bhagyanagaram
-
2021.. ఓ మువ్వన్నెల పండుగ!
భాగ్యనగరం ఒకప్పుడు.. 30 వేల జనాభాతో కిటకిటలాడింది.. భవిష్యత్తు మీద బెంగతో గోల్కొండను వదిలింది.. అడిగింది లేదనకుండా ఇచ్చే అక్షయపాత్రగా అలరారింది.. చార్మినార్, హుస్సేన్‌సాగర్ వంటి నిర్మాణాలతో అబ్బురపరిచింది.. ఇప్పుడు.. కోటి జనాభాతో కిక్కిరిసిపోతోంది.. ఆధునిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.. శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటుకు ప్రణాళికలు వేసుకుంటోంది.. సరికొత్త హైదరాబాద్‌గా మారేందుకు అడుగులేస్తోంది.. అలాంటి మన హైదరాబాద్ మహానగరం త్వరలోనే ఓ అద్భుతమైన మైలు రాయిని దాటనుంది. అదేంటంటే.. 2021 నాటికి.. గోల్కొండ రాజధానిగా అవతరించి 525 ఏళ్లు కానుంది. భాగ్యనగరం రూపుదిద్దుకుని 430 ఏళ్లు పూర్తవుతుంది. సికింద్రాబాద్ ఏర్పడి 215 ఏళ్లు అవుతుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఘన చరిత్రను గుర్తు చేసుకునేందుకు, ఈ నగరాన్ని భావితరాలకు చెక్కు చెదరకుండా అందించేందుకు ‘హైదరాబాద్ హెరిటేజ్ ఫెస్ట్’పేరిట హైదరాబాద్ ట్రేల్స్, వసామహ ఆర్కిటెక్ట్, హెరిటేజ్ ఫ్యూచర్స్ వంటి పలు సంస్థలు ముందుకొచ్చాయి. హైదరాబాద్ గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు, ప్రజలకు నగరంపై అవగాహన కలిగించేందుకు ఏడాది పొడవునా పలుకార్యక్రమాలు నిర్వహించనున్నాయి. తొలి అడుగు పడిందక్కడ.. 1496: గోల్కొండ రాజధాని నగరంగా ఏర్పాటుకు తొలి అడుగు.. కాకతీయుల హయాంలో సైనిక పోస్టు, చిన్న గ్రామాల సముదాయంగా ఉన్న గోల్కొండ.. రాజధానిగా ఎదిగేందుకు 1496లో బీజం పడింది. ఈ ప్రాంతంపై దండెత్తి విధ్వంసం సృష్టించిన బహమనీ సామ్రాజ్యం.. సుల్తాన్ కులీని సుబేదారు (గవర్నర్)గా నియమించింది. పర్షియా నుంచి వచ్చిన ఆయన కుతుబ్‌షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. చూస్తుండగానే గోల్కొండ పట్టణంగా పురోగమించింది. అలా 95 ఏళ్లు కొనసాగింది. సరికొత్త పరిజ్ఞానం గోల్కొండ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు.. నాటి ఆధునికతను వాడుకుంటూ ముందుకు సాగారు. నీటి వనరుల కోసం గురుత్వాకర్షణ శక్తితో అందేలా ఎత్తయిన ప్రాంతంలో దుర్గం చెరువును తవ్వించారు. అక్కడి నుంచి ప్రత్యేక చానెళ్ల ద్వారా నీటిని తరలించి కోటలో నిల్వచేసేందుకు కటోరా హౌస్‌ను నిర్మించారు. ఆ నీళ్లు కోట భాగానికి చేరేందుకు ఈజిప్షియన్ వాటర్ వీల్ పరిజ్ఞానాన్ని వినియోగించారు. అంటే మనం చూసే జెయింట్ వీల్ తరహాలో ఉండే ఏర్పాటన్న మాట. అది తిరిగే కొద్దీ కింది నీళ్లు పైకి చేరతాయి. అలా రెండు, మూడు యంత్రాలతో పూర్తి పైకి చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా దిగువకు పంపుతారు. అలాగే కింద అలికిడి అయితే పై వరకు వినిపించేలా ధ్వని శాస్త్రం ఆధారంగా ఏర్పాట్లు చేయించారు. ఇక గానా బజానాలు, కుస్తీ పోటీలు, వేడుకలతో నిత్యం కోట కళకళలాడుతుండేది. 1591 భాగ్యనగరానికి పునాది.. ‘చెరువులో చేపల్లాగా ఈ కొత్త నగరం జనంతో నిండిపోవాలి’.. మహ్మద్ కులీ కుతుబ్‌షా దైవ ప్రార్థన ఇదీ. అప్పటికే గోల్కొండ నగరం దాదాపు 30 వేల జనాభాతో కిటకిటలాడుతోంది. దీంతో నగరాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో ఆయన పట్టాభిషిక్తుడైన 11 ఏళ్ల తర్వాత.. మూసీకి ఆవల కొత్త నగరానికి శంకుస్థాపన చేశాడు. శత్రువుల భయంతో కోట గోడల మధ్య గోల్కొండ ఉండగా, శత్రువులు లేరన్న ధీమాతో గోడల అవసరం లేకుండా హైదరాబాద్‌ను నిర్మించాడు. ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమీన్ ప్రణాళికతో నగరం రూపుదిద్దుకుంది. చూస్తుండగానే నగరం నలుచెరగులా విస్తరించింది. నిజాం(గవర్నర్)గా నియమితుడైన మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్.. అసఫ్‌జాహీ పాలనకు శ్రీకారం చుట్టాడు. తొలుత ఆయన ఔరంగాబాద్ నుంచే పాలన సాగించారు. కానీ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో మళ్లీ నగర విస్తరణ పెరిగింది. మలుపు తిప్పిన ఆరో నిజాం ముస్లిమేతరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, పరమత సహనానికి ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ.. హైదరాబాద్ నిర్మాణం విషయంలో అసఫ్జాహీలు ప్రత్యేకత చాటుకున్నారు. హిందూ సంస్కృతిపై దౌర్జన్యాల అప ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ఆధునిక హైదరాబాద్‌కు బీజం పడింది. అప్పటికే రైల్వే లాంటి అరుదైన ప్రయాణ వసతి భాగ్యనగరాన్ని చేరింది. నూతన హైదరాబాద్ శిల్పిగా ఖ్యాతికెక్కిన ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్‌కు పిలిపించింది ఆరో నిజామే. అప్పుడే విరుచుకుపడ్డ వరదలు హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేయటంతో మోక్షగుండం వచ్చి అద్భుత డ్రైనేజీ వ్యవస్థ, వరదకు అడ్డుకట్ట పడేలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నిర్మాణం జరిపిన విషయం తెలిసిందే. ఆరో నిజాం హయాంలో అందుకు ప్రణాళికలు రచించగా.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో అమలైంది. ఇక ప్రపంచ కుబేరుడిగా చరిత్రలో నిలిచిన ఏడో నిజాం.. హైదరాబాద్‌కు పూర్తి ఆధునిక రూపునిచ్చాడు. భారతదేశంలో భాగంగా ఉండాలన్న కోరిక లేక పాకిస్తాన్‌కు అనుకూల వైఖరి ప్రదర్శించిన అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ప్రస్తుత హైదరాబాద్‌లో ఈ మాత్రం వసతులు ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం మాత్రం ఆయనే. 1806 జంట నగరం వెలసిందప్పుడే ప్రపంచ జంటనగరాల జాబితాలో హైదరాబాద్–సికింద్రాబాద్లు ప్రముఖంగా నిలుస్తాయి. దానికి బీజం పడి 215 ఏళ్లు అవుతోంది. మూడో నిజాం హయాంలో సైనిక స్థావరం పేరుతో సికింద్రాబాద్‌లో ఈస్టిండియా కంపెనీ కాలు మోపింది. అది నిజాంకు మద్దతుగా ఉంటుందనీ నమ్మబలికింది. 5 వేల బ్రిటిష్ సైన్యంతో హుస్సేన్‌సాగర్‌కు ఉత్తరాన కంటోన్మెంట్ ఏర్పడింది. క్రమంగా బ్రిటిష్ అధికారులు, సైనిక పటాలాలు, స్థానికుల నివాసాలు పెరగటంతో అక్కడ తమకు ప్రత్యేకంగా నగరం ఏర్పాటుకు స్థలం చూపాలని నాటి బ్రిటిష్ రెసిడెన్సీ థామస్ సైడన్‌హామ్.. మూడో నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జాకు లేఖ రాశాడు. ప్రస్తుతం కంటోన్మెంట్ ఉన్న స్థలాన్ని కేటాయిస్తూ దానికి తన పేర సికింద్రాబాద్ అని నామకరణం చేశాడు. ఈ ప్రాంతానికి దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఉండటంతో శరవేగంగా ఆ ప్రాంతం వ్యాపారపరంగా అభివృద్ధి చెంది జనరల్ బజార్ లాంటివి విస్తరించాయి. విద్యాసంస్థలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, సాధారణ క్లబ్‌లు, చర్చిలు, తమిళ, కన్నడ, మరాఠీ, పార్సీ వారి విస్తరణ.. కొత్త దేవాలయాలు.. ఒకటేమిటి సికింద్రాబాద్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ కన్నా ప్రణాళికా బద్ధంగా, విశాలమైన రోడ్లు, ఎక్కడ చూసినా పరిశుభ్రత.. విదేశీ ప్రాంతం తరహాలో పురోగమించింది. కుతుబ్‌షాహీల హయాంలో నగరానికి పునాది పడినా.. అభివృద్ధి మాత్రం అసఫ్‌జాహీల కాలంలోనే ఊపందుకుంది. ఇక సికింద్రాబాద్ అభివృద్ధి బ్రిటిష్ వారి పాలనలో జరిగిందని చెప్పుకోవచ్చు. -
పద పదవే వయ్యారి గాలిపటమా!
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలుబోసిపోగా పరేడ్ గ్రౌండ్ పరిసరాలు మాత్రం సందర్శకులతో కిక్కిరిసి పోయాయి. నగరంలో సంక్రాంతి సందడంతా పరేడ్ గ్రౌండ్లోనేకనిపించింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ ఉత్సాహం.. పండుగ వాతావరణాన్ని చూసేందుకు రెండు కళ్లుచాలవంటే అతిశయోక్తి కాదు. ఈ హడావుడితో మైదానం చుట్టూ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మురిసిపోయింది. ఆకాశం సప్తవర్ణ శోభితమైంది. పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నగర గగనానికి కొత్తరంగులు అద్దింది. అంతర్జాతీయ పతంగుల పండుగను నగర యువత ఎంజాయ్ చేస్తోంది. అసలే పండుగ.. ఆపై వరుస సెలవులు కావడంతో సోమవారం భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. రకరకాల ఆకారాలు, రంగురంగుల పతంగులను ఎగరేస్తూ.. రాత్రి వరకు ఉత్సాహంగా గడిపారు. ఈ పండుగకోసమే వచ్చిన దేశ, విదేశాలకు చెందిన పతంగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. గాలిలో నృత్యం చేస్తున్న టైగర్, డ్రాగన్, చింపాంజీ, గరుడ వంటి రకరకాల పతంగులు చూసేందుకు ఉత్సాహం చూపించారు. గ్రౌండ్లో ఏర్పాటుచేసిన డీజే సౌండ్స్ సందర్శకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. రిమోట్ సహాయంతో రాత్రి ఆకాశంలో ఎగురవేసిన లైటింగ్ పతంగులు ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సప్తవర్ణాల పతంగులతో పరేడ్ గ్రౌండ్ పరిసరాలు కలర్పుల్గా మారాయి. అటు నెక్లెస్ రోడ్‌లోనూ కుర్రకారు ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఇదినాలుగోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం ఇది నాలుగోసారి. ఈసారి.. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, స్వీడన్, పోలాండ్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, కొరియా, కాంబోడియా, పిలిప్పీన్స్ దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. మాది గుజరాత్. వ్యక్తిగతంగా నాకు ఇది 15వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. 45 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ఇందులో పాల్గొంటున్నారు. – పవన్ సొలంకి, తెలంగాణ టూరిజం కైట్స్ కన్సల్టెంట్ -
జీయర్ స్వామివారి తిరుప్పావై యజ్ఞం సన్నిధి
రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా భాగ్యనగరంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అధ్వర్యాన తిరుప్పావై యజ్ఞం ప్రతి ధనుర్మాసంలోనూ అద్భుతంగా సాగుతూ ఉంటుంది. తిరుప్పావై అంటే శ్రీ నోము అని సిరినోము అని అర్థం. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నమ్మే శ్రీవైష్ణవ మతానువర్తులు ఏటేటా అనుసరించే ఈ వ్రతాన్ని కాత్యాయనీ వ్రతం అని కూడా అంటారు. పన్నెండుగురు వైష్ణవ ఆళ్వార్ (భగవత్ దార్శనికులు, దారి చూపిన వారు) లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ వటపత్రశాయి ఆలయంలో పెరియాళ్వార్ పెంచిన తులసితోటలో దొరికిన పాప గోదాదేవి. ఆయన మనసులో ఎప్పడికీ విష్ణువే కనుక విష్ణుచిత్తుడనే పేరు వచ్చింది. గోదాదేవి తండ్రి పెంపకంలో పరమభక్తురాలిగా ఎదిగింది. ఆమె రచించిన ముఫ్ఫయ్ తమిళ పాశురాలు (ఎనిమిది పాదాల పద్యాలు)– నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవత గ్రంథాల సారాంశాన్ని రంగరించినవి. నిష్కల్మషమైన భక్తిని అక్షరక్షరంలో ప్రత్యక్షం చేసే గోవింద గీతా ప్రబంధం తిరుప్పావై అని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వివరిస్తున్నారు. ఈసారి ధనుర్మాసోత్సవాన్ని ఆధ్యాత్మికులు శ్రీ రామేశ్వరరావు నివాస గృహంలో ఉదయం, సాయంత్రం జీయర్ స్వామి స్వయంగా తిరుప్పావై పాశురాన్ని అందరిచేత చదివించి ఆ పాశుర ప్రతిపదార్థాన్ని, సారాంశాన్ని విశేష అర్థాన్ని వివరిస్తూ నెలరోజులుగా నిర్వహిస్తున్నారు. అలతి పదాలలో అపురూపమైన అర్థాన్ని సామాన్యులకు సైతం అవగాహన అయ్యే విధంగా సంస్కృత, తమిళ, తెలుగు, ఆంగ్ల భాషలలో జీయర్ స్వామి ప్రబోధిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లక్షలాది మంది వింటున్నారు, చూస్తున్నారు.గోదాదేవికి విల్లిపుత్తూరే రేపల్లె. చెలులే గోపికలు. కావేరీ నది యమున. వటపత్రశాయే క్రిష్ణయ్య. గోపికలను తెల్లవారుజామునే నిద్రలేపి, నందగోప రాజు ఇంట నందకిశోరుడైన శ్రీ కృష్ణుని లేచి రమ్మని, నడిచి వస్తే ఆ నడకను వర్ణించి, సింహాసనంపై ఆసీనుడు కాగానే మంగళహారతులు పాడి, తమ వ్రత విధానం, సాధనం, గమ్యం లక్ష్యం అన్నీ నారాయణుడే అని విన్నవించి, తమకు ఏమీ తెలియదని, భక్తి అంటే ఏమిటో కూడా అర్థం కాదని, అయినా అందరితో కలిసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామని, మాకేం కావాలో మీరే నిర్ణయించి మీ బంధువులుగా మమ్ము భావించి ఆ సంబంధంతో మాకు ఆనందాన్నివ్వాలని, కనుక మిమ్మల్నే మేము కోరుకుంటున్నామని గోపికలద్వారా గోవిందునికి విన్నవించడమే తిరుప్పావై అని జీయర్ స్వామి అరటి పండు ఒలిచి పెట్టినంత సులభంగా విప్పి చెప్పారు. తిరుమల, శ్రీరంగం నుంచి మన ఊళ్లో చిన్న గుడి దాకా దేశం మొత్తంమీద విష్ణ్వాలయాలలో నెలరోజుల పాటు ఉదయం వేళ పాశురగానం, సాయంత్రం పాశుర సారాంశ వివరణా ప్రసంగాలు కొన్ని వందల సంవత్సరాలుగా సాగున్నాయి. జీయర్ స్వామి మార్గదర్శకత్వంలో అనేకమంది రచయితలు తిరుప్పావైని వివరించే పుస్తకాలు రచించారు. వేలాది ప్రవచన కర్తలు రూపొందారు. జీయర్ తిరుప్పావై భక్తి సాగర తరంగాలతో భక్తుల అంతరంగాలను ముంచెత్తుతున్నారు. అర్థం చేసుకున్నవారిని పరమాత్మ వైపు నడిపించే పరమార్థమే జీయర్ సాగించే ఈ యజ్ఞ లక్ష్యం. –డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఆచార్య -
వినోదం.. సందేశం
కన్నడ రైజింగ్ స్టార్ యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. ప్రకాష్‌రాజ్, తులసి ముఖ్య పాత్రలు చేశారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్ కుమార్ అక్టోబర్ 5న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ముందు ఓ మంచి డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా ‘భాగ్యనగరం’ సినిమా విడుదల చేస్తున్నా. మా బ్యానర్‌కి ఈ చిత్రం చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రం కన్నడలో కంటే తెలుగులో పెద్ద విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. డ్యాన్సింగ్ సెన్సేషన్ ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేశారు’’ అన్నారు. ‘‘యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించే చిత్రం ‘భాగ్యనగరం’. ఇలాంటి మంచి సినిమాను పంపిణీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్.రావు. -
నలుగురు యువకుల కథ
మాదక ద్రవ్యాలు, మద్యపానం బారిన పడి నలుగురు యువకులు తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భాగ్యనగరం’. యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని సంతోష్ కుమార్ ‘భాగ్యనగరం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. ఓ డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనతో ఈ సినిమా విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ ఆలోచన రేకెత్తించేదే ఈ చిత్రం. మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్ రావు. -
పతంగులు.. ముత్యాలు..
సాక్షి, హైదరాబాద్: మకర సంక్రాంతి వేళ ‘గుజరాత్’ కొత్త శోభతో మెరిసిపోతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్ సహా దాదాపు 45 దేశాల పర్యాటకులు అహ్మదాబాద్‌లో వాలిపోతుంటారు. 3 రోజులు అహ్మదాబాద్ ఆకాశం సప్తవర్ణశోభితంగా వెలిగిపోతుంది. ఆ వేడుకకు గిన్నిస్‌బుక్‌లో చోటు కూడా దక్కింది. అదే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. విదేశీ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్న ఆ వేడుకకు ఈసారి మన భాగ్యనగరం కూడా వేదిక కాబోతోంది. నగర శివారులో వంద ఎకరాల సువిశాల స్థలంలో విస్తరించిన ఆగాఖాన్ ట్రస్టు అకాడమీలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ట్రస్టుతో కలసి ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. అంతర్జాతీయంగా పతంగులు ఎగురవేయటంలో దిట్టలుగా పేరున్న ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు పర్యాటక అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్‌తో దీన్ని నిర్వహించటం ద్వారా విదేశీయుల దృష్టి హైదరాబాద్‌పై పడేలా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇలాంటి మరిన్ని వేడుకలు నిర్వహించటం ద్వారా తరచూ హైదరాబాద్/తెలంగాణ పేరు అంతర్జాతీయంగా వినిపించాలనే తాపత్రయంలో ఉంది. త్వరలో ముత్యాల ప్రదర్శన భాగ్యనగరానికి మరో పేరు ముత్యాల నగరం (పెరల్స్ సిటీ). అప్పట్లో ముత్యాలను ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేసిన ఖ్యాతి ఈ నగర సొంతం. చార్మినార్‌కు ఓ పక్కన ఉన్న లాడ్ బజార్ ఇప్పటికీ దానికి గుర్తుగా నిలుస్తోంది. దీన్ని కూడా ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో మరోసారి గుర్తు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ముత్యాలు, గాజుల ప్రదర్శనను నిర్వహించాలనీ యోచిస్తోంది. దీన్ని కూడా జనవరిలోనే నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. మూడు రోజులు జరిగే ఈ ప్రదర్శనకు అలనాటి ప్రముఖ హోటల్ ‘రిట్జ్’ను వేదికగా చేసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రదర్శనకు అనుబంధంగా హైదరాబాద్ వంటకాల ఘుమఘుమలు, ఇక్కడి కళల హొయలనూ సందర్శకుల ముందు నిలపాలని నిర్ణయించింది. ఇందుకోసం గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని వేదికగా గుర్తించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముత్యాలు, గాజుల ప్రదర్శన.. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అక్కడ ‘రుచులు’, కళల ప్రదర్శన నిర్వహించటం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవచ్చని భావిస్తోంది. ‘బతుకమ్మ’లో సాధ్యం కాకపోవటంతో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తనకుంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకు బతుకమ్మ వేడుకను వినియోగించుకోవాలని భావించింది. గత బతుకమ్మ ఉత్సవాన్ని అంతర్జాతీయ వేడుకగా నిర్వహించాలని అనుకుంది. ప్రపంచంలో ఉన్న ఏకైక మహిళా పండుగగా దానికి విదేశాల్లో ప్రచారం చేసి విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవాలని భావించింది. కానీ సమయం చిక్కకపోవటంతో చేయలేకపోయింది. వచ్చే ఏడాది నిర్వహించే వేడుకల్లో దాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. -
విషం తాగుతున్నామా!
-
విషం తాగుతున్నామా!
జలమండలి నీటిలో ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఏసిరెడ్డి రంగారెడ్డి: బొట్టుబొట్టులో హాలాహలం.. ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా.. మంచినీరే కదా అని తాగారో.. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా, జీర్ణకోశ వ్యాధులు తథ్యం! భాగ్యనగరానికి జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలోకి ఓసారి తొంగిచూస్తే ఇన్ని రకాల జబ్బులు పలకరించాయి మరి!! ఆరోగ్యాన్ని కుప్పకూల్చే బ్యాక్టీరియాలు కుప్పలుతెప్పలుగా కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు.. నగరంలో 8.65 లక్షల నివాసాలకు జలమండలి మంచినీటి రూపంలో ఇలా హాలాహలాన్ని పంచుతోంది. నగరంలో కలుషిత జలాలపై స్వల్ప కాలంలోనే 647 ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని ‘సాక్షి’ సేకరించింది. ఆ నీటిని ల్యాబ్‌లో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. పలు బస్తీలు, కాలనీలకు సరఫరా చేస్తున్న జలంలో మానవ మలమూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి, సిట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, బహదూర్‌పురా, ముషీరాబాద్, చంచల్‌గూడ, కార్వాన్, మెహిదీపట్నం, సీతాఫల్మండి తదితర ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో ఈ విష కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. నగరంలో అనేకచోట్ల మంచినీటి పైప్లైన్లు డ్రైనేజీ లైన్లతో కలిసిపోవటం, పలుచోట్ల లీకేజీలు, శుద్ధి కేంద్రాల్లో నిబంధనలను గాలికొదిలేయడంతో మంచినీళ్లు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. చిత్త’శుద్ధి’ఏదీ?: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నీటిని శుద్ధిచేసి సరఫరా చేసేందుకు జలమండలి ఏటా సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి వెయ్యి లీటర్ల నీటి శుద్ధికి రూ.27 ఖర్చు చేస్తున్నారు. నగరంలో నాలుగు చోట్ల, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల ఫిల్టర్బెడ్లున్నాయి. ఈ నీటిని మహానగరానికి సరఫరా చేసేందుకు 250 స్టోరేజీ రిజర్వాయర్లున్నాయి. ఈ కేంద్రాల వద్ద నీటిశుద్ధి ప్రక్రియను గాలికొదిలేస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి నగరానికి నీటిని తరలించేందుకు 900 కి.మీ. మేర ట్రంక్మెయిన్ భారీ పైపులైన్లు, నగరవ్యాప్తంగా మరో 9 వేల కి.మీ. మేర పైపులైన్లు ఉన్నాయి. వీటికి తరచూ ఏదో ఓచోట లీకేజీలు ఏర్పడుతుండడంతో పైప్లైన్లలోకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరుతోంది. ఇలా శుద్ధి చేయాలి.. జలాశయాల్లోని నీటిని(రా వాటర్) నాలుగు దశల్లో శుద్ధి చేయాలి. మొదటి దశ: క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్ రసాయనాలు కలిపి కెమికల్ ట్రీట్మెంట్ నిర్వహించాలి. రెండో దశ: నిల్వ ఉన్న నీటిలో ఆలం కలిపి అందులోని ఘన వ్యర్థాలు, ధూళి కణాలు రిజర్వాయర్ అడుగున చేరేలా చూడాలి. మూడో దశ: మంచినీటిని వివిధ ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేయాలి. చిన్న, పెద్ద సైజు గులక రాళ్లు, సన్న ఇసుక, దొడ్డు ఇసుక, లేయర్స్ మీడియా ఫిల్టర్ల మీదుగా నీటి ప్రవాహం వెళ్లనివ్వాలి. నాలుగో దశ: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ప్రతి వెయ్యి లీటర్ల నీటికి 2 పీపీఎం, సర్వీసు రిజర్వాయర్ల వద్ద 1.5 పీపీఎం, వినియోగదారుడికి నల్లాల ద్వారా అందించే సమయంలో 0.2 పీపీఎం మోతాదులో క్లోరిన్ ఉండేలా చూడాలి. * కార్బోనేట్ ఫిల్టర్లను ఏర్పాటు చేసి నీటిని పూర్తి స్థాయిలో శుద్ధిచేయాలి. * ఫిల్టర్ బెడ్‌లోకి వచ్చిన నీటిలోకి ఆక్సిజన్‌ను అధిక మోతాదులో పంపితే నీటి నాణ్యత మెరుగుపడుతుంది. రంగు మటుమాయమౌతుంది. కాలుష్యానికి కారణాలెన్నో.. * ఫిల్టర్ బెడ్లు, స్టోరే జీ రిజర్వాయర్ల వద్ద నీటిని శుద్ధి చేసేందుకు ఆలం, క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్లను సరైన మోతాదులో కలపడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు, ఇతర రసాయనాలను ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. * ప్రతి స్టోరేజీ రిజర్వాయర్ వద్ద 600 కేజీల ఆలం, 36 కేజీల క్లోరిన్గ్యాస్ను కలిపి నీటిని శుద్ధి చేయాల్సి ఉన్నా ఆ నిబంధన పాటించడం లేదు. * మంచినీటిలోకి ఆక్సిజన్‌ను పంపే ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం. నీటిలో రంగు పూర్తిగా పోవాలంటే నాన్ఫెర్రిక్ హైడ్రేటెడ్ లైమ్ కలపాలి. దీన్నీ గాలికొదిలేస్తున్నారు. * బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్ కోసం కేటాయించిన క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు పక్కదారిపడుతున్నాయి. దీంతో తగు మోతాదులో క్లోరిన్ ను కలపడం లేదు. * నగరంలో 250 సర్వీసు రిజర్వాయర్లను సీజన్ మారగానే శుద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. సుమారు 50 రిజర్వాయర్ల వద్ద అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. * మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లు అల్లుకుపోయిన ప్రాంతాల్లో లీకేజీల వల్ల మురుగు నీరు, మంచినీటి లైన్లలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్లో 1,500 బస్తీలు ఉండగా.. లీకేజీల వల్ల తరచూ 100 బస్తీలు కలుషిత జలాల బారిన పడుతున్నాయి. * నగరంలో యుద్ధప్రాతిపదికన 1,100 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైప్లైన్లు మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. * నీటి నాణ్యత తెలుసుకునేందుకు చేసే ఫిజికో కెమికల్, బ్యాక్టీరియాలజీ పరీక్షలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. * జలాశయాల నుంచి ఫిల్టర్‌బెడ్‌కు వచ్చే నీటికి కెమిక ల్, క్లోరిన్, బ్లీచింగ్, ఆలం, వైట్ పౌడర్లను సరైన మోతాదులో కలపకుండానే శుద్ధి చేస్తున్నారు. * గండిపేట క్యాండుట్ కాలువ నిజాంకాలం నాటిది. కొన్నిచోట్ల నాలాపై కప్పు లేకపోవడంతో చెత్తాచెదారం చేరుతోంది. * అనేక స్టోరేజీ రిజర్వాయర్ల వద్ద నీటిలో ఘన వ్యర్థాలు, ధూళి కణాలను తొలగించేందుకు ఫిల్టర్లు లేవు. పురాతన పైపులైన్ల వల్లే.. నగరంలో డ్రైనేజీ, మంచినీరు పైపులైన్లు పక్కపక్కనే ఉండ డం, చాలాచోట్ల 50 ఏళ్ల నాటి పైపులైన్ల కారణంగానే తరచూ జలాలు కలుషితమవుతున్నాయి. తక్ష ణం పురాతన పైపులైన్లు మార్చి స్టెయిన్లెస్ స్టీలు పైపులు వేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి తాగడానికి పనికిరాదు ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లున్న నీరు తాగడానికి పనికిరాదు. తాగితే తీవ్రమైన జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. యూవీ ఫిల్టర్స్ ద్వారా శుద్ధిచేసిన నీటిని తాగితే మంచిది. - ఎనుముల రాజు, వాటర్ క్వాలిటీ అనలిస్ట్ జలమండలి వైఫల్యమే.. నగరవాసులకు స్వచ్ఛమైన నీటి ని సరఫరా చేయడంలో జల మండలి విఫలమవుతోంది. కలుషిత జలాలు జనం ఉసురు తీస్తున్నాయి. ఈ నీళ్లు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే బాధ్య త ప్రభుత్వానిదే. జలమండలిపై నమ్మకం లేక జనం ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు. -ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ చీఫ్ మెంటార్ జీర్ణకోశ వ్యాధులు వస్తాయి కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్న నీళ్లు తాగి తే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా వంటి వ్యాధులకు గురవుతారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలపై దీని ప్ర భావం అధికం. నల్లా నీరు కాచి చల్లార్చి తాగాలి. - డాక్టర్ బి.రమేష్,గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి -
అందరి చూపు భాగ్యనగరం వైపు!
‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి ప్రస్తుతం ఐదెకరాల లోపు చేపట్టే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కూ షెల్టర్ ఫీజును చెల్లిస్తున్నాం. ఇది జీహెచ్ఎంసీ పరిధిలో చ.మీ.కు రూ.750, హెచ్ఎండీఏ పరిధిలో అయితే రూ.600గా ఉంది. అయితే ఇకపై 5 ఎకరాలపైన చేపట్టే ప్రతి ప్రాజెక్ట్‌కు కూడా షెల్టర్ ఫీజును చెల్లించాలని నిర్ణయించుకున్నాం. ఇలా వచ్చే అదనపు సొమ్మును ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ వర్గాల ఇంటి నిర్మాణాలకు ఉపయోగించుకోవ చ్చు. ♦ స్థిరాస్తి సంస్థలే కాదు ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు కూడా.. ♦ 8 నెలల్లో 40 శాతం మేర స్థిరాస్తి ధరలు పెరుగుతాయ్ ♦ 2020 నాటికి క్రెడాయ్ లీడర్ యువతే సాక్షి, హైదరాబాద్: ‘‘ఐటీ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు, బడా పారిశ్రామిక సంస్థలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కంపెనీలు, దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు.. ఇలా ప్రతి ఒక్కరి చూపు భాగ్యనగరంపై పడింది. దీంతో గత పదేళ్లలో దేశంలోని ఏ నగరమూ చేరుకోలేని స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందనుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే రానున్న రోజుల్లో నగరంలో స్థిరాస్తి రంగం నిలకడైన పనితీరును కనబర్చనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటికి నగరంలో స్థిరాస్తి అమ్మకాలు, ధరలు రెండూ 20-25 శాతం మేర పెరిగాయని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి చెప్పారు. క్రెడాయ్ హైదరాబాద్ సారథిగా ఎన్నికైన సందర్భంగా ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► ప్రస్తుతం సంయుక్త రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ బిల్డింగ్ కోడ్ నిబంధనలే అమలవుతున్నాయి. దీన్నుంచి తెలంగాణ బిల్డింగ్ కోడ్‌ను విభజించి ఇక్కడి నిర్మాణ రంగం అవసరాలు, అభివృద్ధిలకు వీలుగా నిబంధనల్లో కాసింత మార్పులు తీసుకురావాలి. అప్పుడే సంయుక్త రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి కంటే నాలుగు రెట్లు వృద్ధి కనిపిస్తుంది. పెపైచ్చు ఇక్కడి నూతన పారిశ్రామిక విధానం, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, మెరుగైన మౌలిక వసతులు మరింత కలిసొచ్చే అంశాలు. ► అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పరిశ్రమలు, విద్యుత్, నీళ్లు వంటి వాటిపై దృష్టి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంపై కన్నేశారు. నిర్మాణ రంగంలో రాత్రికి రాత్రే ఏం జరగదు. దేనికైనా కాసింత సమయం కావాలి. ఒక స్థిరాస్తి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటేనే ఎంతలేదన్నా మూడేళ్ల సమయం పడుతుంటే.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సెట్ కావాలంటే మరింత సమయం కావాలి. అయినా రాష్ట్రాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి అందరికంటే ముందున్నారనే చెప్పాలి. ఎందుకంటే నూతన పారిశ్రామిక విధానంతో అంతర్జాతీయ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కంపెనీలను ఆకర్షించారు. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరించే యోచనలోనూ ఉన్నాయి. ఇవి చాలు పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యతనిస్తుందో చెప్పడానికి. ► ప్రస్తుతం క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్లోని 10 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, 9 మంది ఆఫీస్ బేరర్స్‌లో.. ఐదుగురు మినహా మిగతా అందరూ 35 లోపు వయస్సు వాళ్లే. ఉన్నత విద్యనభ్యసించిన ప్రొఫెషనల్సే. దీన్నిబట్టి చూస్తే 2020 నాటికి క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా యువతే అనేది నా అభిప్రాయం. ఇప్పటికే మంజీరా, ప్రజయ్, ఎస్ఎంఆర్, జనప్రియ, సీఎస్సార్ వంటి నగరానికి చెందిన నిర్మాణ సంస్థల్లో తండ్రులతో పాటు వారి వారసత్వమూ కీలక బాధ్యతల్లో ఉన్నారు. కాకపోతే వీరు మరింత మెరుగైన నాయకత్వ లక్షణాలు, పరిశ్రమ మీద పూర్తి అవగాహన, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు వంటి కీలకాంశాలపై సుశిక్షితులు కావాలి. ► రాష్ట్రాభివృద్ధిలో క్రెడాయ్ది పెద్దన్న పాత్ర. ప్రస్తుతం హైదరాబాద్ చాప్టర్లో 158 మంది మెంబర్లున్నారు. రెండేళ్లలో వీరి సంఖ్యను 250కి పైగా పెంచుతాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రెడాయ్ చాప్టర్లను తెరవనున్నాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్, రెవెన్యూ, అగ్నిమాపక మండలి వంటి అన్ని ప్రభుత్వ విభాగాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పనిచేస్తాం. క్రెడాయ్ మెంబర్లకు ప్రాజెక్ట్‌ను ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి, నిధుల సమీకరణ ఎలా, ప్రాజెక్ట్‌లో ఎలాంటి వసతులివ్వాలి, ధర ఎంత పెట్టాలి.. వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులతును చేసేందుకు నిపుణుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, శిక్షణ శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తాం. ► సిమెంట్, ఇనుము, ఉక్కు వంటి నిర్మాణ సామగ్రి ధరలను అదుపులో ఉంచేందుకు గంపగుత్తగా (బల్క్) కొనుగోళ్లు చేస్తాం. ఒక్కోదానికి నాలుగేసి కంపెనీలతో చర్చించి టెండర్ల మాదిరిగా సామగ్రిని కొనుగోలు చేస్తాం. దీంతో 10-15 శాతం ధర తక్కువకొస్తుంది. టెక్నాలజీ ద్వారా కొనుగోలుదారులకు మరింత దగ్గరవుతాం. అందుకే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ పోర్టల్‌ను ప్రారంభిస్తాం. దీంతో హైదరాబాద్‌కు చెందిన క్రెడాయ్ బిల్డర్ల ప్రాజెక్ట్‌లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ► ప్రస్తుతం నగరంలో మార్కెట్ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో గచ్చిబౌలి నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హాట్‌స్పాట్. ఎందుకంటే ఇక్కడ భూమి ఉంది. ధరలూ అందుబాటులోనే ఉన్నాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. పెపైచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ తర్వాత అభివృద్ధి విజయవాడ హైవే మీదుగా వరంగల్ హైవేకు మళ్లే అవకాశాలున్నాయి. మరో 8 నెలల్లో 40-50 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. ► ప్రభుత్వం కూడా తమ భూములేంటనే వివరాలను ఆన్లైన్లో పెట్టాలి. అప్పుడు బిల్డర్లే గానీ, సామాన్యులే గానీ స్థలాలను కొనుగోలు చేసేముందు ప్రభుత్వ భూములా.. లేక ఎవరికైనా దానం చేసిన భూములా అనేది నిర్ధారణ చేసుకొని కొనుగోలు చేస్తారు. అలాకాకుండా దాదాపు ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయంలో ఇది ప్రభుత్వ భూమంటూనో, వక్ఫ్ భూములంటూనో నోటీసులిస్తే ఎవరికైనా ఎంత సమస్య.. ఎంత నష్టం.. ఎంత డబ్బు వృథా! -
ఇది నా లక్కీ సిటీ..దీక్షాపంత్
‘ఈ సిటీకి చాలా రుణపడిపోయా. ఇది ఓ రకంగా నా లక్కీ సిటీ’ అంటూ భాగ్యనగరంపై తన ప్రేమను తెలియజేసింది నార్త్ ఇండియన్ బ్యూటీ దీక్షాపంత్. బంజారాహిల్స్ రోడ్ నెం3 లోని పారిస్ ది సెలూన్‌ను రీ లాంచ్ చేసిన అనంతరం ఈ సుందరి ‘సాక్షి’తోత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి కెరీర్‌కి తొలి అడుగులు ఇక్కడే... మాది ఉత్తరాఖండ్. పుట్టి పెరిగింది అంతా అక్కడే అయినా... నా మోడలింగ్ కెరీర్‌కు పునాది పడింది ఇక్కడే. హార్లీ డేవిడ్సన్ షోరూం లాంచ్ సందర్భంగా జరిగిన షోలో పాల్గొన్నాను. అలాగే సినీకెరీర్‌కు కూడా ఇక్కడే ఫస్ట్ స్టెప్. అందుకే నాకు హైదరాబాద్ లక్కీ సిటీ. మోడలింగ్ పనుల నిమిత్తం ముంబయి వెళ్లి వస్తున్నా, ప్రస్తుతం పేరెంట్స్‌తో సహా ఇక్కడే ఉంటున్నాను. టాలీవుడ్లో ‘గోపాల గోపాల’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని ఒక తెలుగు సినిమాలో చేస్తున్నా. మరిన్ని మంచి ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నాను. నా స్టైలిస్ట్ నేనే... సినిమాల విషయం ఎలా ఉన్నా... వ్యక్తిగతంగా నా స్టైలిస్ట్ నేనే. నాకు డ్రెస్ సెలక్షన్లో మంచి టేస్ట్ ఉంది. ఎక్కువ మేకప్ చేసుకోవడం నచ్చదు. అవసరాన్ని బట్టి పార్లర్స్ సర్వీస్‌లలో అంటే వాక్సింగ్, హెడ్ మసాజ్ వంటివి చేయిస్తుంటాను. అంతే. ఫిట్నెస్ కోసం మినిమిమ్ వర్కవుట్ల మీద ఆధారపడతా. మోడలింగ్ కన్నా యాక్టింగ్ కష్టం... మోడల్-యాక్టర్.. ఈ రెండింటిలో చెప్పాలంటే యాక్టింగ్ కష్టం. స్క్రీన్ మీద అందం ఒక్కటే చాలదు, అభినయం కూడా కావాలి. అలాగే మోడలింగ్‌లో ఫేస్ గ్లామర్ కన్నా ఫిగర్ ప్రధానం. కానీ సినిమాకు రెండూ కావాల్సి వచ్చినా, ఫేస్ లుక్ ఇంకొంచెం ఎక్కువ అవసరం. సినిమాల గురించి... ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదే. తెలుగు, తమిళ భాషల మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇకపై లీడ్ క్యారెక్టర్స్‌ని ఎంచుకుందామనుకుంటున్నా. బాలీవుడ్లో మంచి ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. ఫ్యాషన్‌లో ప్రియాంక చోప్రా వేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. తెలుగులో నా ఫేవరెట్ హీరో మహేష్‌బాబు. తనని చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అంతే అందంగా ఉన్నాడు. గ్లామర్ మెయిన్‌టెయిన్ చేయడంలో ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. -
మబ్బే మసకేసిందిలే...
హైదరాబాద్: అసలే ఆదివారం ఆపై ఆకాశం మబ్బులు కమ్మేయడంతో భాగ్యనగర వాసులు ముసుగుతన్నారు. నిన్నామొన్నటి వరకు ఉక్కపోతలతో అల్లాడిన హైదరాబాదీలు వాతావరణం చల్లబడడంతో సేదతీరారు. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో భాగ్యనగరం అంతా కాస్త చీకటి అలముకుంది. సూర్యుడు మబ్బులు చాటున దాక్కోవడంతో ఉదయం 10 గంటలైనా వెలుతురు జాడే లేదు. సెలవు రోజు కూడా కావడంతో భాగ్యనగర వాసులు మంచం దిగేందుకు ఇష్టపడలేదు. ఆదివారం రోజున ఆలస్యంగా నిద్రలేచే హైదరాబాదీలు ఈరోజు మరింత బద్దకించారు. చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉండడంతో మరింతగా మంచానికి అతుక్కుపోయారు. అత్యవసర పనులు, పెళ్లిపేరంటాలు ఉన్నవారు మంచం దిగక తప్పలేదు. -
నేడు, రేపు సాక్షి ప్రాపర్టీ షో 2015
-
సాక్షి ప్రాపర్టీ షో నేడే!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలు, మరెంతో సమయం వృథా. వీటన్నింటికి సులువైన పరిష్కారం చూపించేందుకు సిద్ధమైంది సాక్షి. శని, ఆదివారాల్లో బంజారాహిల్స్ రోడ్ నంబర్:1లోని హోటల్ తాజ్‌కృష్ణాలో ఉదయం 10 గంటలకు మెగా ప్రాపర్టీ షో జరగనుంది. ⇒ జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్ గంట గంటకూ లక్కీ డ్రా తీయనుంది. ⇒ నగరంలోని ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉంది? స్థిరాస్తి కంపెనీలు అందజేస్తున్న ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్‌లోన్ సదుపాయాలు.. ఇలా స్థిరాస్తికి సంబంధించిన సమాచారం ఈ షోలో తెలుసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీలు ఒకే చోటుకి చేరడం వల్ల సరసమైన ధరలకు ఫ్లాట్ లేదా స్థలం లభించే అవకాశం ఉంటుంది. మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ కో-స్పాన్సర్స్: హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్, మంజీరా కన్స్ట్రక్షన్స్. పాల్గొనే సంస్థలు: సత్వా గ్రూప్, ఎస్ఎంఆర్ బిల్డ ర్స్, శాంతా శ్రీరామ్, జనప్రియ ఇంజనీర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రణీత్ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్ ఇంజనీర్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్, గ్రీన్ హోమ్, ఎస్ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్ఫ్రా, శతాబ్ధి టౌన్‌షిప్స్, స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, స్పేస్ విజన్, మ్యాక్ ప్రాజెక్ట్స్, జీకే డెవలపర్స్, గ్రీన్ సిటీ ఎస్టేట్స్, స్వేర్మైల్ ప్రాజెక్ట్స్, శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్. బ్యాంకులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ. -
భాగ్యనగరం.. విశ్వనగరం!
సాక్షి, హైదరాబాద్: నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం విశ్వనగరంగా మారనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైఫై సిటీ, ఫార్మా సిటీ, సినిమా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో నగరంలోని నిర్మాణ రంగంలో ఒక్కసారిగా ఆశలు చిగురిస్తున్నాయి. నాలుగేళ్లుగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగానికి మళ్లీ మంచి రోజులొస్తాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. రానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ‘ప్రపంచస్థాయి ఉత్తమ స్థిరాస్తి బిల్లు’ను తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశ, విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి త్వరలోనే ఏకగవాక్ష విధానాన్ని కూడా తీసుకురానున్నారు. ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ప్రభుత్వ వెబ్సైట్లో ఫార్మా, రియల్టీ, కెమికల్స్.. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలంటాయి. వీటిని పూర్తి చేసి సబ్మిట్ చేస్తే చాలు. అన్ని రకాలుగా తనిఖీ చేసిన తర్వాత పది రోజుల్లో నేరుగా సీఎస్ కార్యాలయం నుంచి సంబంధిత పారిశ్రామికవేత్తలకు ఫోన్ వస్తుంది. ఆపై నేరుగా చర్చించిన తర్వాత.. 15 రోజుల్లో ఓ ఎన్వలెప్లో ప్రాజెక్ట్ అనుమతులు మంజూరవుతాయన్నమాట. వచ్చే యాభై ఏళ్ల నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలతో కూడిన సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. అలాగే స్థిరాస్తి అభివృద్ధికి అడ్డంకిగా మారుతోన్న నాలా పన్ను, మైనింగ్ సెస్, ఏవియేషన్ అనుమతులనూ ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సరికొత్త పారిశ్రామిక విధానంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోవైపు ఒక్కో సిటీ.. నగరం చుట్టూ ఒక్కో వైపు ఒక్కో సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే శామీర్‌పేటలో ఫార్మా సిటీని నిర్మిస్తోంది. విదేశీ సంస్థల రాకపోకల నిమిత్తం ఇక్కడే విమానాశ్రయాన్ని కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కలసి ఐటీఐఆర్ విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సార్లు సమీక్ష జరిపారు. ఇన్క్యుబేషన్ సెంటర్ ఏర్పాటు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలతో ఐటీ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదన వంటి చర్యల వల్ల హైదరాబాద్ అభివృద్ధిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. విమానాల అడ్డా.. ప్రస్తుత సమయంలో టాటా, రుయాగ్ కంపెనీలు కలసి ఆదిభట్లలో విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి సానుకూల పరిణామంగా బిల్డర్లు అభివర్ణిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇదే బాటలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పయనించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. పటిష్టమైన పోలీసింగ్.. పోలీసింగ్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ప్రకటన దేశ, విదేశీ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తోంది. ఉద్యమ సమయంలో శాంతిభద్రతల సమస్య కారణంగా నగరాన్ని విడిచిన సంస్థలు మళ్లీ నగరానికి రావొచ్చు. స్పోర్ట్స్ సిటీ.. భాగ్యనగరాన్ని అమ్యూజ్మెంట్, స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు దేశ, విదేశీ సంస్థల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే భాగ్యనగరంలో ఆధునిక పరిజ్ఞానం గల ఆసుపత్రుల సంఖ్య ఎక్కువే. అందుకే రకరకాల చికిత్సల కోసం వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికొస్తారు. వీరి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది కార్యరూపం దాల్చితే మెడికల్ టూరిజంగా నగరం అభివృద్ధి చెందుతుంది. -
దిల్దార్..షహర్
విభిన్నం భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనం భాగ్యనగరం. ఎక్కడి నుంచి వచ్చిన వారికైనా ఆత్మీయంగా ఆతిథ్యం ఇవ్వడమే మన నగర సంస్కృతి. అందుకే చాలామందికి హైదరాబాద్ సొంతిల్లులా మారింది. ఒకప్పుడు ఉద్యోగాల కోసం విదేశీయులు ఇక్కడకు క్యూకడితే.. ఇప్పుడు చదువుల కోసం విదేశీ విద్యార్థులు ఇక్కడకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం 78 దేశాల విద్యార్థులకు మన నగరం విజ్ఞానకేంద్రంగా విలసిల్లుతోంది. నగరంలో దాదాపు 9,800 మంది విదేశీ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే నాలుగువేల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలను కాదని విదేశీ విద్యార్థులు చదువుల కోసం హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలా వచ్చిన కొందరు విదేశీ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీలో ‘సిటీప్లస్’ పలకరించగా, హైదరాబాద్‌లో తమ అనుభవాలను, అనుభూతులను ఆనందంగా పంచుకున్నారు. ..:: ప్రవీణ్‌కుమార్ కాసం తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య ... మొదటిచూపులోనే హైదరాబాద్ నచ్చేసింది. ఇక్కడి భాష రాకపోతే చాలా ఇబ్బందులొస్తాయనుకున్నా. కానీ, ఇక్కడ అందరూ రెండుమూడు భాషలు మాట్లాడుతున్నారు. ఏదైనా అడ్రస్ అడిగితే చాలా ఓపికగా చెబుతారు. ఓ.యూ.లో బీసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ప్రస్తుతం టోలీచౌకీలో ఉంటున్నాను. ఇక్కడికొచ్చి ఏడాదవుతోంది. చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందేది హైదరాబాద్‌లోనే. - హుసామ్( లిబియా) ఆతిథ్యం బాగుంటుంది.. హైదరాబాద్ నగరం రోమ్లా ఫ్యాషన్‌గా ఉండకపోవచ్చు. కానీ, ఇక్కడ ఆతిథ్యం చాలా బాగుంటుంది. ఇతరులను ఎలా గౌరవించాలో ఇక్కడి వారిని చూసి నేర్చుకోవాలి. ప్రస్తుతం ఓయూలో కలినరీ ఆర్ట్స్‌లో పీజీ చేస్తున్నా. ఇటాలియన్ ఫుడ్ కంటే ఇక్కడి బిర్యానీ, తందూరీ రోటీలే నాకు బాగా నచ్చాయి. లేడీస్ కూడా చాలా సేఫ్‌గా ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇక్కడికొచ్చి ఏడు నెలలవుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ర్యాగింగ్ లాంటివి ఎక్కడా కనిపించలేదు. చార్మినార్‌లో గాజులు బాగున్నాయి. వాటిని నా ఫ్రెండ్సకి గిఫ్ట్‌గా తీసుకెళ్తున్నా. - షియారా ఓనిస్ (ఇటలీ) ఇక్కడి ప్రజలు చాలా సాఫ్ట్ బీకాం కంప్యూటర్స్ చదువుతున్నా. ఇక్కడ లెక్చరర్స చెప్పే పాఠాలు మొదటి సంవత్సరం అర్థం కాలేదు. ఇప్పుడు ఫర్వాలేదు. భారత్‌లో అన్ని నగరాలకు వెళ్లా. కానీ, హైదరాబాద్‌లో వాతావరణం బాగుంటుంది. ఢిల్లీలోలా మాదిరిగా మరీ చలిగా ఉండదు. జైపూర్‌లో ఉన్నంత ఎండలూ ఉండవు. ఇక్కడి ప్రజలు కూడా చాలా సాఫ్ట్. సిటీబస్‌లో నిలబడితే చాలా మంది పిలిచి మరీ సీటు ఇస్తుంటారు. - ఒకెటుండే అల్యుతెమ్ (నైజీరియా) హైదరాబాదీలు కొత్త వాళ్లతో కలసిపోతారు హైదరాబాదీలు కొత్త వాళ్లతో చాలా త్వరగా కలసిపోతారు. ఎక్కడి నుంచి వచ్చిన వారైనా ఈ వాతావరణంలో తేలిగ్గా అడ్జస్ట్ అయిపోతారు. మా దేశంలో ఎక్కడికి వెళ్లినా తిరగి వస్తామన్న గ్యారంటీ లేదు. ఇక్కడ మాత్రం చాలా సేఫ్‌గా ఎక్కడికైనా వెళ్లొచ్చు. కాకుంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ. హైదరాబాద్ బిర్యానీ నా ఫేవరెట్ ఫుడ్. నెలకోసారైనా ఫ్రెండ్సతో ప్యారడైజ్‌కు వెళ్తుంటా. - హయతుల్లా హమాదీ (అఫ్ఘ్ఘానిస్థాన్) తెలుగు సినిమాలు బాగుంటాయి ఇక్కడ అందరూ సహకరిస్తారు. మా వాళ్లు చాలామంది ఇక్కడ ఉన్నారు. మా దేశంలాగే కనిపిస్తుంది. ఇక్కడ గోల్కొండ, చార్మినార్.. అన్ని చూశా. ముఖ్యంగా శిల్పారామం అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలంటే మరీ ఇష్టం. హీరోలు భలే ఫైట్స్ చేస్తుంటారు. అవన్నీ ఫన్నీగా అనిపిస్తుంటాయి. - తన్వీర్, సౌదీ అరేబియా - నగరంలోని మొత్తం ఫారిన్ స్టూడెంట్స్ - సుమారుగా 9,800 - గతేడాది ఉస్మానియా వర్సిటీ పరిధిలో స్టూడెంట్స్ - 4,000 - ఫారిన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండేది - టోలీచౌకీ, మెహదీపట్నం - ఎక్కువ ఫారిన్ స్టూడెంట్స్ వస్తున్నది - ఆఫ్రికన్, సౌదీ దేశాల నుంచి - 78 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు - 2-దేశంలో విదేశీ విద్యార్థులు అత్యధికంగా గల నగరంలో హైదరాబాద్ స్థానం (మొదటి స్థానం పుణే) -
1920 - 1389 = 531
ఇవీ నగరంలో మిగిలిన చెరువులు.. వీటిల్లోనూ 50 శాతానికి పైగా కబ్జాలోనే.. మహానగరంలో అడుగడుగునా చెరువుల విధ్వంసం ► కబ్జాలు, ఆక్రమణలు, అభివృద్ధి పేరుతో మాయం ►జలవనరులు మింగడంతో మహానగరానికి కన్నీటి దౌర్భాగ్యం ► వేలాది ఎకరాల వ్యవసాయ, ద్రాక్ష తోటలు కనుమరుగు ►103 రకాల పక్షి జాతులు దూరం.. మత్స్యకారుల వలసలు ► చెరువులను చెరబట్టడంతో నేడు వరదల్లో మునుగుతున్న నగరం ఇదీ చెరువుల లెక్క (హుడా పరిధిలో... ఓఆర్ఆర్ లోపల) 1982 920 2012 545 మాయమైన చెరువులు మొత్తం - 375 5 హెక్టార్లలోపు 323 5-10 హెక్టార్ల లోపు 52 తగ్గిన వ్యవసాయం 1970లో 80 వేల ఎకరాలు 2012లో 15 వేల ఎకరాలు రైతుల సంఖ్య 1970లో 49 వేలు 2012లో 7 వేలు నీటి వనరుల ప్రాంతం తగ్గుదల సంవత్సరం శాతం 1982 21.53 2012 17.02 భాగ్యనగరం... రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతూ నీటి లభ్యత కరువై అల్లాడుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, గండిపేట చెరువులు అందిస్తున్న నీరు ఏమాత్రం సరిపోని పరిస్థితి. వందల సంవత్సరాలుగా రాజధాని నగరంగా ఉన్న హైదరాబాద్‌కు గతంలో ఈ దుస్థితి లేదు. స్వాతంత్య్రం వచ్చే నాటికి వందలాది చెరువులు తాగు, సాగునీటిని అందిస్తుండేవి. నేడు ఆ చెరువులు కుంచించుకుపోయాయి. కొన్ని కనుమరుగయ్యాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భూ కబ్జాల్లో భాగంగా అన్యాక్రాంతం అయిన చెరువుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే తమ్మిడి చెరువు, శేరిలింగపల్లిలోని కొన్ని చెరువుల ఆక్రమణను జీహెచ్ఎంసీ లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో చెరువుల ఆక్రమణపై నేటి ‘సిటీ ఫోకస్’... వనం దుర్గాప్రసాద్, సాక్షి -సిటీప్లస్ నాడు... 1920 చెరువులు, తటాకాలు.. అనాడు మహానగరంలో ఉన్న జలవనరులివి. ఇది చారిత్రక ఆధారం... ఎటు చూసినా పుష్కలంగా నీళ్లు.. పది గజాలు తవ్వితేనే తన్ను కొచ్చే జలాలు. పచ్చని పైర్లతో స్వాగతం పలికే శివార్లు.. బస్తాలకొద్దీ ఆహార ధాన్యాలు, బుట్టలకొద్దీ మధుర ఫలాలు, టన్నులకొద్దీ కూరగాయలు.. ఇతర పట్టణాలకు సైతం సరఫరా చేసేంత పాడి.. వేసవి తాపం దాదాపు తెలియదనే చెప్పాలి. చెరువుల శిఖాలు పంట పొలాలయ్యాయి. 1970 వరకు మహానగరాన్ని అనుకుని 80 వేల ఎకరాల్లో వ్యవసాయం జరిగేది. వేల ఎకరాల్లో ద్రాక్ష తోటలు ఉండేవి. 103 రకాల పక్షి జాతులు ఉండేవి. ఇదీ నేపథ్యం దీనికో చరిత్ర ఉంది. నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే మూసీ 1908 సెప్టెంబర్ 28న శివాలెత్తింది. వరదతో ముంచెత్తింది. ఆ రోజు నగరంలో 17 అంగుళాల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు కొట్టుకుపోయాయి. 150 మంది చనిపోయారు. అపార ఆస్తినష్టం జరిగింది. ఆ విపత్తు నవాబును కదిలించింది. వరదలను కట్టడి చేసేందుకు నిపుణుల సలహా మేరకు చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. హుస్సేన్‌సాగర్, మీర్ఆలం, అఫ్జల్‌సాగర్, జల్పల్లి, మా- సాహెబా ట్యాంక్ (మాసబ్‌ట్యాంక్), తలాబ్‌కట్ట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్... ఇలాంటి చెరువుల నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. నాడు పచ్చని శోభతో అలరారిన తటాకాలు ఇప్పుడు చూస్తే రోత పుట్టే మురుగుతో నిండిపోయాయి. మూసీలోకి రోజూ 350 మిలియన్ లీటర్ల వ్యర్థ పదార్థాలను పంపుతున్నారు. బతుకమ్మ ఏమైంది? తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ పేరుతో వెలసిన బతుకమ్మ చెరువు ‘ఛే’ నంబర్ బస్తీకి చేరువలో ఉండేది. నిజాం కాలంలో కట్టిన ఈ చెరువులో అప్పట్లో గుర్రాలను కడిగేవాళ్లు. 27 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువులో బతుకమ్మల నిమజ్జనం వేడుకగా ఉండేది. కానీ ఇప్పుడు దీని ఆనవాళ్లే లేవు. ఏమిటీ ‘దుర్గం’ధం? 400 ఏళ్ల చరిత్ర కలిగిన 100 ఎకరాల దుర్గం చెరువు దుస్థితి ఆందోళన కలిగిస్తోంది. కబ్జారాయుళ్లు దీన్ని సగం కాజేశారు. మిగతా సగాన్ని విషతుల్యం చేశారు. ఈ ప్రాంతంలో 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. అక్కడ శాశ్వత కట్టడాలు కట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించినా ఎవరూ పట్టించుకోలేదు. రామమ్మ కుంట సంగతేంటి? ప్రస్తుతం ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఒకప్పుడు రామమ్మకుంట ఉండేది. ఇది మత్స్యకారులకు, రైతులకు ఒకప్పుడు ప్రధానవనరు. ఇప్పుడిక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్ హోటళ్లు వెలిశాయి. మణికొండలోని 30 ఎకరాల ఎల్లమ్మ చెరువుదీ ఇదే పరిస్థితి. సగం కబ్జా చేసిన ఈ చెరువు స్థలంలో అపార్టుమెంట్లు వెలిశాయి. గతంలో ఇక్కడ 12 వేల ఎకరాల్లో రైతులు సాగు చేసేవారు. శామీర్‌పేట ఏమైంది? శామీర్‌పేటలో చెరువులన్నీ నామ రూపాల్లేకుండా పోయాయి. బూరుగు చెరువును పూడ్చేసి రిసార్ట్ కట్టారు. మేడ్చల్ పరిధిలో 247 చెరువులు, కుంటలు ఉండగా 17 చెరువులు కబ్జా అయ్యా యి. బోడుప్పల్, పీర్జాదిగూడ పుల్‌చర్‌కుంట, మేడిపల్లి చెరువులు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. సరూర్‌నగర్ మండలంలోని పార్క్ ఏరియా చెరువు 70 శాతం ఆక్రమించారు. ఇబ్రహీంపట్నం నియో జకవర్గంలో దాదాపు 9 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. వికారాబాద్ పట్టణంలోని శివసాగర్ చెరువు విస్తీర్ణం 211.32 ఎకరాలు. ఇందులో 80 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఒకటా... రెండా...? ఇప్పటికీ 375 చెరువుల జాడ తెలియడం లేదు. పర్యావరణ వేత్తల ఒత్తిడి, న్యాయస్థానాల ఆగ్రహంతో పైపై లెక్కలు మొదలు పెట్టిన జీహెచ్ఎంసీ సరైన వివరాలు సేకరించలేదు. 30 ఏళ్ల కిందట 920 చెరువులున్నట్టు లెక్కలున్నాయి. కానీ 2012 నాటికి వీటి సంఖ్య 531కి తగ్గింది. జీహెచ్ఎంసీ, హుడా, నీటి పారుదల, రెవెన్యూ విభాగాల లెక్కలకు పొంతన కుదరడం లేదు. మాయమైన చెరువుల్లో 5 హెక్టార్లలోపు ఉన్నవే ఎక్కువ. ఇలాంటి చెరువులు 1982 నుంచి 2012 మధ్య 375 కనుమరుగయ్యాయి. సర్వేలో నిజాలు కబ్జాకు గురవుతున్న చెరువులపై స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. కోర్టులనూ ఆశ్రయించాయి. దీనిపై హైకోర్టు, సుప్రీం కోర్టులూ స్పందించాయి. చెరువుల లెక్క తేల్చాలని లోకాయుక్త, కోర్టులూ ఆదేశించాయి. ఈ నేపథ్యంలో హుడా అధికారులు మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో 2,304 చెరువులున్నట్టు నిగ్గు తేల్చారు. తొలిదశలో 501 చెరువులపై సర్వే చేయించారు. ‘గ్రేటర్’ పరిధిలో 176 చెరువులున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో 128 ఉన్నట్టు గుర్తించారు. జీహెచ్ఎంసీ అవతల హుడా పరిధిలో 325 చెరువులున్నాయని పంచాయితీరాజ్ శాఖ చెబుతోంది. కానీ ఇందులో 204 మాత్రమే గుర్తించారు. ఈ గందరగోళ పరిస్థితిలో పూర్తిస్థాయి సర్వే, ఎఫ్టీఎల్(ఫుల్ట్యాంక్ లెవల్) బాధ్యతను ఆర్వీ కన్సల్టెన్సీకి ఇచ్చారు. అయితే ఈ సంస్థకు నిజాం నాటి చిత్రాలను అందించలేదు. సర్వే ఆఫ్ ఇండియా పాయింట్స్‌ను చెప్పలేదు. దీంతో ఇప్పుడున్న ఎఫ్టీఎల్(పూర్తిస్థాయి నీటిమట్టం)నే గుర్తించాలని చూస్తున్నారు. ఇది వివాదాస్పదమైంది. దీంతో ఈ సర్వే ముందుకు సాగడం లేదు. మరోవైపు ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ ఇన్స్టిట్యూట్) శాటిలైట్ సమాచారంతో 30 ఏళ్ల నాటి చిత్రాలను క్రోడీకరించి, సర్వే నివేదికను జీహెచ్ఎంసీకి అందజేసింది. క్షేత్రస్థాయి సర్వేలు జరిగితే తప్ప ఎన్ని చెరువులున్నాయనేది నిర్ధారించడం కష్టమే. కాపాడుకోవడం ఎలా..? కబ్జాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్‌కు నీటి వనరులు కష్టమనేది నిపుణుల అభిప్రాయం. ఆక్రమణలను తొలగించడంతో పాటు, ఉన్న చెరువులకు రక్షణ వలయం ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. చెరువుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. కాపాడకపోతే కష్టాలే చెరువులు మాయమవ్వడం సాధారణ విషయం కాదు. దీనివల్ల పదేళ్ళ కాలంలో నగర వాతావరణంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. పర్యావరణ వేడి 1.2 డిగ్రీలు పెరగడం ప్రమాదాన్ని సూచిస్తోంది. దీనివల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. భూగర్భ నీటి మట్టం ఏటా 10 అడుగులు తగ్గుతోంది. ఉన్న చెరువులనైనా కాపాడాలి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలో ప్రత్యేక అథారిటీని నియమించాలి. అప్పుడే చెరువులను కాపాడుకోగలం. -డాక్టర్ ఎంజే నందర్, (సీనియర్ శాస్త్రవేత్త, ఎన్జీఆర్ఐ) అవగాహన కల్పించాలి చెరువుల అవసరంపై అవగాహన కల్పించాలి. దీన్నో ఉద్యమంగా చేపట్టాలి. కొన్ని చెరువుల రికార్డులే దొరకడం లేదు. పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్) నిర్థారణ బాధ్యతను ఓ సర్వే సంస్థకు అప్పగించారు. అయితే వాళ్ళకు అవసరమైన మ్యాప్‌లు ఇవ్వలేదు. 1970లో సర్వే ఆఫ్ ఇండియా చిత్రాలను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయి. చెరువులకు ఫెన్సింగ్ వేసి, కాలుష్యం నుంచి రక్షించాలి. వీటిపై అధికారులు దృష్టి పెట్టాలి. - వేదకుమార్ (సామాజిక వేత్త) నిజాలు తేల్చండి పూర్తిస్థాయి నీటిమట్టం గుర్తింపు (ఎఫ్టీఎల్) బాధ్యతను ఆర్వీ కన్సల్టెన్సీకి అప్పగించారు. వాళ్ళు ఇప్పుడున్న నీటిమట్టాన్నే వాస్తవమైనదిగా చెబుతున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. చెరువుల ఆక్రమణ మరుగున పడే ప్రమాదం ఉంది. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ ద్వారానే నిర్ధారణ జరగాలి. దీంతో పాటు వర్షం నీటిని చెరువులకు పంపి, భద్రపరిచే ప్రక్రియ జరగాలి. దీనివల్ల చాలావరకూ భూగర్భ నీటి మట్టాన్ని పరిరక్షించుకోవచ్చు. - చక్రవర్తి (సేవ్ అవర్ లేక్స్ సంస్థ సభ్యుడు)