భాగ్యనగరం.. విశ్వనగరం! | telangana government start to setup WiFi City, Pharma City, Film City in city | Sakshi
Sakshi News home page

భాగ్యనగరం.. విశ్వనగరం!

Published Sat, Sep 6 2014 12:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

భాగ్యనగరం.. విశ్వనగరం! - Sakshi

భాగ్యనగరం.. విశ్వనగరం!

సాక్షి, హైదరాబాద్: నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం విశ్వనగరంగా మారనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైఫై సిటీ, ఫార్మా సిటీ, సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ  వంటి ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో నగరంలోని నిర్మాణ రంగంలో ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగానికి మళ్లీ మంచి రోజులొస్తాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.

  రానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ‘ప్రపంచస్థాయి ఉత్తమ స్థిరాస్తి బిల్లు’ను తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశ, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి త్వరలోనే ఏకగవాక్ష విధానాన్ని కూడా తీసుకురానున్నారు. ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఫార్మా, రియల్టీ, కెమికల్స్.. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలంటాయి. వీటిని పూర్తి చేసి సబ్‌మిట్ చేస్తే చాలు. అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాత పది రోజుల్లో నేరుగా సీఎస్ కార్యాలయం నుంచి సంబంధిత పారిశ్రామికవేత్తలకు ఫోన్ వస్తుంది. ఆపై నేరుగా చర్చించిన తర్వాత.. 15 రోజుల్లో ఓ ఎన్వలెప్‌లో ప్రాజెక్ట్ అనుమతులు మంజూరవుతాయన్నమాట.

  వచ్చే యాభై ఏళ్ల నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలతో కూడిన సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. అలాగే స్థిరాస్తి అభివృద్ధికి అడ్డంకిగా మారుతోన్న నాలా పన్ను, మైనింగ్ సెస్, ఏవియేషన్ అనుమతులనూ ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సరికొత్త పారిశ్రామిక విధానంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడతాయని నిపుణులు చెబుతున్నారు.

 ఒక్కోవైపు ఒక్కో సిటీ..
 నగరం చుట్టూ ఒక్కో వైపు ఒక్కో సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.  ఇందులో భాగంగానే శామీర్‌పేటలో ఫార్మా సిటీని నిర్మిస్తోంది. విదేశీ సంస్థల రాకపోకల నిమిత్తం ఇక్కడే విమానాశ్రయాన్ని కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కలసి ఐటీఐఆర్ విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సార్లు సమీక్ష జరిపారు. ఇన్‌క్యుబేషన్ సెంటర్ ఏర్పాటు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కాలేజీలతో ఐటీ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదన వంటి చర్యల వల్ల హైదరాబాద్ అభివృద్ధిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది.

 విమానాల అడ్డా..
 ప్రస్తుత సమయంలో టాటా, రుయాగ్ కంపెనీలు కలసి ఆదిభట్లలో విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి సానుకూల పరిణామంగా బిల్డర్లు అభివర్ణిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇదే బాటలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పయనించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

 పటిష్టమైన పోలీసింగ్..
 పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ప్రకటన దేశ, విదేశీ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది.  ఉద్యమ సమయంలో శాంతిభద్రతల సమస్య కారణంగా నగరాన్ని విడిచిన  సంస్థలు మళ్లీ నగరానికి రావొచ్చు.

 స్పోర్ట్స్ సిటీ..
 భాగ్యనగరాన్ని అమ్యూజ్‌మెంట్, స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు దేశ, విదేశీ సంస్థల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే భాగ్యనగరంలో ఆధునిక పరిజ్ఞానం గల ఆసుపత్రుల సంఖ్య ఎక్కువే. అందుకే రకరకాల చికిత్సల కోసం వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికొస్తారు. వీరి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది కార్యరూపం దాల్చితే మెడికల్ టూరిజంగా నగరం అభివృద్ధి చెందుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement