Meerkhanpet
-
నేడు మీర్ఖాన్పేటకు సీఎం రేవంత్‌రెడ్డి
కందుకూరు: రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించను న్నారు. అధికారులు, నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శశాంక బుధవారం సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు. నెట్ జీరో సిటీలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, రైతులకు ప్లాట్లు కేటాయించనున్న లేఅవుట్లో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4 గంటలకు అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఏర్పాట్లు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట టీజీఐఐసీ ఈడీ పవన్, ఆర్డీఓ సూరజ్‌కుమార్, డీఈఓ సుశీంధర్‌రావు, తహసీల్దార్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కోటి కాంతులు!
♦ రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ‘పవర్‌గ్రిడ్’ ♦ ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా ♦ సామర్థ్యం : 4,800 మెగావాట్లు ♦ నిర్మాణ వ్యయం : రూ.600 కోట్లు ♦ 470 కిలోమీటర్ల లైన్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు ♦ 6 సర్క్యూట్ల ద్వారా 3000మెగావాట్ల సరఫరా సామర్థ్యం ♦ 765/400 కేవీ జీఐఎస్ విద్యుత్ సబ్ స్టేషన్ రాష్ట్రంలో రెండోది పూర్తిగా గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ (జీఐఎస్) సాంకేతికతతో నిర్మిస్తున్న రెండో అతిపెద్ద సబ్ స్టేషన్ ఇదే కావడం విశేషం. తెలంగాణ కాంతులీననుంది. విద్యుత్ వెలుగు జిలుగులతో చిమ్మచీకటిని పారదోలనుంది. కరెంట్ కోతలను అధిగమించిన రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించే దిశగా ముందడుగు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న 765/400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌తో రాష్ట్రంలో నిరాటంకంగా కరెంట్ సరఫరా కానుంది. ఇక్కడ నిర్మిస్తున్న 765/400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్రానికి తెచ్చుకోవడానికి సులువు అవుతుంది. రంగారెడ్డి జిల్లా నుంచి డోకూరి వెంకటేశ్వరరెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీ చేరువలో నిర్మిస్తున్న 765/400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. చత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర వార్దా వరకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న పవర్‌గ్రిడ్ సంస్థ.. ఈ 765/400 కేవీ సబ్‌స్టేషన్ సామర్థ్యంతో పొరుగు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీర్చనుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి.. ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర వార్దా వరకు, అక్కడి నుంచి నిజామాబాద్ మిట్టపల్లి వరకు, అక్కడి నుంచి మీర్ఖాన్ పేటలో నిర్మిస్తున్న 765/400 కేవీ సబ్‌స్టేషన్ వరకు రెండు లైన్లద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. మొత్తం 470 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న కారిడార్‌కు సుమారు రూ.2,400 కోట్లు ఖర్చయింది. ఇక్కడి నుంచి ఆరు సర్క్యూట్ల ద్వారా విద్యుత్‌ను పంపిణీ చేయనున్నా రు. ఒకటి హైదరాబాద్ వైపు, మరొకటి కర్నూల్ వైపు, మరో రెండు సర్క్యూట్ల ద్వారా స్థానికంగా ట్రాన్స్‌కో పరిధిలోని 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, మరో రెండు సర్క్యూట్ల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా వెల్టూరుకు విద్యుత్ సరఫరా చేయనున్నా రు. ఒక్కో సర్క్యూట్లో 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రతిపాదిత రెండు ట్రాన్స్ఫార్మర్లలో ఒకటి అందుబాటులోకి రావడంతో కర్నూలు సర్క్యూట్‌కు విద్యుత్ సరఫరా మొదలైంది. మహబూబ్‌నగర్ వైపు లైన్ల నిర్మాణం పూర్తి కాక అటు వైపు మినహా మిగతా మూడు సర్క్యూట్లకు విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సర్క్యూట్కూ కరెంట్ సరఫరా చేయాలని పవర్‌గ్రిడ్ సంస్థ భావిస్తోంది. రూ.600 కోట్ల వ్యయంతో.. మీర్ఖాన్పేట సర్వేనంబర్ 120లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 62.5 ఎకరాలు సేకరించి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. దీంట్లో రూ.600 కోట్ల అంచనా వ్యయంతో సబ్‌స్టేషన్‌కు అంకురార్పణ చేసింది. గ్రిడ్ కుప్పకూలడం, ఇతరత్రా నిర్వహణా వైఫ ల్యాలను నివారించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ క్రమంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిర్మాణాలు చేప ట్టిన పవర్‌గ్రిడ్.. రెండు రియాక్టర్లు, రెండు బస్ రియాక్టర్లు, రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 4800 మెగావాట్ల సామర్థ్యంతో సబ్ స్టేషన్‌ను నిర్మించారు. -
భూములు ఇచ్చేందుకు సిద్ధం
♦ ముందుకు వచ్చిన మీర్ఖాన్పేట రైతులు ♦ గతంలో సర్వేనంబర్ 112లో భూసేకరణపై కోర్టుకు వెళ్లడంతో స్టే ♦ తాజాగా భూములిస్తామని తహసీల్దార్‌కు వినతిపత్రం కందుకూరు: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మండలంలోని మీర్ఖాన్పేట పరిధిలోని సర్వే నంబర్ 112లోని అసైన్డ్ రైతులు కొందరు ముందుకొచ్చారు. సంబంధిత సర్వే నంబర్లో రికార్డుల ప్రకారం 613.30 ఎకరాలు ఉండగా వాస్తవంగా ఉన్న భూమి 842.22 ఎకరాలు. రికార్డుల ప్రకారం 294.28 ఎకరాల్లో అసైన్డ్‌దారులు, 335.21 ఎకరాల్లో ఆక్రమణదారులు ఉన్నారు. మిగతాది పట్టా, మైనింగ్, రాళ్లు, గుట్టలు, ఖాళీ భూములు ఉన్నాయి. కాగా, ప్రభుత్వం జీఓ 45 ప్రకారం సంప్రదింపుల ద్వారా ఎకరం రూ.8 లక్షల చొప్పున అసైన్డ్ భూములను తీసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో కొందరు రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తీరుపై హైకోర్టుకు వెళ్లగా ఆగస్టు 17న 8 వారాలు స్టే విధించారు. ఈ నేపథ్యంలో, మళ్లీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సదరు సర్వే నంబర్లో భూసేకరణ చేపట్టకుండా అధికారులు ఆగిపోయారు అధికారులు. తాజాగా ఆ సర్వే నంబర్లోని పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వం ఇవ్వజూపిన ధరకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ గురువారం ఎంపీటీసీ సత్తయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ సుశీలను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసైన్డ్ రైతులు కె.రాములు, శంకర్, రఘుపతి, జంగయ్య, బి.రాములు, హన్మంత్ తదితరులు మాట్లాడుతూ.. 112 సర్వే నంబర్లో దాదాపు 300 మందికి పైగా అసైన్డ్ రైతులం ఉన్నామని, అందులో 200 మందికి పైగానే భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. పరిహారం అందించాలని అధికారులను కోరినట్లు వారు తెలిపారు.