పతంగులు.. ముత్యాలు..
సాక్షి, హైదరాబాద్: మకర సంక్రాంతి వేళ ‘గుజరాత్’ కొత్త శోభతో మెరిసిపోతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్ సహా దాదాపు 45 దేశాల పర్యాటకులు అహ్మదాబాద్‌లో వాలిపోతుంటారు. 3 రోజులు అహ్మదాబాద్ ఆకాశం సప్తవర్ణశోభితంగా వెలిగిపోతుంది. ఆ వేడుకకు గిన్నిస్‌బుక్‌లో చోటు కూడా దక్కింది. అదే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. విదేశీ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్న ఆ వేడుకకు ఈసారి మన భాగ్యనగరం కూడా వేదిక కాబోతోంది.
నగర శివారులో వంద ఎకరాల సువిశాల స్థలంలో విస్తరించిన ఆగాఖాన్ ట్రస్టు అకాడమీలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ట్రస్టుతో కలసి ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. అంతర్జాతీయంగా పతంగులు ఎగురవేయటంలో దిట్టలుగా పేరున్న ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు పర్యాటక అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ బ్రాండ్‌తో దీన్ని నిర్వహించటం ద్వారా విదేశీయుల దృష్టి హైదరాబాద్‌పై పడేలా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇలాంటి మరిన్ని వేడుకలు నిర్వహించటం ద్వారా తరచూ హైదరాబాద్/తెలంగాణ పేరు అంతర్జాతీయంగా వినిపించాలనే తాపత్రయంలో ఉంది.
త్వరలో ముత్యాల ప్రదర్శన
భాగ్యనగరానికి మరో పేరు ముత్యాల నగరం (పెరల్స్ సిటీ). అప్పట్లో ముత్యాలను ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేసిన ఖ్యాతి ఈ నగర సొంతం. చార్మినార్‌కు ఓ పక్కన ఉన్న లాడ్ బజార్ ఇప్పటికీ దానికి గుర్తుగా నిలుస్తోంది. దీన్ని కూడా ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో మరోసారి గుర్తు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ముత్యాలు, గాజుల ప్రదర్శనను నిర్వహించాలనీ యోచిస్తోంది.
దీన్ని కూడా జనవరిలోనే నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. మూడు రోజులు జరిగే ఈ ప్రదర్శనకు అలనాటి ప్రముఖ హోటల్ ‘రిట్జ్’ను వేదికగా చేసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రదర్శనకు అనుబంధంగా హైదరాబాద్ వంటకాల ఘుమఘుమలు, ఇక్కడి కళల హొయలనూ సందర్శకుల ముందు నిలపాలని నిర్ణయించింది.
ఇందుకోసం గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని వేదికగా గుర్తించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముత్యాలు, గాజుల ప్రదర్శన.. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అక్కడ ‘రుచులు’, కళల ప్రదర్శన నిర్వహించటం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవచ్చని భావిస్తోంది.
‘బతుకమ్మ’లో సాధ్యం కాకపోవటంతో
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తనకుంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకు బతుకమ్మ వేడుకను వినియోగించుకోవాలని భావించింది. గత బతుకమ్మ ఉత్సవాన్ని అంతర్జాతీయ వేడుకగా నిర్వహించాలని అనుకుంది. ప్రపంచంలో ఉన్న ఏకైక మహిళా పండుగగా దానికి విదేశాల్లో ప్రచారం చేసి విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవాలని భావించింది. కానీ సమయం చిక్కకపోవటంతో చేయలేకపోయింది. వచ్చే ఏడాది నిర్వహించే వేడుకల్లో దాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది.