ఫార్మాసిటీ మాస్టర్‌ప్లాన్ గడువు పెంపు | master plan of pharmacity extended | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీ మాస్టర్‌ప్లాన్ గడువు పెంపు

Published Sat, Aug 1 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

master plan of pharmacity extended

ఆగస్టు 11 వరకు ప్రతిపాదనల స్వీకరణ  
 అర్హతల ఆధారంగా కన్సల్టెన్సీ ఎంపిక  
 ఆసక్తి వ్యక్తం చేసిన తొమ్మిది సంస్థలు
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మాసిటీకి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనల స్వీకరణకు తొలుత జూలై 31 గడువు విధించగా, తాజాగా ఆగస్టు 11 వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) శుక్రవారం సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన కన్సల్టెన్సీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ టీఎస్‌ఐఐసీ తొలుత జూన్ 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన సంస్థలు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గడువు విధించింది. 20కి పైగా సంస్థలు ఆసక్తి కనబరిచినా చివరకు తొమ్మిది సంస్థలు మాత్రమే ప్రతిపాదనల సమర్పణకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటిలో రెండు ఇంగ్లాండ్, ఒకటి హాంకాంగ్‌కు చెందిన కన్సల్టెన్సీలు కాగా, మిగతావి జాతీయ సంస్థలు వున్నట్లు సమాచారం. అయితే సమగ్ర ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనల సమర్పణకు గడువు కావాలని ఈ సంస్థల నుంచి వినతులు అందడంతో గడువు పెంచుతూ టీఎస్‌ఐఐసీ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది.
 
 అర్హతలు పరిశీలించిన తర్వాతే..
 
 ప్రతిపాదిత ఫార్మాసిటీలో జనావాసాలు, వర్క్‌స్టేషన్లు, కాలుష్య వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనపై టీఎస్‌ఐఐసీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో అనుభవమున్న క న్సల్టెన్సీల నుంచి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. గడువులోగా కన్సల్టెన్సీల నుంచి అందే ప్రతిపాదనలు, సంస్థ అనుభవం, సాంకేతిక నైపుణ్యం తదితరాలు పరిశీలించిన తర్వాతే  కన్సల్టెన్సీని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన కన్సల్టెన్సీ సమర్పించే సమగ్ర ప్రణాళిక ఆమోదం పొందిన వెంటనే ఫార్మాసిటీలో తొలిదశ అభివృద్ధి పనులు చేపట్టాలనీ టీఎస్‌ఐఐసీ నిర్ణయించింది.
 
 11వేల ఎకరాల్లో...
 
 రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అవసరమైన 11 వేల ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. రెవెన్యూ విభాగం సర్వే కూడా పూర్తి చేయడంతో భూ సేకరణపై దృష్టి సారించారు. ఫార్మాసిటీ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫార్మాసిటీలో అనుమతులు కోరుతూ ఇప్పటికే 350కు పైగా పెద్దా, చిన్నా ఫార్మా పరిశ్రమల నుంచి టీఎస్‌ఐఐసీకి దరఖాస్తులు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement