ఫార్మాసిటీకి భూములు రెడీ
♦ నక్కర్తమేడిపల్లి రైతులు ఏకగ్రీవ తీర్మాణం
♦ ఎకరాకు పరిహారం రూ. 8 లక్షలకు మించి ఇవ్వాలని విన్నపం
♦ రేపు తీర్మాణ పత్రాన్ని ఇవ్వనున్న సర్పంచ్, రైతులు
♦ తీర్మాణం పత్రాన్ని ఇవ్వగానే జేసీకి, ఆర్డీఓకు
♦ భూసర్వేకు అనుమతి తీసుకోనున్న తహసీల్దార్
యాచారం: ముచ్చర్ల ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రైతులు భూములు ఇవ్వడానికి రెడీ అయ్యారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారమైన, లేదా ఎకరాకు రూ. 15 లక్షలైన పరిహారం ఇస్తేనే భూములిస్తామని మొదట్లో మొండికేశారు. గత వారం యాచారం ఎంపీడీఓ కార్యాలయంలో నక్కర్తమేడిపల్లి రైతులతో జేసీ రజత్‌కుమార్‌సైనీ, సరూర్‌నగర్ ఆర్డీఓ సుధాకర్‌రావు, తహసీల్దార్ పద్మనాభరావు సమావేశమైనారు. ఈ సమావేశంలో రైతులు మొండిగా వ్యవహరించడంతో జేసీ ఆగ్రహాంతో పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన భూములనైన తీసుకుంటాం కాని మీ నక్కర్తమేడిపల్లి భూములను మాత్రం తీసుకునేది లేదని తేల్చి చెప్పారు.
దీంతో రైతులు కొంచెం మెతకవైఖరి వచ్చింది. ఇన్నాళ్లు ఫార్మాకు భూములు పోతే , వచ్చే డబ్బులతో ఇతర గ్రామాల్లో సాగు యేగ్యంగా ఉన్న భూములు, ప్లాట్లనైన కొనుగోలు చేసుకోవచ్చని కలలకన్న రైతులకు జేసీ హెచ్చరిక మింగుడు పడదనిగా మారింది. అత్యధిక అసైన్‌్డ భూముల్లో రైతులు సగం వరకు సాగు చేసుకోవడం, మిగితా భూములను పశువులు, మేకలు, గొర్రెల మేపకానికి వాడుకోవడం జరుగుతుంది. కాని ఎనాడు కూడ ఆ భూముల్లో పెట్టుబడులు పెట్టడమే కాని ..రూ. లక్షల్లో ఆదాయం పొందిన దాఖాలాలు లేవు. ఈ నేపథ్యంలో ఫార్మాకు తీసుకోవడం వల్ల ఒకేసారి ఎకరాకు రూ. 8 లక్షలు ఇస్తుండడడం వల్ల రైతుల్లో భూములిచ్చేయడానికి సుముఖత ఏర్పడింది. కేవలం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోనే 1,954 ఎకరాలను తీసుకుంటుండడం వల్ల దాదాపు 600 మందికి పైగా రైతులు లబ్ధిపొందనున్నారు. నక్కర్తమేడిపల్లి రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం వల్ల పక్కనే ఉన్న నానక్‌నగర్, తాడిపర్తి రైతులు ఒకే అనే పరిస్థితి మారింది.
రేపు తీర్మాణ పత్రాన్ని తహసీల్దార్‌కు
ఫార్మాసిటీకి భూములు ఇవ్వడానికి మొదట తీవ్ర వ్యతిరేకత, సీపీఎం నాయకుల పాదయాత్రకు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల ఆందోళనలకు నక్కర్తమేడిపల్లి గ్రామమే వేదికైంది. మొదట్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న పక్క జిల్లాలోని భూములు తీసుకుంటామని జేసీ తెలియజేయడంతో రైతుల్లో ఒకేసారి మార్పు వచ్చింది. ఒకనోక దశలో గ్రామ సర్పంచ్ పాశ్ఛ భాషా, ఎంపీటీసీ మోటె శ్రీశైలం, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులకు తెలియకుండానే రైతులే స్వయంగా జేసీని కలిసి మా భూములిస్తామని తెలియజేసే అవకాశం వచ్చింది. అధిక శాతం రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్పంచ్ రెండు రోజుల కింద గ్రామస్తులు, రైతులతో సమావేశమై ఫార్మాకు భూములిచ్చే విషయమై చర్చించారు.
సమావేశంలో అధిక శాతం మంది రైతులు సుముఖత వ్యక్తం చేయడంతో సంతకాల సేకరణ, తీర్మాణాన్ని చేశారు. తీర్మాణం విషయమై సర్పంచ్ భాషా శుక్రవారం సరూర్‌నగర్ ఆర్డీఓను కలిసి ఫార్మాకు భూములిచ్చే సుముఖతపై తెలియజేశారు. అనంతరం తహసీల్దార్‌ను కూడ కలిశారు. సోమవారం రోజు కూడ రైతులతో సమావేశమైన సర్పంచ్ ఫార్మాకు భూములివ్వడానికి సిద్ధమైనట్లు, కాని ఇచ్చే పరిహారం కన్న కొంచెం పెంచి ఇస్తే న్యాయంగా ఉంటుందనే విషయంలో కూడ జేసీ అలోచన చేయాలని తీర్మాణం చేశారు. గ్రామ పంచాయతీలో చేసిన తీర్మాణ పత్రాన్ని బుధవారం సర్పంచ్ భాషా, తహసీల్దార్‌కు ఇవ్వనున్నారు. తీర్మాణ పత్రాన్ని జేసీకి, ఆర్డీఓకు పంపి భూసర్వేకు తహసీల్దార్ అనుమతి తీసుకోనున్నారు.
వారంలో భూసర్వేకు ప్రణాళిక
నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఫార్మాకు భూములు తీసుకోవడానికి తహసీల్దార్ పద్మనాభరావు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జేసీ నుంచి అనుమతి రాగానే సర్వేయర్, రెవెన్యూ, టీఎస్‌ఐఐసీ శాఖల ఆధ్వర్యంలో రైతుల వారిగా భూసర్వే చేయనున్నారు. నక్కర్తమేడిపల్లి గ్రామంలో కేవలం 184, 213, 247 నంబర్లల్లోనే కాక 76,101,118,131,129,219,236,237,245,426,430,448, 454 తదితర సర్వే నంబర్లల్లోని భూములను సైతం ఫార్మాకు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అదే విధంగా తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పలు సర్వే నంబర్లల్లో మరో వెయ్యి ఎకరాలకు పైగా భూములను తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అసైన్‌్డ భూముల సేకరణ అనంతరం ఆయా గ్రామాల్లోని పట్టా భూములను తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ పద్మనాభరావును సంప్రదించగా సర్పంచ్ తీర్మాణ పత్రాన్ని ఇవ్వగానే జేసీకి, ఆర్డీఓకు పంపి భూసర్వేకు అనుమతి తీసుకుంటానని అన్నారు.