ఫిల్మ్సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి: కృష్ణ
హైదరాబాద్ : తెలంగాణలో రెండువేల ఎకరాలతో నిర్మించబోయే ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిపాదించారు. ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ... ఫిల్మ్సిటీ నిర్మాణాన్ని స్వాగతించింది. పలువురు సినీ పెద్దలు ఈ సందర్భంగా కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండువేల ఎకరాల్లో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని కేసీఆర్ సూచించారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తరలిపోదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో సినీ పరిశ్రమకు మేలు జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.