రామోజీతో కేసీఆర్ భేటీ
ఫిలింసిటీని సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాజధాని శివారులోని రామోజీ ఫిలింసిటీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సందర్శించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన ఫిలింసిటీకి వెళ్లారు. దాదాపు ఐదు గంటల పాటు అక్కడే గడిపారు. బర్డ్ పార్క్‌ను, ఇతర ప్రదేశాలను తిలకించారు. ఫిలింసిటీ అధినేత రామోజీరావుతో కలసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్రంతో స్నేహపూర్వక వైఖరితో వెళితే బాగుంటుందని, తెలంగాణకు, హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌కు రామోజీ సూచించారు. హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. తాను తదుపరి చేపట్టబోయే ‘ఓం’ ప్రాజెక్టు గురించి కూడా ముఖ్యమంత్రికి రామోజీరావు వివరించినట్లు సమాచారం.
ప్రపంచంలోని అన్ని దేవాలయాల సమాహారాన్ని ఒక చోట చేర్చి నిర్మించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని ఇటీవల ప్రధాని మోదీని కలసి ఆయన వివరించిన సంగతి తెలిసిందే. కాగా, నిత్యం ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీగా ఉండే సీఎం కేసీఆర్ ఏకంగా ఐదు గంటల పాటు ఓ ప్రైవేట్ ప్రదేశంలో గడపడం రాజకీయ, అధికార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రామోజీ ఫిలింసిటీని దాదాపుగా ఆనుకుని ఉన్న రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీని నిర్మిస్తామని కేసీఆర్ ఇటీవల తరచూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రామోజీతో సీఎం భేటీకి ప్రాధాన్యత ఏర్పడిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ‘బతుకుదెరువు కోసం వచ్చిన ఆంధ్రా ప్రాంతం వారితో మాకు తగాదా లేదు. వలస వచ్చి వందలు, వేల ఎకరాలను దోపిడీ చేసిన వారిపైనే మా పోరాటం. తెలంగాణ రైతుల దగ్గర కాజేసి నిర్మించిన రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తా’ అంటూ తెలంగాణ ఉద్యమ ప్రారంభ సమయంలో వరంగల్ బహిరంగసభలో కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఫిలింసిటీకి వెళ్లి రామోజీ ఆతిథ్యం స్వీకరించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఈటీవీతో కేసీఆర్ మాట్లాడుతూ.. ఫిలింసిటీ అద్భుత కట్టడమని, హైదరాబాద్‌కు మణిహారమని కితాబిచ్చారు.