Pharmacity
-
సురేష్ మా పార్టీవాడే: కేటీఆర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో సాగుతోంది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిర ఎమర్జెన్సీ పాలన అంటూ తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే.. పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అని ఆరోపించారు. సీఎం తన సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అంటూ నాటకాలడుతున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాల వలనే లగచర్ల ఘటన జరిగింది. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి భరతం పడుతాం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్. సీఎం సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్. సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి, శరత్‌ల ఫార్మా కంపెనీలను విస్తరించటం కోసం ప్రభుత్వం సహకరిస్తుంది.తన ఏడు ఎకరాల భూమి కోల్పోతున్న కారణంగానే సురేష్ కలెక్టర్‌ను అడిగాడు. సురేష్ అనే వ్యక్తి.. బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే. నిఘా వ్యవస్థ వైఫల్యం వలనే లగచర్ల ఘటన.. కలెక్టర్ గన్ మెన్లు ఎక్కడ?. ప్రభుత్వ కుట్రకు పోలీస్ ఉన్నతాధికారుల బలికావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సురేష్ పద్దతిగా.. మర్యాదగా చెప్తే తప్పా?. సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా?. సురేష్ మమల్ని కలవటం తప్పు అయితే.. రాహుల్ గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్ కలవటం కూడా తప్పే. హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వం జడ్జీలను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలన.రేవంత్ పిచ్చి నిర్ణయాల వలనే కొడంగల్ రగులుతున్నది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్.. మహారాష్ట్రకు మూటలు మోస్తున్నాడు. రైతుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతుంటే సీఎం ఎక్కడ?. షోలాపూర్ చౌరస్తాలో నిలబడినా.. రేవంత్‌ను ఎవరూ గుర్తుపట్టరు. కనీసం ఆయన సతీమణికి కూడా సమాచారం ఇవ్వకుండా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తీవ్రవాదుల మాదిరిగా రైతులను పొలాల వెంబడి తరుముతున్నారు. ఫార్మా విలేజ్ వలన వచ్చే లాభమెంటో ముఖ్యమంత్రి చెప్పాలి. రైతులు తిరుపతి రెడ్డికి ఫోన్ చేసి అడిగితే.. తన్ని భూములు తీసుకుంటామని హెచ్చరించలేదా?. కేంద్ర పెద్దలను నేను కలవటం తప్పు అయితే.. సీఎం గవర్నర్‌ను కలవటం కూడా తప్పే. ఫార్మా సిటీని రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అనలేదా?. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అని.. మళ్ళీ యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెప్తుంటే.. ఐజీ దాడి జరిగిందంటున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
ఫార్మా సిటీ భూములతో రియల్ దందా చేస్తావా..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మాసిటీ కోసం హైదరాబాద్‌కు సమీపంలో సేకరించిన 15 వేల ఎకరాల భూములతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని, ఇందులో పది వేల ఎకరాలు తన అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీమంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి.. నువ్వు సీఎంవా, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా అంటూ హరీశ్ నిలదీశారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరుతో డప్పూరుపై ఈ రాయి పడిందన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూరులో ఫార్మా విలేజ్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మద్దతు గా జరిగిన రచ్చబండకు హరీశ్‌రావు హాజర య్యారు. ప్రభుత్వం సేకరిస్తున్న పంట పొలా లను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ పచ్చని పల్లెల్లో ఫార్మా విలేజీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్వాసితుల తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు, హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమా వేశాల్లో దీనిపై మాట్లాడతామని, మూడు పంటలు పండుతున్న ఈ భూముల్లో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని, బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నిస్తే బాధి తుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. మూసీ ని శుద్ధి చేస్తానని చెప్పి అక్కడి పేదల ఇళ్లు కూల్చి వేస్తున్న రేవంత్‌రెడ్డి.. డప్పూరు పచ్చని పంట పొలాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసి ఇక్కడి చెరువులు, కుంటలు, పక్కనే ఉన్న మంజీర నదిని విషంతో నింపుతావా అని హరీశ్‌రావు నిలదీశారు. రాహుల్.. రేవంత్‌కు బుద్ధి చెప్పు..‘మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టుడు.. వారి భూములు కొల్ల గొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా ’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ గరీబీ హఠావో అంటే.. రేవంత్‌రెడ్డి గరీబోంకో హఠావో చేస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములు లాక్కోవొద్దని రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ వెంట ఆ పార్టీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూరం శివకుమార్ తదితరులు ఉన్నారు. -
ఫార్మాసిటీ ఉంటుందా? లేదా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైకోర్టు సైతం ఈ విషయంలో స్పష్టత కోరిందని, తక్షణమే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా నంబర్ వన్‌గా నిలిపే ఉద్దేశంతో ఫార్మా సిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. 9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించే లక్ష్యంతో ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని భావించామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందనే ఆలోచన చేశామన్నారు. భూ సేకరణను సైతం పూర్తి చేశామని తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గందరగోళం నెలకొందన్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించటంతో ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఫార్మా సిటీ వస్తే ఉద్యోగాలొస్తాయని భావించిన యువత, బతుకులు బాగుపడతాయని భూములు ఇచ్చిన రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మొండి పట్టుదలకు పోయి రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని కోరారు. ప్రాజెక్టును రద్దు చేయాలని భావిస్తే రైతుల భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. భూములను ఇతర అవసరాలకు వాడతామంటే రైతులతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: ‘అసలు పార్టీలో చేర్చుకోవడం ఎందుకు? ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలెందుకు?’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు, మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఎక్స్ వేదికగా ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్లు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. -
రాచకొండలో ఫిలింసిటీ: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటుచూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీ కోసం సేకరించిన 20 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఐటీ పార్కులు, కాలుష్య రహిత ఫార్మాస్యూటికల్ కంపెనీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమలు, బ్యాటరీ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. న్యూయార్క్ తరహాలో మహేశ్వరంలో మరో విశ్వనగరాన్ని తీర్చిదిద్దుతాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం పథకం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కల్లు గీత కార్మీకుల రక్షణ కోసం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు (ఎవరెస్ట్ అధిరోహించిన మాలోతు పూర్ణతో కూడిన బృందం) రూపొందించిన కిట్లను ఈ సందర్భంగా కల్లు గీత కార్మీకులకు అందజేశారు. కిట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రదేశంగా రంగారెడ్డి జిల్లా ‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఉన్నాయి. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలుకుతోంది. రాబోయే రోజుల్లో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు ఓ మణిహారంగా నిలుస్తుంది. దాని చుట్టూ కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటు హయత్‌నగర్, అటు శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. వెంచర్లలోనూ ఈత, తాటి చెట్లు ‘వృత్తిదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వీరి కోసం ప్రభుత్వ ఖాళీ భూముల్లో, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ, చెరువులు, కుంటలు, కాలువగట్లు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులకు ఇరువైపులా ఈత, తాటి చెట్లు నాటిస్తాం. వన మహోత్సవంలో భాగంగా ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటాల్సిందిగా ఎక్సైజ్, అటవీ శాఖలకు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నా. కొత్తగా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లోనూ ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు తీసుకొస్తాం. చేతి వృత్తులకు సమ న్యాయం కల్పిస్తాం. ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ పార్టీలో చేరుతున్నారు! ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలే. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ఈ లోపే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఫాంహౌస్‌లలో పడుకున్నోళ్లు ప్రభుత్వాన్ని కూలుస్తామంటుంటే.. ప్రజాక్షేత్రంలో తిరిగే వారి ఎమ్మెల్యేలు మాత్రం నిలబెడతామంటూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజలు ఆశించే అన్ని పనులు పూర్తి చేసి తీరుతుంది. పోటీ పరీక్షల షెడ్యూల్‌పై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతల మాటలు విని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అయినదానికి, కాని దానికి ఆవేశపడి రోడ్లెక్కొద్దు. ఏదైనా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడండి. అంతా కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేద్దాం..’ అని సీఎం చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్‌బాబు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కల్లెంత?..నీళ్లెంత? – గీత కార్మికులతో సీఎం సరదా సంభాషణ అబ్దుల్లాపూర్‌మెట్: ‘ఏం లక్ష్మయ్యా..రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతావ్? ఎన్ని సీసాల కల్లు తీస్తావ్? తీసేదాంట్లో కల్లెంత.. నీళ్లెంత..? రోజుకు కనీసం రూ.వెయ్యి అయినా మిగులుతుందా? ఊళ్లో బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా..?’ ‘ఏం రంగయ్యా.. ఏం కిష్టయ్యా.. ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కిట్టు మంచిగుందా? పనిచేస్తోందా? కిట్టును కనిపెట్టినోళ్లకు ఏమైనా దావత్ ఇచ్చారా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి లష్కర్‌గూడలో కల్లుగీత కార్మీకులతో కొద్దిసేపు ముచ్చటించారు. వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు స్పీకర్, మంత్రులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. గీత కార్మీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైఎస్సార్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు 2004 నుంచి 2014 మధ్య కాలంలో దివంగత నేత వైఎస్సార్ నాయకత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్ సృషే్ట. గత ప్రభుత్వం చనిపోయిన గీత కార్మీకులకు రూ.7.90 కోట్లు బకాయిపడింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
ప్రపంచాన్ని ఆదుకొనేలా మన ఫార్మా: కేటీఆర్
భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ప్రపంచాన్ని ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సు ఈ నెల 24వ తేదీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కేటీఆర్ మీడియాతో ముచ్చటించారు. త్వరలో ఎంఆర్ఎన్ఏ టీకా కేంద్రం ‘జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారింది. ఏటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోంది. త్వరలోనే ఈ సంఖ్య 1,400 కోట్లకు చేరుతుంది. టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదిత ఫార్మా కంపెనీలు అత్యధికంగా (214) ఉండటం, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కు, త్వరలో ప్రారంభం కానున్న ఫార్మాసిటీ వంటివి హైదరాబాద్‌ను జీవశాస్త్ర రంగంలో అగ్రగామిగా నిలుపుతున్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్’తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎంఆర్ఎన్ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి..’అని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రాబర్ట్ లాంగర్‌కు అవార్డు ‘బయో ఆసియా గత 19 ఏళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగాం. 20 వేలకు పైగా భాగస్వామ్య చర్చలకు వెసులుబాటు కల్పించాం. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీకి కీలకమైన ప్రయోగాలు నిర్వహించిన రాబర్ట్ లాంగర్‌కు ఈ ఏడాది జినోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డును అందించనున్నాం. 400కు పైగా స్టార్టప్‌లతో నిర్వహిస్తున్న పోటీలో 75 వరకూ స్టార్టప్‌లను స్క్రీన్ చేయగా.. వీటిల్లో టాప్ 5 సంస్థలు బయో ఆసియా సదస్సు తుది రోజు తమ ఆలోచనలను పంచుకోనున్నాయి..’అని వెల్లడించారు. తొలిసారిగా సదస్సుకు ఆపిల్ కంపెనీ.. ‘బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీతిఆయోగ్ ఇతర రాష్ట్రాలకు బయో ఆసియా నిర్వహణ, ఫలితాలపై మాస్టర్ క్లాస్ ఇస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై బయో ఆసియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. (ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని ఉదాహరణలు చెప్పారు) 20వ బయో ఆసియా సదస్సులో తొలిసారి ఆపిల్ కంపెనీ కూడా పాల్గొంటోంది. ఆపిల్ ఆరోగ్య విభాగానికి చెందిన డాక్టర్ సంబుల్ దేశాయి, యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెకాఫీ, దేశీ ఫార్మారంగ ప్రముఖులు అజయ్ పిరమల్, సతీశ్‌రెడ్డి, గ్లెన్ సల్దానా తదితరులు పాల్గొంటున్నారు..’అని కేటీఆర్ వివరించారు. రెట్టింపు పెట్టుబడులు, ఉద్యోగాలు ‘జీవశాస్త్ర రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బయో ఆసియాతో పాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2021లో హైదరాబాద్, దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఆదాయం 50 బిలియన్ డాలర్లుగా ఉంది. 2028 నాటికి దీన్ని వంద బిలియన్ డాలర్లకు చేరుస్తాం. ప్రస్తుతం ఈ రంగంలోని 4 లక్షల ఉద్యోగాలను 8 లక్షలు చేస్తాం. రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీని ఫార్మాసిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం..’అని చెప్పారు. ‘టీం ఇండియా’స్ఫూర్తి నినాదాలకే పరిమితం తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. బల్క్ డ్రగ్ పార్కు మొదలుకొని రక్షణ రంగం ప్రాజెక్టు వరకు పలు విషయాల్లో కేంద్రం తనదైన శైలిలో వ్యవహరించిందని, ‘టీం ఇండియా’అన్న స్ఫూర్తిని కేవలం నినాదాలకే పరిమితం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ జీవశాస్త్ర, ఫార్మా విభాగపు డైరెక్టర్ శక్తి నాగప్పన్‌లు పాల్గొన్నారు. -
ఫార్మాసిటీ మృతులకు.. రూ.25 లక్షలు చొప్పున పరిహారం
మధురవాడ (భీమిలి)/పరవాడ (పెందుర్తి)/మహారాణిపేట : అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో ఫార్మాసిటీ లారస్ ల్యాబ్ పరిశ్రమలో సోమవారం రాత్రి సంభవించిన ప్రమాదంలో మృతులు నలుగురికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినా తక్షణమే చర్యలు తీసుకున్నామన్నారు. బహుళ జాతి కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో బ్రాండిక్స్ లాంటి పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పుడు సైతం అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటుచేశామని, సేఫ్టీ ఆడిట్స్ చేయాలని ఆదేశించామని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో 80–90 వరకు ప్రమాదకర పరిశ్రమలున్నట్లు గుర్తించామన్నారు. వాటిలో భద్రతాపరమెన ఆడిట్స్ చేయాలని ఆదేశించినట్లు అమర్నాథ్ చెప్పారు. పరవాడ ఫార్మాలో ప్రమాద ఘటన ఎందువల్ల జరిగింది? అందులో ఎవరి తప్పిదం ఉందో సమగ్రంగా విచారణ జరిపించాలని అనకాపల్లి కలెక్టర్, ఎస్పీలను ఆదేశించామన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం ఇక ఈ ప్రమాదంలో మృతులు బి. రాంబాబు, రాజేష్‌బాబు, రాపేటి రామకృష్ణ, మజ్జి వెంకట్రావు మృతదేహాలకు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు పరవాడ సీఐ పి.ఈశ్వరరావు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎడ్ల సతీష్ షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల కుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం మరోవైపు.. దుర్ఘటనలో మరణించిన నలుగురు కార్మికులకుటుంబాలకు రూ.2.24 కోట్ల పరిహారం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించిందని సీఐటీయూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ చెప్పారు. విశాఖ కేజీహెచ్‌లో ఇరువర్గాల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పర్మినెంట్ ఉద్యోగులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.70 లక్షలు చొప్పున రూ.1.40 కోట్లు, అలాగే.. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.42 లక్షల చొప్పున రూ.84 లక్షలు పరిహారం ఇవ్వడంతోపాటు బాధిత కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. -
‘ఫార్మా సీటీ వద్దు.. ఐటీఐఆర్ ముద్దు’
సాక్షి, హైదరాబాద్: యూపీఏ అధికారంలో ఉండగా మంజూరైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టు ఏర్పాటు జాప్యానికి పూర్తి బాధ్యత టీఆర్ఎస్దేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ‘ఫార్మా సిటీ వద్దు.. ఐటీఐఆర్ ముద్దు’ అనే నినాదంతో గురువారం ఇందిరాభవన్‌లో రంగారెడ్డి డీసీసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. విషం చిమ్మే ఫార్మా కంపెనీలపై మోజు పెంచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మందికి ఉపాధినిచ్చే ఐటీఐఆర్‌పై నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. లక్షల మందికి ఉపాధే లక్ష్యంగా నాడు కాంగ్రెస్ ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేస్తే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్లు పూర్తిగా విస్మరించాయని కాంగ్రెస్ సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏపాటిదో ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో తేటతెల్లమవుతోందని అన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుపై మెతక వైఖరి అవలంభిస్తున్న సీఎం కేసీఆర్ తన ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ఇప్పటివరకు కేవలం 18 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రాజెక్టుగా వెలుగొందే అవకాశమున్న ఐటీఐఆర్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని కేసీఆర్‌కు సూచించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ చేపడితే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని డిజైన్ మార్చి రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేసిందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాగా, ఐటీఐఆర్ ఏర్పాటుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని జీవన్ రెడ్డికి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం, కిసాన్ సెల్ ఛైర్మన్ కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
రైతు నోట్లో మట్టి!
ఫార్మాకు ‘ఓంకారేశ్వర’ భూములు ► 389 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు నిర్ణయం ► టీఎస్ఐఐసీకి దేవాదాయ శాఖ ప్రతిపాదన ► రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్లు తొలగింపు ► లబోదిబోమంటున్న బాధితులు ► జిల్లా కలెక్టర్‌ను కలవనున్న కౌలు రైతులు ఆలయ భూమి 1,289 ఎకరాలు కౌలుకు తీసుకుంటున్న రైతులు 250 మంది ఫార్మాకు ఇవ్వనున్న భూమి 389 ఎకరాలు రైతుల పేర్లు తొలగించిన సర్వే నంబర్లు 201, 204, 211 ఫార్మాకు అమ్మితే వచ్చే ఆదాయం రూ.4కోట్లు ఇప్పటి వరకు దేవాలయ భూములను కౌలుకు తీసుకొని కుటుంబాలను పోషించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూముల మీదే ఆధారపడ్డారు. కానీ, ఇప్పుడు వాటిలో కొంత భూమిని ఫార్మాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆ కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టినట్టయింది. తమ బాధలను కలెక్టర్‌కు విన్నవించేందుకు వారు సిద్ధమవుతున్నారు. – యాచారం(ఇబ్రహీంపట్నం): యాచారం మండలం నందివనపర్తి ఓంకారేశ్వర ఆలయ భూములను ఫార్మాసిటీకి తీసుకోనున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు భూములను టీఎస్ఐఐసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ పరిధిలో 1,289 ఎకరాల భూములు ఉన్నాయి. నందివనపర్తికి చెందిన పప్పు వెంకయ్య 1910లో పింగళి వెంకటరమణారెడ్డి (అప్పట్లో కమిషనర్ ఆఫ్ పోలీస్) వద్ద కొనుగోలు చేసి 1956లో ఓంకారేశ్వర ఆలయానికి అప్పగించారు. అప్పట్నుంచి ఓంకారేశ్వరాలయ ఆధీనంలో ఉన్న భూములకు పప్పు కుటుంబ సభ్యులు ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు. ఈ భూముల్లో ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 250 మంది రైతులు కొన్నేళ్లుగా సాగు (కౌలు) చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కౌలు రైతులతో పాటు దేవాలయ ఉత్సవాల్లో శ్రమించే వివిధ కులవృత్తుల వారు కూడా సాగులో ఉన్నారు. కౌలు రైతుల నుంచి వచ్చే ఆదాయంతో ఓంకారేశ్వరుడికి నిత్యం ధూప, దీప, నైవేద్యాలు, ఏటా ఆలయ ఉత్సవాలకు వెచ్చించాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి ఆర్థిక వనరుల కోసం ఆలయ భూములను ఫార్మాకు విక్రయించాలని అధికారులు టీఎస్ఐఐసీ శాఖకు ప్రతిపాదనలు పంపారు. సర్వే నంబరు 201, 204, 211లలోని సుమారు 389 ఎకరాల భూములను ఫార్మాకు ఇవ్వనున్నారు. భూములను ఫార్మాకు విక్రయిస్తే వచ్చే రూ.4 కోట్లతో ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేయడం, మిగిలిన డబ్బులను బ్యాంకులో జమ చేసి ప్రతి నెలా వచ్చే వడ్డీతో ఓంకారేశ్వరుడికి నిత్యం ధూప, దీప, నైవేద్యాలు, ఉత్సవాలు జరపాలని అధికారులు యోచిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్ల తొలగింపు నస్దిక్‌సింగారం, నందివనపర్తి, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల్లో 148 నుంచి 551 వరకు ఉన్న సర్వే నంబర్లలో దాదాపు 800 ఎకరాల్లో రైతులు ఏళ్లుగా కౌలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రాళ్లు, రాప్పలు తొలగించి ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు. అయితే రైతులు సక్రమంగా కౌలు చెల్లించడం లేదనే సాకుతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్లను తొలగించాలని రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పెట్టారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సూచన మేరకు రైతు సమగ్ర సర్వేలో కూడా కౌలు రైతుల పేర్లను నమోదు చేయలేదు. తమకు మళ్లీ ఆ భూములపై సర్వ హక్కులు కల్పించాలని రైతులు రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావును కోరనున్నట్లు తెలిసింది. ఇదే విషయమై నందివనపర్తి ఓంకారేశ్వరాలయ ఈఓ శశిధర్‌ను సంప్రదించగా 389 ఎకరాల ఆలయ భూములను ఫార్మాసిటీకి విక్రయించడానికి నిర్ణయించింది వాస్తవమేనని అన్నారు. భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం ఏళ్లుగా ఓంకారేశ్వరాలయ భూముల్లోనే సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్నాం. మా బతుకులకు ఆ భూములే ఆధారం. కౌలు చట్టం ప్రకారం భూములు మాకే దక్కుతాయని అనుకున్నాం. కానీ రెవెన్యూ రికార్డుల్లోంచి మా పేర్లను పూర్తిగా తొలగించడం అన్యాయం. ఆ భూములు తీసుకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. కౌలు చెల్లిద్దామన్నా అధికారులు రావడం లేదు. – దార నర్సింహ, కౌలు రైతు నస్దిక్‌సింగారం ఆ భూములెప్పటికీ ఓంకారేశ్వరుడివే మా తండ్రి పప్పు వెంకయ్య 1910 లో కొనుగోలు చేసి దేవాలయానికి చెందేటట్లుగా 1956లో వీలునామా రాశారు. రైతులు కౌలు చేసుకుని జీవనోపాధి పొందడమే కానీ ఆలయ భూములు వారికి చెందవని నింబంధన ఉంది. రైతులు సక్రమంగా కౌలు చెల్లించడం లేదు. అప్పులు చేసి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉంది. – పప్పు కృష్ణమూర్తి, ఓంకారేశ్వరాలయ ధర్మకర్త రైతుల పేర్లు తొలగింపు నిజమే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రతిపాదనలు.. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు ఓంకారేశ్వరాలయ భూములపై రికార్డుల్లో ఉన్న కౌలు రైతుల పేర్లను తొలగించింది వాస్తవమే. రైతుల పేర్లు తొలగించి ఓంకారేశ్వరస్వామి అని నమోదు చేశాం. సర్వే నంబరు 210, 204, 211లలోని దేవాలయ భూమిని ఫార్మాసిటీకి తీసుకోవడానికి టీఎస్ఐఐసీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం ఉంది. – పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం -
ఫార్మాసిటీ సర్వే పనులు ప్రారంభం
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం సమీపంలోని అన్మాస్‌పల్లి, పుల్లేరుబోడ్ తండా పరిసరాల్లో ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ కోసం భూముల సర్వే ముమ్మరంగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ అనంతరెడ్డి పర్యవేక్షణలో రెండు బృందాలుగా ఏర్పడి అధికారులు సర్వే నంబర్ 260, 321లలో సర్వే చేపట్టారు. భూముల హద్దుల గుర్తింపునకు, సమగ్ర వివరాల సేకరణకు తాము సర్వే కొనసాగిస్తున్నట్లు వివరించారు. ముందుగా ఆయా సర్వే నంబర్లలో భూముల హద్దులను గుర్తించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా భూములు ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. -
భూములు ఇచ్చేందుకు సిద్ధం
♦ ముందుకు వచ్చిన మీర్ఖాన్పేట రైతులు ♦ గతంలో సర్వేనంబర్ 112లో భూసేకరణపై కోర్టుకు వెళ్లడంతో స్టే ♦ తాజాగా భూములిస్తామని తహసీల్దార్‌కు వినతిపత్రం కందుకూరు: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మండలంలోని మీర్ఖాన్పేట పరిధిలోని సర్వే నంబర్ 112లోని అసైన్డ్ రైతులు కొందరు ముందుకొచ్చారు. సంబంధిత సర్వే నంబర్లో రికార్డుల ప్రకారం 613.30 ఎకరాలు ఉండగా వాస్తవంగా ఉన్న భూమి 842.22 ఎకరాలు. రికార్డుల ప్రకారం 294.28 ఎకరాల్లో అసైన్డ్‌దారులు, 335.21 ఎకరాల్లో ఆక్రమణదారులు ఉన్నారు. మిగతాది పట్టా, మైనింగ్, రాళ్లు, గుట్టలు, ఖాళీ భూములు ఉన్నాయి. కాగా, ప్రభుత్వం జీఓ 45 ప్రకారం సంప్రదింపుల ద్వారా ఎకరం రూ.8 లక్షల చొప్పున అసైన్డ్ భూములను తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో కొందరు రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తీరుపై హైకోర్టుకు వెళ్లగా ఆగస్టు 17న 8 వారాలు స్టే విధించారు. ఈ నేపథ్యంలో, మళ్లీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సదరు సర్వే నంబర్లో భూసేకరణ చేపట్టకుండా అధికారులు ఆగిపోయారు అధికారులు. తాజాగా ఆ సర్వే నంబర్లోని పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వం ఇవ్వజూపిన ధరకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ గురువారం ఎంపీటీసీ సత్తయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ సుశీలను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసైన్డ్ రైతులు కె.రాములు, శంకర్, రఘుపతి, జంగయ్య, బి.రాములు, హన్మంత్ తదితరులు మాట్లాడుతూ.. 112 సర్వే నంబర్లో దాదాపు 300 మందికి పైగా అసైన్డ్ రైతులం ఉన్నామని, అందులో 200 మందికి పైగానే భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పరిహారం అందించాలని అధికారులను కోరినట్లు వారు తెలిపారు. -
భూములు తీసుకుంటే మా బతుకుదెరువు ఎలా..?
► ఫార్మాకు భూములు ఇవ్వబోమని నక్కర్తమేడిపల్లి రైతుల తీర్మానం ► ఉప తహసీల్దార్‌కు భాస్కర్‌కు వినతిపత్రం యాచారం: ఏళ్లుగా ఆ భూములపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాం, నేడు ఫార్మాకు మా పట్టా భూములు తీసుకుంటే మేం ఎక్కడికి పోవాలి..? ఏలా బతకాలి..? అంటు నక్కర్తమేడిపల్లి పట్టా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట కొంతమంది రైతులు గురువారం ఉదయం సమావేశమయ్యారు. గ్రామంలోని పట్టా భూములను ఫార్మాకు ఇచ్చేది లేదని సమావేశంలో తీర్మానించారు. పట్టా భూములు తీసుకుంటే పరిహారంతోపాటు భూమికి భూమి ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. భూములు తీసుకుంటే మేమెక్కక భూములు కొనుగోలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి ఏ గ్రామంలో కూడా ఎకరా భూమి వచ్చే అవకాశం లేదు, ఇక బతికేది ఏలా? అంటూ సమావేశంలో చర్చించారు. గ్రామ సర్పంచ్ పాశ్ఛ భాషా, ఎంపీటీసీ సభ్యుడు మోటె శ్రీశైలం, ఉప సర్పంచ్ చిగురింత శ్రీనివాస్‌రెడ్డి, గ్రామానికి చెందిన సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, వివిధ పార్టీల ముఖ్య నాయకులు లేకుండానే రైతులు సమావేశమయ్యారు. నక్కర్తమేడిపల్లి గ్రామంలోని పట్టా భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని రైతులు మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ భాస్కర్‌కు వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్‌ను తక్షణమే కలెక్టర్‌కు, ప్రభుత్వానికి పంపి తమకు న్యాయం జరిగేలా కృషి చేయాలని వారు కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామన్నారు. గురువారం రాత్రి గ్రామంలో మరి కొంతమంది రైతులు సమావేశమై గ్రామానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టా భూములను ఫార్మాకు ఇచ్చేలా చర్చించినట్లు తెలిసింది. భూములు ఇవ్వడానికి సమ్మతం తెలిపే రైతులు సోమవారం తహసీల్దార్ కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఓ రైతు యాచారంలో విలేకరులతో తెలిపాడు. -
ఫార్మాసిటీకి భూములు రెడీ
♦ నక్కర్తమేడిపల్లి రైతులు ఏకగ్రీవ తీర్మాణం ♦ ఎకరాకు పరిహారం రూ. 8 లక్షలకు మించి ఇవ్వాలని విన్నపం ♦ రేపు తీర్మాణ పత్రాన్ని ఇవ్వనున్న సర్పంచ్, రైతులు ♦ తీర్మాణం పత్రాన్ని ఇవ్వగానే జేసీకి, ఆర్డీఓకు ♦ భూసర్వేకు అనుమతి తీసుకోనున్న తహసీల్దార్ యాచారం: ముచ్చర్ల ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రైతులు భూములు ఇవ్వడానికి రెడీ అయ్యారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారమైన, లేదా ఎకరాకు రూ. 15 లక్షలైన పరిహారం ఇస్తేనే భూములిస్తామని మొదట్లో మొండికేశారు. గత వారం యాచారం ఎంపీడీఓ కార్యాలయంలో నక్కర్తమేడిపల్లి రైతులతో జేసీ రజత్‌కుమార్‌సైనీ, సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావు సమావేశమైనారు. ఈ సమావేశంలో రైతులు మొండిగా వ్యవహరించడంతో జేసీ ఆగ్రహాంతో పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన భూములనైన తీసుకుంటాం కాని మీ నక్కర్తమేడిపల్లి భూములను మాత్రం తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో రైతులు కొంచెం మెతకవైఖరి వచ్చింది. ఇన్నాళ్లు ఫార్మాకు భూములు పోతే , వచ్చే డబ్బులతో ఇతర గ్రామాల్లో సాగు యేగ్యంగా ఉన్న భూములు, ప్లాట్లనైన కొనుగోలు చేసుకోవచ్చని కలలకన్న రైతులకు జేసీ హెచ్చరిక మింగుడు పడదనిగా మారింది. అత్యధిక అసైన్‌్డ భూముల్లో రైతులు సగం వరకు సాగు చేసుకోవడం, మిగితా భూములను పశువులు, మేకలు, గొర్రెల మేపకానికి వాడుకోవడం జరుగుతుంది. కాని ఎనాడు కూడ ఆ భూముల్లో పెట్టుబడులు పెట్టడమే కాని ..రూ. లక్షల్లో ఆదాయం పొందిన దాఖాలాలు లేవు. ఈ నేపథ్యంలో ఫార్మాకు తీసుకోవడం వల్ల ఒకేసారి ఎకరాకు రూ. 8 లక్షలు ఇస్తుండడడం వల్ల రైతుల్లో భూములిచ్చేయడానికి సుముఖత ఏర్పడింది. కేవలం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోనే 1,954 ఎకరాలను తీసుకుంటుండడం వల్ల దాదాపు 600 మందికి పైగా రైతులు లబ్ధిపొందనున్నారు. నక్కర్తమేడిపల్లి రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం వల్ల పక్కనే ఉన్న నానక్‌నగర్, తాడిపర్తి రైతులు ఒకే అనే పరిస్థితి మారింది. రేపు తీర్మాణ పత్రాన్ని తహసీల్దార్‌కు ఫార్మాసిటీకి భూములు ఇవ్వడానికి మొదట తీవ్ర వ్యతిరేకత, సీపీఎం నాయకుల పాదయాత్రకు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల ఆందోళనలకు నక్కర్తమేడిపల్లి గ్రామమే వేదికైంది. మొదట్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న పక్క జిల్లాలోని భూములు తీసుకుంటామని జేసీ తెలియజేయడంతో రైతుల్లో ఒకేసారి మార్పు వచ్చింది. ఒకనోక దశలో గ్రామ సర్పంచ్ పాశ్ఛ భాషా, ఎంపీటీసీ మోటె శ్రీశైలం, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులకు తెలియకుండానే రైతులే స్వయంగా జేసీని కలిసి మా భూములిస్తామని తెలియజేసే అవకాశం వచ్చింది. అధిక శాతం రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్పంచ్ రెండు రోజుల కింద గ్రామస్తులు, రైతులతో సమావేశమై ఫార్మాకు భూములిచ్చే విషయమై చర్చించారు. సమావేశంలో అధిక శాతం మంది రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో సంతకాల సేకరణ, తీర్మాణాన్ని చేశారు. తీర్మాణం విషయమై సర్పంచ్ భాషా శుక్రవారం సరూర్‌నగర్ ఆర్డీఓను కలిసి ఫార్మాకు భూములిచ్చే సుముఖతపై తెలియజేశారు. అనంతరం తహసీల్దార్‌ను కూడ కలిశారు. సోమవారం రోజు కూడ రైతులతో సమావేశమైన సర్పంచ్ ఫార్మాకు భూములివ్వడానికి సిద్ధమైనట్లు, కాని ఇచ్చే పరిహారం కన్న కొంచెం పెంచి ఇస్తే న్యాయంగా ఉంటుందనే విషయంలో కూడ జేసీ అలోచన చేయాలని తీర్మాణం చేశారు. గ్రామ పంచాయతీలో చేసిన తీర్మాణ పత్రాన్ని బుధవారం సర్పంచ్ భాషా, తహసీల్దార్‌కు ఇవ్వనున్నారు. తీర్మాణ పత్రాన్ని జేసీకి, ఆర్డీఓకు పంపి భూసర్వేకు తహసీల్దార్ అనుమతి తీసుకోనున్నారు. వారంలో భూసర్వేకు ప్రణాళిక నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఫార్మాకు భూములు తీసుకోవడానికి తహసీల్దార్ పద్మనాభరావు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జేసీ నుంచి అనుమతి రాగానే సర్వేయర్, రెవెన్యూ, టీఎస్ఐఐసీ శాఖల ఆధ్వర్యంలో రైతుల వారిగా భూసర్వే చేయనున్నారు. నక్కర్తమేడిపల్లి గ్రామంలో కేవలం 184, 213, 247 నంబర్లల్లోనే కాక 76,101,118,131,129,219,236,237,245,426,430,448, 454 తదితర సర్వే నంబర్లల్లోని భూములను సైతం ఫార్మాకు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అదే విధంగా తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పలు సర్వే నంబర్లల్లో మరో వెయ్యి ఎకరాలకు పైగా భూములను తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అసైన్‌్డ భూముల సేకరణ అనంతరం ఆయా గ్రామాల్లోని పట్టా భూములను తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ పద్మనాభరావును సంప్రదించగా సర్పంచ్ తీర్మాణ పత్రాన్ని ఇవ్వగానే జేసీకి, ఆర్డీఓకు పంపి భూసర్వేకు అనుమతి తీసుకుంటానని అన్నారు. -
పరిహారం చెల్లింపుపై చర్చలు విఫలం
♦ నక్కర్తమేడిపల్లి భూములు తీసుకోం ♦ నానక్‌నగర్, తాడిపర్తి రైతులతో పరిహారం ఇచ్చే విషయంలో చర్చలు జరుపుతాం ♦ ఆ గ్రామాల్లో రైతులు ఒప్పుకోకపోతే మహబూబ్‌నగర్ జిల్లాలో భూములు తీసుకుంటాం ♦ జేసీ రజత్‌కుమార్‌సైనీ యాచారం: ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి భూములను తీసుకునేది లేద§ýని, ఆ గ్రామ రైతులు పరిహారం చెల్లింపు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నందున ఆ భూములను తీసుకునే విషయంలో విత్‌డ్రా అవుతున్నట్లు జేసీ రజత్‌కుమార్‌సైనీ తెలిపారు. ముచ్చర్ల ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి భూముల సేకరణ విషయంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆ గ్రామ రైతులతో జేసీ రెండో దఫా చర్చలు జరిపారు. చర్చల ప్రారంభంలో సర్పంచ్ పాశ్ఛ భాషా మాట్లాడుతూ ఎకరా భూమికి రూ. 15లక్షలు చెల్లిస్తే భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నట్లు జేసీకి తెలియజేశారు. జేసీ కల్పించుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇంతకు ముందు భూమి సేకరించిన గ్రామాల్లో ఇచ్చినట్టుగానే రూ. 8లక్షలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. ప్రభుత్వం నింబంధనలకు వ్యతిరేకంగా పైసా కూడా పెంచి ఇచ్చేది లేదన్నారు. ఇంతలోనే కొందరు రైతులు భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.15లక్షలకు పైగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తాం.. లేదంటే భూములిచ్చేది లేదని ఆందోళనకు దిగారు. దీంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ భూములను తీసుకోం...ఇక నక్కర్తమేడిపల్లి రైతులతో పరిహారం చెల్లింపు విషయంలో చర్చలు జరిపేది లేదని చెప్పి సమావేశం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిపోయారు. అనంతరం సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భూసేకరణ విషయంలో నక్కర్తమేడిపల్లి రైతులు మొండిగా వ్యవహరిస్తున్నందున ఆ గ్రామ భూములు తీసుకునే విషయంలో విత్‌డ్రా అవుతున్నట్లు తెలిపారు.యాచారం మండలంలోని భూముల కంటే పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో తక్కువ ధరకు వచ్చే భూములను తీసుకుంటామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే తన తపన తప్పా రైతులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. యాచారం మండలంలో ఎకరా భూమి రూ. 8 లక్షలు పెట్టి కొనుగోలు చేసే బదులు పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకరా రూ. 3 నుంచి రూ. 4 లక్షలకే ఎకరా భూమిని కొనుగోలు చేస్తామన్నారు. నక్కర్తమేడిపల్లి రైతులతో సమావేశం కూడా నిర్వహించలేదని తెలిపారు. నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల రైతులతో మాత్రమే సమావేశం అవుతామని తెలిపారు. రైతుల్లో ఆందోళన ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రెవెన్యూ భూములను తీసుకునేది లేదని జేసీ తెలియజేయడంతో ఆ గ్రామ రైతుల్లో ఆందోళన మొదలైంది. జేసీతో సమావేశమైన రైతులు ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రూ. 8 లక్షలు కాకున్నా కొంచెం పెంచైనా పరిహారం ఇవ్వడానికి జేసీ ఒప్పుకుంటే భూములు ఇస్తామని రైతులు అభిప్రాయానికి వచ్చారు. కొంతమంది రైతులు స్వయంగా జేసీని కలిసి రూ. 8 లక్షలైనా సరే మా భూములిస్తామని జేసీకి చెప్పారు. సర్పంచ్ పాశ్ఛ భాషా, ఉప సర్పంచ్ చిగురింత శ్రీనువాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కర్నాటి రంగారెడ్డి తదితరులు మరోమారు జేసీని కలిసి మీ మాటకు గౌరవం ఇచ్చి భూములు ఇవ్వడానికి త్వరలో గ్రామసభ పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఫార్మాసిటీ మాస్టర్‌ప్లాన్ గడువు పెంపు
ఆగస్టు 11 వరకు ప్రతిపాదనల స్వీకరణ అర్హతల ఆధారంగా కన్సల్టెన్సీ ఎంపిక ఆసక్తి వ్యక్తం చేసిన తొమ్మిది సంస్థలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మాసిటీకి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనల స్వీకరణకు తొలుత జూలై 31 గడువు విధించగా, తాజాగా ఆగస్టు 11 వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) శుక్రవారం సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన కన్సల్టెన్సీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ టీఎస్ఐఐసీ తొలుత జూన్ 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన సంస్థలు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గడువు విధించింది. 20కి పైగా సంస్థలు ఆసక్తి కనబరిచినా చివరకు తొమ్మిది సంస్థలు మాత్రమే ప్రతిపాదనల సమర్పణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటిలో రెండు ఇంగ్లాండ్, ఒకటి హాంకాంగ్‌కు చెందిన కన్సల్టెన్సీలు కాగా, మిగతావి జాతీయ సంస్థలు వున్నట్లు సమాచారం. అయితే సమగ్ర ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనల సమర్పణకు గడువు కావాలని ఈ సంస్థల నుంచి వినతులు అందడంతో గడువు పెంచుతూ టీఎస్ఐఐసీ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు పరిశీలించిన తర్వాతే.. ప్రతిపాదిత ఫార్మాసిటీలో జనావాసాలు, వర్క్స్టేషన్లు, కాలుష్య వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనపై టీఎస్ఐఐసీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో అనుభవమున్న క న్సల్టెన్సీల నుంచి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. గడువులోగా కన్సల్టెన్సీల నుంచి అందే ప్రతిపాదనలు, సంస్థ అనుభవం, సాంకేతిక నైపుణ్యం తదితరాలు పరిశీలించిన తర్వాతే కన్సల్టెన్సీని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన కన్సల్టెన్సీ సమర్పించే సమగ్ర ప్రణాళిక ఆమోదం పొందిన వెంటనే ఫార్మాసిటీలో తొలిదశ అభివృద్ధి పనులు చేపట్టాలనీ టీఎస్ఐఐసీ నిర్ణయించింది. 11వేల ఎకరాల్లో... రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అవసరమైన 11 వేల ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. రెవెన్యూ విభాగం సర్వే కూడా పూర్తి చేయడంతో భూ సేకరణపై దృష్టి సారించారు. ఫార్మాసిటీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫార్మాసిటీలో అనుమతులు కోరుతూ ఇప్పటికే 350కు పైగా పెద్దా, చిన్నా ఫార్మా పరిశ్రమల నుంచి టీఎస్ఐఐసీకి దరఖాస్తులు అందాయి. -
ఔషధనగరికి చిక్కుముళ్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది ఔషధనగరి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీకి అడుగడుగునా చిక్కుముళ్లే ఎదురవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ మొదలుకాకపోవడానికి బాలారిష్టాలే కారణంగా కనిపిస్తోంది. కందుకూరు మండలం ముచ్చర్లలో 10,939 ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్లో ఫార్మారంగ దిగ్గజాలతో కలిసి స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఔషధనగరిని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రతిపాదిత ప్రాంతంలో భూసేకరణను వేగవంతం చేసి.. టీఐఐసీకి అప్పగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద క్షేత్రస్థాయి సర్వేకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు భూసేకరణ ప్రక్రియ ఆషామాషీకాదని అర్థమైంది. అటవీశాఖ అంగీకరించేనా? గుర్తించిన విస్తీర్ణంలో 6,097 ఎకరాలు అటవీశాఖకు చెందిన భూమి ఉంది. తాడిపర్తి, కుర్మిద్ద, ముద్విన్ రిజర్వ్‌ఫారెస్ట్‌లోని ఈ భూములను సేకరించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సేకరించే భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని అటవీశాఖకు కేటాయించడానికి రాష్ట్ర సర్కారు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూములను బదలాయించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. అటవీ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు దీనిపై ఫైలు సిద్ధం కాలేదు. ఈ తరుణంలో కేంద్ర సర్కారు ఆమోదముద్ర పడేంతవరకు భూసేకరణ జరిపేందుకు వీలుపడదు. మరోవైపు పక్కనే ఉన్న ‘దిల్' భూములను కూడా ఔషధనగరి కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 1,642.38 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ఈ భూమి సేకరించడంలో కాలయాపన జరుగుతోంది. దిల్ భూముల్లో టౌన్షిప్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. అసైన్డ్‌దారులతో చిక్కులు! ముచ్చర్లలోని సర్వే నంబర్ 288లో రెవెన్యూ రికార్డు ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, అందులో 460 ఎకరాలు లెక్కతేలడంలేదు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్(ఈటీఎస్) సర్వేలో కేవలం 2,286 ఎకరాలు మాత్రమే తేలడంతో గుర్తించిన విస్తీర్ణంలో వ్యత్యాసం కనిపిస్తోంది. గట్ నంబర్లకు ఈటీఎస్ సర్వేకు కొంత తేడా రావడం సర్వసాధారణమే. మరోవైపు భూ లభ్యత లెక్క తప్పిందని జుట్టుపీక్కుంటున్న రెవెన్యూ గణానికి అందులోనూ పట్టా భూములు ఉండడం మరింత చిరాకు కలిగిస్తోంది. 381 ఎకరాల మేర ప్రైవేటు వ్యక్తుల సాగుబడిలో ఉండగా, 282 ఎకరాలను ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. అయితే, అసైన్డ్‌దారులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశంపై జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ నేతృత్వంలో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పట్టాలు పొందినప్పటికీ, పొజిషన్లో లేన ందున పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. అయితే, ప్రభుత్వం పొజిషన్ చూపకపోవడంతోనే అసైన్డ్‌దారులు కబ్జాలో లేరని, అది వారి తప్పుగా భావించడంలో అర్థంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టతవస్తే కానీ భూసేకరణ సాఫీగా జరిగే అవకాశంలేదు. వివాదరహిత భూమి 2,537 ఎకరాలే! ఫార్మాసిటీకి గుర్తించిన 10,939 ఎకరాల్లో వివాదరహిత భూమి కేవలం 2,537 ఎకరాలు మాత్రమే ఉంది. 6,099.09 ఎకరాల మేర అటవీ భూముల సేకరణపై కేంద్రం క్లియరెన్స్ రావాల్సి ఉండగా, పట్టా, అసైన్డ్‌దారులకు సంబంధించిన వివాదం తేలేవరకు దాదాపు 663 ఎకరాలను సేకరించే వీలుపడదు. దిల్ భూముల పరిస్థితీ అంతే. ప్రభుత్వ స్థాయిలో జరిగే చర్చల అనంతరమే ఈ భూములను స్వాధీనం చేసుకోవాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో ఔషధనగరి స్థాపన కోసం ఈ స్థలాలను టీఐఐసీకి అప్పగించడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశంలేకపోలేదు. ఫార్మాసిటీకి ప్రతిపాదిత భూములు ప్రభుత్వ భూములు: 3,200 దిల్ భూములు: 1,642.38 అటవీ భూములు: 6,097.09 -
ఫార్మాసిటీ @ ముచ్చర్ల
కేసీఆర్ నిర్ణయం.. ఫార్మారంగ ప్రతినిధులతో కలసి ఏరియల్ సర్వే హైదరాబాద్ ఫార్మా సిటీ ఎక్కడ : రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల విస్తీర్ణం : 11,000 ఎకరాలు పెట్టుబడి : రూ. 30,000 కోట్ల పెట్టుబడికి స్థానిక కంపెనీల సంసిద్ధత ఉపాధి : ప్రత్యక్షంగా, పరోక్షంగా 70,000 మందికి ఇంకా : పరిశ్రమలతోపాటు ఫార్మా విశ్వవిద్యాలయం, పరిశోధన సంస్థ ఏర్పాటు.. ఉద్యోగులు, కార్మికుల కోసం టౌన్షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ప్రాంతం వేదిక కానుంది. ఇక్కడ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ పేరుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అధునాతన ఫార్మా నగరాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ర్టంలోని ఫార్మా దిగ్గజాలతో కలసి బుధవారం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. ఫార్మా సిటీకి అవసరమైన స్థలాన్వేషణలో భాగంగా ఉదయం బేగంపేట నుంచి బయలుదేరి వెళ్లి కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చేరుకున్నారు. విహంగ వీక్షణం ద్వారా సమీప ప్రాంతాలను పరిశీలించారు. ఆమనగల్లు మండల పరిధిలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను కూడా తిలకించారు. ఫార్మా, కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు ముచ్చర్ల ప్రాంతం అత్యంత అనువుగా ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాన్ని కేసీఆర్ రెండుసార్లు చుట్టివచ్చారు. అనంతరం అక్కడే పారిశ్రామిక ప్రతినిధులతో గంటసేపు భేటీ అయ్యారు. 11 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పారిశ్రామికవాడకు ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ పేరును ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఫార్మా పరిశ్రమలతో పాటు ఫార్మా విశ్వవిద్యాలయం, ఫార్మా పరిశోధనా సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కోసం ఇక్కడే టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఫార్మా కంపెనీలతో సమీప ప్రాంతాలు కాలుష్యమయం కాకుండా చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి హాని లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మాసిటీలో స్థానిక ఫార్మా కంపెనీలే రూ. 30 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ముచ్చర్ల ప్రాంతం అనువుగా ఉందని వ్యాపారవేత్తలు కూడా అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఫార్మా ప్రతినిధులతో సమావేశం, మధ్యాహ్న భోజనం తర్వాత 2.30 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఫార్మా రంగ దిగ్గజాలైన పార్థసారథిరెడ్డి(హెటిరో), కె.రత్నాకర్‌రెడ్డి(హెటిరో), కె.సతీష్‌రెడ్డి(డాక్టర్ రెడ్డీస్), కె.నిత్యానంద రెడ్డి(అరబిందో), ఎం. నారాయణరెడ్డి(విర్కో), పి.ఈశ్వర్‌రెడ్డి(బీడీఎంఏ), ఎం.ఎస్.ఎన్.రెడ్డి(ఎంఎస్ఎన్ ల్యాబ్స్), సంతోష్(వివి మెడ్ ), డాక్టర్ ఎస్.ఆనంద్(సాగర్ గ్రూప్), ఎం.మోహన్‌రావు(సైనుడ్), వి.కృష్ణారెడ్డి(కృష్ణా డ్రగ్స్) తదితరులు ముఖ్యమంత్రితో పాటు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ ఎండీ జయేష్‌రంజన్, ఇతర అధికారులు కూడా సీఎం వెంట ఉన్నారు. ఈ పర్యటన వివరాలను తెలియజేస్తూ సీఎం కార్యాలయం ఓ నోట్‌ను విడుదల చేసింది. తక్షణమే పది వేల కోట్లు పెడతాం ఫార్మా సిటీలో తక్షణమే రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు బల్క్‌డ్రగ్స్ ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. ప్రతిపాదిత ఫార్మాసిటీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరిస్తే కొన్నేళ్లలోనే రూ. 30 వేల కోట్ల మేర పెట్టుబడుల్ని ఆకర్శించవచ్చని అంచనా వేసింది. పెద్ద కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా ఏర్పాటయ్యేలా సమీకృత పారిశ్రామికవాడగా ఫార్మాసిటీని తీర్చిదిద్దనున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎం. నారాయణరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవ పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ముందే పారిశ్రామికవేత్తలతో కలిసి భూములను పరిశీలించడం ద్వారా ఫార్మా రంగానికి రాష్ర్ట ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించారని ప్రశంసించారు. ఫార్మా సిటీ రూపకల్పనకు ప్రభుత్వం త్వరలోనే కన్సల్టెంట్‌ను నియమిస్తుందని ఆయన చెప్పారు. కాగా, పరిశ్రమల ఏర్పాటుకు ముచ్చర్ల ప్రాంతం అనుకూలంగా ఉందని, అమెరికా ఆహార ఔషధ నియంత్రణ(యూఎస్ ఎఫ్‌డీఏ) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేందుకు వీలుంటుందని ఫార్మా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఫార్మాసిటీకి ప్రభుత్వం.. కృష్ణా జలాలను అందిస్తుందని భావిస్తున్నాయి.