భూములు తీసుకుంటే మా బతుకుదెరువు ఎలా..?
► ఫార్మాకు భూములు ఇవ్వబోమని నక్కర్తమేడిపల్లి రైతుల తీర్మానం
► ఉప తహసీల్దార్‌కు భాస్కర్‌కు వినతిపత్రం
యాచారం: ఏళ్లుగా ఆ భూములపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాం, నేడు ఫార్మాకు మా పట్టా భూములు తీసుకుంటే మేం ఎక్కడికి పోవాలి..? ఏలా బతకాలి..? అంటు నక్కర్తమేడిపల్లి పట్టా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట కొంతమంది రైతులు గురువారం ఉదయం సమావేశమయ్యారు. గ్రామంలోని పట్టా భూములను ఫార్మాకు ఇచ్చేది లేదని సమావేశంలో తీర్మానించారు. పట్టా భూములు తీసుకుంటే పరిహారంతోపాటు భూమికి భూమి ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. భూములు తీసుకుంటే మేమెక్కక భూములు కొనుగోలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి ఏ గ్రామంలో కూడా ఎకరా భూమి వచ్చే అవకాశం లేదు, ఇక బతికేది ఏలా? అంటూ సమావేశంలో చర్చించారు.
గ్రామ సర్పంచ్ పాశ్ఛ భాషా, ఎంపీటీసీ సభ్యుడు మోటె శ్రీశైలం, ఉప సర్పంచ్ చిగురింత శ్రీనివాస్‌రెడ్డి, గ్రామానికి చెందిన సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, వివిధ పార్టీల ముఖ్య నాయకులు లేకుండానే రైతులు సమావేశమయ్యారు. నక్కర్తమేడిపల్లి గ్రామంలోని పట్టా భూములను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని రైతులు మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ భాస్కర్‌కు వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్‌ను తక్షణమే కలెక్టర్‌కు, ప్రభుత్వానికి పంపి తమకు న్యాయం జరిగేలా కృషి చేయాలని వారు కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామన్నారు. గురువారం రాత్రి గ్రామంలో మరి కొంతమంది రైతులు సమావేశమై గ్రామానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టా భూములను ఫార్మాకు ఇచ్చేలా చర్చించినట్లు తెలిసింది. భూములు ఇవ్వడానికి సమ్మతం తెలిపే రైతులు సోమవారం తహసీల్దార్ కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఓ రైతు యాచారంలో విలేకరులతో తెలిపాడు.