అంతర్జాతీయ హంగులతో అత్యాధునికంగా ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్
ఫార్మాసిటీ భూముల్లో ఐటీ పార్కులు, విద్యుత్ కార్ల పరిశ్రమలు.. మహేశ్వరంలో మరో విశ్వనగరం
హయత్‌నగర్, శంషాబాద్ వరకు మెట్రో విస్తరణ
ట్రిపుల్ ఆర్ చుట్టూ, చెరువులు, కాల్వ గట్లపై తాటి, ఈత చెట్లు పెంచుతామన్న ముఖ్యమంత్రి
లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం’ పథకం ప్రారంభం.. గీత కారి్మకులకు రక్షణ కిట్లు అందజేత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటుచూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీ కోసం సేకరించిన 20 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఐటీ పార్కులు, కాలుష్య రహిత ఫార్మాస్యూటికల్ కంపెనీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమలు, బ్యాటరీ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. న్యూయార్క్ తరహాలో మహేశ్వరంలో మరో విశ్వనగరాన్ని తీర్చిదిద్దుతాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం పథకం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కల్లు గీత కార్మీకుల రక్షణ కోసం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు (ఎవరెస్ట్ అధిరోహించిన మాలోతు పూర్ణతో కూడిన బృందం) రూపొందించిన కిట్లను ఈ సందర్భంగా కల్లు గీత కార్మీకులకు అందజేశారు. కిట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పర్యాటక ప్రదేశంగా రంగారెడ్డి జిల్లా
‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఉన్నాయి. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలుకుతోంది. రాబోయే రోజుల్లో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు ఓ మణిహారంగా నిలుస్తుంది. దాని చుట్టూ కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటు హయత్‌నగర్, అటు శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం..’ అని రేవంత్ చెప్పారు.
వెంచర్లలోనూ ఈత, తాటి చెట్లు
‘వృత్తిదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వీరి కోసం ప్రభుత్వ ఖాళీ భూముల్లో, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ, చెరువులు, కుంటలు, కాలువగట్లు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులకు ఇరువైపులా ఈత, తాటి చెట్లు నాటిస్తాం. వన మహోత్సవంలో భాగంగా ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటాల్సిందిగా ఎక్సైజ్, అటవీ శాఖలకు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నా. కొత్తగా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లోనూ ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు తీసుకొస్తాం. చేతి వృత్తులకు సమ న్యాయం కల్పిస్తాం.
ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ పార్టీలో చేరుతున్నారు!
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలే. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ఈ లోపే బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఫాంహౌస్‌లలో పడుకున్నోళ్లు ప్రభుత్వాన్ని కూలుస్తామంటుంటే.. ప్రజాక్షేత్రంలో తిరిగే వారి ఎమ్మెల్యేలు మాత్రం నిలబెడతామంటూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజలు ఆశించే అన్ని పనులు పూర్తి చేసి తీరుతుంది.
పోటీ పరీక్షల షెడ్యూల్‌పై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతల మాటలు విని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అయినదానికి, కాని దానికి ఆవేశపడి రోడ్లెక్కొద్దు. ఏదైనా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడండి. అంతా కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేద్దాం..’ అని సీఎం చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్‌బాబు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.
కల్లెంత?..నీళ్లెంత?
– గీత కార్మికులతో సీఎం సరదా సంభాషణ
అబ్దుల్లాపూర్‌మెట్:
‘ఏం లక్ష్మయ్యా..రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతావ్? ఎన్ని సీసాల కల్లు తీస్తావ్? తీసేదాంట్లో కల్లెంత.. నీళ్లెంత..? రోజుకు కనీసం రూ.వెయ్యి అయినా మిగులుతుందా? ఊళ్లో బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా..?’
‘ఏం రంగయ్యా.. ఏం కిష్టయ్యా.. ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కిట్టు మంచిగుందా? పనిచేస్తోందా? కిట్టును కనిపెట్టినోళ్లకు ఏమైనా దావత్ ఇచ్చారా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి లష్కర్‌గూడలో కల్లుగీత కార్మీకులతో కొద్దిసేపు ముచ్చటించారు. వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు స్పీకర్, మంత్రులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. గీత కార్మీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
వైఎస్సార్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు
2004 నుంచి 2014 మధ్య కాలంలో దివంగత నేత వైఎస్సార్ నాయకత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్ సృషే్ట. గత ప్రభుత్వం చనిపోయిన గీత కార్మీకులకు రూ.7.90 కోట్లు బకాయిపడింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment