే లక్ష్యంతో ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని భావించామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందనే ఆలోచన చేశామన్నారు. భూ సేకరణను సైతం పూర్తి చేశామని తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గందరగోళం నెలకొందన్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించటంతో ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఆందోళన చెందుతున్నాయన్నారు.
ఫార్మా సిటీ వస్తే ఉద్యోగాలొస్తాయని భావించిన యువత, బతుకులు బాగుపడతాయని భూములు ఇచ్చిన రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మొండి పట్టుదలకు పోయి రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని కోరారు. ప్రాజెక్టును రద్దు చేయాలని భావిస్తే రైతుల భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. భూములను ఇతర అవసరాలకు వాడతామంటే రైతులతో పాటు బీఆర్‌ఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: ‘అసలు పార్టీలో చేర్చుకోవడం ఎందుకు? ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలెందుకు?’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు, మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఎక్స్ వేదికగా ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్లు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment