Film City
-
రాచకొండలో ఫిలింసిటీ: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటుచూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీ కోసం సేకరించిన 20 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఐటీ పార్కులు, కాలుష్య రహిత ఫార్మాస్యూటికల్ కంపెనీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమలు, బ్యాటరీ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. న్యూయార్క్ తరహాలో మహేశ్వరంలో మరో విశ్వనగరాన్ని తీర్చిదిద్దుతాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం పథకం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కల్లు గీత కార్మీకుల రక్షణ కోసం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు (ఎవరెస్ట్ అధిరోహించిన మాలోతు పూర్ణతో కూడిన బృందం) రూపొందించిన కిట్లను ఈ సందర్భంగా కల్లు గీత కార్మీకులకు అందజేశారు. కిట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రదేశంగా రంగారెడ్డి జిల్లా ‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఉన్నాయి. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలుకుతోంది. రాబోయే రోజుల్లో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు ఓ మణిహారంగా నిలుస్తుంది. దాని చుట్టూ కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటు హయత్‌నగర్, అటు శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. వెంచర్లలోనూ ఈత, తాటి చెట్లు ‘వృత్తిదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వీరి కోసం ప్రభుత్వ ఖాళీ భూముల్లో, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ, చెరువులు, కుంటలు, కాలువగట్లు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులకు ఇరువైపులా ఈత, తాటి చెట్లు నాటిస్తాం. వన మహోత్సవంలో భాగంగా ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటాల్సిందిగా ఎక్సైజ్, అటవీ శాఖలకు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నా. కొత్తగా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లోనూ ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు తీసుకొస్తాం. చేతి వృత్తులకు సమ న్యాయం కల్పిస్తాం. ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ పార్టీలో చేరుతున్నారు! ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలే. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ఈ లోపే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఫాంహౌస్‌లలో పడుకున్నోళ్లు ప్రభుత్వాన్ని కూలుస్తామంటుంటే.. ప్రజాక్షేత్రంలో తిరిగే వారి ఎమ్మెల్యేలు మాత్రం నిలబెడతామంటూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజలు ఆశించే అన్ని పనులు పూర్తి చేసి తీరుతుంది. పోటీ పరీక్షల షెడ్యూల్‌పై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతల మాటలు విని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అయినదానికి, కాని దానికి ఆవేశపడి రోడ్లెక్కొద్దు. ఏదైనా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడండి. అంతా కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేద్దాం..’ అని సీఎం చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్‌బాబు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కల్లెంత?..నీళ్లెంత? – గీత కార్మికులతో సీఎం సరదా సంభాషణ అబ్దుల్లాపూర్‌మెట్: ‘ఏం లక్ష్మయ్యా..రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతావ్? ఎన్ని సీసాల కల్లు తీస్తావ్? తీసేదాంట్లో కల్లెంత.. నీళ్లెంత..? రోజుకు కనీసం రూ.వెయ్యి అయినా మిగులుతుందా? ఊళ్లో బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా..?’ ‘ఏం రంగయ్యా.. ఏం కిష్టయ్యా.. ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కిట్టు మంచిగుందా? పనిచేస్తోందా? కిట్టును కనిపెట్టినోళ్లకు ఏమైనా దావత్ ఇచ్చారా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి లష్కర్‌గూడలో కల్లుగీత కార్మీకులతో కొద్దిసేపు ముచ్చటించారు. వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు స్పీకర్, మంత్రులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. గీత కార్మీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైఎస్సార్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు 2004 నుంచి 2014 మధ్య కాలంలో దివంగత నేత వైఎస్సార్ నాయకత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్ సృషే్ట. గత ప్రభుత్వం చనిపోయిన గీత కార్మీకులకు రూ.7.90 కోట్లు బకాయిపడింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. -
సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువే
సాక్షి, అమరావతి: ఈనాడు అధినేత రామోజీరావు తెలుగు రాష్ట్రాల మధ్య శకుని పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. దేశ స్వాతంత్య్రమంత వయసు కలిగిన రామోజీరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నంత మాత్రాన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా దళిత వ్యతిరేకులని రామోజీ భావిస్తున్నారా? అని ప్రశ్నిచారు. అసైన్డ్ భూములను ఆక్రమించి ఫిలింసిటీని నిర్మించుకున్నది రామోజీరావు అయితే అసైన్డ్ భూములపై బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ధీరోదాత్తుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. దళితులు కళ్లు తెరిస్తే ఫిల్మ్‌సిటీని దున్నేస్తారని హెచ్చరించారు. పేదోడి బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులను అడ్డుకున్న దురహంకారి రామోజీ అని మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తెలంగాణలో ఉందా? అని ప్రశ్నిచారు. సీఎం జగన్ పట్ల దళితులకున్న ప్రేమను చంద్రబాబు బృందం ఎప్పటికీ కొనలేదని స్పష్టం చేశారు. దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, ఈనాడు రామోజీరావుకు తెలియవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవేమిటి మరి? పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ నాలుగేళ్లలో పారదర్శకంగా రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించిన సీఎం జగన్ ఖచ్చితంగా దళిత బంధువు అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలిస్తే లబ్ధిదారుల్లో దళిత కుటుంబాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా మెరుగైన స్థితికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఇటీవల సర్వే ద్వారా కేంద్రమే గుర్తించిందని తెలిపారు. దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డులో ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువేనని స్పష్టంచేశారు. -
సీరియల్ షూటింగ్లో అగ్నిప్రమాదం.. పూర్తిగా కాలిబూడిదైన సెట్
ప్రముఖ హిందీ సీరియల్ సెట్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ముంబైలోని ఫిలిం సిటీలో 'ఘమ్ హై కిసికీ ప్యార్ మే' సీరియల్ సెట్లో భారీగా మంటలంటుకున్నాయి. దాదాపు సెట్ అంతా ధగ్దమైనట్లు కనిపిస్తోంది. ఈ సెట్ పరిసరాల్లోనే సీరియల్ యూనిట్ షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్ సమీపంలో శూన్య స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మరో సెట్‌కు సైతం ఈ మంటలు వ్యాపించాయి. కాగా సీరియల్ యూనిట్ అంతా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఓ బ్లాస్ట్‌కు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. నటీనటులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై సెట్ బయటకు పరుగులు తీయగా వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే సెట్లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రామోజీ రావు పై భూకబ్జా కేసుకు సీపీఎం డిమాండ్
-
యూపీ సీఎంతో బాలీవుడ్ హీరో భేటీ
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ముంబై ట్రైడెంట్ హోటల్లో మంగళవారం ఆయన ముఖమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన అప్ కమింగ్ మూవీ "రామ్ సేతు" పై చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా ఫిల్మ్‌సిటీ ప్రణాళికల గురించి చర్చించిన మొదటి వ్యక్తులలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. వీరిద్దరూ చర్చలు జరుపుతున్న చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం యూపీ సీఎం మంగళవారం ముంబై చేరుకున్నారు. లక్నో మున్సిపల్ బాండ్ల లాంచింగ్ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. లక్నో మునిసిపల్ కార్పొరేషన్ (ఎల్ఎంసి) గత నెలలో బాండ్ ఇష్యూ ద్వారా రూ .200 కోట్లు సమీకరించింది. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామికవేత్తలతో పాటు బాలీవుడ్ ప్రముఖులను కలవనున్నారు. రామ్ సేతు పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్షయ్ ఇటీవల విడుదల చేశారు. అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతోపాటు విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మరోవైపు యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీనిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఏడాది సెప్టెంబరులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఫిలింసిటీ ఏర్పాటుపై చర్చించేందుకుఆదిత్యనాథ్ బుధవారం బాలీవుడ్ చిత్రనిర్మాతల ప్రతినిధి బృందాన్ని కలవనున్నట్లు నిర్మాత రాహుల్ మిత్రా తెలిపారు. ప్రముఖ నిర్మాతలు సుభాష్ ఘాయ్, బోనీ కపూర్, రాజ్‌కుమార్ సంతోషి, సుధీర్ మిశ్రా, రమేష్ సిప్పీ, టిగ్మన్షు ధులియా, మాధుర్ భండార్కర్, ఉమేష్ శుక్లా, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, పెన్ స్టూడియోస్‌కు చెందిన జయంతిలాల్ గడా, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ తదితరులు వీరిలో ఉన్నారు. -
శివార్లలో సినిమా సిటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1,500–2,000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనందున సినిమా షూ టింగులు, సినిమా థియేటర్లు పునఃప్రారం భించవచ్చని సీఎం ప్రకటించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి–విస్తరణపై చర్చ జరిగింది. ‘తెలంగాణలో చిత్ర పరిశ్రమ ఆధారంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోయి, థియేటర్లు నడవక అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.88 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లు కొనసాగించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో షూటింగ్‌లు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి వరద బాధితుల సహాయార్థం విరాళాల చెక్కులను అందజేస్తున్న సినీనటులు చిరంజీవి, నాగార్జున, మై హోమ్స్ గ్రూప్ డైరెక్టర్ రామ్. చిత్రంలో సీఎస్ సోమేశ్‌కుమార్ సినిమా సిటీలో స్టూడియోలకు స్థలాలు.. ‘హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి–విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినైనా ఒడిలో చేర్చుకొనే గుణం ఈ నగరానికి ఉంది. షూటింగులు సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే తలంపుతో ఉంది. ప్రభుత్వం 1,500–2,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకొనేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు స్థలం కేటాయిస్తుంది. ఎయిర్ స్ట్రిప్‌తోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. సీఎంకు ‘గ్రేటర్ వరద’ విరాళాలు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలకు తమ వంతు సాయంగా మై హోమ్ గ్రూప్‌తోపాటు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విరాళాలు అందించారు. ‘మై హోం’తరఫున ఆ సంస్థ డైరెక్టర్ రామ్ రూ. 5 కోట్లు అందించగా చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ. 50 లక్షల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
టాలీవుడ్‌కి గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్‌తో భారీగా నష్టపోయిన చిత్ర పరిశ్రమను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. త్వరలోనే థియేటర్లను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శనివారం సీఎం కేసీఆర్‌ను మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసి వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పరిశ్రమ గురించి అడిగి తెలుసుకున్నారు. (చదవండి : సీఎం కేసీఆర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ ) అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోయిందని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తనవంతు సాయం చేస్తుందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ సిటీ శివార్లులో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సీటీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఫిల్మ్‌సిటీ కోసం 1500-2000 ఎకరాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు త్వరలోనే బల్గేరియా ఫిల్మ్‌సిటీని పరిశీలించనున్నారు. -
హస్తినాపూర్‌లో అతిపెద్ద ఫిల్మ్ సిటీ
లక్నో : యమున ఎక్స్‌ప్రెస్‌వేపై హస్తినాపూర్ వద్ద దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మంగళవారం ప్రకటించారు. సినీ పరిశ్రమ ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన యోగి నూతన ఫిల్మ్ సిటీ ప్రతిపాదనపై చర్చించారు. దీనిపై యమున ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి అథారిటీ ప్రజెంటేషన్ ఇచ్చిందని, ప్రతిపాదిత ఫిల్మ్ సిటీని దేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. గంగ, యమునా నదుల మధ్య ఈ ప్రాంతం ఉందని, యమునా నదికి సమాంతరంగా నిర్మించిన యమునా ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీ, ఆగ్రాలను కలిపేందుకు నిర్మించారని చెప్పారు. ఈ ప్రాంతమంతా రెండు పవిత్ర నదుల మధ్యన ఉంటుందని చెప్పుకొచ్చారు. హస్తినాపూర్ చుట్టూ ప్రతిపాదిత ఫిల్మ్‌సిటీని నిర్మించనున్నామని వెల్లడించారు. ఇక ఈనెల 20న యోగి ఆదిత్యానాథ్ ప్రముఖ దర్శకులు మధుర్ భండార్కర్‌తో సమావేశమైన సందర్భంగా ప్రతిపాదిత ఫిల్మ్ సిటీపై ఆయనతో చర్చించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయని అధికారులు తెలిపారు. -
దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మాణం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్‌లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూసి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఘజియాబాద్, బులంద్‌షహర్, హాపూర్, బాగ్పట్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలతో కూడిన మీరట్ డివిజన్ అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం సమీక్షించారు. అంతేకాకుండా నోయిడా కన్వెన్షన్ అండ్ హాబిటాట్ సెంటర్, గోల్ఫ్ కోర్సు , మెట్రో విస్తరణ, షూటింగ్ రేంజ్ వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. (నిరుద్యోగులకు ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్..) మొత్తంగా గౌతమబుద్ధనగర్‌లో ప్రస్తుతం ఏడు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మీరట్‌లోని రింగ్ రోడ్ వద్ద మునుపెన్నడూ లేని విధంగా ట్రాఫిక్‌ను సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టును సైతం 2025 మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం సహించమని, నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని సీఎం యోగి పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడితే దోషుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతోపాటు కఠినచర్యలు తీసుకుంటామని ఆదిత్యనాథ్ హెచ్చరించారు. (పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లివ్వాలి) -
ఆర్ఎఫ్సీని తలదన్నేలా తెలంగాణలో కొత్త ఫిల్మ్‌సిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మించాలన్నది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయమని రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న ప్రపంచస్థాయి ఫిల్మ్‌సిటీ (రామోజీ ఫిల్మ్ సిటీ- ఆర్ఎఫ్సీ) ఉందని.. దీన్ని తలదన్నేలా మరో ఫిల్మ్‌సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందన్నారు. ప్రపంచ స్థాయిలో అత్యున్నత సాంకేతికతో ఏర్పాటుకానున్న ఈ ఫిల్మ్‌సిటీ నిర్మాణంలో సినీ పరిశ్రమ భాగం పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ సదస్సులో పాల్గొన్న జయేశ్ రంజన్.. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న అత్యున్నత విధానాలపై అధ్యయనం జరిపి లండన్‌లో అమలవుతున్న విధానమే అత్యున్నతమైనదని గుర్తించిందన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైం సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని జయేశ్ రంజన్ తెలిపారు. అయితే పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లు వేల సంఖ్యలో ఉంటున్నాయని, వీటిని నిలిపేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. వెబ్సైట్లను బ్లాక్ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని తాము చేస్తున్న డిమాండ్‌కు మద్దతు తెలపాలని కోరారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా క్లస్టర్ ఏర్పాటు కోసం రూ. 500 కోట్ల విలువజేసే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. ఇందులో మల్టిమీడియా సిగ్నేచర్ టవర్‌ను నిర్మిస్తామన్నారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్ల కొరతను ఈ ప్రాజెక్టుతో తీర్చుకోవచ్చన్నారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా సహకరిస్తోందని, ఇలాంటి తోడ్పాటు అరుదుగా లభిస్తుందని ఐఫా డెరైక్టర్ సబ్బాస్ జోసెఫ్ అభినందించారు. పేద, మధ్యతరగతి ప్రజలు మల్టిప్లెక్స్ థియేటర్ల టికెట్ల భారాన్ని మోయలేరని, అందువల్ల ఎక్కువ సంఖ్యలో థియేటర్లను ఏర్పాటు చేస్తేనే ప్రజలకు సినిమా చేరుతుందని బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్ర పేర్కొన్నారు. సినీ పరిశ్రమలోని అన్ని శాఖల్లో తీవ్రంగా ఉన్న నిపుణుల కొరతను అధిగమించేందుకు యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు పేర్కొన్నారు. బాలల చిత్రాలు, యానిమేషన్ చిత్రాలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని సినీ నిర్మాత అల్లు అరవింద్ పిలుపునిచ్చారు. సదస్సులో దిగ్గజ దర్శకుడు రమేశ్ సిప్పి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ సినీనటులు నాగార్జున, వివేక్ ఒబెరాయ్, ఆస్కార్ అవార్డు గ్రహిత రసూల్ పోకుట్టి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
ఫిలింసిటీ నిర్మిస్తే ఆత్మహత్యలు ఆగవు: స్వామి అగ్నివేశ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై స్వామి అగ్నివేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలింసిటీ నిర్మిస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగవని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి అగ్నివేశ్‌తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, సాక్షి ఈడీ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ‘సర్వే’తోనూతనోత్తేజం
మంచాల: ఫిలింసిటీ ఏర్పాటు కోసం రాచకొండ గుట్టల్లో భూములు పరిశీలించేందుకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ సర్వే చేయడం స్థానిక ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపింది. సీఎం వస్తారనే సమాచారంతో జనం భారీ ఇక్కడికి సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నిత్యం నిర్మానుష్యంగా ఉండే రాచకొండ పరిసర ప్రాంతం జనంతో కిటకిటలాడింది. పోలీసులు అడుగడుగునా తనిఖీలతో జనం రాకుండా వాహనాలను అడ్డుకున్నారు. అయినా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మూడుసార్లు చక్కర్లు.. ఉదయం 11.40 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్లోంచి దిగారు. నేరుగా సమీపంలోని వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ రాచకొండ గుట్టలు, వాటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన వివరాలతో కూడిన మ్యాపులను పరిశీలించారు. 12-19 గంటలకు రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలు హెలికాప్టర్‌పై రాచకొండ గుట్టలను ఏరియల్ సర్వే చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ, రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల కలెక్టర్లు శ్రీధర్, చిరంజీవులుతో కలిసి 12-23 నుంచి 12-50 గంటల వరకు ఏరియల్ సర్వే చేశారు. హెలికాప్టర్లో ఇలా మూడుసార్లు చక్కర్లు కొట్టారు. తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిలో భోజనం చేశారు. అధికారులతో మాట్లాడి రాచకొండ గుట్టల విస్తీర్ణం, ప్రాముఖ్యత వంటి అంశాలపై 2-15 గంటల దాకా చర్చించారు. తిరిగి 2-20 గంటలకు మరోసారి ఏరియల్ సర్వే చేసి తిరిగి వెళ్లిపోయారు. రాచకొండ గుట్టల్లో ముఖ్యమంత్రి 2 గంటల 40 నిమిషాలు గడిపారు. పోలీసుల భారీ బందోబస్తు.. రాచకొండ గుట్టల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ చేయనుండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. రాచకొండ ముఖ ద్వారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తిప్పాయిగూడ గ్రామం నుంచే వాహనాలు రాకుండా నిలిపివేశారు. సీఎం వేదిక వద్దకు మీడియా ప్రతినిధులను అనుమతించ లేదు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. -
హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్
-
హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్ సిటీ: కేసీఆర్
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంత్రులతో కలిసి రాచకొండ ప్రాంతంలో హెలికాప్టర్‌తో ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి రంగారెడ్డి -నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ఆయన చెప్పారు. రాచకొండలో దాదాపు 31 వేల ఎకరాల భూమి ఉందని, అందువల్ల ఆ ప్రాంతం పరిశ్రమలు, విద్యాలయాలు, ఇతర సంస్థలు స్థాపించేందుకు చాలా అనుకూలమని కేసీఆర్ అన్నారు. -
రామోజీతో కేసీఆర్ భేటీ
ఫిలింసిటీని సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: రాజధాని శివారులోని రామోజీ ఫిలింసిటీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సందర్శించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన ఫిలింసిటీకి వెళ్లారు. దాదాపు ఐదు గంటల పాటు అక్కడే గడిపారు. బర్డ్ పార్క్‌ను, ఇతర ప్రదేశాలను తిలకించారు. ఫిలింసిటీ అధినేత రామోజీరావుతో కలసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్రంతో స్నేహపూర్వక వైఖరితో వెళితే బాగుంటుందని, తెలంగాణకు, హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌కు రామోజీ సూచించారు. హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. తాను తదుపరి చేపట్టబోయే ‘ఓం’ ప్రాజెక్టు గురించి కూడా ముఖ్యమంత్రికి రామోజీరావు వివరించినట్లు సమాచారం. ప్రపంచంలోని అన్ని దేవాలయాల సమాహారాన్ని ఒక చోట చేర్చి నిర్మించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని ఇటీవల ప్రధాని మోదీని కలసి ఆయన వివరించిన సంగతి తెలిసిందే. కాగా, నిత్యం ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీగా ఉండే సీఎం కేసీఆర్ ఏకంగా ఐదు గంటల పాటు ఓ ప్రైవేట్ ప్రదేశంలో గడపడం రాజకీయ, అధికార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రామోజీ ఫిలింసిటీని దాదాపుగా ఆనుకుని ఉన్న రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని నిర్మిస్తామని కేసీఆర్ ఇటీవల తరచూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రామోజీతో సీఎం భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ‘బతుకుదెరువు కోసం వచ్చిన ఆంధ్రా ప్రాంతం వారితో మాకు తగాదా లేదు. వలస వచ్చి వందలు, వేల ఎకరాలను దోపిడీ చేసిన వారిపైనే మా పోరాటం. తెలంగాణ రైతుల దగ్గర కాజేసి నిర్మించిన రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తా’ అంటూ తెలంగాణ ఉద్యమ ప్రారంభ సమయంలో వరంగల్ బహిరంగసభలో కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఫిలింసిటీకి వెళ్లి రామోజీ ఆతిథ్యం స్వీకరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఈటీవీతో కేసీఆర్ మాట్లాడుతూ.. ఫిలింసిటీ అద్భుత కట్టడమని, హైదరాబాద్‌కు మణిహారమని కితాబిచ్చారు. -
సుడిగాలి పర్యటన!
ఆమనగల్లు: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యే క హెలిక్యాప్టర్‌లో వివిధ ప్రభుత్వ శాఖ లకు చెందిన ఉన్నతాధికారులతో కలిసి వచ్చిన ఆయన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో మూడున్నర గం టల పాటు పర్యటించారు. ఫార్మా, ఫిల్మ్ సిటీ, ఇతర అవసరాల కోసం ఆమనగల్లు మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను హెలిక్యాప్టర్‌లోనే ఉండి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సీఎం దిల్‌సంస్థకు ఇచ్చిన భూములను ప్రత్యేకంగా పరిశీలించారు. అలాగే ఈ రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూములను సీఎం కేసీఆర్, ఫార్మా కంపెనీల ప్రతినిధుల బృందం సభ్యులు పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ సమీపంలోని జమ్ములబావితండా సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్, ఫార్మా ప్రతినిధులు వేర్వేరుగా నాలుగు హెలిక్యాప్టర్ల ద్వారా చేరుకున్నారు. మీడియాకు నోఎంట్రీ! సీఎం కేసీఆర్ రాకకోసం ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముచ్చర్ల సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుంచి 2 కి.మీ ముందునుంచే జమ్ములబావితండా వద్ద పోలీసులను మోహరించారు. ఈ సమయంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు తమకు పాసులు ఉన్నాయని వెళ్లడంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టీఆర్ఎస్ నాయకులను పంపిస్తూ మీడియా ప్రతినిధులను అడ్డుకోవడం ఏమిటని పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. సీఎం పర్యటన కవరేజ్ కోసం వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అనుమతి లేకపోవడంతో అక్కడే పడిగాపులుకాశారు. ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద ఆమనగల్లు మండలంలో దిల్ సంస్థకు ఇచ్చిన భూములకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్ తిలకించారు. కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంతరెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీఎం ఏరియల్ సర్వే
ఆమనగల్లు: ఫార్మాసిటీకి కావాల్సిన భూములను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం పరిశీలించనున్నారు. హెలికాప్టర్ నుంచే ఆయన భూములను పరిశీలించనుండడంతో అధికారులు ఆ భూముల్లో జెండాలు పాతారు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామిక వేత్తల బృందంతో కలిసి బుధవారం అందుకు సంబంధించిన భూములను హెలికాప్టర్ నుంచి పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ శర్మన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమనగల్లు మండల పరిధిలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను గుర్తించేందుకు వీలుగా ఆ భూముల్లో పచ్చజెండాలు పాతారు. ‘దిల్’కు 1642 ఎకరాలు కేటాయింపు మండలంలోని ఐదు గ్రామాల ప రిధిలో 1,642 ఎకరాలను దిల్ సంస్థకు ప్రభుత్వం 2007లో కేటాయించింది. ఆమనగల్లు గ్రామంలోని 16 సర్వే నెంబర్ లో 226 ఎకరాలు, 21 సర్వే నెంబర్లో 8.15 ఎకరాలు, సర్వే నెం.27లో 101 ఎకరాలు, సర్వే నెం.68లో 113ఎకరా లు, సర్వే నెం.643లో 18ఎకరాలు, స ర్వే నెం.646లో 40 ఎకరాలు, సర్వే నెం.1429లో 197 ఎకరాలు, ముద్విన్‌లో సర్వే నెం.179లో 267 ఎకరాలు, ఆకుతోటపల్లిలో సర్వే నెం.304లో 382 ఎకరాలు, చెన్నంపల్లిలో సర్వే నెం.23లో 57 ఎకరాలు, పోలెపల్లిలో సర్వే నెం.3లో 162 ఎకరాలు, సర్వే నెం.5 లో 68 ఎకరాలను దిల్ సంస్థకు కేటాయించారు. భూముల పరిశీలన జిల్లా సరిహద్దులను గుర్తించడానికి వీ లుగా అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మండలంలోని జమ్ములబావితాండా సమీపంలో దాదాపు 570 ఎకరాలను రంగారెడ్డి జిల్లా అధికారులు తమ భూములుగా రికార్డుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లా సరిహద్దులోని భూములను జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు శివకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్ మహేశ్ కొలతలు వేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి ముఖ్యమంత్రి పరిశ్రమలకు కేటాయించిన భూములపై ఏరియల్ సర్వే చేయనున్నందున అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను గుర్తించడానికి వీలుగా జెండాలు ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఏర్పాటు చేసిన వద్ద జిల్లాకు సంబందించిన భూముల ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఫిలింసిటీ కోసం.. రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణలో కొత్తగా ఫిలిం సిటీ, ఫార్మా సిటీల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం నాడు ఏరియల్ సర్వే చేయనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జల్లాల్లో ఆయన ఈ సర్వే చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సీఎం ఏరియల్ సర్వే కొనసాగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడినుంచి ఆంధ్రా ప్రాంతానికి తరలిపోకుండా ఉండేందుకు ఇక్కడే సమస్త సదుపాయాలతో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీ నిర్మించాలని కేసీఆర్ పలు సందర్భాలలో తెలిపారు. అలాగే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కూడా తరలిపోయే అవకాశం ఉన్నందున.. వాటికోసం కూడా సదుపాయాలు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో భూములను పరిశీలించి, ఫొటో ఎగ్జిబిషన్ చూస్తారు. అలాగే పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం నిర్వహిస్తారు. -
ఫార్మా, ఫిల్మ్‌సిటీల కోసం భూ పరిశీలన
ఆమనగల్లు: ఫార్మా, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కోసం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివారం అధికారులు పరిశీలించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఐఐసీ ఎండీ జేఎస్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చారు. రంగారె డ్డి జిల్లా ముచ్చర్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని పరిశీలించారు. రంగారెడ్డి కలెక్టర్ శ్రీధర్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ప్రియదర్శినిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ 3 జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతంలో ఫార్మా సిటీ, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 3న సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ సర్వే చేయనున్నారు. -
మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు ఐటీఐఆర్ ప్రాజెక్టుతో మరో కోటి జనాభా పెరుగుదల సినీ పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి హైదరాబాద్: అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా హైదరాబాద్ మహానగరం ‘మెడికల్ టూరిజం హబ్’గా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ‘కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ ’ను ఆయన ప్రారంభించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యసేవలు, పరికరాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఎంత మంచి ఆసుపత్రిని కట్టినా దానిని సరిగ్గా ప్రచారం చేసుకోకపోతే ఉపయోగం ఉండదని.. ఈ ఆసుపత్రికి తాను అంబాసిడర్‌గా, ఏజెంట్‌గా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందన్నారు. రాజధానిలో ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తున్నందున మరో కోటి మంది జనాభా పెరుగుతుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తామని, నాలుగైదు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. దాని బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకరిగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణను ఆయన కోరారు. హైదరాబాద్ వాతావరణం మరెక్కడా ఉండదని తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి, రేడియేషన్ అంకాలజిస్ట్ రమణమూర్తి, ప్రముఖ సినీ నటుడు కృష్ణ, విజయనిర్మల దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్ నా సొంతూరు: సినీ హీరో కృష్ణ ముప్పై ఏళ్లుగా తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఈ నగరమే తన సొంతూరన్న అభిప్రాయంతో ఉన్నానని ప్రముఖ సినీ నటుడు కృష్ణ చెప్పారు. ఇక్కడ సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే పెద్దదిగా నిర్మించదలచిన ఆ ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ ఫిల్మ్‌సిటీగా పేరుపెట్టాలని సూచించారు. -
ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరైతేనే బాగుంటుంది!
-
భాగ్యనగరం.. విశ్వనగరం!
సాక్షి, హైదరాబాద్: నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం విశ్వనగరంగా మారనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైఫై సిటీ, ఫార్మా సిటీ, సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో నగరంలోని నిర్మాణ రంగంలో ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగానికి మళ్లీ మంచి రోజులొస్తాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ‘ప్రపంచస్థాయి ఉత్తమ స్థిరాస్తి బిల్లు’ను తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశ, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి త్వరలోనే ఏకగవాక్ష విధానాన్ని కూడా తీసుకురానున్నారు. ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ప్రభుత్వ వెబ్సైట్లో ఫార్మా, రియల్టీ, కెమికల్స్.. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలంటాయి. వీటిని పూర్తి చేసి సబ్మిట్ చేస్తే చాలు. అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాత పది రోజుల్లో నేరుగా సీఎస్ కార్యాలయం నుంచి సంబంధిత పారిశ్రామికవేత్తలకు ఫోన్ వస్తుంది. ఆపై నేరుగా చర్చించిన తర్వాత.. 15 రోజుల్లో ఓ ఎన్వలెప్లో ప్రాజెక్ట్ అనుమతులు మంజూరవుతాయన్నమాట. వచ్చే యాభై ఏళ్ల నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలతో కూడిన సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. అలాగే స్థిరాస్తి అభివృద్ధికి అడ్డంకిగా మారుతోన్న నాలా పన్ను, మైనింగ్ సెస్, ఏవియేషన్ అనుమతులనూ ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సరికొత్త పారిశ్రామిక విధానంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోవైపు ఒక్కో సిటీ.. నగరం చుట్టూ ఒక్కో వైపు ఒక్కో సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే శామీర్‌పేటలో ఫార్మా సిటీని నిర్మిస్తోంది. విదేశీ సంస్థల రాకపోకల నిమిత్తం ఇక్కడే విమానాశ్రయాన్ని కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కలసి ఐటీఐఆర్ విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సార్లు సమీక్ష జరిపారు. ఇన్క్యుబేషన్ సెంటర్ ఏర్పాటు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలతో ఐటీ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదన వంటి చర్యల వల్ల హైదరాబాద్ అభివృద్ధిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. విమానాల అడ్డా.. ప్రస్తుత సమయంలో టాటా, రుయాగ్ కంపెనీలు కలసి ఆదిభట్లలో విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి సానుకూల పరిణామంగా బిల్డర్లు అభివర్ణిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇదే బాటలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పయనించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పటిష్టమైన పోలీసింగ్.. పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ప్రకటన దేశ, విదేశీ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఉద్యమ సమయంలో శాంతిభద్రతల సమస్య కారణంగా నగరాన్ని విడిచిన సంస్థలు మళ్లీ నగరానికి రావొచ్చు. స్పోర్ట్స్ సిటీ.. భాగ్యనగరాన్ని అమ్యూజ్మెంట్, స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు దేశ, విదేశీ సంస్థల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే భాగ్యనగరంలో ఆధునిక పరిజ్ఞానం గల ఆసుపత్రుల సంఖ్య ఎక్కువే. అందుకే రకరకాల చికిత్సల కోసం వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికొస్తారు. వీరి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది కార్యరూపం దాల్చితే మెడికల్ టూరిజంగా నగరం అభివృద్ధి చెందుతుంది. -
భూముల కోసం వేట
- ఫిలింసిటీ కోసం స్థలాల అన్వేషణ - జిల్లా యంత్రాంగానికి సినిమా కష్టాలు - భూ లభ్యతపై సందేహాలు - జవహర్‌నగర్‌పై యంత్రాంగం మొగ్గు - దీంతోనైనా అక్రమాలకు కళ్లెం వేయవచ్చని అంచనా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఫిలింసిటీ’ ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు వేయి ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే అనువైన భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భూ లభ్యతపై దృష్టి సారించిన రెవెన్యూ యంత్రాం గం.. ఒకేచోట ఆ స్థాయిలో భూసమీకరణ అంత సులువుకాదని భావిస్తోంది. నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని ఏర్పాటు చేయాలని యోచించినప్పటికీ, అట వీ ప్రాంతం కావడం.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద నాయక్ ప్రకటించిన నేపథ్యం లో.. రాచకొండ విషయంలో సాధ్యాసాధ్యాలపై అంచనా వేస్తోంది. అటవీ ప్రాంతంలో బిట్లు బిట్లుగానేవేయి ఎకరాలు లభిస్తుంది తప్ప నిర్దేశిత స్థాయి లో భూమి అందుబాటులోలేదని రెవెన్యూ యం త్రాంగం అంటోంది. అంతేగాకుండా రిజర్వ్ ఫారెస్ట్ కు నిర్దేశించిన ప్రాంతంలో కట్టడాలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నందున.. ఈ ప్రాంతంలో ఫిలింసిటీ నిర్మించాలనే ఆలోచన సరికాదని చెబుతోంది. దీంతో పలు ప్రత్యామ్నాయాలను అన్వేషిం చిన జిల్లా యంత్రాంగం ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టుకు చేరువలో ఫిలింసిటీ ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది. శంషాబాద్ పరిసరాల్లో ఫిలింసిటీని ఏర్పాటు అంశాన్ని పరిశీలించినప్పటికీ, ఈ ప్రాంతం 111జీవో పరిధిలో ఉండడంతో యోచనను విరమించుకుంది. షాబాద్ మండలం సీతారాంపూర్‌లోని దేవాదాయశాఖ భూముల్లో కూడా ఫిలింసిటీని ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే అంశం పై కూడా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జాతీయ రహదారి, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయానికి చేరువలో ఈ చోటు ఉండడం సానుకూలంగా మారుతుందని భావిస్తోంది. జవహర్‌నగర్ వైపు మొగ్గు! ఫిలింసిటీ ఏర్పాటుకు పలు భూములను పరిశీలి స్తున్న యంత్రాంగం జవహర్‌నగర్ భూములపై దృష్టిసారించింది. నగరానికి సమీపంలో ఉండడం తో ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తోంది. సుమారు 3వేల ఎకరాల భూమి ఒకే చోట లభించే అవకాశం ఉండడం.. సమీప ప్రాంతంలో విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉండడంతో జవహర్‌నగర్ భూముల ను ఫిలింసిటీకి కేటాయించేందుకు యంత్రాంగం మొగ్గు చూపుతోంది. దాదాపు 5వేల ఎకరాల విస్తీ ర్ణం కలిగిన ఈ ప్రాంతంలో దాదాపు 2వేల పైచిలు కు ఎకరాల్లో ఆక్రమణలు వెలిశాయి. ఈ కట్టడాలను తొలగించడం.. అక్రమార్కులు మళ్లీ నిర్మించుకోవడం షరా మామూలుగా మారిన తరుణంలో.. ఈ భూములను ఫిలింసిటీకి కేటాయించడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. -
తెలంగాణ పరిశ్రమ ఎదగడానికి అందరూ కృషి చేయాలి!
‘‘మన తెలంగాణా నుంచి మంచి సినిమాలు రావడానికి కనీసం ఓ ఏడేళ్లు పడుతుంది. తెలంగాణ సినిమా పరిశ్రమ ఎదగడానికి అందరూ తమ వంతు కృషి చేయాలి. రెండువేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫిల్మ్‌సిటీని ప్రభుత్వమే నడిపే విధంగా ఉంటే బాగుంటుంది’’ అని సీనియర్ దర్శకుడు బి. నరసింగరావు అన్నారు. ‘తెలంగాణ సినిమా అస్థిత్వం’ పేరుతో హైదరాబాద్‌లో జరిపిన సెమినార్‌కు ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సానా యాదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాణి శ్రీధర్, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో పాటు తెలంగాణ మేధావులు, తెలంగాణ సినీ పెద్దలు పాల్గొన్నారు. -
కొత్త ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి
-
ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి: కృష్ణ
హైదరాబాద్ : తెలంగాణలో రెండువేల ఎకరాలతో నిర్మించబోయే ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిపాదించారు. ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ... ఫిల్మ్‌సిటీ నిర్మాణాన్ని స్వాగతించింది. పలువురు సినీ పెద్దలు ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండువేల ఎకరాల్లో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని కేసీఆర్ సూచించారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తరలిపోదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో సినీ పరిశ్రమకు మేలు జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. -
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మురళీమోహన్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో రెండువేల ఎకరాల్లో ఫిలిం సిటీ అభివృద్ధి చేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ మురళీమోహన్ స్వాగతించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ చూపుతున్న చొరవ హర్షణీయం అని అన్నారు. గురువారం జరిగిన సమావేశంలో రెండువేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని సీఎం తెలిపారు. -
బెంగళూరులో ఫిల్మ్‌సిటీ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకు ముందుకొచ్చే ప్రైవేట్ సంస్థలకు పూర్తి సహకారం సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమను మరింత అృవద్ధి చేయడంలో భాగంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో బెంగళూరులో ఫిల్మ్‌సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్ట ంచేశారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు చెప్పారు. తన క్యాంప్ కార్యాలయం కష్ణా’లో ఆదివారం ఆయన దక్షిణ బారత చలన చిత్ర వాణిజ్య మండలి, కర్ణాటక చలని చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారం లేక పోవడం వల్లనే చలన చిత్ర పరిశ్రమ కుదేలవుతోందన్న భావన సరికాదని అన్నారు. చిత్ర పరిశ్రమలకు మల్టీఫ్లెక్స్‌ల వల్ల ఎదురవుతున్న బెంగళూరులో ఫిల్మ్‌సిటీ సమస్యలు, ప్రభుత్వం విధిస్తున్న సేవా పన్ను తదితర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీనిచ్చారు. రాష్ట్ర సమాచార శాఖా మంత్రి రోషన్ బేగ్ మాట్లాడుతూ.. జిల్లా, తాలూకా కేంద్రాల్లో జనతా థియేటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని అన్నారు. మల్లీఫ్లెక్స్ల ద్వారా కన్నడ చిత్రాలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు త్వరలో సీఎం నేృతత్వంలో మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు చెప్పారు. సమావేశంలో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు శశికుమార్, ఉపాధ్యక్షుడు బి.విజయ్‌కుమార్, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు హెచ్.డి.గంగరాజ్, ప్రముఖ నిర్మాత సా.రా.గోవిందు తదితరులు పాల్గొన్నారు.