భూములు ఇచ్చేందుకు సిద్ధం
♦ ముందుకు వచ్చిన మీర్‌ఖాన్‌పేట రైతులు
♦ గతంలో సర్వేనంబర్ 112లో భూసేకరణపై కోర్టుకు వెళ్లడంతో స్టే
♦ తాజాగా భూములిస్తామని తహసీల్దార్‌కు వినతిపత్రం
కందుకూరు: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మండలంలోని మీర్‌ఖాన్‌పేట పరిధిలోని సర్వే నంబర్ 112లోని అసైన్డ్ రైతులు కొందరు ముందుకొచ్చారు. సంబంధిత సర్వే నంబర్‌లో రికార్డుల ప్రకారం 613.30 ఎకరాలు ఉండగా వాస్తవంగా ఉన్న భూమి 842.22 ఎకరాలు. రికార్డుల ప్రకారం 294.28 ఎకరాల్లో అసైన్డ్‌దారులు, 335.21 ఎకరాల్లో ఆక్రమణదారులు ఉన్నారు. మిగతాది పట్టా, మైనింగ్, రాళ్లు, గుట్టలు, ఖాళీ భూములు ఉన్నాయి. కాగా, ప్రభుత్వం జీఓ 45 ప్రకారం సంప్రదింపుల ద్వారా ఎకరం రూ.8 లక్షల చొప్పున అసైన్డ్ భూములను తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో కొందరు రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తీరుపై హైకోర్టుకు వెళ్లగా ఆగస్టు 17న 8 వారాలు స్టే విధించారు. ఈ నేపథ్యంలో, మళ్లీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సదరు సర్వే నంబర్‌లో భూసేకరణ చేపట్టకుండా అధికారులు ఆగిపోయారు అధికారులు. తాజాగా ఆ సర్వే నంబర్‌లోని పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వం ఇవ్వజూపిన ధరకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ గురువారం ఎంపీటీసీ సత్తయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ సుశీలను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసైన్డ్ రైతులు కె.రాములు, శంకర్, రఘుపతి, జంగయ్య, బి.రాములు, హన్మంత్ తదితరులు మాట్లాడుతూ.. 112 సర్వే నంబర్‌లో దాదాపు 300 మందికి పైగా అసైన్డ్ రైతులం ఉన్నామని, అందులో 200 మందికి పైగానే భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పరిహారం అందించాలని అధికారులను కోరినట్లు వారు తెలిపారు.